అమానుషత్వం | a crime story | Sakshi
Sakshi News home page

అమానుషత్వం

Published Sun, Mar 16 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

అమానుషత్వం

అమానుషత్వం

 మానవుడిలో ఉండే గొప్ప తత్వానికే మానవత్వం అని పేరు పెట్టారు. మరి ఆ మానవుడే మానవత్వం అన్న మాటను మర్చిపోతే? దానవుడిలా ప్రవర్తిస్తే? మృగమై సాటి మనిషి ప్రాణాలు హరిస్తే? అతడిని చూసి జాలిపడాలా... ద్వేషించాలా...
 అసహ్యించుకోవాలా? ఏం చేసినా జరిగిన దారుణం సమసిపోదు. పోయిన ప్రాణం తిరిగి రాదు. మరి ఏం చేయాలి?
 డాక్టర్ సోమనాథ్ పరీదా చేసిన ఘాతుకం గురించి తెలిసిన వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారు. ఇంతకీ ఎవరీ సోమనాథ్? ఏమిటతడు చేసిన నేరం, దారుణం?

 
 జూన్ 21, 2013... భువనేశ్వర్ (ఒడిశా)...
 ఉదయం ఏడు కావస్తోంది. కాలింగ్‌బెల్ మోగుతోంది. ముసుగుతన్ని నిద్రపోతోన్న సోమనాథ్‌కి మెలకువతో పాటు విసుగూ వచ్చింది.
 ‘‘మళ్లీ ఈ కమ్లియే వచ్చుంటుంది. ఫోన్ చేసేవరకూ రావొద్దన్నానుగా. మర్చిపోయిందో ఏంటో’’... విసురుగా దుప్పటి తోసి లేచాడు. చెప్పులేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. గుమ్మంలో నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నువ్వా’’... మనసులో అనుకోబోయి పైకే అనేశాడు.


 ‘‘అదేంటి బావా అలా అన్నావ్? ఇంకెవరైనా వస్తారనుకున్నావా ఏంటి?’’... నవ్వుతూ అన్నాడు సోమనాథ్ బామ్మర్ది రంజన్ సమల్.
 నవ్వలేక నవ్వాడు సోమనాథ్. ‘‘అదేం లేదు. వస్తానని చెప్పలేదుగా. అందుకే ఆశ్చర్యపోయా.’’
 ‘‘నేనూ ఆశ్చర్యపోయా... నువ్వు తలుపు తీసేసరికి. ఇంత త్వరగా లేవవు కదా, అక్కయ్యే తీస్తుందనుకున్నా.’’
 
 సోమనాథ్ మాట్లాడలేదు. లోపలికి రమ్మని రంజన్‌ని పిలవనూ లేదు. దాంతో తనే సోమనాథ్‌ని తోసుకుని లోనికొచ్చాడు రంజన్. వస్తూనే ‘ఓ గాడ్’ అంటూ జేబులోని ఖర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డుపెట్టుకున్నాడు.
 
 ‘‘ఏంటి బావా ఈ వాసన’’ అన్నాడు చిరాగ్గా.
 ‘‘ఇంటి నిండా ఎలుకలున్నాయ్‌లే. ఎక్కడో ఒకటి చచ్చివుంటుంది. నేనూ దానికోసమే వెతుకుతున్నా.’’
 ‘‘అది సరే... అక్కయ్య ఏది?’’... అడిగాడు రంజన్.
 ‘‘కాలనీ వాళ్లతో కలిసి తీర్థయాత్రలకెళ్లింది.’’
 ‘‘కనీసం చెప్పనైనా లేదే. పైగా ఫోన్ కూడా స్విచాఫ్ చేసి పెట్టింది.’’
 ‘‘ఓ అదా... అనుకోకుండా ప్లాన్ చేసుకున్నారు. తీరా వెళ్లాక ఫోన్ పాడయ్యిందట. అప్పుడప్పుడూ ల్యాండ్‌లైన్ నుంచి చేస్తోంది.’’
 అలాగా అన్నట్టు తలాడించాడు రంజన్. ‘‘సరే బావా... నేను వెళ్తాను. పనుండి ఇటువైపు వచ్చాను, ఓసారి అక్కయ్యని చూడాలనిపించింది. తను రాగానే ఫోన్ చె య్యమని చెప్పు’’ అనేసి బయటికి నడిచాడు రంజన్. అతడు కారెక్కి వెళ్లిపోయేవరకూ చూసి తలుపు మూసుకున్నాడు సోమనాథ్.
 
 ‘‘మీకీ అనుమానం ఎందుకొచ్చింది?’’... అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘మా అక్కయ్య కొడుకు, కూతురు అమెరికాలో సెటిలయ్యారు సార్. వాళ్లు చాలా రోజులుగా ఫోన్ చేస్తున్నా అక్క తీయడం లేదట. చివరకు నాకు చేసి ఓసారి చూసి రమ్మన్నారు. వెళ్తే అక్కయ్య ఇంట్లో లేదు.’’
 
 ‘‘తీర్థయాత్రలకు వెళ్లారని చెప్తున్నారుగా... అదే నిజమై ఉండొచ్చు’’
 అడ్డంగా తలూపాడు రంజన్. ‘‘లేదు సర్. నేను కాలనీలో ఎంక్వయిరీ చేశాను. ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లలేదు. పైగా వాళ్లంతా అక్కయ్యని చూసి చాలా రోజులైందని చెప్పారు.  మేముండేదీ ఈ ఊళ్లోనే. తీర్థయాత్రలకు వెళ్లేట్లయితే నా భార్యని కూడా రమ్మని అక్కయ్య పిలిచివుండేది. పిలవక పోయినా కనీసం చెప్పి వెళ్లేది.’’
 
 ఇన్‌స్పెక్టర్ భృకుటి ముడిపడింది. ‘‘అంటే... మీ బావగారు అబద్ధం చెబుతున్నారన్నమాట’’ అన్నాడు సాలోచనగా.
 
 ‘‘అదే అన్పిస్తోంది. మరో విషయం... ఇంట్లో భరించలేని దుర్వాసన వస్తోంది. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది.’’
 
 ఆ మాట వింటూనే నిటారుగా అయ్యాడు ఇన్‌స్పెక్టర్. అతడి పోలీసు బుర్ర పరిపరి విధాల ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే రంజన్‌ని, కానిస్టేబుల్స్‌ని తీసుకుని సోమనాథ్ ఇంటికి బయలుదేరాడు.
 
 రంజన్‌తో పాటు వచ్చిన పోలీసులను చూసి అదరలేదు బెదరలేదు సోమనాథ్. ‘‘ఏమయ్యింది రంజన్? పోలీసులతో వచ్చావేంటి’’ అన్నాడు నింపాదిగా. రంజన్ మాట్లాడలేదు. పోలీసులు లోనికి దూసుకెళ్లారు. ముక్కు పుటాలదిరిపోయేలా వాసన. కడుపులో దేవినట్టయ్యింది. అంత దుర్వాసనలో అతడు ఎలా ఉంటున్నాడో అర్థం కాలేదు వారికి.
 ‘‘ఈ వాసనేంటి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఎలుక చచ్చినట్టుంది సార్’’ తడబడకుండా చెప్పాడు సోమనాథ్.
 
 ‘‘సరే... ఎలుకని పట్టుకుందాం’’ అంటూ కానిస్టేబుల్స్‌కి సైగ చేశాడు ఇన్‌స్పెక్టర్. ఆజ్ఞ అందీ అందగానే వాళ్లు ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. బెడ్‌రూమ్, గెస్ట్‌రూమ్, బాత్‌రూమ్స్... అన్నీ జల్లెడపట్టారు. చివరగా ఓ కానిస్టేబుల్ వంటగదిలోకి వెళ్లాడు. అక్కడ రెండు పెద్ద పెద్ద రేకుడబ్బాలున్నాయి. వాటిని తెరిచి చూస్తే కొన్ని స్టీలు డబ్బాలు కనిపించాయి. ఓ డబ్బాని తెరిచి చూశాడు కానిస్టేబుల్. అంతే... అదిరిపడ్డాడు. ‘సార్’ అంటూ గట్టిగా కేక పెట్టాడు.
 అతడి అరుపు వినగానే కంగారుగా వంటగదిలోకి వచ్చారంతా. కానిస్టేబుల్ చేతిలోని డబ్బాలో చిన్న చిన్న మాంసం ముక్కలున్నాయి. కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. వెంటనే అన్ని డబ్బాలూ తెరవమన్నాడు ఇన్‌స్పెక్టర్. అన్నింటిలోనూ మాంసం ముక్కలే. మొత్తం ఇరవై రెండు డబ్బాలు. ఆ డబ్బాల అడుగున, శిథిలమైపోతోన్న దశలో ఉంది... సోమనాథ్ భార్య ఉషశ్రీ తల.
 
 ‘‘అక్కా’’ అంటూ గావుకేక పెట్టాడు రంజన్. ఖాకీల కరకు గుండెలు సైతం క్షణంపాటు గుబగుబలాడాయి. వాళ్లు ఇప్పటివరకూ ఎన్నో కేసులు చూశాడు. కానీ ఇంత దారుణమైన కేసుని... ఘోరాతి ఘోరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. వెంటనే ఆ డబ్బాలన్నిటినీ పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. సోమనాథ్ చేతులకు బేడీలు వేసి స్టేషన్‌కి నడిపించారు.
 
 
 ‘‘చెప్పండి డాక్టర్ సోమనాథ్... మీ భార్యని ఎందుకు చంపారు’’... కటువుగా పలికింది ఇన్‌స్పెక్టర్ గొంతు.సోమనాథ్ కంగారు పడలేదు. చాలా కూల్‌గా ఉన్నాడు.
 ‘‘మొన్న మూడో తేదీన మా ఇద్దరికీ గొడవయ్యింది. కోపంలో తన తల నేలకేసి కొట్టాను, చనిపోయింది. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని బాడీని మూడు వందల ముక్కలుగా కోసి, డబ్బాల్లో వేశాను. ఉషకి శిరిడీ అంటే ఇష్టం. అందుకే అక్కడ అంత్యక్రియలు చేద్దామనుకున్నాను. మరో రెండు రోజుల్లో బయలుదేరాల్సి ఉంది. ఇంతలో మీరొచ్చారు’’
 చేసిన ఘాతుకాన్ని అతడంత కూల్‌గా చెబుతుంటే షాకైపోయారు పోలీసులు. డెబ్భై రెండేళ్ల వృద్ధుడు... ఆర్మీలో పేరున్న వైద్యుడు... లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రిటైరైనవాడు... ఇంత దారుణానికి ఒడిగట్టాడా? పైగా అంత చేసి ఇంత కూల్‌గా ఉన్నాడా? నోట మాట రాలేదు వారికి. ఎలా చంపాడో, ఎలా ముక్కలు చేశాడో సోమనాథ్ చెబుతూవుంటే నోళ్లు తెరచుకుని వింటూండిపోయారు. తన భార్య తలని టేబుల్ మీద పెట్టుకుని, కొన్ని రోజుల పాటు దానితో కబుర్లు చెప్పానని... చర్మం, జుట్టు ఊడిపోతుండటంతో పెట్టెలో పెట్టేశానని చెప్తుంటే... అతడి పైశాచికత్వానికి ఎలా రియాక్టవ్వాలో అర్థం కాక చూస్తూండిపోయారు.
 
 సోమనాథ్ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు. రంజన్ సాక్ష్యాన్ని నమోదు చేశారు. కాలనీవాసులను కూడా విచారించారు. డాక్టర్ సోమనాథ్ వైఖరి విచిత్రంగా ఉంటుందని, అంత వయసులో కూడా కుర్రాడిలా తయారై తిరుగుతుంటాడని, ప్రవర్తన వింతగా ఉంటుందని, భార్యని ఎవరితోనూ కలవనిచ్చేవాడు కాదని, మార్నింగ్ వాక్‌కి వెళ్లినప్పుడు పరిచయమైన ఓ స్త్రీతో అతడికి సాన్నిహిత్యం ఏర్పడిందని, ఆమెతో సంబంధం పెట్టుకుని ఉషశ్రీని వేధించేవాడని... ఇలా ఒక్కొక్కళ్లూ ఒక్కో విషయాన్ని చెప్పుకొచ్చారు. దాంతో వదిలించుకునేందుకే అతడు భార్యను హత్య చేసి ఉంటాడనిపించింది పోలీసులకి. తమ నివేదికలో అదే రాసి కోర్టుకు సమర్పించారు.
 కానీ మన దేశంలో ఓ కేసు తేలాలంటే ఎంత సమయం పడుతుందో తెలియనిది కాదు. ఇంకొన్ని సాక్ష్యాలు కావాలి, మరిన్ని ఆధారాలు అవసరం అంటూ యేళ్లకేళ్లు గడిపేస్తుంటారు. సోమనాథ్ కేసు విషయంలోనూ అదే జరుగుతోంది. అతడు నిజం చెప్పాడా లేదా అంటూ ఇప్పటికీ లై డిటెక్టర్ టెస్టులు, నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తూనే ఉన్నారు తప్ప ఏ విషయం తేల్చడం లేదు. నేనే చంపాను అంటూ అతడే తన రాక్షసక్రీడను కళ్లకు కట్టినట్టు చెబుతున్నా శిక్ష వేయడమూ లేదు. చూద్దాం... కేసు ఎన్నేళ్లకు తేలుతుందో, మానవత్వానికే మచ్చ తెచ్చిన సోమనాథ్‌కి ఏ శిక్ష పడుతుందో!
 - సమీర నేలపూడి
 
 డాక్టర్ సోమనాథ్, ఉషశ్రీ దంపతులకి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, కూతురు. ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. జూన్ 3 నుంచి తల్లి తమతో మాట్లాడక పోవడంతో అనుమానం వచ్చి మేన మామ రంజన్‌కి ఫోన్ చేసి చెప్పారు. అయితే తండ్రే తల్లిని చంపుతాడని, అదీ అంత దారుణంగా ఆమె ప్రాణం తీస్తాడని వాళ్లు ఊహించలేదు. వాళ్లు ఇప్పటికీ ఆ వాస్తవాన్నిజీర్ణించుకోలేకపోతున్నారు!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement