ప్రేమ.. ప్యార్... లవ్...! | a story about love | Sakshi
Sakshi News home page

ప్రేమ.. ప్యార్... లవ్...!

Published Sun, Feb 2 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

ప్రేమ.. ప్యార్... లవ్...!

ప్రేమ.. ప్యార్... లవ్...!

 కథ
 ‘‘ఏం చెయ్యాలి. ఏం చెయ్యాలి. అయ్యో! నేనేం చెయ్యాలి. ఎలా ఇప్పుడెలా?’’
 ‘‘ఏంటయ్యా అలా తల బాదుకుంటున్నావు. తలకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లిపోతావు.’’
 ‘‘ఏం చెయ్యమంటారు. నా సమస్య అలాంటిది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.’’
 ‘‘అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ అలా తల బాదుకుంటే ఎలా?’’
 ‘‘ఏం చెయ్యలేకే సార్ తల బాదుకుంటున్నా.’’
 ‘‘ప్రతి సమస్యకొక పరిష్కారం ఉంటుందయ్యా. నీ సమస్య చెప్పు ఏం చెయ్యాలో నేను చెబుతా.’’
 ‘‘ఎందుకులేండి మీ పని మీరు చూసుకోండి.’’
 ‘‘పనేమీ లేకనేనయ్యా చెప్పమంటున్నాను. నువ్వా కుర్రాడివి, నేనా రిటైర్ అయినవాణ్ని. నీ కంటే అనుభవజ్ఞుణ్ని, జీవితం చూసినవాణ్ని. చెప్పు పరిష్కారం చెబుతా!’’
 ‘‘నా పేరు భీమేష్ అండి, బర్కత్‌పురాలో ఉంటాం.’’
 ‘‘భీమేష్ బర్కత్‌పురా బావుంది, ప్రాస కుదిరింది.’’
 ‘‘అబ్బా! వినండి సార్, వంట చేయడమంటే చిన్నప్పటినుంచీ ఇంట్రస్ట్.’’
 ‘‘వంటను ఒంటపట్టించుకున్నావన్నమాట.’’
 ‘‘అవును. వంట చెయ్యటాన్ని ప్రేయసిని ప్రేమించినట్టు ప్రేమించాను.’’
 ‘‘బావుంది పోలిక.’’
 ‘‘అందులో నైపుణ్యం సంపాదించాను. బిర్యానీ వాసనను బట్టి ఎంత దూరం నుంచైనా అందులో వాడిన మసాలా దినుసుల పర్సంటేజీ ఎంతో కచ్చితంగా చెబుతాను.’’
 ‘‘అబ్బో!’’
 ‘‘చికెన్ మటన్ బిర్యానీలు ఎన్ని రకాలుగా చెయ్యొచ్చో అద్భుతంగా చేస్తా.’’
 ‘‘నోరూరుతోందయ్యా.’’
 ‘‘వంటలు తయారుచేయటం గురించి సమస్త సమాచారం సేకరించాను. వంటల పుస్తకాలు కొని లైబ్రెరీ తయారుచేశాను. ఇంటర్నెట్‌లో కూడా కేవలం వంటలు తయారుచేసే సైట్లే చూస్తాను.’’
 ‘‘అబ్బబ్బ!’’
 ‘‘ఒక రకంగా వంటలు వండటమే ప్రపంచంలాగా బతుకుతున్నాను.’’
 ‘‘భారతంలో భీముడిలాగా పాకశాస్త్ర ప్రియుడివన్నమాట.’’
 ‘‘అలాగే అనుకోండి.’’
 ‘‘మీ అమ్మా నాన్నా నీకు భీమేష్ అని పేరు కూడా కరెక్ట్‌గానే పెట్టారయ్యా.’’
 ‘‘మా అమ్మ అంటే గుర్తొచ్చింది. అసలు నాకీ వంటల మీద ఆసక్తి చిన్నప్పుడే చిత్రంగా గమ్మత్తుగా కలిగింది.’’
 
 ‘‘అబ్బ అబ్బ చెప్పు ఇంట్రెస్టింగ్‌గా ఉంది.’’
 ‘‘మా అమ్మ చిన్నప్పుడు చపాతీలు చేసేటప్పుడు పక్కనున్న పిండిలో చిన్నచిన్నగా చపాతీలు చేసేవాణ్ని. నన్ను సంతోష పెట్టడానికి అమ్మ వాటిని కూడా కాల్చి ఇచ్చేది. అందరికీ గొప్పగా చెప్పుకునేవాణ్ని. అప్పటినుంచీ అమ్మ వంట చేస్తుంటే కూరలు కోసేవాణ్ని. గరిట తిప్పేవాణ్ని. అలా అలా కొద్ది రోజుల తర్వాత ఇంట్లో వంటపని నేనే చేయడం మొదలుపెట్టాను. వంట రుచిగా ఉంటుండటంతో మా నాన్న నన్నే వండమనేవాడు. అలా అన్ని రకాల వంటలు నేర్చుకున్నాను.’’
 ‘‘వంటింటి భాగోతం బాగుంది చెప్పు.’’
 ‘‘కాలేజీలో డిగ్రీ చదివిన తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాను.’’
 ‘‘హోటల్ వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతావయ్యా.’’
 ‘‘సలహాలు ఇవ్వకండి. చెప్పేది వినండి.’’
 ‘‘సారీ సారీ చెప్పు.’’
 ‘‘అప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ హోటల్ పెట్టమని బలవంతపెట్టసాగారు. ఆలోచిస్తే నాకు అదే కరెక్ట్ అనిపించింది.’’
 ‘‘ఆ మరేం చేశావు?’’
 ‘‘ఈ విషయం మా నాన్నతో చెప్పాను. మా నాన్న కూడా సరే మంచి ఆలోచనే అన్నాడు. హోటల్ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే...’’
 ‘‘ఏమైంది?’’
 ‘‘వారం తర్వాత మా నాన్నకు ఎవరో సలహా ఇచ్చారట.’’
 ‘‘ఏంటి?’’
 ‘‘వంట తయారు చేయడం వేరు, అమ్మడం వేరు. ఇది వ్యాపారం. ముందు వ్యాపార కిటుకులు తెలుసుకోమను. ఏదైనా హోటల్‌లో అన్ని పనులు చేస్తూ అనుభవం సంపాదించమను అని ఒక పనికిమాలిన అభిప్రాయం వ్యక్తం చేశారట.’’
 ‘‘పనికిమాలినది ఎందుకవుతుంది, పనికొచ్చేదే.’’
 ‘‘పనికొచ్చేదేనని మా నాన్న మాట విని ఒక పెద్ద హోటల్‌లో చేరాను.’’
 ‘‘మంచి నిర్ణయం.’’
 ‘‘సరే అక్కడ అన్ని రకాల పనులు చేస్తుంటే...’’
 ‘‘ఆ.. చేస్తుంటే...’’
 ‘‘ఒకరోజు ఒక అమ్మాయి పొద్దున్నే టిఫిన్ తినడానికి హోటల్‌కు వచ్చింది.’’
 ‘‘అమ్మాయి బావుంటుందా?’’
 ‘‘చక్కని చుక్క.’’
 ‘‘ఓహో! అయితే లవ్వా?’’
 ‘‘వినండి, ఆ అమ్మాయిని చూడగానే గుండె గడబిడ చేసినట్టనిపించింది.’’
 ‘‘ఒళ్లు పులకరించడం, షాక్ కొట్టినట్టనిపించడం, బుర్ర గిర్రున తిరిగినట్టనిపించడం..!’’
 ‘‘నిజమే అలాగే అనిపించింది. మీకెలా తెలుసు?’’
 ‘‘ఎన్ని సినిమాల్లో చూళ్లేదయ్యా. తర్వాత ఏమైంది?’’
 ‘‘ఆ అమ్మాయి ప్లేట్ చపాతీ ఆర్డర్ ఇచ్చింది.’’
 ‘‘ఇక్కడా మళ్లీ చపాతీనా?’’
 ‘‘అమ్మాయి కోసం చపాతీని నెయ్యితో స్పెషల్‌గా తయారుచేసి, ఆలూ కుర్మానూ, వేడివేడి సాంబార్‌నూ వడ్డించాను.’’
 ‘‘చపాతీ నీ లైఫ్‌ను ఏమో చెయ్యబోతోంది అన్నమాట.’’
 ‘‘అమ్మాయి తింటుంటే చూశాను, ఆవిడ మొహంలో ఒక రకమైన మార్పు కనబడింది. నాకు అర్థమైంది.. అమ్మాయి ఇంతవరకూ ఇంత రుచికరమైనది తినలేదని!’’
 ‘‘ఫేస్ రీడింగ్ కూడా వచ్చా నీకు!’’
 ‘‘ఆ మాత్రం అర్థం చేసుకోవడానికి ఫేస్ రీడింగ్ ఎందుకండి?’’
 ‘‘సరే సరే తర్వాత ఏమైందో చెప్పు.’’
 ‘‘అలా... అలా... రోజూ సరిగ్గా పొద్దున్నే వచ్చేది. నేను ఆవిడ ఇచ్చిన ఆర్డర్‌ను సర్వ్ చేసేవాడిని, ఆవిడ లొట్టలు వేసుకుంటూ తినేది.’’
 ‘‘ఓహో!’’
 ‘‘ఒకరోజు సినిమాకెళ్లాను. అక్కడ అమ్మాయి టికెట్టు దొరకకుండా నిరాశగా ఎదురుచూడసాగింది.’’
 ‘‘నువ్వెళ్లి హీరోలాగా నీ టికెట్టు ఇచ్చావా?’’
 ‘‘నా టికెట్టు ఎందుకిస్తానండి! బ్లాకులో కొని అమ్మాయికిచ్చాను. ఆవిడ ఆశ్చర్యంగా హోటల్లో సర్వర్‌గా పనిచేసే నువ్వు ఇంత పెద్ద థియేటర్‌కు ఎలా వచ్చావు అని అడిగింది.’’
 ‘‘నీ బ్యాక్‌గ్రౌండ్ తెలియదు కదా! అందుకే అడిగింది.’’
 ‘‘నేను నా విషయాలన్నీ చెప్పాను. తర్వాత పెద్ద హోటల్ పెట్టబోతున్నాను. ట్రైనింగ్ కోసం పనిచేస్తున్నానని చెబితే చాలా సంతోషపడింది.’’
 ‘‘నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది.’’
 ‘‘నా మీదే కాదు, ఆవిడ మీద నాక్కూడా పెద్ద అభిప్రాయం ఏర్పడింది. ఆ అమ్మాయి విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరట. నెలకు డెబ్భై అయిదు వేలట.’’
 ‘‘అబ్బో!’’
 ‘‘అయినా మా మధ్య పరిచయం అలా అలా పెరిగింది. ఆవిడ నా చేతి వంట తినకుండా ఉండలేనట్టుగా తయారైంది. నేను కూడా ఎప్పుడు తెల్లవారుతుందా, ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటట్టు తయారయ్యాను.’’
 ‘‘ప్రేమ మహత్యం.’’
 ‘‘ఇద్దరి మధ్య ప్రేమ ముదిరి పాకాన పడింది. పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పడం లేదు.’’
 ‘‘పెళ్లి చేసుకున్నారా?’’
 ‘‘ఎక్కడ చేసుకున్నామండి! ఇక్కడే ఆవిడ పెట్టిన షరతుతో ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతూ తల బాదుకుంటున్నాను.’’
 ‘‘షరత్తా. ఏంటది?’’
 ‘‘పెళ్లి చేసుకోవాలంటే హోటల్ పెట్టకూడదట. నేను కేవలం ఆవిడ కోసం తప్ప వేరేవారికి వంట చేయకూడదట. నా వంట ఆవిడ ఒక్కదానికే సొంతం కావాలట.’’
 ‘‘‘నా మొగుడి వంట నాకొక్కదానికే సొంతంలా అన్నమాట.’’
 ‘‘ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.’’
 ‘‘ఇంత చిన్న విషయానికి ఇంత నసనా? చక్కగా పెళ్లి చేసుకోవయ్యా.’’
 ‘‘ఎట్లా చేసుకోవాలండి! మగాడు ఇంట్లో వంట చేస్తుంటే జనం ఏమంటారండి? చూసి నవ్వరా?’’
 ‘‘నవ్వితే నవ్వనీ! వాళ్లు నవ్వుతున్నారని నీ ప్రేమని కాదంటావా? అమ్మాయిని చేసుకోవా?’’
 ‘‘అమ్మాయిని చేసుకోవడం గ్యారెంటీ అనుకోండి. కాని ఏం చెయ్యాలి, ఎలా అని?’’
 ‘‘ఏమీ ఆలోచించకు, ముందు పెళ్లి చేసుకో. అమ్మాయికి చక్కగా వండిపెట్టు. వడ్డించు, కాలు మీద కాలు వేసుకొని కాలం గడిపేయి.’’
 ‘‘అంతేనా?’’
 ‘‘దీనికి ఇంత ఆలోచిస్తావేంటయ్యా. వెళ్లు. పెళ్లి చేసుకో. ఇంకేం ఆలోచించకు. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. అందరు ఆడవాళ్లూ వంటింట్లో వంట చేస్తుంటే ఎలా, నీలాంటి వాడు కూడా ఒకరుండాలి!’’
 ‘‘చేసుకుంటే ఎలా ఉంటుందా అని!’’
 ‘‘చేసుకో, బాగానే ఉంటుంది. వెళ్లు.’’
 ‘‘సరే మీరు చెప్పారు. తప్పకుండా పెళ్లి చేసుకుంటా.’’
 ‘‘అదీ... అలా డేర్ చెయ్యి. ఇంతకీ అమ్మాయి పేరు?’’
 ‘‘సత్యభామ.’’
 
 ‘పెళ్లి చేసుకున్నారా?’’
 ‘‘ఎక్కడ చేసుకున్నామండి!
 ఇక్కడే ఆవిడ పెట్టిన షరతుతో
 ఏం చెయ్యాలో తెలియక
 సతమతమవుతూ తల
 బాదుకుంటున్నాను.’’
 
 ‘అమ్మాయి తింటుంటే చూశాను,  ఆవిడ మొహంలో ఒక రకమైన మార్పు కనబడింది. రుచిని ఆస్వాదించసాగింది నాకు అర్థమైంది. అమ్మాయి ఇంతవరకూ ఇంత రుచికరమైనది తినలేదని!’’
-అల్లం శశిధర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement