మద్యం తాగినప్పుడు కలిస్తే..!
సందేహం
నేను పిల్లలు పుట్టకుండా కాపర్-టి పెట్టించుకుని వారం రోజులయ్యింది. నేను ఎన్ని రోజుల తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చు?
- ప్రశాంతి, పెదపూడి
సాధారణంగా వేరే ఇతర సమస్య ఏదీ లేనప్పుడు కాపర్-టి వేసిన రోజు నుంచే శృంగారంలో పాల్గొనవచ్చు. కొంతమందికి కాపర్-టి వేసిన తర్వాత ఒకట్రెండు రోజులు కొద్దిగా బ్లీడింగ్ (స్పాటింగ్) కనిపించవచ్చు. అలా కనుక జరిగితే... బ్లీడింగ్ తగ్గేవరకూ ఆగితే మంచిది. ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే కనుక మూడు నుంచి ఐదు రోజుల పాటు యాంటీ బయొటిక్స్ వాడిన తర్వాతే సెక్స్‌లో పాల్గొనాలి.
నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి నాతో ఆనల్ సెక్స్ చేశాడు. అప్పట్నుంచీ నాకు చాలా భయం వేస్తోంది. తనకి ఎయిడ్స్ ఉందేమో, నాకూ వచ్చిందేమోనన్న ఆలోచనలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నాకు ఎయిడ్స్ వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- విజయ, గోదావరి ఖని
ఆనల్ సెక్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ఎయిడ్స్ సోకే అవకాశం ఉంది. ఎయిడ్స్ అనేది హెచ్‌ఐవీ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఆ వైరస్ ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించాక, రోగ నిరోధక శక్తిని పెంపొందించే కణాలు క్షీణించిపోతాయి. వైరస్ పెరిగిపోతుంది. దాంతో అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎయిడ్స్ వైరస్ శరీరంలో ప్రవేశించాక వ్యాధి లక్షణాలు బయటపడటానికి వారి వారి శరీరతత్వాన్ని బట్టి ఆరు నెలల నుంచి ఐదారేళ్లు పడుతుంది.
ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. రక్తపరీక్ష చేస్తే వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి మీరు ముందు హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అయినా ఇలా చిన్న వయసులోనే ఎవరితో పడితే వాళ్లతో శారీరకంగా దగ్గరవడం అంత మంచిది కాదు. ఇప్పుడు చూశారుగా ఎంత టెన్షన్ పడాల్సి వస్తోందో! కాబట్టి ఇక మీదటైనా కాస్త జాగ్రత్తగా ఉండండి.
నా వయసు 36. నా భర్త మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పట్నుంచీ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. అయితే ఈమధ్య నాకు కోరికలు ఎక్కువవుతున్నాయి. మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది. కానీ మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది, ఆ ఆలోచన మానుకో అని కోప్పడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కోరికల్ని చంపేయడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి.
- రాగిణి, నల్లజర్ల
మీ పరిస్థితి నిజంగా ఇబ్బందికరమే. అయితే కోరికలు పెరగడానికి మందులు కనిపెట్టారే తప్ప, తగ్గడానికి ఏవీ కనిపెట్టలేదు. మీ వయసు తక్కువే కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మీ పిల్లల వయసు, మీ ఇంట్లోవాళ్ల సపోర్ట్‌ని దృష్టిలో ఉంచుకుని, మీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జాగ్రత్తగా మాట్లాడి ఇంట్లోవాళ్లని ఒప్పించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని, మీ పరిస్థితుల్ని అర్థం చేసుకునే మంచి మనిషిని ఎంచుకుని వివాహం చేసుకోండి. ఇవేమీ సాధ్యం కానప్పుడు మనసును నియంత్రించుకోవడం తప్ప మరో మార్గం లేదు. ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన ఓ హాబీని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టండి. అంతకు మించి పరిష్కారం లేదు.
నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. మావారు తాగుతారు. తాగినప్పుడల్లా సెక్స్ కావాలని గొడవ చేస్తారు. అయితే మద్యం తాగి ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటే... ఆ సమయంలో విడుదలైన అండం ఆరోగ్యంగా ఉండదని, తద్వారా పిల్లలు రకరకాల వ్యాధులతో పుడతారని ఎవరో అనగా విన్నాను. అందుకే తాగి వున్నప్పుడు ఆయనకు దగ్గర కావాలంటే భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు?
- స్వాతి, గుంతకల్లు
మద్యం తాగడం అన్నది పుట్టబోయే పిల్లలకే కాదు... మీ భర్తకు కూడా మంచిది కాదు. ఆ అలవాటు వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వృషణాలు దెబ్బ తింటాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి కదలికలో, నాణ్యతలో తేడా వస్తుంది. మెల్లగా కోరికలు తగ్గిపోవడం, అంగస్తంభన లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీర్యకణాల నాణ్యత తగ్గడం వల్ల పిండం సరిగ్గా తయారవదు. అలాంటప్పుడు ఒక్కోసారి అబార్షన్ అవుతుంది. లేదంటే పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయి.
అవయవ లోపాలు, జన్యు లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. కొందరు పిల్లలకు పుట్టిన తర్వాత ఐదేళ్లలోపు మతిమరుపు, బుద్ధిమాంద్యం, ఇతరత్రా మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. ఈ విషయాలన్నీ మీవారికి వివరించండి. మంచి భవిష్యత్తు కోసమైనా తాగుడు మానేయమని చెప్పండి. వినకపోతే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి.
- డా॥వేనాటి శోభ