
టీనేజర్ల ఆరోగ్యానికి బ్రేక్‌ఫాస్టే కీలకం
వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఉదయాన్నే తినే అల్పాహారం ఆరోగ్యానికి కీలకంగా పనిచేస్తుంది. ఎదిగే వయసులో ఉన్న టీనేజర్లకైతే ఇది మరింత కీలకమని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొట్టే టీనేజర్లు తరచుగా ఆరోగ్య సమస్యల బారిన పడతారని వారు హెచ్చరిస్తున్నారు. తరచుగా బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొట్టే టీనేజర్లు ఐరన్, అయోడిన్, క్యాల్షియం, ఫోలేట్ వంటి పోషకాల లోపంతో బాధపడతారని, వారిలో జీవక్రియలు కూడా మందగిస్తాయని లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలం ఇదే అలవాటు కొనసాగితే మెదడు కుంచించుకుపోవడంతో పాటు ఎదుగుదల లోపాలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. సన్నగా కనిపించాలనో, త్వరగా కాలేజీలకు, స్కూళ్లకు బయల్దేరాలనో బ్రేక్‌ఫాస్ట్ ఎగవేయడం సరికాదని, ఎదిగే వయసులో ఉండే పిల్లలు ఉదయాన్నే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.