నెత్తురు చిందిన ప్రేమ
నిజాలు దేవుడికెరుక
జూన్ 9, 2000... పంజాబ్‌లోని ఓ మారుమూల ప్రాంతం... ‘‘ఏంటో ఈ చాకిరీ. పొద్దున్న లేచింది మొదలు రాత్రి మంచమెక్కేవరకూ ఒకటే కష్టం. ఈ బాధలు ఎప్పుడు తీరతాయో తెలియడంలా’’... చంకన పెట్టుకుని వచ్చిన బట్టల మూటని నేలమీద పడేస్తూ విసుగ్గా అంది రజ్జీ. ఆమె విసుగు చూసి నవ్వింది మన్‌ప్రీత్. ‘‘వదినా... ఈ మాట అనకుండా నువ్వెప్పుడైనా పని మొదలుపెట్టావా? రోజూ వస్తావు. తిట్టుకుంటావు. తర్వాతే పని ప్రారంభిస్తావు. ఇవాళ కొత్తేముంది?’’ ఆ మాటలకి తనూ నవ్వేసింది రజ్జీ.
రజకులు కావడంతో బట్టలు ఉతకడానికి రోజూ పొద్దున్నే కాలువ దగ్గరకు వస్తారు ఇద్దరూ. ప్రతిరోజూ తన కష్టాన్ని తలచు కుని రజ్జీ విసుక్కుంటూనే ఉంటుంది. మొగుడు తాగుబోతు. దమ్మిడీ పని చేయడు. అన్నీ తనే చక్కబెట్టాలి. అందుకే ఆమెకు అంత విసుగు!
‘‘అవునూ వదినా... అన్నయ్యతో తాగుడు మాన్పించడానికి ఎవరో స్వామీజీ మందు ఇస్తారన్నావ్ కదా! తీసుకెళ్లావా?’’
మన్‌ప్రీత్ ప్రశ్నకి తల అడ్డంగా ఊపింది రజ్జీ. ‘‘తీసుకెళ్తానంటే వచ్చేస్తాడా మీ అన్నయ్య! ఎడ్డెమంటే తెడ్డెమనడం అలవాటేగా... రాను పొమ్మన్నాడు. ఆ మనిషిని ఒప్పించడం నా వల్ల ఎప్పుడ య్యిందని! అందుకే వదిలేశాను’’ అంటూ కాలువలోకి దిగింది రజ్జీ. మన్‌ప్రీత్‌తో మాటా మంతీ చెబుతూనే బట్టలు జాడించసాగింది. అంతలో అనుకోకుండా ఆమె చూపులు మరోవైపు మళ్లాయి.
‘‘ఏయ్ మన్‌ప్రీత్... అటు చూడు’’ అంది కంగారుగా. అటువైపు చూసిన మన్‌ప్రీత్ ముఖంలో రంగులు మారాయి. ‘‘అమ్మో... అది శవమే కదా’’ అంది వణుకుతున్న గొంతుతో. అవునన్నట్టు తలూపింది రజ్జీ. ఇద్దరూ ముఖాలు చూసు కున్నారు. వెంటనే విషయం పోలీసుల చెవిని వేయడానికి స్టేషన్‌కు పరుగెత్తారు.
వాళ్లు పోలీసుల్ని తీసుకుని వచ్చేసరికి ఆ శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. చుట్టూ కొంతమంది జనం కూడా గుమిగూడారు. వాళ్లందరినీ చెదరగొట్టి మృతదేహం దగ్గరకు వెళ్లాడు ఇన్‌స్పెక్టర్.
ఎవరో అమ్మాయి. పాతికేళ్లుంటాయి. నీటిలో ఉబ్బిపోయినా కూడా ఆమె ఎంతో అందంగా ఉండేదన్న విషయం తెలు స్తోంది. ఖరీదైన బట్టలే వేసుకుంది.
ఒంటి మీద నగలున్నాయి. వాటితో పాటు గాయాలు కూడా. పదునైన ఆయుధంతో కోయడంతో మెడ దాదాపు తెగిపోయింది. ఎవరో చిత్రహింసలు పెట్టి చంపారని చూడగానే అర్థమైపోతోంది.
‘‘ఈమె ఎవరో మీలో ఎవరికైనా తెలుసా?’’... అడిగాడు ఇన్‌స్పెక్టర్. ఎవరూ మాట్లాడలేదు. దాంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి ఏ కోణంలో విచారించాలా అని ఆలోచనలో పడ్డాడు.
‘‘సర్... ఇన్‌స్పెక్టర్‌గారు...’’
కానిస్టేబుల్స్‌తో కేసు గురించి డిస్కస్ చేస్తోన్న ఇన్‌స్పెక్టర్ చప్పున తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఓ యువకుడు నిల బడి ఉన్నాడు. మంచి ఒడ్డూ పొడవూ... చక్కని రంగు... చూడటానికి బాగున్నాడు. కానీ కళ్లలో మాత్రం ఏదో భయం. ఎందుకో కంగారు.
‘‘నేనే... రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించాడు ఇన్‌స్పెక్టర్. ఆ యువకుడు కూర్చోలేదు. కాస్త ముందుకు వచ్చి ఇన్‌స్పెక్టర్‌కి ఎదురుగా నిలబడ్డాడు. మాట్లాడటం మొదలుపెట్టక ముందే కళ్ల నుంచి నీళ్లు జారడం మొదలైంది.
‘‘ఏంటి... ఏం జరిగింది?’’... అడిగాడు ఇన్‌స్పెక్టర్ అనునయంగా.
‘‘నా పేరు సుఖ్వీందర్ సర్. నా భార్య జస్వీందర్ వారం రోజుల్నుంచీ కనిపించడం లేదు’’... అతని గొంతు వణికింది.
‘‘వారం నుంచీ కనబడకపోతే ఇప్పటి వరకూ ఏం చేస్తున్నావ్?’’... సహజ సిద్ధమైన పోలీసు ఆలోచనలతో అడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘‘హాస్పిటల్‌లో ఉన్నాను సర్. ఎవరో రౌడీలు... నన్ను చితక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు. నా భార్యను కారులో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తనని ఏం చేశారోనని భయంగా ఉంది సర్. ఇన్ని రోజులూ ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడివున్నాను. స్పృహలోకి రాగానే మీ దగ్గరికొచ్చాను’’... దుఃఖాన్ని అణచుకుంటూ చెప్పాడు.
మాటల్లో తడబాటు లేదు. కళ్లలో నిజాయితీ కూడా కనిపిస్తోంది. దాంతో పెద్దగా సాగదీయలేదు ఇన్‌స్పెక్టర్. వివరాలు చెప్పమని అడిగాడు. సుఖ్వీందర్ చెబుతుంటే ఇన్‌స్పెక్టర్ భృకుటి ముడి వడింది. మెదడులో ఏదో ఆలోచన తళుక్కుమంది. వెంటనే అతడిని తనతో రమ్మని తీసుకెళ్లాడు.
మార్చురీ అన్న బోర్డు చూడగానే సుఖ్వీందర్ కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ‘‘ఇక్కడికెందుకు తీసుకొచ్చారు సర్’’ అన్నాడు భయపడుతూ.
‘‘సారీ సుఖ్వీందర్. వారం రోజుల క్రితం కాలువలో మాకు ఓ అమ్మాయి మృతదేహం దొరికింది. అది ఎవరిదో ఇప్పటివరకూ తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన వివరాలు వింటుంటే... ఆ అమ్మాయే నీ భార్యయేమోనని అనుమానంగా...’’
ఇన్‌స్పెక్టర్ మాట పూర్తి కాకముందే ‘‘లేదు’’ అంటూ అరిచాడు సుఖ్వీందర్. ‘‘అంత మాటనకండి. నా జస్వీందర్ చావదు. నన్ను వదిలిపెట్టి వెళ్లదు. ఎందుకంటే తను లేకుండా నేను బతకలేనని తనకు బాగా తెలుసు’’... వెక్కివెక్కి ఏడుస్తోన్న సుఖ్వీందర్‌ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇన్‌స్పెక్టర్‌కి. ధైర్యం చెబు తున్నట్టుగా భుజం తట్టి, చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి మృత దేహాన్ని చూపించమని అక్కడున్న వ్యక్తికి సైగ చేశాడు. అతడు మృతదేహాన్ని బయటకు తీశాడు.
ఆమెను చూస్తూనే కుప్పకూలి పోయాడు సుఖ్వీందర్. ‘‘జస్సీ... నన్ను వదిలేసి వెళ్లిపోయావా’’ అంటూ గుండె లవిసేలా ఏడవసాగాడు. అతడి పరిస్థితి చూసి ఇన్‌స్పెక్టర్ సైతం కదిలిపోయాడు. వెంటనే తనని మార్చురీ బయటకు తీసు కొచ్చేశాడు. కాస్త తేరుకున్నాక అడిగాడు... ‘‘అసలేమైంది సుఖ్వీందర్? నిన్ను ఎందుకు కొట్టారు? జస్వీందర్‌ని ఎందుకు చంపారు? అసలిదంతా ఎవరు చేశారు?’’
దీనంగా ఇన్‌స్పెక్టర్ ముఖంలోకి చూశాడు సుఖ్వీందర్. గుండెల్ని పిండేసే తన కథ చెప్పడం మొదలుపెట్టాడు.
మే 12, 2000.
ఎయిర్‌పోర్ట్‌లో సుఖ్వీందర్‌ని చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి అతణ్ని అల్లుకుపోయింది జస్వీందర్ కౌర్.
‘‘వచ్చేశావా జస్సీ. నువ్వు రావేమో, ఎంత కంగారు పడ్డానో తెలుసా’’ అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు సుఖ్వీందర్.
‘‘రాకుండా ఉండగలనా? ప్రపంచ మంతా ఒక్కటై ప్రయత్నించినా నన్ను నీ దగ్గరకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు’’ అంటూ చిలిపిగా నవ్వింది జస్వీందర్. జస్సీ అలా నవ్వుతుంటే చూస్తూ ఈ ప్రపం చాన్నే మర్చిపోతాడతను. అసలు అతడిని ఆమెవైపు లాగిందే ఆ అందమైన నవ్వు!
జస్వీందర్ పుట్టింది పంజాబ్‌లోనే. కానీ చదువుకుంది, సెటిలయ్యింది మాత్రం కెనడాలో. అక్కడామెకు బ్యూటీ షియన్‌గా మంచి పేరుంది. రెండు చేతులా సంపాదిస్తోంది. 1994లో ఓసారి కుటుంబ సభ్యులతో కలిసి లూధి యానాలో ఒక ఫంక్షన్‌కి వచ్చింది. అప్పుడే ఆమెకు ఆటో డ్రైవర్ సుఖ్వీందర్‌తో పరిచయమయ్యింది. అతడు ఆమెలా ఎక్కువ చదువుకోలేదు. ఆమెతో పోలిస్తే అంత అందగాడు కాదు. ఆమెలాగా బాగా సంపాదించడమూ లేదు. కానీ ఆమెలో చలనాన్ని కలిగించాడు.
తొలి పరిచయంలోనే వాళ్ల మధ్య ప్రేమ పుట్టింది. కొద్ది రోజుల తర్వాత జస్వీందర్ వాళ్లు కెనడా వెళ్లిపోయినా ఆ ప్రేమ అలాగే నాలుగేళ్లు కొనసాగింది. అయితే జస్సీకి ఇంట్లోవాళ్లు మరొకరితో పెళ్లి సెటిల్ చేయడంతో వారి ప్రేమకథ కొత్త మలుపు తిరిగింది.
సుఖ్వీందర్‌నే పెళ్లాడతానంది జస్సీ.
ఇంట్లోవాళ్లు విరుచుకుపడ్డారు. ఆటో వాడితో ప్రేమేంటి అంటూ తిట్టారు, కొట్టారు, ఇంట్లో బంధించారు. అయినా ఆమె మనసును మాత్రం మార్చలేక పోయారు. సుఖ్వీందర్ కోసం పరితపిం చింది జస్సీ. ఫ్రెండ్స్ సాయంతో ఎలాగో తప్పించుకుని ఇండియా వచ్చేసింది. సుఖ్వీందర్‌తో తాళి కట్టించుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. ఇక తనకు ఏ కష్టమూ రాదనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకవు తుంది! నెల రోజులు తిరక్కుండానే సుఖ్వీందర్‌ని, జస్వీందర్‌ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సుఖ్వీందర్‌ని చితక్కొట్టి రోడ్డు పక్కన పడేశారు. జస్సీని కారులో దూరంగా తీసుకెళ్లి చంపేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ కాలువలో పడేశారు.
‘‘ఇది కచ్చితంగా వాళ్ల ఇంట్లోవాళ్ల పనే అయ్యుంటుంది సర్. వాళ్లు నన్ను అల్లుడిగా ఒప్పుకోలేదు. నన్ను పెళ్లి చేసుకుందన్న కోపంతో చివరికి తనని పొట్టన పెట్టుకున్నారు.’’
బాధేసింది ఇన్‌స్పెక్టర్‌కి. ఏం మనుషులు వీళ్లు! అల్లుడు నచ్చలేదని కూతుర్ని చంపేసుకుంటారా! కడుపు మండిపోయిందతనికి. విచారణ వేగవంతం చేశాడు. సుఖ్వీందర్ చెప్పిన గుర్తుల్ని బట్టి ఈ దారుణానికి పాల్పడిన ఏడుగురు దుండగుల్నీ అరెస్ట్ చేశాడు. వాళ్ల వాంగ్మూలం ఆధారంగా ఈ హత్య చేయిం చింది జస్సీ తల్లి మల్కిత్, మేనమామ సుర్జీత్ అని తేలింది. దాంతో వాళ్లమీద కూడా కేసు ఫైలు చేశాడు.
కానీ వాళ్లు కెనడాలో ఉండటంతో కేసు త్వరగా ముందుకు సాగలేదు. వాళ్లని అరెస్ట్ చేయడానికి చాలాకాలం పట్టింది. తీరా అరెస్టయ్యాక వారి పలుకుబడి కేసును పక్కదారి పట్టించింది. వాంగ్మూలాలు మారిపోయాయి. సాక్ష్యాలు తారుమారు అయ్యాయి. వాద ప్రతివాదనలు జరిగాయి. కానీ కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. పదిహేనేళ్లుగా సాగుతూనే ఉంది.
అయితే ఇప్పటికీ సుఖ్వీందర్‌లో మాత్రం ఆశ చావలేదు.
తన ప్రాణానికి ప్రాణమైన జస్సీని చంపినవాళ్లు ఉరి కంబానికి వేళ్లాడటం ఏదో ఒక రోజు తాను చూస్తాననే అంటున్నాడు. పాపం... నేటికీ ఆమె జ్ఞాపకాల కొలిమిలో కాలిపోతున్నాడు ఆ పేద ప్రేమికుడు. ‘‘జస్సీని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. తను కూడా నన్ను మొదటి చూపులోనే ఇష్టపడింది. ఆరోజు తను నా ఆటో ఎక్కింది. దిగేటప్పుడు తన లిప్‌స్టిక్‌తో ఐ లవ్యూ అని సీటు మీద రాసింది. నేనెంతో అదృష్టవంతుడిని అనుకున్నాను. కానీ నాకు తెలియలేదు... ఆ భగవంతుడు మా తలరాత నెత్తుటితో రాశాడని’’ అంటాడు చెమ్మగిల్లిన కళ్లతో. ఆ చెమ్మ నిండా జెస్సీ జ్ఞాపకాలే!