క్యాన్సర్ వచ్చి తగ్గింది... పెళ్లి చేసుకోవచ్చా?!
సందేహం
నా వయసు 22. ఈ మధ్యనే పాప పుట్టింది. తల్లిపాలే ఇస్తున్నాను. అయితే పాపకి ఓసారి వెక్కిళ్లు వస్తే కొద్దిగా నీళ్లు పట్టించాను. అది చూసి మా అమ్మ కోప్పడింది. చంటిపిల్లలకు ఆరు నెలలు దాటేవరకూ నీళ్లు తాగించ కూడదు అంది. అది నిజమేనా? పాపకు నీళ్లు పట్టించకూడదా? ఏ వయసు వచ్చేవరకూ పట్టించకూడదు?
- కవిత, వరంగల్
పిల్లలకు మొదటి ఆరు నెలలు నీటి అవసరం ఉండదు. ఎందుకంటే తల్లి పాలలో, డబ్బా పాలలో 85 శాతం నీరే ఉంటుంది. కాబట్టి మొదటి ఆరు నెలలు మంచినీళ్ల అవసరం ఉండదు. ఒకవేళ విడిగా నీళ్లు కనుక తాగిస్తే... తీసుకున్న ఆహారంలోని మినరల్స్, విటమిన్స్ డైల్యూట్ అయ్యి, బిడ్డకు సరైన పోషకాలు అందవు. పైగా చిన్నపిల్లల కిడ్నీలు మొదటి ఆరు నెలల్లో అధిక నీటిని తట్టుకోలేవు. నీళ్లు ఎక్కువైతే వాళ్లకు water intoxication జరుగుతుంది. డబ్బాపాలలో కూడా దానిపైన ముద్రించిన మోతాదులోనే నీళ్లు కలిపి తాగించాలి. అలా కాకుండా ఎక్కువ కలిస్తే మాత్రం పోషకాలు అందక పిల్లలకు వేరే సమస్యలు ఏర్పడతాయి.
నా వయసు 24. నేను చిన్నప్పట్నుంచీ బలపాలు తింటూ ఉంటాను. ఎందుకో తెలీదు కానీ నాకు అవంటే చాలా ఇష్టం. రోజుకి ఒకటైనా తింటాను. ఇది నా క్లోజ్‌ఫ్రెండ్స్‌కి తప్ప ఎవరికీ తెలియదు. ఈ మధ్య నా ఫ్రెండ్ నాతో, బలపాలు తింటే పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది, మానెయ్ అంది. ఆ మాట విన్నప్పట్నుంచీ భయమేస్తోంది. మరో ఐదు నెలల్లో నా పెళ్లి. ఒకవేళ నా అలవాటు వల్ల నాకు పిల్లలు పుట్టరా అని కంగారు వచ్చేస్తోంది. కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా తినకుండా ఉండలేకపోతున్నాను. ఇదేమైనా వ్యాధా? నాకు పిల్లలు పుడతారా పుట్టరా?
- మౌనిక, ఒంగోలు
కొందరికి బలపాలు, చాక్‌పీసులు, ముగ్గురాళ్లు, బియ్యం తినే అలవాటు ఉంటుంది. దీనినే ‘పైకా’ అంటారు. రక్తంలో కాల్షియం, హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా, రక్తహీనత ఉన్నా, కొన్ని రకాల మినరల్స్ తక్కువ ఉన్నా ఇలాంటివి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కొందరి కడుపులో పేగుల్లో నులి పురుగులు ఉంటాయి. అవి రక్తం, తద్వారా విటమిన్స్, మినరల్స్ వంటి వాటిని లాగేసుకోవడం వల్ల బలపాలు, చాక్‌పీసుల్లాంటివి తినాలనిపిస్తుంది.
కాబట్టి మీరోసారి డాక్టర్‌ని సంప్రదించి రక్తహీనత ఉందేమో పరీక్ష చేయించుకోవడం మంచిది. సీబీపీ లేదా హెమోగ్లోబిన్ శాతం, కాల్షియం టెస్ట్ వంటివి చేయించుకుని... కారణాన్ని బట్టి చికిత్స తీసుకోండి. కాల్షియం, ఐరన్ తక్కువగా ఉంటే... మూడు నెలల పాటు ఆ మాత్రలు వేసుకోవాలి. మలంలో నులి పురుగులు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకుని, దానికి కూడా చికిత్స తీసుకోవడం మంచిది.
తద్వారా బలపాలు, చాక్‌పీసులు తినే అలవాటు తగ్గుతుంది. ఇవి తినడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అంటూ ఉండదు. కాకపోతే అవి తినడానికి గల కారణం వల్ల... అంటే రక్తహీనత, కాల్షియం లోపం వంటి వాటి వల్ల గర్భంతో ఉన్నప్పుడు సమస్యలు రావచ్చు. కాబట్టి కంగారు పడకుండా ముందు మంచి డాక్టర్‌ను కలిసి పరీక్షలు, చికిత్స చేయించుకోండి.
నా వయసు 28. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 50 కిలోలు. నాకు ఇరవై రెండేళ్లు ఉన్నప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ప్రారంభ దశలోనే ఉండటంతో ఆపరేషన్ చేసి గ్లాండ్‌ను తీసేశారు. శరీరంలో ఇంకెక్కడికీ క్యాన్సర్ పాకలేదని చెప్పారు. ఆ తర్వాత నేను బాగానే ఉన్నాను. డాక్టర్ చెప్పిన థైరాయిడ్ మాత్రలు వాడుతున్నాను. ఏ సమస్యా లేదు కాబట్టి పెళ్లి చేసుకొమ్మని ఇంట్లోవాళ్లు అంటున్నారు. కానీ నాకు భయంగా ఉంది. క్యాన్సర్ వచ్చినవాళ్లకు పిల్లలు పుడతారా? పుడితే వాళ్లకు ఏవైనా సమస్యలు వస్తాయా? ఒకవేళ నాకే భవిష్యత్తులో మళ్లీ ఏమైనా ఇబ్బందులొస్తాయా అనేది అర్థం కావడం లేదు. ఏం చేయాలో మీరే చెప్పండి.
- ఎన్.ప్రభావతి, కాశిపూడి
మీకు థైరాయిడ్ క్యాన్సర్‌కి ఆపరేషన్ చేసి, థైరాయిడ్ గ్లాండ్ తీసేసి ఆరు సంవత్సరాలు అయిపోయింది. ఆ క్యాన్సర్ చుట్టుపక్కల పాకలేదు కనుక దానివల్ల ఇంకెప్పటికీ సమస్య రాదు. క్యాన్సర్ ఏ భాగానికి వచ్చింది, అది చుట్టూ పాకిందా, రేడియోథెరపీ ఇచ్చారా, కీమోథెరపీ ఇచ్చారా అనేదాన్ని బట్టి పిల్లలు పుడతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మీకు థైరాయిడ్‌కి మాత్రమే వచ్చింది. అదీ తీసేశారు కాబట్టి పిల్లలు పుట్టకపోవడం అనేది ఉండదు.
ఎలాగూ మీరు థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారు కాబట్టి వాటిని క్రమం తప్పకుండా జీవితాంతం వాడండి. పుట్టబోయే బిడ్డకి మీ సమస్య వల్ల ఏ ఇబ్బందీ రాదు. ఈ ఆరేళ్లలో మీకు ఏ ఇబ్బందీ లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. ఓసారి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను కలిసి సలహా తీసుకుని, అవసరమైతే థైరాయిడ్ పరీక్షలు చేయించుకుని చక్కగా పెళ్లి చేసుకోండి. ఆనందంగా ఉండండి.
నా వయసు 22. నేను ఈ మధ్యనే గర్భం దాల్చాను. మా అత్తగారు జాగ్రత్తలు చెబుతూ నువ్వులు, పైనాపిల్, బొప్పాయి పొరపాటున కూడా తినొద్దు అని చెప్పారు. తింటే గర్భం పోతుందని కూడా అన్నారు. అది నిజమా? బొప్పాయి తింటే గర్భవతులకు మంచిదే అని ఎక్కడో చదివినట్టు గుర్తు. అందుకే మిమ్మల్ని అడగాలనిపించింది. అవి నేను తినొచ్చా తిన కూడదా? గర్భవతులు తినకూడనివి ఏంటి?
- సుజిత, సంగారెడ్డి
గర్భవతులు బొప్పాయి, పైనాపిల్, నువ్వులు తినకూడదు, వాటివల్ల అబా ర్షన్లు అవుతాయి... అరటిపండు, కొబ్బరి నీళ్లు తీసుకుంటే బిడ్డకి జుట్టు రాదు, జలుబు చేస్తుంది అంటూ పెద్దవారు, పక్కింటివారు చెబుతూ ఉంటారు. కానీ ఇవేవీ నిజాలు కావు. కేవలం అపోహలు. వాస్తవం ఏమిటంటే... బొప్పాయి (పచ్చిది కాదు) బాగా పండిన తర్వాత తింటే... దానిలో ఉండే విటమిన్ ఎ, బి, సి, ఫైబర్‌లు తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి బొప్పాయిలో latex, papain అనే పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల.. వాటిని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు కాస్త ఎక్కువ. అందకని బొప్పాయిని పచ్చిగా కాకుండా పండిన తర్వాత తీసుకోవాలి. కాకపోతే కాస్త మితంగానే తీసుకోవాలి.
ఇక పైనాపిల్‌లో ఉండే బి, సి విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎంతో మేలు చేస్తాయి. సీ విటమిన్ బిడ్డ ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా పెరగ డానికి... బీ విటమిన్ బిడ్డ కణజాలం, నాడీవ్యవస్థ వంటివి అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడతాయి. ఫైబర్ వల్ల తల్లిలో జీర్ణశక్తి పెరిగి, మలబద్ధక సమస్య ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మితంగా తినవచ్చు. మితంగా ఎందుకు అంటే... పైనాపిల్‌లో ఉండే బ్రోమిలిన్ అనే పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో (అతి తక్కువ) అబార్షన్లు అయ్యే అవకాశాలున్నాయి.
ఇక నువ్వుల సంగతి. ఇవి తింటే వేడి చేస్తుందనేది అపోహ మాత్రమే. నువ్వుల్లో ఐరన్, కాల్షియం, అమైనో యాసిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఉంటాయి. అవి కూడా తల్లికీ, బిడ్డకీ ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే ఏదైనా మితంగానే తినాలి. అతి ఎవరికైనా ప్రమాదమే! కాకపోతే పచ్చళ్లు, నూనె వస్తువులు, కారం, మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
కొబ్బరినీళ్లు తాగండి. ఎక్కువ చక్కెర లేకుండా పండ్లరసాలూ తీసుకోవచ్చు. అరటిపండ్లు, సపోటాలు వంటి చక్కెర ఎక్కువ ఉన్న పండ్లని బరువు తక్కువగా ఉన్నవారు తీసుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో షుగర్ వ్యాధి హిస్టరీ ఉన్నవారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
నా వయసు 23. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. అంతకు రెండేళ్ల ముందే నాకు హెచ్‌ఐవీ ఉందని తెలిసింది. దిగులు పడ్డాను. కానీ అదే సమస్య ఉన్న నా స్నేహితుడొకరు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం. మందులు వాడుతున్నాం. నాకో బిడ్డను కనాలని ఉంది. కానీ పుట్టే బిడ్డకు కూడా హెచ్‌ఐవీ వస్తుందేమోనని భయం. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
- ఓ సోదరి
హెచ్‌ఐవీ అనేది ఓ వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక కణాలలో చేరి, అక్కడ వృద్ధి చెందుతూ, ఆ కణాలను నశింపజేస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుముడతాయి. మనిషిని మెల్లమెల్లగా కృశింపజేస్తాయి. ఈ పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. ఈ వ్యాధి అసురక్షిత రక్తమార్పిడి వల్ల, లైంగిక కలయికల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచ్‌ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే... మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది.
తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సంక్ర మిస్తుంది. అయితే ఇప్పుడు మిగతా జబ్బుల లాగానే దీనికి కూడా యాంటి వైరల్ మందుల్ని కనుగొన్నారు. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల హెచ్‌ఐవీ వైరస్ చాలావరకు నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరూ ఓసారి వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోండి. ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని రోజులు మందులు వాడి, తర్వాత గర్భం కోసం ప్రయత్నించండి.
అప్పుడు కడుపులో బిడ్డకి హెచ్‌ఐవీ వైరస్ సంక్రమించే అవకాశాలు తగ్గుతాయి. గర్భం దాల్చిన తర్వాత కూడా డాక్టర్ పర్యవేక్షణలో సక్రమంగా మందులు వాడాలి. దానివల్ల బిడ్డకి వైరస్ తక్కువగా సంక్రమిస్తుంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోనిద్వారా వైరస్ ఎక్కువగా సంక్ర మించే అవకాశాలుంటాయి. కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయించేసుకోవాలి.
దానివల్ల బిడ్డకి హెచ్‌ఐవీ సోకే అవకాశాలు తక్కువ. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్‌ఐవీ మందులు వాడటం వల్ల... వైరస్ బిడ్డకు సోకి ఉంటే, అది కాస్తా నాశనమవుతుంది. తల్లిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా బయటి పాలే ఇవ్వాలి. లేదంటే వైరస్ బిడ్డకు సోకేస్తుంది.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్