Dr.venati shobha
-
ఫైబ్రాయిడ్... క్యాన్సర్‌గా మారుతుందా?
సందేహం నా వయసు 28. పెళ్లైన సంవత్సరానికే గర్భం దాల్చాను. అయితే గర్భం ట్యూబులో రావడంతో ల్యాపరోస్కోపీ చేసి ఒకవైపు ట్యూబ్ తీసేశారు. ఇది జరిగి మూడేళ్లవుతోంది. కానీ ఇంతవరకూ నేను మళ్లీ గర్భం దాల్చలేదు. ఒక ట్యూబ్ తీసేస్తే పిల్లలు పుట్టరా? నేను తల్లినయ్యే అవకాశం ఇక లేదా? దయచేసి నేనేం చేయాలో సలహా ఇవ్వండి. - వి.రమ్యశ్రీ, నకిరేకల్ గర్భాశయానికి ఇరువైపులా ఒక్కో ట్యూబు, ఒక్కో అండాశయం ఉంటాయి. ప్రతినెలా అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఒక నెల ఒకవైపు అండాశయం నుంచి, మరో నెల మరొక అండాశయం నుండి విడుదలైన అండం... అటువైపున్న ట్యూబ్‌లోకి ప్రవేశించి, అక్కడకు గర్భాశయం నుంచి వచ్చిన వీర్యకణాలతో ఫలదీకరణ చెందుతుంది. దాంతో ట్యూబ్‌లో పిండం ఏర్పడి, అది తిరిగి గర్భాశయంలోకి చేరి, అక్కడ పాతుకుని, గర్భం మొదలవుతుంది. మీకు ఒకవైపు ట్యూబ్ లేదు, ఇంకోవైపు ఉంది కాబట్టి... అటువైపు అండం విడుదలైనప్పుడు గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆపరేషన్ అయ్యి మూడేళ్లు అయినా ఇంకా గర్భం రాలేదు కాబట్టి.. ఓసారి గైనకాలజిస్టును సంప్రదించండి. ట్యూబ్ ఉన్న అండాశయం నుంచి అండం విడుదల అవుతుందా లేదా తెలుసుకోడానికి ఫాలిక్యులార్ స్టడీ చేసి చూడాల్సి ఉంటుంది. ట్యూబ్ ఉన్నవైపు అండా శయం నుంచి అండం విడుదలయ్యే టప్పుడు భర్తతో కలిస్తే గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదలవ్వకపోతే... మందులు వాడి ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. అయినా గర్భం రాకపోతే... ఉన్న ట్యూబ్ తెరచుకునే ఉందా లేక మూసుకుని ఉందా తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా డాక్టర్‌ను కలిసి, అన్ని పరీక్షలూ చేయించుకుని, తగిన చికిత్స తీసుకోండి. త్వరలోనే తప్పకుండా పండంటి బిడ్డకు తల్లి అవుతారు. నా వయసు 23. నాకిప్పుడు నాలుగో నెల. ఈ మధ్య స్కానింగ్ చేసినప్పుడు నా గర్భాశయంలో ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది. దానివల్ల సమస్య ఏమీ ఉండదని డాక్టర్ చెప్పారు. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఫైబ్రాయిడ్లు క్యాన్సర్లుగా మారతాయని ఎక్కడో విన్నాను. అస్తమానం అదే నా బుర్రలో తిరుగుతోంది. నా బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని భయమేస్తోంది. అలాంటివేమీ జరక్కూడదంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - మంజూష, పాలకొల్లు గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రస్ టిష్యూ, కండరాలతో కూడిన గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు చాలా చాలా అరుదు. కాబట్టి అనవసరంగా ఆందోళన చెందకుండా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండండి. గడ్డలు పెద్దవిగా ఉన్నా, ఎక్కువ గడ్డలు ఉన్నా కాన్పు సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గడ్డ చిన్నదే కాబట్టి అసలు కంగారే అవసరం లేదు. దాని కోసం మీరు ప్రత్యేకంగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. గర్భంలో శిశువు పెరిగేకొద్దీ గర్భాశయం సాగడం జరుగుతుంది. అందులో ఈ గడ్డ ఇంకా చిన్నగా కనబడుతుంది. చాలా అరుదుగా మాత్రమే గర్భంతో ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడవద్దు. డాక్టర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా స్కానింగులు చేయించుకోండి. ఆనందంగా ఉండి పండంటి బిడ్డను కనండి. నా వయసు 27. ఎత్తు 4 అంగుళాల 10 సెం.మీ. బరువు 57 కిలోలు. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అయ్యింది. మావారికి నాకు మధ్య పదకొండు సంవత్సరాల వయసు తేడా ఉంది. నాకు వెంటనే పిల్లలు కావాలని అనిపిస్తోంది. కానీ ఇంతవరకూ నేను గర్భం దాల్చలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకుంటే పాప్‌స్మియర్ పరీక్ష చేసి ఇన్ఫెక్షన్ ఉంది అని తేల్చారు. అది పోవడానికి ఏవో మందులు కూడా ఇచ్చారు. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది. అది ఉంటే పిల్లలు పుట్టరా? - లక్ష్మి, మచిలీపట్నం యోని లోపల, గర్భాశయ ముఖ ద్వారం నుంచి ద్రవాన్ని తీసి... దాన్ని పరీక్షకు పంపించి, దానిలోని కణాలు ఎటువంటివో తెలుసుకునే పరీక్షను పాప్‌స్మియర్ అంటారు. ఇందులో మీకు ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది కాబట్టి దానికి సరైన యాంటి బయొటిక్స్తో కూడిన చికిత్స తీసుకుంటే మీ సమస్య త్వరలోనే తీరిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిపోతే పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవా, వైరస్ల వల్ల రావొచ్చు. ఇది భారాభర్తల కలయిక వల్ల ఒకరి నుంచి ఒకరి సంక్రమించనూ వచ్చు. లేదా ఆడవారిలో మలద్వారం యోని ద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల మలద్వారం దగ్గరున్న రోగక్రిములు యోని ద్వారంలోకి ప్రవేశించి, తద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. అయినా మీకు పెళ్లై తొమ్మిది నెలలే అయ్యింది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుని మరో మూడు నెలలు గర్భం కోసం ప్రయత్నం చేయండి. సంవత్సరం దాటినా కూడా గర్భం దాల్చకపోతే, డాక్టర్‌ను సంప్రదించండి. గర్భం రాకపోవడానికి గల కారణాలు తెలుసుకుంటే తగిన చికిత్స తీసుకోవచ్చు. నా వయసు 22. బరువు 90 కిలోలు. మెచ్యూర్ అయినప్పట్నుంచీ కూడా నాకు పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కాదు. అయితే గత నెల వచ్చాయి కానీ ఇరవై అయిదు రోజుల పాటు బ్లీడింగ్ అవుతూనే ఉంది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకున్నాను. హైపో థైరాయిడ్ అని, నా గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని తేలింది. సెకెండ్ ఒపీనియన్ ఉంటే మంచిదని మరో హాస్పిటల్లో కూడా చేయించుకున్నాను. అక్కడా ఇదే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకున్నవి పెద్ద సమస్యలా? - విజయలక్ష్మి, కోదాడ మీరు తొంభై కిలోల బరువు ఉన్నారు. అంటే అధిక బరువు ఉన్నారు. దానివల్ల అండాశయంలో నీటి బుడగలు ఏర్పడి, హార్మోన్ల అసమతుల్యత కూడా వచ్చి, పీరియడ్స్ సక్రమంగా రావు. పైగా మీకు హైపో థైరాయిడ్ సమస్య కూడా ఉంది. ఇది ఉంటే థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువ విడుదలవుతుంది. దానివల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రావు. అయితే ప్రతి ఒక్క సమస్యకీ ఏదో ఒక పరిష్కారం ఉన్నట్లే... మీ సమస్యకీ పరిష్కారం ఉంది. కాకపోతే అది మీ చేతుల్లోనే ఉంది. బరువు తగ్గడం వల్ల థైరాయిడ్ సమస్య కొద్దిగా అదుపులోకి వస్తే, మందుల డోసును తగ్గించవచ్చు. అలాగే నీటి బుడగల వల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా కొద్దిగా సరి చేయవచ్చు. క్రమపద్ధతిలో వ్యాయామం, వాకింగ్ చేస్తూ ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకోండి. దాంతో బరువు తగ్గుతారు. అలాగే గైనకాలజిస్టును సంప్రదించి, వారి పర్యవేక్షణలో పీసీఓఎస్ ఇంకా పెరగకుండా ఉండటానికి, అలాగే హార్మోన్ల అసమతుల్యతను సరిచేయ డానికి మందుల్ని వాడండి. కచ్చితంగా మీ సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడు కనుక అశ్రద్ధ చేస్తే సమస్య ఇంకా జటిలమవుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిపోతే పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవా, వైరస్ వల్ల రావొచ్చు. ఇది భారాభర్తల కలయిక వల్ల ఒకరి నుంచి ఒకరి సంక్రమించనూ వచ్చు. నా వయసు 33. బరువు 55 కిలోలు. నాకు ఇద్దరు పిల్లలు. నాకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతోంది. గత నెల పదిహేను రోజుల వరకూ అవ్వడంతో డాక్టర్ని సంప్రదించాను. స్కాన్ చేసి గర్భసంచి ఉబ్బింది, 13.5 ఉంది అని చెప్పారు. నేను ప్రతి విషయాన్నీ ఎక్కువ ఆలోచిస్తాను. ఏదైనా చిన్న బాధ కలిగినా పదే పదే తలచుకుని కుమిలి పోతుంటాను. ఈ లక్షణాలు పీరియడ్స్‌కి ముందు మరీ ఎక్కువవు తున్నాయి. ఈ మనస్తత్వం వల్లే నాకు సమస్య వచ్చిందేమో అనిపిస్తోంది. దీనికి తోడు నాకు సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. పరిష్కారం చెప్పండి. - బి.కవిత, వరంగల్ మీకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువవుతోంది, పైగా అది రానురాను ఎక్కువ రోజులు అవుతోందని అంటున్నారు. గర్భాశయం ఉబ్బిందనీ అంటున్నారు. మీరు రాసిన 13.5 అనేది గర్భాశయం పొడవా లేక ఏంటి అనేది సరిగ్గా రాలేదు. నేననుకోవడం గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర మందంగా తయారయ్యి, 13.5 మిల్లీ మీటర్లకు చేరినట్లుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల జరిగి ఉండొచ్చు. మీరు చెప్పే కంగారు, భయం వంటి లక్షణాలు కూడా చాలామందికి పీరియడ్స్ మొదలయ్యే పది రోజులకు ముందు నుంచే ఎక్కువ అవుతూ ఉంటాయి. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా పీరియడ్స్ ముందు రక్తంలో అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్లలో మార్పుల వల్ల, మినరల్స్ లోపం వల్ల రావొచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో సాయంత్రం primerose oil, minerals కాంబినేషన్‌తో ఉన్న మాత్రలను మూడు నెలల పాటు వాడుతూ ఉండాలి. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల సిండ్రోమ్ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. ఎండోమెట్రియమ్ పొర 13.5 మి.మీ. మందంగా ఉండటం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది. దీనికి మూడు నెలల పాటు ప్రతి నెలా పదిహేనవ రోజు నుంచి పది రోజుల పాటు medroxyprogesterone మందులు వాడండి. మూడు నెలల తర్వాత ఐదవ రోజు స్కానింగ్ చేసి, ఎండోమెట్రియమ్ పొర మందం ఎంత ఉందో చూసుకోవాలి. 6 మి.మీ. ఉంటే ఫర్వాలేదు. ఇంకా మందంగా కనుక ఉంటే... డీ అండ్ సీ చేసి, పొర ముక్కను బయాప్సీకి పంపించాలి. కారణం తెలిశాక దాన్నిబట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల తేడా వల్ల కూడా బ్లీడింగ్ అధికంగా అవ్వొచ్చు. హార్మోన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని, వాటిలో తేడా ఉంటే తగిన మందులు వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు. - డా. వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
క్యాన్సర్ వచ్చి తగ్గింది... పెళ్లి చేసుకోవచ్చా?!
సందేహం నా వయసు 22. ఈ మధ్యనే పాప పుట్టింది. తల్లిపాలే ఇస్తున్నాను. అయితే పాపకి ఓసారి వెక్కిళ్లు వస్తే కొద్దిగా నీళ్లు పట్టించాను. అది చూసి మా అమ్మ కోప్పడింది. చంటిపిల్లలకు ఆరు నెలలు దాటేవరకూ నీళ్లు తాగించ కూడదు అంది. అది నిజమేనా? పాపకు నీళ్లు పట్టించకూడదా? ఏ వయసు వచ్చేవరకూ పట్టించకూడదు? - కవిత, వరంగల్ పిల్లలకు మొదటి ఆరు నెలలు నీటి అవసరం ఉండదు. ఎందుకంటే తల్లి పాలలో, డబ్బా పాలలో 85 శాతం నీరే ఉంటుంది. కాబట్టి మొదటి ఆరు నెలలు మంచినీళ్ల అవసరం ఉండదు. ఒకవేళ విడిగా నీళ్లు కనుక తాగిస్తే... తీసుకున్న ఆహారంలోని మినరల్స్, విటమిన్స్ డైల్యూట్ అయ్యి, బిడ్డకు సరైన పోషకాలు అందవు. పైగా చిన్నపిల్లల కిడ్నీలు మొదటి ఆరు నెలల్లో అధిక నీటిని తట్టుకోలేవు. నీళ్లు ఎక్కువైతే వాళ్లకు water intoxication జరుగుతుంది. డబ్బాపాలలో కూడా దానిపైన ముద్రించిన మోతాదులోనే నీళ్లు కలిపి తాగించాలి. అలా కాకుండా ఎక్కువ కలిస్తే మాత్రం పోషకాలు అందక పిల్లలకు వేరే సమస్యలు ఏర్పడతాయి. నా వయసు 24. నేను చిన్నప్పట్నుంచీ బలపాలు తింటూ ఉంటాను. ఎందుకో తెలీదు కానీ నాకు అవంటే చాలా ఇష్టం. రోజుకి ఒకటైనా తింటాను. ఇది నా క్లోజ్ఫ్రెండ్స్కి తప్ప ఎవరికీ తెలియదు. ఈ మధ్య నా ఫ్రెండ్ నాతో, బలపాలు తింటే పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది, మానెయ్ అంది. ఆ మాట విన్నప్పట్నుంచీ భయమేస్తోంది. మరో ఐదు నెలల్లో నా పెళ్లి. ఒకవేళ నా అలవాటు వల్ల నాకు పిల్లలు పుట్టరా అని కంగారు వచ్చేస్తోంది. కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా తినకుండా ఉండలేకపోతున్నాను. ఇదేమైనా వ్యాధా? నాకు పిల్లలు పుడతారా పుట్టరా? - మౌనిక, ఒంగోలు కొందరికి బలపాలు, చాక్‌పీసులు, ముగ్గురాళ్లు, బియ్యం తినే అలవాటు ఉంటుంది. దీనినే ‘పైకా’ అంటారు. రక్తంలో కాల్షియం, హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా, రక్తహీనత ఉన్నా, కొన్ని రకాల మినరల్స్ తక్కువ ఉన్నా ఇలాంటివి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కొందరి కడుపులో పేగుల్లో నులి పురుగులు ఉంటాయి. అవి రక్తం, తద్వారా విటమిన్స్, మినరల్స్ వంటి వాటిని లాగేసుకోవడం వల్ల బలపాలు, చాక్పీసుల్లాంటివి తినాలనిపిస్తుంది. కాబట్టి మీరోసారి డాక్టర్ని సంప్రదించి రక్తహీనత ఉందేమో పరీక్ష చేయించుకోవడం మంచిది. సీబీపీ లేదా హెమోగ్లోబిన్ శాతం, కాల్షియం టెస్ట్ వంటివి చేయించుకుని... కారణాన్ని బట్టి చికిత్స తీసుకోండి. కాల్షియం, ఐరన్ తక్కువగా ఉంటే... మూడు నెలల పాటు ఆ మాత్రలు వేసుకోవాలి. మలంలో నులి పురుగులు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకుని, దానికి కూడా చికిత్స తీసుకోవడం మంచిది. తద్వారా బలపాలు, చాక్‌పీసులు తినే అలవాటు తగ్గుతుంది. ఇవి తినడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అంటూ ఉండదు. కాకపోతే అవి తినడానికి గల కారణం వల్ల... అంటే రక్తహీనత, కాల్షియం లోపం వంటి వాటి వల్ల గర్భంతో ఉన్నప్పుడు సమస్యలు రావచ్చు. కాబట్టి కంగారు పడకుండా ముందు మంచి డాక్టర్‌ను కలిసి పరీక్షలు, చికిత్స చేయించుకోండి. నా వయసు 28. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 50 కిలోలు. నాకు ఇరవై రెండేళ్లు ఉన్నప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ప్రారంభ దశలోనే ఉండటంతో ఆపరేషన్ చేసి గ్లాండ్‌ను తీసేశారు. శరీరంలో ఇంకెక్కడికీ క్యాన్సర్ పాకలేదని చెప్పారు. ఆ తర్వాత నేను బాగానే ఉన్నాను. డాక్టర్ చెప్పిన థైరాయిడ్ మాత్రలు వాడుతున్నాను. ఏ సమస్యా లేదు కాబట్టి పెళ్లి చేసుకొమ్మని ఇంట్లోవాళ్లు అంటున్నారు. కానీ నాకు భయంగా ఉంది. క్యాన్సర్ వచ్చినవాళ్లకు పిల్లలు పుడతారా? పుడితే వాళ్లకు ఏవైనా సమస్యలు వస్తాయా? ఒకవేళ నాకే భవిష్యత్తులో మళ్లీ ఏమైనా ఇబ్బందులొస్తాయా అనేది అర్థం కావడం లేదు. ఏం చేయాలో మీరే చెప్పండి. - ఎన్.ప్రభావతి, కాశిపూడి మీకు థైరాయిడ్ క్యాన్సర్‌కి ఆపరేషన్ చేసి, థైరాయిడ్ గ్లాండ్ తీసేసి ఆరు సంవత్సరాలు అయిపోయింది. ఆ క్యాన్సర్ చుట్టుపక్కల పాకలేదు కనుక దానివల్ల ఇంకెప్పటికీ సమస్య రాదు. క్యాన్సర్ ఏ భాగానికి వచ్చింది, అది చుట్టూ పాకిందా, రేడియోథెరపీ ఇచ్చారా, కీమోథెరపీ ఇచ్చారా అనేదాన్ని బట్టి పిల్లలు పుడతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మీకు థైరాయిడ్కి మాత్రమే వచ్చింది. అదీ తీసేశారు కాబట్టి పిల్లలు పుట్టకపోవడం అనేది ఉండదు. ఎలాగూ మీరు థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారు కాబట్టి వాటిని క్రమం తప్పకుండా జీవితాంతం వాడండి. పుట్టబోయే బిడ్డకి మీ సమస్య వల్ల ఏ ఇబ్బందీ రాదు. ఈ ఆరేళ్లలో మీకు ఏ ఇబ్బందీ లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. ఓసారి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను కలిసి సలహా తీసుకుని, అవసరమైతే థైరాయిడ్ పరీక్షలు చేయించుకుని చక్కగా పెళ్లి చేసుకోండి. ఆనందంగా ఉండండి. నా వయసు 22. నేను ఈ మధ్యనే గర్భం దాల్చాను. మా అత్తగారు జాగ్రత్తలు చెబుతూ నువ్వులు, పైనాపిల్, బొప్పాయి పొరపాటున కూడా తినొద్దు అని చెప్పారు. తింటే గర్భం పోతుందని కూడా అన్నారు. అది నిజమా? బొప్పాయి తింటే గర్భవతులకు మంచిదే అని ఎక్కడో చదివినట్టు గుర్తు. అందుకే మిమ్మల్ని అడగాలనిపించింది. అవి నేను తినొచ్చా తిన కూడదా? గర్భవతులు తినకూడనివి ఏంటి? - సుజిత, సంగారెడ్డి గర్భవతులు బొప్పాయి, పైనాపిల్, నువ్వులు తినకూడదు, వాటివల్ల అబా ర్షన్లు అవుతాయి... అరటిపండు, కొబ్బరి నీళ్లు తీసుకుంటే బిడ్డకి జుట్టు రాదు, జలుబు చేస్తుంది అంటూ పెద్దవారు, పక్కింటివారు చెబుతూ ఉంటారు. కానీ ఇవేవీ నిజాలు కావు. కేవలం అపోహలు. వాస్తవం ఏమిటంటే... బొప్పాయి (పచ్చిది కాదు) బాగా పండిన తర్వాత తింటే... దానిలో ఉండే విటమిన్ ఎ, బి, సి, ఫైబర్లు తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి బొప్పాయిలో latex, papain అనే పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల.. వాటిని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు కాస్త ఎక్కువ. అందకని బొప్పాయిని పచ్చిగా కాకుండా పండిన తర్వాత తీసుకోవాలి. కాకపోతే కాస్త మితంగానే తీసుకోవాలి. ఇక పైనాపిల్‌లో ఉండే బి, సి విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎంతో మేలు చేస్తాయి. సీ విటమిన్ బిడ్డ ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా పెరగ డానికి... బీ విటమిన్ బిడ్డ కణజాలం, నాడీవ్యవస్థ వంటివి అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడతాయి. ఫైబర్ వల్ల తల్లిలో జీర్ణశక్తి పెరిగి, మలబద్ధక సమస్య ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మితంగా తినవచ్చు. మితంగా ఎందుకు అంటే... పైనాపిల్‌లో ఉండే బ్రోమిలిన్ అనే పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో (అతి తక్కువ) అబార్షన్లు అయ్యే అవకాశాలున్నాయి. ఇక నువ్వుల సంగతి. ఇవి తింటే వేడి చేస్తుందనేది అపోహ మాత్రమే. నువ్వుల్లో ఐరన్, కాల్షియం, అమైనో యాసిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఉంటాయి. అవి కూడా తల్లికీ, బిడ్డకీ ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే ఏదైనా మితంగానే తినాలి. అతి ఎవరికైనా ప్రమాదమే! కాకపోతే పచ్చళ్లు, నూనె వస్తువులు, కారం, మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కొబ్బరినీళ్లు తాగండి. ఎక్కువ చక్కెర లేకుండా పండ్లరసాలూ తీసుకోవచ్చు. అరటిపండ్లు, సపోటాలు వంటి చక్కెర ఎక్కువ ఉన్న పండ్లని బరువు తక్కువగా ఉన్నవారు తీసుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో షుగర్ వ్యాధి హిస్టరీ ఉన్నవారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. నా వయసు 23. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. అంతకు రెండేళ్ల ముందే నాకు హెచ్ఐవీ ఉందని తెలిసింది. దిగులు పడ్డాను. కానీ అదే సమస్య ఉన్న నా స్నేహితుడొకరు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం. మందులు వాడుతున్నాం. నాకో బిడ్డను కనాలని ఉంది. కానీ పుట్టే బిడ్డకు కూడా హెచ్ఐవీ వస్తుందేమోనని భయం. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? - ఓ సోదరి హెచ్ఐవీ అనేది ఓ వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక కణాలలో చేరి, అక్కడ వృద్ధి చెందుతూ, ఆ కణాలను నశింపజేస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుముడతాయి. మనిషిని మెల్లమెల్లగా కృశింపజేస్తాయి. ఈ పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. ఈ వ్యాధి అసురక్షిత రక్తమార్పిడి వల్ల, లైంగిక కలయికల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే... మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సంక్ర మిస్తుంది. అయితే ఇప్పుడు మిగతా జబ్బుల లాగానే దీనికి కూడా యాంటి వైరల్ మందుల్ని కనుగొన్నారు. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల హెచ్ఐవీ వైరస్ చాలావరకు నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరూ ఓసారి వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోండి. ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని రోజులు మందులు వాడి, తర్వాత గర్భం కోసం ప్రయత్నించండి. అప్పుడు కడుపులో బిడ్డకి హెచ్ఐవీ వైరస్ సంక్రమించే అవకాశాలు తగ్గుతాయి. గర్భం దాల్చిన తర్వాత కూడా డాక్టర్ పర్యవేక్షణలో సక్రమంగా మందులు వాడాలి. దానివల్ల బిడ్డకి వైరస్ తక్కువగా సంక్రమిస్తుంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోనిద్వారా వైరస్ ఎక్కువగా సంక్ర మించే అవకాశాలుంటాయి. కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయించేసుకోవాలి. దానివల్ల బిడ్డకి హెచ్ఐవీ సోకే అవకాశాలు తక్కువ. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల... వైరస్ బిడ్డకు సోకి ఉంటే, అది కాస్తా నాశనమవుతుంది. తల్లిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా బయటి పాలే ఇవ్వాలి. లేదంటే వైరస్ బిడ్డకు సోకేస్తుంది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
అప్పట్నుంచీ పెళ్లంటే భయం... ఎలా మరి?
సందేహం నా వయసు 28. మరో రెండు నెలల్లో నాకు పెళ్లి. కానీ నాకు చాలా భయంగా ఉంది. ఓసారి నెట్లో డెలివరీ వీడియో ఒకటి చూశాను. అప్పట్నుంచీ పిల్లలు కనడమంటే భయం. పెళ్లి వద్దని ఎంత చెప్పినా మావాళ్లు వినిపించుకోకుండా ఫిక్స్ చేసేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదైనా సలహా ఇవ్వండి. - యు.సింధుజ, మెయిల్ డెలివరీ అంటే భయం అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఎలా? పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటివి స్త్రీ జీవితంలో భాగం. కాబట్టి ముందు ఆ భయాన్ని వదిలేయండి. లేదంటే పెళ్లి అవ్వగానే మీ భయం గురించి మీ భర్తకు చెప్పండి. కొంతకాలం గర్భం దాల్చకుండా జాగ్రత్త తీసుకుని, సంసార జీవితాన్ని ఆస్వాదించండి. దాంతో కొంత కాలానికి మెల్లగా పిల్లలు కావాలని అనిపిస్తుంది. అప్పుడు బిడ్డ కోసం ఆరాటం పెరిగి, భయం దానంతటదే తొలగిపోతుంది. ధైర్యం వస్తుంది. సాధారణ కాన్పుకి సిద్ధపడినప్పుడు కాస్త నొప్పులు ఓర్చుకోవాల్సి వస్తుంది. అది సహజమే. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. పుట్టిన బిడ్డను చూడగానే ఆ నొప్పి సంగతే మర్చిపోతారు మీరు. కాబట్టి ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఒకవేళ డెలివరీ సమయానికి కూడా మీ భయం పోకపోతే, సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయవచ్చు. కాబట్టి ఇప్పట్నుంచే అవన్నీ ఆలోచించి కంగారు పడకుండా ఆనందంగా పెళ్లి చేసుకోండి. నా వయసు 20. ఎత్తు ఐదడుగుల నాలుగంగుళాలు. బరువు 48 కిలోలు. చూడటానికి పుష్టిగానే కనిపిస్తాను. కానీ వక్షోజాలు మాత్రం చిన్నపిల్లలకు ఉన్నట్లే ఉన్నాయి. అస్సలు పెరగలేదు. ఏం చేసినా పెరగడం లేదు. ఇరవయ్యేళ్లు దాటాక ఇక ఛాతి పెరగదని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే ఇక నా పరిస్థితి ఇంతేనా? రేపు పెళ్లయ్యాక నా భర్త నన్ను అవమానిస్తే నా పరిస్థితి ఏంటి? చాలా సిగ్గుగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి. - గ్లోరీ, హైదరాబాద్ మీ ఎత్తుకి 49 నుంచి 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. ఛాతి పెరగడానికి వయస్సుతో సంబంధం లేదు. రొమ్ముల్లో పాలగ్రంథులు, కొవ్వు, ఎలాస్టిక్ టిష్యూ ఉంటాయి. శరీర తత్వం, బరువు, కొవ్వు శాతం, హార్మోన్లను బట్టి వక్షోజాల పరిమాణం ఉంటుంది. మీరు పౌష్టికాహారం... అంటే పాలు, పెరుగు, పప్పులు, పండ్లు, మాంసాహారం, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకుంటూ కాస్త బరువు పెరగడానికి ప్రయత్నించండి. అప్పుడు ఒంట్లోను, వక్షోజాల్లోను కొవ్వు పెరిగి... వాటి పరిమాణం కాస్త పెరుగుతుంది. అలాగే వక్షోజాలను ఒక క్రమపద్ధతిలో రోజూ మసాజ్ చేసుకోండి. రక్తప్రసరణ పెరిగి దానివల్ల కూడా వక్షోజాల పరిమాణం కొద్దిగా పెరుగుతుంది. అలాగే మీరు సిగ్గుపడకుండా ఓసారి డాక్టర్ని సంప్రదించి, వారి సలహా మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. నా వయసు 29. పెళ్లై పదేళ్లు దాటింది. ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డకు సిజేరియన్ పడింది. అప్పుడే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పట్నుంచీ యోనిలో మంటగా, దురదగా అనిపిస్తోంది. మూత్ర విసర్జన సమయంలోను, కలయిక సమయంలోను చాలా ఇబ్బందిగా ఉంటోంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందేమోనని మందులు వాడినా ఫలితం లేకపోయింది. రెండేళ్లుగా ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. పరిష్కారం చెప్పండి. - జయశ్రీ, కోదాడ పిల్లలు పుట్టకుండా చేయించుకున్న ఆపరేషన్‌కి, మూత్రంలో మంటకి సంబంధమేమీ లేదు. యోనిలో కూడా మంట అంటున్నారు కాబట్టి ఓసారి గైనకాలజిస్టును సంప్రదించండి. పరీక్ష చేసి సమస్య ఏమిటో కనిపెడతారు. యోనిలో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే యాంటీ ఫంగల్ మాత్రలు ఇస్తారు. రెండేళ్లుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి మందులు వాడుతున్నా ఫలితం లేదంటున్నారు కాబట్టి యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. మీరు, మీవారు కూడా ఓసారి మూత్రపరీక్ష, షుగర్ పరీక్షలు చేయించుకోండి. కొన్నిసార్లు భర్తకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే భార్యకు కూడా రావొచ్చు. అలాంటప్పుడు మీరొక్కరే మందులు వాడినా ఉపయోగం ఉండదు. కలిసినప్పుడల్లా ఆయన నుంచి మీకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇద్దరూ కలిసి మందులు వాడండి. అయితే అవి వాడేటప్పుడు శారీరకంగా కలవకండి. కోర్సు మొత్తం పూర్తయ్యాక కలవండి. నా వయసు 42. సంవత్సరం క్రితం పెద్దాపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. అప్పట్నుంచీ నేను శారీరకంగా బలహీన పడిపోయాను. అంతకుముందు ఎంత పనయినా హుషారుగా చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడలా చేయలేకపోతున్నాను. కాస్త పని చేసినా కాళ్లు గుంజుతున్నాయి. నడుం నొప్పి, ఆయాసం వచ్చేస్తున్నాయి. ఇదంతా ఆపరేషన్ వల్లనేనా? నేను ఎప్పటిలాగా అవ్వాలంటే ఏం చేయాలి? - ఎల్.పద్మావతి, కాకినాడ సాధారణంగా ఆడవారిలో నలభయ్యేళ్ల తర్వాతి నుంచి హార్మోన్ల అసమతుల్యత కొద్దికొద్దిగా మొదలవు తుంది. థైరాయిడ్ సమస్య కూడా ఏర్పడ వచ్చు. అలాగే శరీరంలో కాల్షియం కూడా తగ్గడం మొదలయ్యి... ఎముకలు, కండరాలు బలహీనపడటం మొదలవు తుంది. గర్భాశయం, అండాశయాలు తీసేసిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల పూర్తిగా తగ్గిపోయి... నీరసం, అలసట, ఒళ్లు నొప్పులు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కొందరిలో ఏర్పడవచ్చు. ఓసారి మీరు గైనకాలజిస్టును సంప్రదించి థైరాయిడ్, హెమోగ్లోబిన్, షుగర్ పరీక్షలు చేయించుకోండి. సమస్యను బట్టి చికిత్స తీసుకోవచ్చు. రక్తం తక్కువ ఉంటే ఐరన్ మాత్రలు, థైరాయిడ్ సమస్య ఉంటే ఆ మాత్రలతో పాటు విటమిన్, కాల్షియం మాత్రలు వాడాల్సి ఉంటుంది. అవసరం అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ మాత్రలు కూడా వాడాల్సి ఉంటుంది. పాలు, పెరుగు, మాంసం, పండ్లు, పప్పులు, తృణధాన్యాలతో కూడిన పౌష్టికాహారం మాత్రం తప్పక తీసుకోండి. నా వయసు 22. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాను. నా కొలీగ్, నేను ప్రేమించుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. అయితే ఆయనకు పదిహేనేళ్ల క్రితం టీబీ వచ్చి తగ్గిందట. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది. నా భయం ఏమిటంటే... ఆయనకు భవిష్యత్తులో మళ్లీ టీబీ వచ్చే అవకాశం ఉందా? ఆయన్ని చేసుకుంటే నాకు, పుట్టబోయే పిల్లలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా? - ప్రేమలత, విజయవాడ టీబీ వచ్చింది పదిహేనేళ్ల క్రితం కదా! దానికి చికిత్స కూడా తీసుకున్నారు. పైగా ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి బాగా ఉన్నంత వరకు టీబీ మళ్లీ తిరగబెట్టదు. అతి తక్కువ మందిలో మాత్రమే రక్తహీనత, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల టీబీ తిరగబెడుతుంది. పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని ఆయనకు చెప్పండి. ఏ సమస్యా రాదు. అయినా ఇంతకు ముందులాగా ఇప్పుడు టీబీ అనగానే భయపడాల్సిన పని లేదు. దాన్ని తగ్గించే మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఆయనకు టీబీ వచ్చి తగ్గినంత మాత్రాన పుట్టే పిల్లలకు సమస్యలు వస్తాయని భయపడటం కూడా అనవసరం. అలా ఏమీ రావు. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా ధైర్యంగా పెళ్లి చేసుకోండి. నా వయసు 28. ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డకు సిజేరియన్ అయ్యింది. అయితే అయ్యి సంవత్సరం కావస్తోన్నా నా కుట్లు ఇప్పటికీ నొప్పి వస్తున్నాయి. ఎప్పుడూ నొప్పి ఉండదు కానీ ఉన్నట్టుండి సడెన్‌గా చురుక్కు చురుక్కుమంటున్నట్టు అనిపిస్తుంది. కుట్లు ఉన్నచోట బాగా దురదగా కూడా ఉంటోంది. ఎందుకిలా అవుతోంది? కుట్లు వేయడంలో ఏదైనా తేడా జరిగిందంటారా? - గీతిక, వనస్థలిపురం ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత లోపలి పేగులు, మిగతా అవయవాలు... అంటే గర్భాశయం, మూత్రాశయం ఒకదానికొకటి అంటుకొని కొయ్య కండలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాం టప్పుడు ఆపరేషన్ అయిన సంవత్సరం లేదా ఎక్కువ కాలం అయినా కూడా ఆ కొయ్య కండలు లాగినట్టు అనిపించి నొప్పి కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి నొప్పి వస్తే చేసేదేమీ ఉండదు. నొప్పి ఉపశమన మాత్రలు మింగడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తే సరిపోతుంది. అలా కాకుండా నొప్పి మరీ ఎక్కువగా ఉండి, తరచుగా వస్తుంటే మాత్రం ఓసారి స్కానింగ్ చేసి, వేరే ఏవైనా సమస్యలు కూడా ఉన్నాయేమోనని చూసుకోవాలి. ఆపైన అవసరమైతే ల్యాపరోస్కోపీ ద్వారా పొట్టమీద చిన్న చిన్న రంధ్రాలు చేసి, లోపల ఉండే కొయ్య కండల్ని తొలగించవచ్చు. అలాగే కుట్ల దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్, అలర్జీ వంటివి ఉన్నా కూడా దురద ఉండవచ్చు. కాబట్టి ఓసారి డాక్టర్ని సంప్రదిస్తే కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత అవసరమైన చికిత్స తీసుకోండి. సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉండాలి. అలాగే బిడ్డ బయటకు వచ్చే దారి కూడా బరువుకు తగ్గట్టే ఉండాలి. అలా లేనప్పుడు బిడ్డ మధ్యలో ఇరుక్కుపోయి, కాన్పు కష్టం అవుతుంది. నా వయసు 21. నాకిప్పుడు ఎనిమిదో నెల. ఎప్పటికప్పుడు అన్ని పరీక్షలూ చేయించుకుంటున్నాను. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. కానీ కాస్త పెద్దగా ఉండటం వల్ల సిజేరియన్ పడొచ్చు అంటున్నారు డాక్టర్. నాకు సిజేరియన్ ఇష్టం లేదు. నార్మల్ డెలివరీ అయితేనే బాగుణ్ననిపిస్తోంది. సిజేరియన్ పడకుండా ఉండేందుకు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? - రాణి, పెంబర్తి ఎనిమిదో నెలకే బిడ్డ బరువు ఎక్కువ ఉందంటున్నారు. ఇంకా కాన్పుకి నెలపైనే సమయం ఉంది. ఈ లోపల బిడ్డ ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. సాధారణ కాన్పు కావాలంటే బిడ్డ బరువు మరీ ఎక్కువ లేకుండా ఉండాలి. అలాగే బిడ్డ బయటకు వచ్చే దారి బరువుకు తగ్గట్టే ఉండాలి. అలా లేనప్పుడు బిడ్డ మధ్యలో ఇరుక్కుపోయి, కాన్పు కష్టం అవుతుంది. బిడ్డ బరువు ఇప్పటికే ఎక్కువ ఉంది కాబట్టి ఓసారి మీలో షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయేమో పరీక్ష చేయించుకోండి. ఇప్పటి నుంచి పొద్దున్న, సాయంత్రం అరగంట పాటు వ్యాయామం చేయండి. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తీసుకుంటూ... స్వీట్లు, షుగర్, తీపి పదార్థాలన్నింటికీ దూరంగా ఉండండి. దీనివల్ల బిడ్డ బరువును కాస్తయినా అదుపు చేయవచ్చు. తొమ్మిదో నెల చివరిలో బిడ్డ బరువును బట్టి, మీ పెల్విస్ వెడల్పును బట్టి సాధారణ కాన్పుకి ఎంత అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
పదేళ్ల పెద్దవాడు... పెళ్లాడితే ప్రాబ్లెమా?!
సందేహం నా వయసు 21. నేను మా కాలేజీలో పని చేసే లెక్చెరర్ని ప్రేమించాను. ఆయన వయసు 31. మా ఇంట్లో వాళ్లకి నా ప్రేమ గురించి చెబితే, అంత వయసు తేడా ఉంటే పెళ్లి చేసేది లేదని తెగేసి చెప్పారు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయని తిడుతున్నారు. కానీ తను లేకుండా నేను బతకలేను. ఆయన్ని పెళ్లి చేసుకుంటే నిజంగా నాకు సమస్యలొస్తాయా? మేమిద్దరం సుఖంగా జీవించలేమా? - అనిత, హన్మకొండ మీరే అతన్ని ప్రేమిస్తున్నారా లేక అతను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? అతనికి అసలు మీ ప్రేమ గురించి తెలుసా? ఆయనకు పెళ్లయిందా ఇంకా అవివాహితుడేనా? ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి? ఇవన్నీ తెలుసుకున్నారా లేదా! ఇద్దరికి నచ్చి ప్రేమించుకుంటే వయసు పెద్ద విషయం కాదు. వయసు తేడా వల్ల పెద్ద సమస్యలు కూడా ఏమీ రావు. కాకపోతే ఆయన మరీ పెద్దవారు కాబట్టి మీకంటే చాలా త్వరగా ముసలి వారు అయిపోతారు. దానివల్ల ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలవీ రావొచ్చు. అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇలాగే ప్రేమించగలుగుతారా అన్నది ఓసారి ఆలోచించుకోండి. అలాగే కొన్నిసార్లు వయసు గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆలోచనల్లో తేడాల వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. ఇవన్నీ ఆలోచించే పెద్దలు అభ్యంతరం చెబుతుంటారు. వీటన్నిటినీ అధిగమించగలను అనుకుంటే భేషుగ్గా పెళ్లి చేసుకోండి. నా వయసు 22. ఈ మధ్యనే పాప పుట్టింది. ఆరోగ్యంగా ఉంది. కానీ నాకు పాలు పడటం లేదు. మంచి ఫుడ్ తీసుకుంటున్నా ఫలితం లేదు. డాక్టర్‌కి చెబితే ఏవో పౌడర్లు కూడా ఇచ్చారు. అవి తాగుతున్నా పాలు సరిపోవట్లేదు. పోత పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. పాలు బాగా రావడానికి ఏదైనా మార్గం ఉంటే చెబుతారా? - ఆర్.జానకి, నెల్లూరు రొమ్ముల్లో పాలు ఉత్పత్తి అవ్వడానికి మెదడు నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల అవసరం ఉంటుంది. ఇవి సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా ఉండాలి. బిడ్డ రొమ్మును బాగా చీకగలగాలి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ఎటువంటి మందులూ అవసరం లేకుండా పాలు బాగా వస్తాయి. బిడ్డ ఆరోగ్యంగానే ఉందంటున్నారు. మరి పాలు సరిపడటం లేదని ఎందుకు అనుకుంటున్నారు? బిడ్డ తాగేకొద్దీ పాలు బాగా తయారవుతాయి. పాలు సరిపోకపోతే బిడ్డ బరువు పెరగ కుండా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. ఆరు నెలల వరకూ మీ పాలే పట్టండి. మీరు పాలు, పప్పులు, కూర గాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ, డాక్టర్ చెప్పిన పౌడర్లు కూడా వాడండి. ఇంకా అవసరం అనుకుంటే ల్యాక్టోనిక్ గ్రాన్యూల్స్ నీళ్లలో కలిపి తీసుకోండి. ప్రొమోల్యాక్ట్ మాత్రలు రెండు పూటలా రెండేసి చొప్పున పది రోజులు వాడండి. నా వయసు 25. బరువు 68 కిలోలు. పోయినేడు థైరాయిడ్ సమస్య వచ్చింది. దానికి మందులు వాడటం మొదలు పెట్టినప్పట్నుంచీ పీరియడ్స్ రావడం ఆగిపోయింది. డాక్టర్ని అడిగితే పీరియడ్స్ రావడానికి మందులిచ్చారు. ఆ నెల వచ్చి మళ్లీ ఆగిపోయాయి. అపట్నుంచీ మందులు వాడితే తప్ప పీరియడ్స్ రావడం లేదు. ఎందుకిలా అవుతోంది? ఇలా అయితే పిల్లల్ని కనడానికి ఇబ్బంది కలగదా? - విజయదుర్గ, శ్రీకాకుళం బరువు రాశారు కానీ ఎత్తు రాయ లేదు. ఒకవేళ ఈ మధ్య బరువు కనుక పెరిగి ఉంటే... హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ క్రమం తప్పి ఉండ వచ్చు. థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారు కాబట్టి అది కంట్రోల్లో ఉంటే... దాని వల్ల సమస్య ఏమీ ఉండదు. ఒకసారి స్కానింగ్ చేయించు కుని, అండాశయాల్లో నీటి బుడగలు లేదా ఒవేరియన్ సిస్టులు ఉన్నాయేమో తెలుసుకోండి. ఉంటే దానికి మందులు వాడండి. తద్వారా పిల్లలు పుట్టడానికి పెద్ద ఇబ్బందులేమీ ఎదురు కావు. బరువు పెరిగి ఉంటే మాత్రం బరువు తగ్గడానికి తప్పకుండా ప్రయత్నించండి. మీ ఎత్తుకు తగిన బరువు మాత్రమే ఉండేలా చూసుకోండి. నా వయసు 31. మావారు మంచివారే. కాకపోతే బాగా తాగుతారు. ఆ సమయంలో శృంగారం కోసం బాగా బలవంతపెడతారు. నాకు అయిష్టత ఉండదు కానీ, నెలసరి సమ యంలో బలవంతపెట్టినప్పుడు మాత్రం బాధగా ఉంటుంది. నాకు ఇబ్బందిగా ఉంటుందని ఎంత చెప్పినా వినిపించుకోరు. అలా కలిసినప్పుడల్లా నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంటోంది. ఆ నొప్పి రెండు మూడు రోజుల వరకూ తగ్గడం లేదు. నెలసరి తగ్గినా నొప్పి ఉంటోంది. అలా నొప్పి రాకుండా ఏవైనా మందులుంటాయా? - సుధారాణి, కాకినాడ పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయ ముఖ ద్వారం కొద్దిగా తెరుచుకుంటుంది. ఆ సమయంలో కలవడం వల్ల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే క్రిములు గర్భాశయంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్లు వచ్చి, తర్వాత నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయిష్టంగా కలిస్తే కండరాలు బిగబట్టడం జరిగి కూడా నొప్పి ఉండవచ్చు. ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే... లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో తెలుస్తుంది. ఉంటే దానికి తగ్గ మందులు ఇస్తారు. అవి క్రమం తప్పకుండా వాడితే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అయినా మీరు మీవారితో ఓసారి మనసు విప్పి మీ ఇబ్బందిని చెప్పండి. ఆయన అర్థం చేసుకుంటే అసలు ఈ సమస్యే ఉండదు. నా వయసు 26. పెళ్లై రెండేళ్లవుతోంది. ఒక బాబు. నాకో విచిత్రమైన సమస్య వచ్చింది. పోయిన నెల పీరియడ్స్ సమయంలో యోని నుంచి తెల్లటి నులి పురుగులు వచ్చాయి. ఒకవేళ అవి ప్యాడ్‌కి ఏమైనా ఉన్నాయేమోనని అనుకున్నాను. కానీ ఈ నెల కూడా వచ్చేసరికి భయమేస్తోంది. అసలు అలా పురుగులు వస్తాయా? ఇప్పుడు నేనేం చేయాలి? - రజిత, తణుకు మీరు చూసింది నిజంగా నులి పురుగు లేనా కాదా అన్నది ముందు నిర్ధారణ చేసుకోవాలి. సాధారణంగా నులి పురుగులు గుడ్ల రూపంలో మనం తినే ఆహారం ద్వారా కడుపులోకి, తద్వారా పేగుల్లోకి వెళ్తాయి. అక్కడ పురుగులుగా మారి... పేగుల నుంచి, మలద్వారం నుంచి బయటికొస్తాయి. కొన్నిసార్లు మలద్వారం నుంచి యోనిలో ప్రవేశిస్తాయి. నిజంగా నులి పురుగులే అయితే ఆల్బెండజాల్ మాత్రలు వారానికి ఒకటి చొప్పున రెండు వారాలు వేసుకుని చూడండి. తర్వాత కూడా పురుగులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవండి. నా వయసు 24. ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. డెలివరీ అయినప్పటి నుంచీ నా పొట్ట బాగా పెరిగిపోతోంది. మరీ ఎత్తుగా ఉండటంతో అందరూ మళ్లీ ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. దాంతో సిగ్గుగా ఉంటోంది. డెలివరీ అయ్యాక నడుముకు పొట్ట కట్టుకోక పోవడం వల్లే అలా అయ్యిందని మా అమ్మ అంటోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పొట్ట ఎలా తగ్గించుకోవాలి? - పూర్ణిమ, కరీంనగర్ తొమ్మిది నెలలపాటు శిశువు గర్భా శయంలో పెరుగుతుంది. అది పెరగడానికి అనువుగా పొట్ట లోపలి కండరాలు సాగుతాయి. అలాగే పొట్టమీది చర్మం కూడా సాగుతుంది. అలా కండరాలు, చర్మం సాగినప్పుడు అవి వదులవుతాయి. కాన్పు తర్వాత అవి పూర్తిగా సాధారణ స్థాయికి రావడం చాలా కష్టం. ఉదా హరణకు ఒక రబ్బర్ బ్యాండ్‌ను కొద్దిగా లాగి వదిలితే సాధారణ స్థితికి వచ్చే స్తుంది. అదే పదే పదే లాగి వదిలినా, ఏదైనా వస్తువుకి చుట్టి తీసినా అది దాని ఎలాస్టిక్ గుణాన్ని కోల్పోయి వదులై పోతుంది. అదే విధంగా పొట్టమీది చర్మం కూడా తన సహజ గుణాన్ని కోల్పోయి వదులైపోతుంది. పొట్టకి బట్ట కట్టుకో వడం, బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట లోపలికి వెళ్లడం అంటూ ఉండదు. అవి కేవలం కొద్ది రోజులు సపోర్ట్ కోసమే పనికొస్తాయి. సాధారణ కాన్పు అయితే నెల నుంచే వాకింగ్, అబ్డామినల్ వ్యాయామం లాంటివి చేస్తే పొట్ట చాలా వరకు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఆప రేషన్ జరిగివుంటే రెండు మూడు నెలల తర్వాతి నుంచీ వ్యాయామం చేయవచ్చు. నా వయసు 26. ఇద్దరు పిల్లలు. రెండో కాన్పు అయిన తర్వాతి నుంచీ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతోంది. డాక్డర్ దగ్గరకు వెళ్లాను. కుట్లు సరిగ్గా పడక ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. దానివల్లే అలా అవుతోందట. అది నిజమేనా? కుట్లు సరిగ్గా పడకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందా? - రమణి, విజయవాడ సాధారణంగా రెండు కాన్పుల తర్వాత కొందరిలో గర్భాశయ ముఖ ద్వారం చీరుకున్నట్లవుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చి వైట్ డిశ్చార్జి అవ్వవచ్చు. అంతేకానీ కుట్లు సరిగ్గా పడకపోవడం దానికి కారణం కాకపోవచ్చు. కాబట్టి ముందు ఇన్ఫెక్షన్ ఎటువంటిదో పరీక్ష చేయించుకుని, దానికి తగ్గ యాంటీ బయొటిక్స్ వాడండి. సమస్య తీరిపోతుంది. నా వయసు 32. పెళ్లై ఆరేళ్లు అవుతోంది. ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు. దాంతో మా అత్తింటివాళ్లు చాలా వేధిస్తున్నారు. గొడ్రాలు అంటున్నారు. చాలామంది డాక్టర్లకు చూపించాను. ఏ సమస్యా లేదని అంటున్నారు. నాకు వైట్ డిశ్చార్జి చాలా ఎక్కువగా అవుతుంది. దానివల్ల ఏదైనా సమస్య ఉందేమో అంటుంటే అలాంటిదేమీ లేదంటున్నారు. మరి నేనెందుకు గర్భం దాల్చడం లేదు? పిల్లలు లేకపోవడం వల్ల నా జీవితం నరకంలా తయారయ్యింది. దయచేసి సమస్యకు పరిష్కారం చెప్పండి. - రామలక్ష్మి, గుంటూరు మీకు ఫాలోపియన్ ట్యూబ్స్ తెరుచుకునే ఉన్నాయా మూసుకు పోయాయా అనేది తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే చేసివుంటే ఐయూఐ మూడుసార్ల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా కాకపోతే... ల్యాపరో స్కోపీ, హిస్టరోస్కోపీ అనే చిన్న ఆపరేషన్ చేసి... గర్భాశయం వెలుపల, లోపల, అండాశయాల్లో, ట్యూబులో మరేవైనా సమస్యలు ఉన్నాయేమో చూసి సరి చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పటికీ సక్సెస్ కాకపోతే చివరిగా ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నమాట. డా॥వేనాటి శోభ, లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
తప్పు చేయలేదు... అయినా ఎందుకిలా?!
సందేహం నా వయసు 23. రెండు నెలల క్రితం పెళ్లి అయ్యింది. నాకు మొదటి రాత్రి మాత్రమే కాస్త నొప్పి అనిపించింది తప్ప, మరెప్పుడూ ఏ ఇబ్బందీ లేదు. కానీ మావారు మాత్రం... తన అంగ పూర్వచర్మం బిగుతుగా ఉందని, నొప్పి వస్తోందని ఇబ్బంది పడిపోతున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే సిగ్గుపడుతున్నారు. ఇలా ఎందుకవుతోంది? దీనికి ఏవైనా చిట్కాలు ఉన్నాయా? - స్వర్ణరేఖ, భీమిలి కొందరు మగవాళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, మరికొన్ని ఇతర కారణాల వల్ల కానీ అంగం మీద ఉన్న పూర్వచర్మం బిగుతుగా అయిపోతుంది. దానివల్ల అంగ ప్రవేశానికి ఇబ్బంది కలుగుతుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే... మందులతో తగ్గిపోవాల్సిన సమస్య ఆపరేషన్ దాకా వెళ్లే ప్రమాదం ఉంది. సిగ్గుపడుతూ కూర్చుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ముందు డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెప్పండి. పరీక్ష చెయ్య కుండా చిట్కాలు చెప్పడం కష్టం. డాక్టర్ చూసిన తర్వాతే సమస్య ఎందుకొచ్చిందో, ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వెంటనే యూరాలజిస్టును కలిస్తే వారు సమస్యకు పరిష్కారం చెబుతారు. నా వయసు 38. నాకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ అనే ఊపిరితిత్తుల వ్యాధి ఉంది. దాంతో తరచుగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి, ఆయాసపడుతుంటాను. దాంతో శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను. దాని వల్ల మావారు ఇబ్బంది పడుతున్నారు. పైకి ఏమీ అనరు కానీ మనసులో ఆశ ఉంటుంది కదా! అందుకే ఒకట్రెండుసార్లు దగ్గరవడానికి ట్రై చేశాను. కానీ ఆయాసం వచ్చేసింది. మా వారిని నేను సంతోష పెట్టలేకపోతున్నానే అని చాలా దిగులుగా ఉంది నాకు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? - వందన, రాజమండ్రి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు సాధారణ భంగిమలో సెక్స్‌లో పాల్గొన డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయాసం వస్తూ ఉంటుంది. ఇది సహజం. ఎందుకంటే.. సెక్స్ సమయంలో ఊపిరితిత్తుల మీద భారం పడి, అవి మామూలు వారిలాగా పని చేయలేవు కాబట్టి ఆయాసం త్వరగా వచ్చేస్తుంది. శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. బరువు ఎక్కువ ఉన్నా కూడా ఆయాసం ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి అధిక బరువు కనుక ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి. ఇలాంటప్పుడు సాధారణ భంగిమల్లో కాకుండా... కూర్చుని ప్రయత్నించండి. లేదంటే మీవారు కింద, మీరు పైన ఉండి సెక్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నించండి. దానివల్ల ఊపిరి తిత్తుల మీద ఒత్తిడి తగ్గుతుంది. నా వయసు 19. పెళ్లై రెండు నెలలు అవుతోంది. అప్పట్నుంచీ కలయికకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ సాధ్యం కావడం లేదు. నా యోని చాలా చిన్నగా ఉంది. మావారి అంగమేమో పెద్దగా ఉంది. దాంతో అస్సలు లోనికి వెళ్లడం లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వండి. - రమ, వరంగల్ యోని ద్వారం కన్నెపొరతో కప్పబడి ఉంటుంది. దానివల్ల పెళ్లయిన కొత్తలో అంగప్రవేశం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే యోనిలోని కండరాలకు సాగే గుణం ఉంటుంది. దానివల్ల యోని చిన్నగా ఉన్నా, మెల్లగా ప్రయత్నిస్తూ ఉంటే, అంగ ప్రవేశం తప్పక జరుగు తుంది. కాబట్టి ముందు మీరు భయ పడటం మానేయండి. కేవై జెల్లీ, లూబ్రిక్ జెల్ వంటివి మీరు, మీవారు కూడా రాసుకుని కలయికకు ప్రయత్నించండి. అయినా కూడా అవ్వకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. వారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. నా వయసు 20. బరువు 40 కిలోలు. ఎత్తు 5.2. మావారికి పాతికేళ్లు. మా పెళ్లై సంవత్సరం అవుతోంది. మొదటిసారి కలిసినప్పుడు యోనిలో చాలా మంటగా అనిపించింది. మెల్లగా తగ్గుతుందిలే అనుకున్నాను. కానీ ఇప్పటి వరకూ తగ్గింది లేదు. మూత్రం పోసుకునేటప్పుడు కూడా చాలా మంటగా ఉంటుంది. నడుము నొప్పి కూడా బాగా వస్తోంది. అది మాత్రమే కాక ఒంట్లో వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. మీరైనా పరిష్కారం చెప్పండి. - త్రివేణి, నల్లగొండ పెళ్లై సంవత్సరమైనా యోనిలో మంట, మూత్రంలో మంట ఉందంటు న్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదనీ అంటున్నారు. అంటే ఇన్ఫెక్షన్ బాగా ఉన్నట్టుంది. మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉన్నట్టుంది. మీరు బరువు చాలా తక్కువ ఉన్నారు. కొన్నిసార్లు బలహీనత, రక్త హీనత, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. మరికొన్నిసార్లు భర్తకి ఇన్ఫెక్షన్ ఉంటే, భార్యకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మందులు వాడినా ఇలా తరచుగా రావడం జరుగుతుంది. కాబట్టి ఓసారి డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకోండి. ఇన్ఫెక్షన్ ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. కంప్లీట్ యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వెజైనల్ స్వాబ్ టెస్ట్ తదితర పరీక్షలు చేస్తే కారణం తెలిసిపోతుంది. దాన్ని బట్టి దంపతులిద్దరూ పది నుంచి పదిహేను రోజుల పాటు మందులు వాడితే సమస్య తగ్గే అవకాశం ఉంది. మందులతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోండి. రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగండి. చలవ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటే వేడీ తగ్గుతుంది. నా వయసు 23. ఏడు నెలల క్రితం పెళ్లి అయ్యింది. ఈ మధ్య నాకు కలయిక సమయంలో ఎందుకో నొప్పి అనిపిస్తోంది. మావారు స్ట్రోక్ ఇస్తున్నప్పుడు లోపల ఏదో పొడుస్తున్నట్లుగా బాధ కలుగుతోంది. తట్టుకోలేకపోతున్నాను. ఆయనతో చెబితే... ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడెందుకలా అవుతోంది అని అంటూ గైనకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లారు. ఆవిడ స్కానింగ్ చేసి ఏ సమస్యా లేదంటున్నారు. కానీ నాకు మాత్రం అంగం ఎక్కడో లోపలకు వెళ్లిపోయినట్టు, పొడుచుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకలా అవుతోంది? - పావని, సంగారెడ్డి కొంతమందిలో కొన్నిసార్లు యోని లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పుండ్లు ఏర్పడినా కూడా కలయిక సమయంలో నొప్పి ఉండవచ్చు. ఎండోమెట్రియాసిస్ వల్ల కూడా నొప్పి ఉంటుంది. ఇవి స్కానింగ్‌లో కనిపించవు. స్పెక్యులమ్ పరీక్ష ద్వారా యోని లోపల చూసినప్పుడే తెలుస్తాయి. కాబట్టి ఓసారి డాక్టర్ దగ్గరకు వెళ్లండి. కారణం తెలుసుకుని మందులు వాడండి. సమస్య తగ్గేవరకూ కలయికకు దూరంగా ఉంటే మంచిది. ఈలోపు నొప్పి కూడా తగ్గుతుంది. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. మావారు మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. దాంతో మూడేసి నెలలు బయటే ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడే మేం కలుస్తూ ఉండేవాళ్లం. తర్వాత నేను గర్భం దాల్చాను. ఆ సమయంలోనే నాకు మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. మా వారు లేని సమయంలో అతనికి బాగా దగ్గరయ్యాను. ఏడో నెల వచ్చేవరకూ వారానికి ఓసారి శారీరకంగా కలిసేవాళ్లం. తర్వాత నాకు పాప పుట్టింది. అయితే నాకో సందేహం. గర్భంతో ఉన్నప్పుడు వేరే వ్యక్తితో అన్నిసార్లు కలిశాను కాబట్టి పాప డీఎన్ఏ మారుతుందా? తనకి మావారి డీఎన్ఏ కాకుండా అతని డీఎన్ఏ వచ్చే అవకాశం ఉందా? - ప్రియ, ఊరు రాయలేదు గర్భం దాల్చినప్పుడే తల్లి నుంచి సగం, తండ్రి నుంచి సగం డీఎన్ఏ బిడ్డకు సంక్రమిస్తుంది. తర్వాతి నుంచి కణాలు విభజన చెందుతూ బిడ్డ తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది. అంతేకాని, తర్వాత డీఎన్ఏ మారడం అంటూ ఉండదు. తల్లి నుంచి అండం (23 క్రోమోజోములు), తండ్రి నుంచి శుక్రకణం (23 క్రోమోజోములు) కలిసి పిండం ఏర్పడుతుంది. ఈ క్రోమోజోముల్లో డీఎన్ఏ ఉంటుంది. ఈ పిండంలోని కణాలు విభజన చెందుతూ అన్ని అవయవాలూ ఏర్పడుతూ పిండం బిడ్డగా రూపాంతరం చెంది, గర్భాశయంలో తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది. మధ్యలో డీఎన్ఏ వచ్చి చేరడం జరగదు. అయినా ఇలాంటి ఉత్తరాలు చదువుతున్నప్పుడల్లా మన భారతీయ సంస్కృతి ఎటు పోతోందో అని బాధ కలుగుతోంది. మీరు చేస్తున్నది ఎంత వరకూ కరెక్టో మీరోసారి ఆలోచించు కోండి. తెలియక తప్పు చేస్తే ఫర్వాలేదు. కానీ ఇలా తెలిసి చేయడం నేరం కాదా?! నా వయసు 29. పెళ్లై నాలుగేళ్లు అవుతోంది. సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు. వాడు పుట్టేవరకూ నేను, మావారు సెక్స్‌ని బాగానే ఎంజాయ్ చేశాం. బాబు పుట్టిన కొన్నాళ్ల వరకూ కూడా బాగున్నాం. కానీ ఈ మధ్య ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. నా యోని చాలా వదులుగా అయిపోయిందని, తనకు తృప్తి లేదనీ అంటున్నారు. ఎక్కువసార్లు సెక్స్ చేస్తే అలా అయిపోతుంది, మనం వారానికి రెండు మూడుసార్లే కలుస్తున్నాం, మరి ఇంత వదులుగా ఎందుకయ్యింది, నీకు వేరే ఎవరితోనైనా సంబంధం ఏర్పడిందా అని అడుగుతున్నారు. ఆ మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి. అలాంటిదేం లేదని ఎంత చెప్పినా వినడం లేదు. ఆయన్ని ఎలా నమ్మించాలో తెలియడం లేదు. ఆయన అన్నది నిజమేనా? ఎక్కువసార్లు సెక్స్ చేస్తే యోని అలా వదులైపోతుందా? నాకెవరితోనూ సంబంధం లేదు. మరి ఎందుకలా అయ్యింది? - సింధుజ, హైదరాబాద్ కాన్పు సాధారణ కాన్పా లేక సిజేరి యన్ అయ్యిందా రాయలేదు. సిజేరియన్ అయినవాళ్ల కంటే సాధారణ కాన్పు అయినవాళ్లలో యోని మామూలుగా కంటే కాస్త ఎక్కువ వదులయ్యే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ అవ్వాలనేమీ లేదు. బిడ్డ బరువు ఎక్కువ ఉండటం, లేదంటే బిడ్డ తల యోనిభాగంలో ఎక్కువ సేపు ఆగిపోవడం జరిగినప్పుడు... యోని కండరాలు బాగా సాగి అలా అవ్వవచ్చు. వారి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో మళ్లీ యోని కండరాలు గట్టి పడిపోయి, సాధారణ స్థాయికి వచ్చేస్తాయి. కొందరిలో అలా కాకపోవచ్చు. అంతే తప్ప... ఎక్కువ సార్లు కలిసినా, వారానికి రెండు మూడు సార్లు కలిసినా యోని వదులవడంలో తేడా ఏమీ ఉండదు. అది కేవలం అపోహ మాత్రమే. ఆ విషయం మీవారికి మీరే అర్థమయ్యేలా చెప్పండి. అప్పటికీ వినకపోతే ఎవరైనా డాక్టర్‌తో చెప్పించండి. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్,మోతీనగర్, హైదరాబాద్ -
ఐపిల్... గర్భం రాకుండా ఆపలేదా?!
సందేహం నా వయసు 31. ఈ మధ్యనే బ్లడ్ టెస్ట్ చేస్తే నాకు డయాబెటిస్ ఉందని తెలిసింది. మధుమేహం వచ్చినవాళ్లకి సెక్స్ కోరికలు తగ్గుతాయని, శృంగారంలో సరిగ్గా పాల్గొనలేరని విన్నాను. అది నిజమేనా? నాకు ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు ఏవైనా తీసుకోవచ్చా? - అమరావతి, కొత్తపేట డయాబెటిస్ వచ్చిన వాళ్లందరికీ కోరికలు తగ్గాలని, సెక్స్‌లో పాల్గొనలేరని ఏమీ లేదు. కొంతమందికి దీర్ఘకాలంగా మధుమేహం ఉండి, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం కంట్రోల్లో లేకపోవడం... మరికొందరిలో రక్తనాళాలు మందంగా తయారయ్యి యోని, ఇతర జననాంగాలకు రక్త సరఫరా తగ్గడం వల్ల సెక్స్‌లో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతే తప్ప అందరికీ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన చెందవద్దు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ వ్యాయామం చేయండి. మితాహారం తీసుకుంటే, బరువు పెరగకుండా నియంత్రించుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. సెక్స్‌లో కూడా హుషారుగా పాల్గొనవచ్చు. నా వయసు 21. నా సమస్య నా బరువే. ఇప్పుడు నా బరువు ముప్ఫై రెండున్నర కిలోలు. 2012లో నాకో సర్జరీ జరిగింది. అప్పుడు నా పేగులు కొంతమేర కత్తిరించి, ఆ స్థానంలో ఓ గొట్టం అమర్చారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు ఏమీ లేవుగానీ అనారోగ్యం వల్ల తగ్గిన బరువు అలానే ఉండిపోయింది. ఏం తిన్నా పెరగడం లేదు. పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు... అన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటాను. అయినా ఫలితం లేదు. బరువు పెరుగుతానేమో అన్న ఆశతో జంక్‌ఫుడ్ కూడా తినడం మొదలుపెట్టాను. కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. నేను కనుక పెళ్లి చేసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? నేనేం చేస్తే బరువు పెరుగుతానో దయచేసి సూచించండి. - సింధు, మెయిల్ కొంతభాగం పేగులు తీసేశారు అని రాశారు. ఏ సమస్య రావడం వల్ల అలా తీశారు అనేది రాయలేదు. మనం నోటి ద్వారా తీసుకునే ఆహారం గొంతులోంచి పొట్టలోకి, అక్కడి నుంచి చిన్న పేగులు, ఆ తర్వాత పెద్ద పేగుల్లోకి ప్రవేశించే క్రమంలో... అనేక రకాల ఎంజైమ్స్ ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి, సులువుగా జీర్ణమయ్యేలా చేస్తాయి. జీర్ణం కాని పదార్థాలు మలద్వారం ద్వారా మలం రూపంలో బయటకు వచ్చేస్తాయి. జీర్ణమైన ఆహారంలో కొంత భాగం చిన్న పేగుల నుంచి, కొంత భాగం పెద్ద పేగుల నుంచి రక్తనాళాల్లోకి ప్రవేశించి, శరీరంలోని అన్ని భాగాలకూ అందడం ద్వారా జీర్ణక్రియ పూర్తవుతుంది. తద్వారా మనిషికి కావలసిన శక్తి వస్తుంది. బరువు పెరుగుతారు. మీకు పేగుల్లో కొంత భాగం తీసేశారు కాబట్టి, మీకు జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేదు. మీరు ఎంత తిన్నా కానీ అది మీ రక్తంలోకి, తద్వారా శరీరంలోకి చేరడం లేదు. అందుకే మీరు బరువు పెరగడం లేదు. ఓసారి డాక్టర్ని సంప్రదించి, బరువు పెరగకపోవడానికి థైరాయిడ్ తదితర హార్మోన్ల సమస్యలు, మరేవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయోమే పరీక్ష చేయించుకోండి. కారణం తెలిశాక తగిన చికిత్స చేయించుకోండి. అవసరమైతే బి-కాంప్లెక్స్ మాత్రలు, ఇంజెక్షన్లు, సెలైన్‌లో ప్రొటీన్, అమైనో యాసిడ్ ఇంజెక్షన్లను కలిపి తీసుకోండి. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక చక్కగా పెళ్లి చేసుకో వచ్చు. దిగులు పడకండి. నా వయసు 33. బరువు 72 కిలోలు. పెళ్లై పదమూడేళ్లు అయ్యింది. పదేళ్ల బాబు ఉన్నాడు. నేను, నా భర్త ఎంతో ప్రేమగా ఉంటాం. శృంగారంలో కూడా ఎంతో హుషారుగా పాల్గొంటాం. అయితే ఆ సమయంలో నా భర్త అతిగా చూషించడం వల్ల నా స్తనాలు వదులుగా అయిపోయాయి. ఆకారాన్ని కోల్పోయాయి. పరిమాణం కూడా తగ్గి చిన్నగా కనిపిస్తున్నాయి. అవి మళ్లీ మామూలుగా అవ్వాలంటే ఏం చేయాలి? క్రీములవీ రాసినా, సర్జరీలు చేయించుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మొన్న మీరొకరికి సలహా ఇచ్చారు. మంచి ఆహారం తీసుకొమ్మని చెప్పారు. నేను తీసుకుంటున్నాను. కానీ ఇప్పటికీ అవి సైజు పెరగలేదు. మరి నేనేం చేయాలి? - రేవతి, బెంగళూరు స్తనాలను చూషించడం వల్ల వదులుగా అవడం జరగదు. పైగా రెగ్యులర్ మసాజ్‌లా పని చేస్తుంది. దాంతో రక్త ప్రసరణ పెరిగి, రొమ్ములు నిండుగా తయారవుతాయి. రొమ్ముల్లో పాలగ్రంథులు, ఫైబ్రస్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. ఆ కొవ్వు తగ్గడం వల్ల వాటికి సపోర్ట్ తగ్గి, చర్మం సాగినట్లయ్యి, వదులుగా చిన్నగా అనిపించడం జరుగుతుంది. కొందరికైతే కాన్పు తర్వాత , బిడ్డకు పాలివ్వడం మానేసిన తర్వాత పాలగ్రంథులు తగ్గిపోయి రొమ్ములు వదులుగా, చిన్నగా అవుతాయి. రెగ్యులర్‌గా రొమ్ముల్ని మసాజ్ చేసుకుంటూ, కొవ్వుపదార్థాలతో కూడిన ఆహారం తీసుకుంటూ కొద్దిగా బరువు పెరగండి. అప్పుడు రొమ్ముల్లో కొవ్వు పేరుకుని, అవి పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు. సిజేరియన్ ద్వారా పుట్టారు. రెండో సిజేరియన్ అయ్యి రెండేళ్లు అయ్యింది. ఆరు నెలల నుంచి పీరియడ్స్ సమయంలో నా పొట్ట మీద, కుట్ల మధ్యలో చిన్న గడ్డలాగా అవుతోంది. అది బాగా నొప్పి పుడుతోంది. పీరియడ్స తగ్గాక మళ్లీ పది రోజులకు మెత్తబడిపోతోంది. ఎందుకలా అవుతోంది? - అంకిత, విజయవాడ సిజేరియన్ చేసేటప్పుడు గర్భసంచి మీద గాటు పెట్టి, అందులో నుంచి బిడ్డను బయటకు తీస్తారు. ఆ సమయంలో మాయను, గర్భసంచి లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్ను కూడా బయటకు తీసివేయడం జరుగుతుంది. ఒక్కోసారి పొరపాటుగా చిన్న ఎండోమెట్రియమ్ ముక్క పొట్టమీద పైన పొరలో కుట్ల కింద ఉండిపోవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి అది అక్కడే కరిగిపోతుంది. కొందరిలో మాత్రం అలా జరగదు. హార్మోన్ల ప్రభావం వల్ల నెలనెలా పీరియడ్స్ సమయంలో గర్భసంచి నుంచి బ్లీడింగ్ ఎలా అవుతుందో, పొట్టమీద కుట్ల కింద ఉన్న ఎండోమెట్రియమ్ ముక్క ఉత్తేజితం అయ్యి అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఆ రక్తం గడ్డకట్టి అక్కడ మీరు చెప్పినట్టుగా గట్టిగా తయారవుతుంది. మళ్లీ వారం పది రోజులకు ఆ గడ్డ దానంతటదే కరిగిపోతుంది. అందువల్లే నెలసరి సమయంలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. మీరు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు వాడి చూడండి. అలా కూడా తగ్గకపోతే... ఆ గడ్డకట్టే ప్రాంతం వరకు చిన్నగా కట్ చేసి, ఎండోమెట్రియమ్ పొరను తొలగించాల్సి ఉంటుంది. నా వయసు 17. నాకు ఈ మధ్య వైట్ డిశ్చార్జ్ బాగా అవుతోంది. పైగా యోనిలోను, ఆ చుట్టుపక్కల చాలా దురదగా కూడా ఉంటోంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయితే మనుషులు బలహీనపడిపోతారని విన్నాను. అది ఎంతవరకు నిజం? - స్రవంతి, ఏలూరు ఆడవారిలో వైట్ డిశ్చార్జి అవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది... యోనిలోను, సర్విక్స్లోను ఉండే గ్రంథుల నుంచి మ్యూకస్ స్రవించడం వల్ల సన్నగా తీగలాగ, నీరులాగ వైట్ డిశ్చార్జి అవుతుంది. దీనిలో వాసన, దురద ఉండవు. రజస్వల అయ్యే ముందు, పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ మధ్యలో అండం విడుదలయ్యే టప్పుడు ఇది స్రవిస్తుంది. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఇక రెండోది... బ్యాక్టీరియా, ఫంగల్, ప్రొటోజోవల్ ఇన్ఫెక్షన్ల వల్ల అయ్యేది. ఇలా అయ్యే డిశ్చార్జి పెరుగులాగ, నురగలాగ ఉంటుంది. పచ్చగా ఉండి దురద, మంట కూడా కలుగుతాయి. దీన్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. మీరు వెంటనే గైనకాలజిస్టును కలిస్తే యాంటి బయొటిక్స్, యాంటి ఫంగల్ మందులు ఇస్తారు. ఇక మీ అనుమానం సంగతి. వైట్ డిశ్చార్జి వల్ల బలహీనపడటం అనేది ఉండదు. రక్తహీనత ఏర్పడినప్పుడు, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు బలహీన పడ తారు. అయితే అలాంటప్పుడు ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం కంట్రోల్లో లేకపోవడం... మరికొందరిలో రక్తనాళాలు మందంగా తయారయ్యి యోని, ఇతర జననాంగాలకు రక్త సరఫరా తగ్గడం వల్ల శృంగారంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతే తప్ప మధుమేహం వచ్చిన వారందరికీ కలయిక సమయంలో ఇబ్బంది ఉండదు. నా వయసు 22. రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. రోజుకు రెండు మూడుసార్లు శారీరకంగా కలుస్తున్నాం. అప్పుడే పిల్లలు వద్దనుకోవడం వల్ల నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడు ఐపిల్ వేసుకుంటున్నాను. అయితే నాకో సందేహం. ఆ పీరియడ్ ముగిసేవరకూ కలిసిన ప్రతిసారీ ఐపిల్ వేసుకోవాలా? లేక రోజుకొక్కసారి వేసుకుంటే ఎన్నిసార్లు కలిసినా ఫర్వాలేదా? ఇలా ఐపిల్ ఎక్కువ వాడటం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలియజేయండి. - దీప్తి, చెన్నై ఐపిల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు గాను ఎప్పుడో ఒకసారి వేసుకునే మాత్ర. అంతేకాని కలిసినప్పుడల్లా దానిని వేసుకోకూడదు. ఈ మాత్రలో ప్రొజెస్టరాన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆ సమయంలో అండం తయారు కాకుండా, వీర్యకణాలు అండంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా కలిసిన ఇరవై నాలుగు గంటల లోపల వేసుకోవాలి. లేదంటే కనీసం డెబ్భై రెండు గంటలు గడవక ముందు అయినా వేసుకోవాలి. ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది. అయితే గర్భం రాకపోవడం అన్నది మాత్రం వారి వారి శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అరవై నుంచి తొంభై శాతం మందిలో మాత్రమే ఇది గర్భం రాకుండా అడ్డుకో గలుగుతుంది. మిగతా శాతం వారిలో ఫెయిలయ్యి, గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. మోతాదును మించి, అంటే నెలలో రెండు మూడుసార్లు వేసుకుంటే... రొమ్ముల్లో నొప్పి, తలనొప్పి, వికారం, పీరియడ్స్ క్రమం తప్పి త్వరగా రావడం, ఒళ్లు బరువెక్కడం వంటి ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరిలా నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడల్లా ఐపిల్ వేసుకుంటూ పోతే... హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో పాటు పైన చెప్పుకున్న ఇతరత్రా సమస్యలు కూడా వస్తాయి. పైగా ముందే చెప్పినట్టు గర్భం రాదు అన్న గ్యారంటీ కూడా లేదు.అందుకే నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడల్లా ఐపిల్ వేసుకోవడం మానేసి... కండోమ్స్ వాడుకోవడం ఎంతైనా మంచిది. - డా॥వేనాటి శోభ -
మద్యం తాగినప్పుడు కలిస్తే..!
సందేహం నేను పిల్లలు పుట్టకుండా కాపర్-టి పెట్టించుకుని వారం రోజులయ్యింది. నేను ఎన్ని రోజుల తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చు? - ప్రశాంతి, పెదపూడి సాధారణంగా వేరే ఇతర సమస్య ఏదీ లేనప్పుడు కాపర్-టి వేసిన రోజు నుంచే శృంగారంలో పాల్గొనవచ్చు. కొంతమందికి కాపర్-టి వేసిన తర్వాత ఒకట్రెండు రోజులు కొద్దిగా బ్లీడింగ్ (స్పాటింగ్) కనిపించవచ్చు. అలా కనుక జరిగితే... బ్లీడింగ్ తగ్గేవరకూ ఆగితే మంచిది. ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే కనుక మూడు నుంచి ఐదు రోజుల పాటు యాంటీ బయొటిక్స్ వాడిన తర్వాతే సెక్స్‌లో పాల్గొనాలి. నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి నాతో ఆనల్ సెక్స్ చేశాడు. అప్పట్నుంచీ నాకు చాలా భయం వేస్తోంది. తనకి ఎయిడ్స్ ఉందేమో, నాకూ వచ్చిందేమోనన్న ఆలోచనలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నాకు ఎయిడ్స్ వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి? - విజయ, గోదావరి ఖని ఆనల్ సెక్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ఎయిడ్స్ సోకే అవకాశం ఉంది. ఎయిడ్స్ అనేది హెచ్ఐవీ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఆ వైరస్ ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించాక, రోగ నిరోధక శక్తిని పెంపొందించే కణాలు క్షీణించిపోతాయి. వైరస్ పెరిగిపోతుంది. దాంతో అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎయిడ్స్ వైరస్ శరీరంలో ప్రవేశించాక వ్యాధి లక్షణాలు బయటపడటానికి వారి వారి శరీరతత్వాన్ని బట్టి ఆరు నెలల నుంచి ఐదారేళ్లు పడుతుంది. ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. రక్తపరీక్ష చేస్తే వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి మీరు ముందు హెచ్ఐవీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అయినా ఇలా చిన్న వయసులోనే ఎవరితో పడితే వాళ్లతో శారీరకంగా దగ్గరవడం అంత మంచిది కాదు. ఇప్పుడు చూశారుగా ఎంత టెన్షన్ పడాల్సి వస్తోందో! కాబట్టి ఇక మీదటైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. నా వయసు 36. నా భర్త మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పట్నుంచీ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. అయితే ఈమధ్య నాకు కోరికలు ఎక్కువవుతున్నాయి. మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది. కానీ మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది, ఆ ఆలోచన మానుకో అని కోప్పడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కోరికల్ని చంపేయడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి. - రాగిణి, నల్లజర్ల మీ పరిస్థితి నిజంగా ఇబ్బందికరమే. అయితే కోరికలు పెరగడానికి మందులు కనిపెట్టారే తప్ప, తగ్గడానికి ఏవీ కనిపెట్టలేదు. మీ వయసు తక్కువే కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మీ పిల్లల వయసు, మీ ఇంట్లోవాళ్ల సపోర్ట్‌ని దృష్టిలో ఉంచుకుని, మీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జాగ్రత్తగా మాట్లాడి ఇంట్లోవాళ్లని ఒప్పించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని, మీ పరిస్థితుల్ని అర్థం చేసుకునే మంచి మనిషిని ఎంచుకుని వివాహం చేసుకోండి. ఇవేమీ సాధ్యం కానప్పుడు మనసును నియంత్రించుకోవడం తప్ప మరో మార్గం లేదు. ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన ఓ హాబీని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టండి. అంతకు మించి పరిష్కారం లేదు. నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. మావారు తాగుతారు. తాగినప్పుడల్లా సెక్స్ కావాలని గొడవ చేస్తారు. అయితే మద్యం తాగి ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటే... ఆ సమయంలో విడుదలైన అండం ఆరోగ్యంగా ఉండదని, తద్వారా పిల్లలు రకరకాల వ్యాధులతో పుడతారని ఎవరో అనగా విన్నాను. అందుకే తాగి వున్నప్పుడు ఆయనకు దగ్గర కావాలంటే భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? - స్వాతి, గుంతకల్లు మద్యం తాగడం అన్నది పుట్టబోయే పిల్లలకే కాదు... మీ భర్తకు కూడా మంచిది కాదు. ఆ అలవాటు వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వృషణాలు దెబ్బ తింటాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి కదలికలో, నాణ్యతలో తేడా వస్తుంది. మెల్లగా కోరికలు తగ్గిపోవడం, అంగస్తంభన లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీర్యకణాల నాణ్యత తగ్గడం వల్ల పిండం సరిగ్గా తయారవదు. అలాంటప్పుడు ఒక్కోసారి అబార్షన్ అవుతుంది. లేదంటే పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయి. అవయవ లోపాలు, జన్యు లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. కొందరు పిల్లలకు పుట్టిన తర్వాత ఐదేళ్లలోపు మతిమరుపు, బుద్ధిమాంద్యం, ఇతరత్రా మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. ఈ విషయాలన్నీ మీవారికి వివరించండి. మంచి భవిష్యత్తు కోసమైనా తాగుడు మానేయమని చెప్పండి. వినకపోతే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. - డా॥వేనాటి శోభ