
నొప్పి నివారిణితో డిప్రెషన్‌కు చెక్!
సాదాసీదా నొప్పి నివారిణితో డిప్రెషన్‌కు చెక్ పెట్టవచ్చని ఒక తాజా పరిశోధనలో తేలింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు కొందరు డిప్రెషన్ రోగులకు ప్రయోగాత్మకంగా నొప్పి నివారిణి ఔషధమైన ‘ఇబుప్రొఫెన్’ ఇచ్చి చూశారు. ఆశ్చర్యకరంగా వారిలో యాంటీ డిప్రెసెంట్లకు కూడా తగ్గని డిప్రెషన్ లక్షణాలు ఇబుప్రొఫెన్ వాడటంతో తగ్గుముఖం పట్టాయి. మెదడులో ఏర్పడే చిన్నవాపు వల్ల కొందరిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని, అలాంటి పరిస్థితిలో మామూలు యాంటీ డిప్రెసెంట్లు వాడటం వల్ల పెద్దగా ఫలితం ఉండదని కింగ్స్ కాలేజీకి చెందిన బయలాజికల్ సైకియాట్రీ ప్రొఫెసర్ కార్మైన్ పారియాంటె చెబుతున్నారు. మెదడులో వాపు వల్ల డిప్రెషన్‌కు గురయ్యే వారికి ఇబుప్రొఫెన్ ఇచ్చినట్లయితే, వాపు తగ్గడమే కాకుండా డిప్రెషన్ లక్షణాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన వివరిస్తున్నారు. అల్జిమర్స్ వంటి క్రానిక్ వ్యాధుల్లో వాపులు కూడా సాధారణ లక్షణమేనని, అలాంటి వారికి ఇతర ఔషధాలతో పాటు ఇబుప్రొఫెన్ ఇవ్వడం వల్ల ఫలితం ఉంటుందని అంటున్నారు.