హ్యూమరం: బాబు క్విజ్ షో
చంద్రబాబు క్విజ్‌పోటీలో పాల్గొన్నాడు.
‘‘సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు?’’ అని అడిగాడు క్విజ్ మాస్టర్.
‘‘తూర్పున అనేది నిజం కాదు. పడమర కావచ్చు. ఒక్కోసారి ఈశాన్యం, నైరుతిలు కూడా కావచ్చు. కొన్నిసార్లు ఉదయించకపోవచ్చు. సూర్యుడు లేకుండా పగలు రావచ్చు. పగలు లేకుండా సూర్యుడు ఉండొచ్చు’’ అని ఆలోచించి మరీ చెప్పాడు బాబు.
క్విజ్ మాస్టర్ కంగారు పడి ‘‘ఇలాంటి సమాధానం ఇంతవరకూ వినలేదే’’ అన్నాడు.
బాబు పీఏ రంగప్రవేశం చేసి ‘‘ఆయనేం చెబితే అదే సమాధానం, ఏమీ చెప్పకపోతే అది సమాధానం లేని ప్రశ్న అని అర్థం’’ అన్నాడు.
క్విజ్ మాస్టర్ సర్దుకుని ‘‘ప్రజాస్వామ్యమంటే ఏమిటి?’’ అని అడిగాడు.
‘‘ప్రజలు లేకుండా ప్రజాస్వామ్యముండొచ్చు. ప్రజాస్వామ్యమంటే తెలియని ప్రజలుండొచ్చు. ప్రజలు, ప్రజాస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు ఉండొచ్చు. ప్రభుత్వమంటే తెలియని ప్రజలు ఉండొచ్చు. వాస్తవానికి ప్రజాస్వామ్యం గురించి ఏళ్ల తరబడి మాట్లాడ్డమే కానీ అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు’’ అన్నాడు బాబు.
‘‘రాజకీయమంటే ఏమిటి?’’ అని క్విజ్ మాస్టర్ అడిగాడు.
వెంటనే బాబు గాల్లోకి చేతిని ఊపి ‘‘ఇదిగో ఈ గిన్నెలోని పాయసం తాగు’’ అన్నాడు.
‘‘గిన్నె ఏంటి? పాయసమెక్కడుంది?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు క్విజ్ మాస్టర్.
పీఏ వచ్చి ‘‘కనబడని పాయసాన్ని ప్రజలతో తాగించడమే రాజకీయం. నోర్మూసుకుని తాగు’’ అన్నాడు.
మాస్టర్ భయపడిపోయి పాయసాన్ని తాగి మూతి తుడుచుకున్నాడు.
‘‘చివరగా మీకిష్టమైన సామెత చెప్పండి.’’
‘‘నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషం’’.
క్విజ్‌మాస్టర్ మూర్ఛపోతే పీఏ నీళ్లు చిలకరించి ‘‘ఆయనంతే. వడ్లు లేకుండా బియ్యాన్నీ, గుడ్లు లేకుండా కోళ్లనీ సృష్టించగలడు’’ అని చెప్పాడు.
మాస్టర్‌కి మళ్లీ స్పృహ తప్పింది.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
చిరంజీవి సమస్యల పరిష్కారం కోసం తీర్థయాత్రలు తిరుగుతున్నాడు.
కాంగ్రెస్ ప్రత్యేకత ఇరువైపులా తానే పందెం కాసి ఫైటింగ్ నడిపిస్తుంది.
కోడిని ఉచితంగా ఇచ్చి నీ ఇంట్లోని మేకల మందను తోలుకుపోవడమే రాజకీయం.