పదేళ్ల పెద్దవాడు... పెళ్లాడితే ప్రాబ్లెమా?! | dr.venati shobha sexual problems solutions! | Sakshi
Sakshi News home page

పదేళ్ల పెద్దవాడు... పెళ్లాడితే ప్రాబ్లెమా?!

Published Sun, Dec 6 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

పదేళ్ల పెద్దవాడు... పెళ్లాడితే ప్రాబ్లెమా?!

పదేళ్ల పెద్దవాడు... పెళ్లాడితే ప్రాబ్లెమా?!

సందేహం

నా వయసు 21. నేను మా కాలేజీలో పని చేసే లెక్చెరర్‌ని ప్రేమించాను. ఆయన వయసు 31. మా ఇంట్లో వాళ్లకి నా ప్రేమ గురించి చెబితే, అంత వయసు తేడా ఉంటే పెళ్లి చేసేది లేదని తెగేసి చెప్పారు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయని తిడుతున్నారు. కానీ తను లేకుండా నేను బతకలేను. ఆయన్ని పెళ్లి చేసుకుంటే నిజంగా నాకు సమస్యలొస్తాయా? మేమిద్దరం సుఖంగా జీవించలేమా?
 - అనిత, హన్మకొండ

 
మీరే అతన్ని ప్రేమిస్తున్నారా లేక అతను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? అతనికి అసలు మీ ప్రేమ గురించి తెలుసా? ఆయనకు పెళ్లయిందా ఇంకా అవివాహితుడేనా? ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి? ఇవన్నీ తెలుసుకున్నారా లేదా! ఇద్దరికి నచ్చి ప్రేమించుకుంటే వయసు పెద్ద విషయం కాదు. వయసు తేడా వల్ల పెద్ద సమస్యలు కూడా ఏమీ రావు. కాకపోతే ఆయన మరీ పెద్దవారు కాబట్టి మీకంటే చాలా త్వరగా ముసలి వారు అయిపోతారు. దానివల్ల ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలవీ రావొచ్చు.

అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇలాగే ప్రేమించగలుగుతారా అన్నది ఓసారి ఆలోచించుకోండి. అలాగే కొన్నిసార్లు వయసు గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆలోచనల్లో తేడాల వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. ఇవన్నీ ఆలోచించే పెద్దలు అభ్యంతరం చెబుతుంటారు. వీటన్నిటినీ అధిగమించగలను అనుకుంటే భేషుగ్గా పెళ్లి చేసుకోండి.

 

నా వయసు 22. ఈ మధ్యనే పాప పుట్టింది. ఆరోగ్యంగా ఉంది. కానీ నాకు పాలు పడటం లేదు. మంచి ఫుడ్ తీసుకుంటున్నా ఫలితం లేదు. డాక్టర్‌కి చెబితే ఏవో పౌడర్లు కూడా ఇచ్చారు. అవి తాగుతున్నా పాలు సరిపోవట్లేదు. పోత పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. పాలు బాగా రావడానికి ఏదైనా మార్గం ఉంటే చెబుతారా?
 - ఆర్.జానకి, నెల్లూరు

 
రొమ్ముల్లో పాలు ఉత్పత్తి అవ్వడానికి మెదడు నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల అవసరం ఉంటుంది. ఇవి సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా ఉండాలి. బిడ్డ రొమ్మును బాగా చీకగలగాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ఎటువంటి మందులూ అవసరం లేకుండా పాలు బాగా వస్తాయి. బిడ్డ ఆరోగ్యంగానే ఉందంటున్నారు. మరి పాలు సరిపడటం లేదని ఎందుకు అనుకుంటున్నారు? బిడ్డ తాగేకొద్దీ పాలు బాగా తయారవుతాయి.

పాలు సరిపోకపోతే బిడ్డ బరువు పెరగ కుండా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. ఆరు నెలల వరకూ మీ పాలే పట్టండి. మీరు పాలు, పప్పులు, కూర గాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ, డాక్టర్ చెప్పిన పౌడర్లు కూడా వాడండి. ఇంకా అవసరం అనుకుంటే ల్యాక్టోనిక్ గ్రాన్యూల్స్ నీళ్లలో కలిపి తీసుకోండి. ప్రొమోల్యాక్ట్ మాత్రలు రెండు పూటలా రెండేసి చొప్పున పది రోజులు వాడండి.  
 
నా వయసు 25. బరువు 68 కిలోలు. పోయినేడు థైరాయిడ్ సమస్య వచ్చింది. దానికి మందులు వాడటం మొదలు పెట్టినప్పట్నుంచీ  పీరియడ్స్ రావడం ఆగిపోయింది. డాక్టర్‌ని అడిగితే పీరియడ్స్ రావడానికి మందులిచ్చారు. ఆ నెల వచ్చి మళ్లీ ఆగిపోయాయి. అపట్నుంచీ మందులు వాడితే తప్ప పీరియడ్స్ రావడం లేదు. ఎందుకిలా అవుతోంది? ఇలా అయితే పిల్లల్ని కనడానికి ఇబ్బంది కలగదా?
 - విజయదుర్గ, శ్రీకాకుళం

 
బరువు రాశారు కానీ ఎత్తు రాయ లేదు. ఒకవేళ ఈ మధ్య బరువు కనుక పెరిగి ఉంటే... హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ క్రమం తప్పి ఉండ వచ్చు. థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారు కాబట్టి అది కంట్రోల్‌లో ఉంటే... దాని వల్ల సమస్య ఏమీ ఉండదు. ఒకసారి స్కానింగ్ చేయించు కుని, అండాశయాల్లో నీటి బుడగలు లేదా ఒవేరియన్ సిస్టులు ఉన్నాయేమో తెలుసుకోండి. ఉంటే దానికి మందులు వాడండి. తద్వారా పిల్లలు పుట్టడానికి పెద్ద ఇబ్బందులేమీ ఎదురు కావు. బరువు పెరిగి ఉంటే మాత్రం బరువు తగ్గడానికి తప్పకుండా ప్రయత్నించండి. మీ ఎత్తుకు తగిన బరువు మాత్రమే ఉండేలా చూసుకోండి.
 
నా వయసు 31. మావారు మంచివారే. కాకపోతే బాగా తాగుతారు. ఆ సమయంలో శృంగారం కోసం బాగా బలవంతపెడతారు. నాకు అయిష్టత ఉండదు కానీ, నెలసరి సమ యంలో బలవంతపెట్టినప్పుడు మాత్రం బాధగా ఉంటుంది. నాకు ఇబ్బందిగా ఉంటుందని ఎంత చెప్పినా వినిపించుకోరు. అలా కలిసినప్పుడల్లా నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంటోంది. ఆ నొప్పి రెండు మూడు రోజుల వరకూ తగ్గడం లేదు. నెలసరి తగ్గినా నొప్పి ఉంటోంది. అలా నొప్పి రాకుండా ఏవైనా మందులుంటాయా?
 - సుధారాణి, కాకినాడ

 
పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయ ముఖ ద్వారం కొద్దిగా తెరుచుకుంటుంది. ఆ సమయంలో కలవడం వల్ల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే క్రిములు గర్భాశయంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్లు వచ్చి, తర్వాత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయిష్టంగా కలిస్తే కండరాలు బిగబట్టడం జరిగి కూడా నొప్పి ఉండవచ్చు.

ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే... లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో తెలుస్తుంది. ఉంటే దానికి తగ్గ మందులు ఇస్తారు. అవి క్రమం తప్పకుండా వాడితే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అయినా మీరు మీవారితో ఓసారి మనసు విప్పి మీ ఇబ్బందిని చెప్పండి. ఆయన అర్థం చేసుకుంటే అసలు ఈ సమస్యే ఉండదు.
 
నా వయసు 26. పెళ్లై రెండేళ్లవుతోంది. ఒక బాబు. నాకో విచిత్రమైన సమస్య వచ్చింది. పోయిన నెల పీరియడ్స్ సమయంలో యోని నుంచి తెల్లటి నులి పురుగులు వచ్చాయి. ఒకవేళ అవి ప్యాడ్‌కి ఏమైనా ఉన్నాయేమోనని అనుకున్నాను. కానీ ఈ నెల కూడా వచ్చేసరికి భయమేస్తోంది. అసలు అలా పురుగులు వస్తాయా? ఇప్పుడు నేనేం చేయాలి?
 - రజిత, తణుకు

 
మీరు చూసింది నిజంగా నులి పురుగు లేనా కాదా అన్నది ముందు నిర్ధారణ చేసుకోవాలి. సాధారణంగా నులి పురుగులు గుడ్ల రూపంలో మనం తినే ఆహారం ద్వారా కడుపులోకి, తద్వారా పేగుల్లోకి వెళ్తాయి. అక్కడ పురుగులుగా మారి... పేగుల నుంచి, మలద్వారం నుంచి బయటికొస్తాయి. కొన్నిసార్లు మలద్వారం నుంచి యోనిలో ప్రవేశిస్తాయి. నిజంగా నులి పురుగులే అయితే ఆల్‌బెండజాల్ మాత్రలు వారానికి ఒకటి చొప్పున రెండు వారాలు వేసుకుని చూడండి. తర్వాత కూడా పురుగులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవండి.
 
నా వయసు 24. ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. డెలివరీ అయినప్పటి నుంచీ నా పొట్ట బాగా పెరిగిపోతోంది. మరీ ఎత్తుగా ఉండటంతో అందరూ మళ్లీ ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. దాంతో సిగ్గుగా ఉంటోంది. డెలివరీ అయ్యాక నడుముకు పొట్ట కట్టుకోక పోవడం వల్లే అలా అయ్యిందని మా అమ్మ అంటోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పొట్ట ఎలా తగ్గించుకోవాలి?
 - పూర్ణిమ, కరీంనగర్

 
తొమ్మిది నెలలపాటు శిశువు గర్భా శయంలో పెరుగుతుంది. అది పెరగడానికి అనువుగా పొట్ట లోపలి కండరాలు సాగుతాయి. అలాగే పొట్టమీది చర్మం కూడా సాగుతుంది. అలా కండరాలు, చర్మం సాగినప్పుడు అవి వదులవుతాయి. కాన్పు తర్వాత అవి పూర్తిగా సాధారణ స్థాయికి రావడం చాలా కష్టం. ఉదా హరణకు ఒక రబ్బర్ బ్యాండ్‌ను కొద్దిగా లాగి వదిలితే సాధారణ స్థితికి వచ్చే స్తుంది.

అదే పదే పదే లాగి వదిలినా, ఏదైనా వస్తువుకి చుట్టి తీసినా అది దాని ఎలాస్టిక్ గుణాన్ని కోల్పోయి వదులై పోతుంది. అదే విధంగా పొట్టమీది చర్మం కూడా తన సహజ గుణాన్ని కోల్పోయి వదులైపోతుంది. పొట్టకి బట్ట కట్టుకో వడం, బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట లోపలికి వెళ్లడం అంటూ ఉండదు. అవి కేవలం కొద్ది రోజులు సపోర్ట్ కోసమే పనికొస్తాయి.

సాధారణ కాన్పు అయితే నెల నుంచే వాకింగ్, అబ్డామినల్ వ్యాయామం లాంటివి చేస్తే పొట్ట చాలా వరకు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఆప రేషన్ జరిగివుంటే రెండు మూడు నెలల తర్వాతి నుంచీ వ్యాయామం చేయవచ్చు.
 
 
నా వయసు 26. ఇద్దరు పిల్లలు. రెండో కాన్పు అయిన తర్వాతి నుంచీ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతోంది. డాక్డర్ దగ్గరకు వెళ్లాను. కుట్లు సరిగ్గా పడక ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. దానివల్లే అలా అవుతోందట. అది నిజమేనా? కుట్లు సరిగ్గా పడకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందా?
 - రమణి, విజయవాడ

 
సాధారణంగా రెండు కాన్పుల తర్వాత కొందరిలో గర్భాశయ ముఖ ద్వారం చీరుకున్నట్లవుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చి వైట్ డిశ్చార్జి అవ్వవచ్చు. అంతేకానీ కుట్లు సరిగ్గా పడకపోవడం దానికి కారణం కాకపోవచ్చు. కాబట్టి ముందు ఇన్ఫెక్షన్ ఎటువంటిదో పరీక్ష చేయించుకుని, దానికి తగ్గ యాంటీ బయొటిక్స్ వాడండి. సమస్య తీరిపోతుంది.
 
నా వయసు 32. పెళ్లై ఆరేళ్లు అవుతోంది. ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు. దాంతో మా అత్తింటివాళ్లు చాలా వేధిస్తున్నారు. గొడ్రాలు అంటున్నారు. చాలామంది డాక్టర్లకు చూపించాను. ఏ సమస్యా లేదని అంటున్నారు. నాకు వైట్ డిశ్చార్జి చాలా ఎక్కువగా అవుతుంది. దానివల్ల ఏదైనా సమస్య ఉందేమో అంటుంటే అలాంటిదేమీ లేదంటున్నారు. మరి నేనెందుకు గర్భం దాల్చడం లేదు? పిల్లలు లేకపోవడం వల్ల నా జీవితం నరకంలా తయారయ్యింది. దయచేసి సమస్యకు పరిష్కారం చెప్పండి.
 - రామలక్ష్మి, గుంటూరు

 
మీకు ఫాలోపియన్ ట్యూబ్స్ తెరుచుకునే ఉన్నాయా మూసుకు పోయాయా అనేది తెలుసుకోవడానికి హెచ్‌ఎస్‌జీ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే చేసివుంటే ఐయూఐ మూడుసార్ల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా కాకపోతే... ల్యాపరో స్కోపీ, హిస్టరోస్కోపీ అనే చిన్న ఆపరేషన్ చేసి...

గర్భాశయం వెలుపల, లోపల, అండాశయాల్లో, ట్యూబులో మరేవైనా సమస్యలు ఉన్నాయేమో చూసి సరి చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పటికీ సక్సెస్ కాకపోతే చివరిగా ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నమాట.                           
 
డా॥వేనాటి శోభ, లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement