ఇవి లేకుంటే దీపావళి అసంపూర్ణం | Diwali Return Gifts For Relatives And Dears And Nears | Sakshi
Sakshi News home page

ఇవి లేకుంటే దీపావళి అసంపూర్ణం

Published Wed, Oct 23 2019 4:48 PM | Last Updated on Sat, Oct 26 2019 3:35 PM

Diwali Return Gifts For Relatives And Dears And Nears - Sakshi

కాంతికి ప్రతీకగా.. ఇళ్లంతా దీపాలు వెలిగించి చీకటిని తరుముతూ వెలుగును స్వాగతిస్తూ ఆనందోత్సాహంతో దేశావ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీప అంటే దీపం, ఆవళి అంటే వరుస కాబట్టి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఇలాంటి పవిత్రమైన రోజు స్వీట్లతో పాటు బాహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం కూడా పండుగ సంప్రదాయంలో భాగమే. ఈ పండుగకు బహుమతులు  లేకుంటే దీపావళి వేడుక అసంపూర్ణంగా ఉండిపోతుందని చాలా మంది భావిస్తారు. చిన్నా.. పెద్ద.. పేదా, ధనిక అనే తారతమ్యాలు లేకుండా ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో  ప్రియమైన వారిని పండుగ వేడుకల్లో  భాగస్వాములుగా చేస్తూ.. వారిలో కూడా కొత్త ఉత్సాహన్ని నింపడానికి  బహుమతులు ఉపయోగపడుతాయని నమ్ముతారు.

దీపావళి బహుమతుల సంప్రదాయం...
దీపావళికి బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడమనేది కొత్తగా పుట్టుకొచ్చిన సంప్రదాయమేమీ కాదు. ప్రాచీన భారతంలో ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్న నాటి నుంచి సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. దీపావళి పర్వదినాన ఇళ్లంతా మట్టి ప్రమిదలతో అలంకరించి ఇంట్లోనే స్వీట్లు తయారు చేసుకునేవారు. పూజలు, వ్రతాలు చేశాక వాటిని బంధువులకు, స్నేహితులకు, ఇరుగుపొరుగు వారికి ఇచ్చి ఆనందాన్ని అందరితో పంచుకునేవారు. ఈ బహుమతి సంప‍్రదాయం వల్ల ఒకరిపై ఒకరు తమ ప్రేమను, అభిమానాన్ని ఇతరులతో పంచుకోవడమే కాకుండా.. ఇరువురి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి వారి మధ్య మరింత సన్నిహితం పెరుగుతుంది. 

ఆధునిక భారత్‌లో బహుమతులు
నేటి కాలంలో దీపావళి బహుమతుల సంప్రదాయం తార స్థాయికి చేరింది. దీపావళికి బహుమతిని ఇవ్వడంలో ఉన్న నిజమైన విలువలను మరచి.. వస్తువు విలువలను మాత్రమే చూస్తున్న వారు కోకొల్లలు. మరికొంత మంది తమ స్టేటస్‌ను, సంపదను ఇచ్చే బహుమతిలో చూపిస్తున్నారు. దీంతో నిజమైన, స్వచ్ఛమైన దీపావళి భావాలకు, ప్రేమకు, భావోద్వేగాలకు కాకుండా బహుమతుల విలువకే ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి దీపావళికి బహుమతిని ఇవ్వడం అంటే మన ప్రేమను, అభిమానాన్ని, సంతోషాన్ని ఇతురులతో పంచుకోవడం. కాబట్టి ఈ దీపావళికి  ఇచ్చే బహుమతులు ఖరీదైనవి మాత్రమే కాకుండా అర్థవంతమైనవిగా ఉండేలా,  అలాగే వాటిలో మీ ప్రేమ, భావోద్వేగాలు అద్దం పట్టేలా ఉండే కానులకను ఎంచుకోండి.

ఎందుకు బహుమతులు ఇవ్వాలి...
దీపావళి కానుక అంటే కేవలం సాధారణ వస్తువు మాత్రమే కాదు.. ఇది భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది.   ఇరువురి మధ్య ఉన్న బంధాన్ని, బంధుత్వాన్ని, సంబంధాన్ని కూడా నిర్వచిస్తుంది. అయితే కానుక అనగానే అందరూ ఎలక్ట్రానిక్‌ వస్తువుల నుంచి విలువైన ఆభరణాలను ఎంచుకుంటారు. కానుక విలువ  ఇచ్చే వస్తువులలో కాకుండా వారు ఇచ్చే మనసులో ఉంటుంది. మనం ఇచ్చే బహుమతులను అందంగా, అర్థవంతంగా ఉండేలా చూసుకోవాలి. అందుకే ఈ కాంతుల పండుగలో మీ ఇష్టమైన వారికి, మీ బంధువులకు, స్నేహితులకు మంచి కానుకలను ఇచ్చి వారికి  ఎప్పటికీ గుర్తుండిపోయోలా ఓ మధురమైన దీపావళిని అందించండి. అలాగే మీరు ఇచ్చే కానుకలో వారిపై మీకు ఉన్న అనుబంధాన్ని, వారు మీకు ఎంత ప్రియులనేది మీ కానుకలో చూపించండి. 

సిల్క్‌ త్రెడ్‌ ఆభరణాలు..
రకాల రకాల సిల్క్‌ దారంతో తయారు చేసే ఆభరణాలను కూడా యువతలకు, మహిళలకు ఈ దీపావళి కానుకకు బాగా ఉపయోగపడతాయి. గాజులు, చెవుల దిద్దులు, నెక్లేస్‌లను మెరిసే స్టోన్స్‌తో అందంగా తయారు చేసిన ఈ ఆభరణాలను వారికి కానుకగా ఇస్తే ఈ దీపావళిలో వారి ముస్తాబు ఇవి మరింత అందాన్ని తెచ్చిపెడుతాయి. మరైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని మీ స్నేహితులకు, బంధువుల అమ్మాయిలకు బహుమతిగా ఇచ్చేయండి మరి.

స్వీట్లతో చేసిన టపాసులు..
ఇది సాధారణమైన బహుమతే అవుతుంది. కానీ దీపావళి పండుగలో అతి ముఖ్యమైనవి స్వీట్లే కదా. ఈ ఆనందోత్సహాల పండుగను ఇతరులతో పంచుకోవాలంటే తీపి పదార్థాలు ఉండాల్సిందే కదా! మరి ఇంకెందుకు ఆలస్యం లడ్డూ, గులాబ్‌జాము, బర్ఫీ, వంటి రకారకాల స్వీట్స్‌ ఓ పెద్ద స్వీట్‌ బాక్స్‌లో పెట్టి ఇవ్వండి. ఇంకాస్త ప్రత్యేకంగా ఉండాలంటే  ఉల్లిగడ్డ బాంబు, బూచక్రాలు, చిచ్చుబుడ్డి వంటి వివిధ రకాల టపాసుల రూపంలో స్వీట్స్‌ను ప్రత్యేకంగా తయారు చేయించండి. బయట మర్కెట్స్‌లో ఆకర్షణీయమైన స్వీట్స్‌ బాక్స్‌లు దొరుకుతాయి. ఈ  స్వీట్స్‌ని మీకు నచ్చిన విధంగా అలంకరించి ఆకర్షణీయమైన బాక్స్‌లో ప్రియమైన వారికి స్నేహితులకు అందించండి. 

దీపావళి కాఫీ కప్పు..
రంగు రంగుల కాంతివంతమైన ఈ దీపావళికి మీ బహుమతి కూడా రంగులతో కాంతివంతంగా ఉండాలంటే దీపావళి కాఫీ కప్పును ఇలా ఇచ్చి చూడండి.. కప్పుపై దీపావళికి కళ తెచ్చే తారాజువ్వలను  డిజిటల్‌ రంగుతో పేయింటింగ్‌ వేయించి  ఈ దీపావళి వేడుకలు ఆ కప్పుపై ప్రతిబింబించేలా మీ స్నేహితులకు ఈ  దీపావళికి ఇలా అందమైన కానుకను ఇవ్వండి.  

గోడ అలంకరణలకు తోరణం: 
అలంకరణ అనేది దీపావళి వేడుకల్లో ప్రముఖం. దీపావళికి అందరూ తమ ఇంటిని శుభ్రం చేసుకుని రంగుల తోరణాలతో ఇంటిని అలంకరించుకుంటారు. అందుకోసం మీ స్నేహితులకు సంప్రదాయ అలంకరణ వస్తువును బహుమతిగా ఇచ్చిచూడండి. ఇందుకోస రాజస్థానీ అక్రలిక్‌ తోరణాన్ని దీపావళి బహుమతిగా ఇచ్చి చూడండి. ఈ తోరణం దీపావళి కోసమే ప్రత్యేకంగా రంగురంగుల ధారాలతో, చమ్మక్‌ చమ్మక్‌గా ఉండేలా గోల్డ్‌ రంగు ధారం, పూసలు, గంటలతో వివిధ డిజైన్‌లో తయారు చేస్తారు. దీనిని ఇంటి గోడలకు, ఇంటిముందు గుమ్మాలకు ఈ అక్రలిక్‌ తోరణాన్ని తగిలిస్తే అందంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే రంగురంగు ధారం, గోల్డ్‌ రంగు ఫినిషింగ్‌, పూసలు, గంటలు ఆకర్షణీయంగా ఉండి లక్ష్మి దేవీని  ఇంటిలోనికి స్వాగతిస్తుంది. ఈ రాజస్థానీ కలర్‌ఫుల్‌ యాక్రలిక్ట్‌ తోరణం ఇంటి ముందు అలంకరించుకుంటే ఇంట్లో నిజమైన దీపావళి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మరింకేంటీ మీ స్నేహితులకు, కుటుంబీకులకు ఈ దీపావళికి దీనిని బహుమతిగా అందించండి.

టెడ్డీబేర్‌ మైనపు కొవ్వొత్తి
అందంగా అమాయకంగా కనిపించే టెడ్డిబేర్‌ బొమ్మలు అంటే ఇష్టపడని వారుండరు.  మైనంతో తయారు చేసే ఈ దీపావళి టేడ్డి కొవ్వొత్తిని మీ స్నేహితులకు ఇవ్వండి. ఈ టేడ్డి కొవ్వత్తులను సాయంకాలం దీపాలంకరణలో వాడితే అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని పిల్లలకు కూడా బహుమతిగా ఇవ్వచ్చు. మీ ఈ దీపావళి కానుకలో ఇది సృజనాత్మంగా అత్యంత అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇక ఏమీ ఆలోచించకుండా వెంటనే ఈ టేడ్డిని మీ స్నేహితులకు, పిల్లలకు బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరచండి.

రంగురంగుల తేలియాడే దియాస్
దీపావళికి దీపాల ఆలంకరణ రంగులమయంగా ఉండాలంటే ఈ దీపాన్ని (దియాస్‌)ను ఎందుకు ఎంచుకోకుడదు. రంగురంగుల పూసలతో అలంకరించిన ఈ దీపాలను ఓ గిన్నెలో నీళ్లు పోసి వెలిగిస్తే నీటిలో  తేలాడుతూ వెలుగుతుంటే సాయంకాలం దీపాలంకరణలో ఇంటి వెలుగులను తార స్థాయికి పెంచుతుంది. ఈ దీపాలను  దీపావళికి కానుకగా ఇచ్చి కాంతి సదేశాన్ని వ్యాప్తి చేయండి.

ఇంకా ఇవే కాకుండా చాక్లెట్లను వివిధ రకాల టపాసుల రూపంలో చేయించి వాటిని పిల్లలకు దీపావళి కానుకగా ఇస్తే ఈ దీపావళి ఉత్సాహం వారిలో మరింత రెట్టింపు అవుతుంది. ఓ ఫ్లేన్‌ టీ షర్టుపై రంగురంగులతో దీపావళి కొటేషస్స్‌ రాయించి బహుమతిగా ఇవ‍్వండి. అలాగే దీపావళి గ్రీటింగ్‌ కార్డుతో పాటు బూ చక్రాలు, చిచ్చుబుడ్డి, క్రాకర్స్‌ వంటివి ఇచ్చి పెద్ద బాంబులు పేల్చి శబ్ధ ​కాలుష్యాన్ని, పర్యావరణ కాలుష్యాన్ని పెంచకుండా.. అలాగే ఆగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించమనే సందేశాన్ని ఇవ్వండి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement