
బ్రిటిష్ గూఢచర్య సంస్థకు ఆస్థాన జ్యోతిష్యుడు
ఓ లుక్కేస్తారా!
హిట్లర్ నాయకత్వంలో నాజీ సేనలు విజృంభిస్తున్న రోజులవి. 1940 వేసవి నాటికి ఫ్రాన్స్ భూభాగంలో చాలా వరకు నాజీలు స్వాధీనం చేసేసుకున్నారు. ఇంగ్లిష్ చానల్ దక్షిణ భాగంలో బ్రిటిష్ అధీనంలో ఉన్న కొన్ని దీవులనూ నాజీలు స్వాధీనం చేసుకున్నారు. హిట్లర్ వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి దీటుగా ప్రతివ్యూహాలను పన్నడం బ్రిటిష్ గూఢచర్య సంస్థ ఎంఐ-5కి తలకు మించిన భారంగా పరిణమించింది.
మానవ ప్రయత్నంతో సాధించలేనిది అతీంద్రయ విద్యల సాయంతోనైనా సాధించాలనుకున్న బ్రిటిష్ ప్రభుత్వం, చివరకు యూదు సంతతికి చెందిన జర్మన్ జ్యోతిషుడు లూయీ డి వోల్‌ను ఎంఐ-5 ఆస్థాన జ్యోతిషుడిగా నియమించి, కెప్టెన్ హోదా కట్టబెట్టింది. ఒకవైపు ఉధృతంగా రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతుంటే, ఈ జ్యోతిషుడు తాపీగా శత్రు బలగాల్లోని ముఖ్యుల జాతకాలను పరిశీలిస్తూ, పై అధికారులకు నివేదికలు పంపేవాడు.