తప్పు చేయలేదు... అయినా ఎందుకిలా?!
సందేహం
నా వయసు 23. రెండు నెలల క్రితం పెళ్లి అయ్యింది. నాకు మొదటి రాత్రి మాత్రమే కాస్త నొప్పి అనిపించింది తప్ప, మరెప్పుడూ ఏ ఇబ్బందీ లేదు. కానీ మావారు మాత్రం... తన అంగ పూర్వచర్మం బిగుతుగా ఉందని, నొప్పి వస్తోందని ఇబ్బంది పడిపోతున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే సిగ్గుపడుతున్నారు. ఇలా ఎందుకవుతోంది? దీనికి ఏవైనా చిట్కాలు ఉన్నాయా?
- స్వర్ణరేఖ, భీమిలి
కొందరు మగవాళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, మరికొన్ని ఇతర కారణాల వల్ల కానీ అంగం మీద ఉన్న పూర్వచర్మం బిగుతుగా అయిపోతుంది. దానివల్ల అంగ ప్రవేశానికి ఇబ్బంది కలుగుతుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే... మందులతో తగ్గిపోవాల్సిన సమస్య ఆపరేషన్ దాకా వెళ్లే ప్రమాదం ఉంది. సిగ్గుపడుతూ కూర్చుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ముందు డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెప్పండి. పరీక్ష చెయ్య కుండా చిట్కాలు చెప్పడం కష్టం. డాక్టర్ చూసిన తర్వాతే సమస్య ఎందుకొచ్చిందో, ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వెంటనే యూరాలజిస్టును కలిస్తే వారు సమస్యకు పరిష్కారం చెబుతారు.
నా వయసు 38. నాకు క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ అనే ఊపిరితిత్తుల వ్యాధి ఉంది. దాంతో తరచుగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి, ఆయాసపడుతుంటాను. దాంతో శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను. దాని వల్ల మావారు ఇబ్బంది పడుతున్నారు. పైకి ఏమీ అనరు కానీ మనసులో ఆశ ఉంటుంది కదా! అందుకే ఒకట్రెండుసార్లు దగ్గరవడానికి ట్రై చేశాను. కానీ ఆయాసం వచ్చేసింది. మా వారిని నేను సంతోష పెట్టలేకపోతున్నానే అని చాలా దిగులుగా ఉంది నాకు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి?
- వందన, రాజమండ్రి
ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు సాధారణ భంగిమలో సెక్స్‌లో పాల్గొన డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయాసం వస్తూ ఉంటుంది. ఇది సహజం. ఎందుకంటే.. సెక్స్ సమయంలో ఊపిరితిత్తుల మీద భారం పడి, అవి మామూలు వారిలాగా పని చేయలేవు కాబట్టి ఆయాసం త్వరగా వచ్చేస్తుంది. శ్వాస ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు.
బరువు ఎక్కువ ఉన్నా కూడా ఆయాసం ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి అధిక బరువు కనుక ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి. ఇలాంటప్పుడు సాధారణ భంగిమల్లో కాకుండా... కూర్చుని ప్రయత్నించండి. లేదంటే మీవారు కింద, మీరు పైన ఉండి సెక్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నించండి. దానివల్ల ఊపిరి తిత్తుల మీద ఒత్తిడి తగ్గుతుంది.
నా వయసు 19. పెళ్లై రెండు నెలలు అవుతోంది. అప్పట్నుంచీ కలయికకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ సాధ్యం కావడం లేదు. నా యోని చాలా చిన్నగా ఉంది. మావారి అంగమేమో పెద్దగా ఉంది. దాంతో అస్సలు లోనికి వెళ్లడం లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- రమ, వరంగల్
యోని ద్వారం కన్నెపొరతో కప్పబడి ఉంటుంది. దానివల్ల పెళ్లయిన కొత్తలో అంగప్రవేశం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే యోనిలోని కండరాలకు సాగే గుణం ఉంటుంది. దానివల్ల యోని చిన్నగా ఉన్నా, మెల్లగా ప్రయత్నిస్తూ ఉంటే, అంగ ప్రవేశం తప్పక జరుగు తుంది. కాబట్టి ముందు మీరు భయ పడటం మానేయండి. కేవై జెల్లీ, లూబ్రిక్ జెల్ వంటివి మీరు, మీవారు కూడా రాసుకుని కలయికకు ప్రయత్నించండి. అయినా కూడా అవ్వకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. వారు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు.
నా వయసు 20. బరువు 40 కిలోలు. ఎత్తు 5.2. మావారికి పాతికేళ్లు. మా పెళ్లై సంవత్సరం అవుతోంది. మొదటిసారి కలిసినప్పుడు యోనిలో చాలా మంటగా అనిపించింది. మెల్లగా తగ్గుతుందిలే అనుకున్నాను. కానీ ఇప్పటి వరకూ తగ్గింది లేదు. మూత్రం పోసుకునేటప్పుడు కూడా చాలా మంటగా ఉంటుంది. నడుము నొప్పి కూడా బాగా వస్తోంది. అది మాత్రమే కాక ఒంట్లో వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. మీరైనా పరిష్కారం చెప్పండి.
- త్రివేణి, నల్లగొండ
పెళ్లై సంవత్సరమైనా యోనిలో మంట, మూత్రంలో మంట ఉందంటు న్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదనీ అంటున్నారు. అంటే ఇన్ఫెక్షన్ బాగా ఉన్నట్టుంది. మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉన్నట్టుంది. మీరు బరువు చాలా తక్కువ ఉన్నారు. కొన్నిసార్లు బలహీనత, రక్త హీనత, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. మరికొన్నిసార్లు భర్తకి ఇన్ఫెక్షన్ ఉంటే, భార్యకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మందులు వాడినా ఇలా తరచుగా రావడం జరుగుతుంది.
కాబట్టి ఓసారి డాక్టర్‌ని కలిసి పరీక్ష చేయించుకోండి. ఇన్ఫెక్షన్ ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. కంప్లీట్ యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, వెజైనల్ స్వాబ్ టెస్ట్ తదితర పరీక్షలు చేస్తే కారణం తెలిసిపోతుంది. దాన్ని బట్టి దంపతులిద్దరూ పది నుంచి పదిహేను రోజుల పాటు మందులు వాడితే సమస్య తగ్గే అవకాశం ఉంది. మందులతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోండి. రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగండి. చలవ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటే వేడీ తగ్గుతుంది.
నా వయసు 23. ఏడు నెలల క్రితం పెళ్లి అయ్యింది. ఈ మధ్య నాకు కలయిక సమయంలో ఎందుకో నొప్పి అనిపిస్తోంది. మావారు స్ట్రోక్ ఇస్తున్నప్పుడు లోపల ఏదో పొడుస్తున్నట్లుగా బాధ కలుగుతోంది. తట్టుకోలేకపోతున్నాను. ఆయనతో చెబితే... ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడెందుకలా అవుతోంది అని అంటూ గైనకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లారు. ఆవిడ స్కానింగ్ చేసి ఏ సమస్యా లేదంటున్నారు. కానీ నాకు మాత్రం అంగం ఎక్కడో లోపలకు వెళ్లిపోయినట్టు, పొడుచుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకలా అవుతోంది?
- పావని, సంగారెడ్డి
కొంతమందిలో కొన్నిసార్లు యోని లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పుండ్లు ఏర్పడినా కూడా కలయిక సమయంలో నొప్పి ఉండవచ్చు. ఎండోమెట్రియాసిస్ వల్ల కూడా నొప్పి ఉంటుంది. ఇవి స్కానింగ్‌లో కనిపించవు. స్పెక్యులమ్ పరీక్ష ద్వారా యోని లోపల చూసినప్పుడే తెలుస్తాయి. కాబట్టి ఓసారి డాక్టర్ దగ్గరకు వెళ్లండి. కారణం తెలుసుకుని మందులు వాడండి. సమస్య తగ్గేవరకూ కలయికకు దూరంగా ఉంటే మంచిది. ఈలోపు నొప్పి కూడా తగ్గుతుంది.
నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. మావారు మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. దాంతో మూడేసి నెలలు బయటే ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడే మేం కలుస్తూ ఉండేవాళ్లం. తర్వాత నేను గర్భం దాల్చాను. ఆ సమయంలోనే నాకు మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. మా వారు లేని సమయంలో అతనికి బాగా దగ్గరయ్యాను. ఏడో నెల వచ్చేవరకూ వారానికి ఓసారి శారీరకంగా కలిసేవాళ్లం. తర్వాత నాకు పాప పుట్టింది. అయితే నాకో సందేహం. గర్భంతో ఉన్నప్పుడు వేరే వ్యక్తితో అన్నిసార్లు కలిశాను కాబట్టి పాప డీఎన్‌ఏ మారుతుందా? తనకి మావారి డీఎన్‌ఏ కాకుండా అతని డీఎన్‌ఏ వచ్చే అవకాశం ఉందా?
- ప్రియ, ఊరు రాయలేదు
గర్భం దాల్చినప్పుడే తల్లి నుంచి సగం, తండ్రి నుంచి సగం డీఎన్‌ఏ బిడ్డకు సంక్రమిస్తుంది. తర్వాతి నుంచి కణాలు విభజన చెందుతూ బిడ్డ తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది. అంతేకాని, తర్వాత డీఎన్‌ఏ మారడం అంటూ ఉండదు. తల్లి నుంచి అండం (23 క్రోమోజోములు), తండ్రి నుంచి శుక్రకణం (23 క్రోమోజోములు) కలిసి పిండం ఏర్పడుతుంది. ఈ క్రోమోజోముల్లో డీఎన్‌ఏ ఉంటుంది. ఈ పిండంలోని కణాలు విభజన చెందుతూ అన్ని అవయవాలూ ఏర్పడుతూ పిండం బిడ్డగా రూపాంతరం చెంది, గర్భాశయంలో తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది. మధ్యలో డీఎన్‌ఏ వచ్చి చేరడం జరగదు. అయినా ఇలాంటి ఉత్తరాలు చదువుతున్నప్పుడల్లా మన భారతీయ సంస్కృతి ఎటు పోతోందో అని బాధ కలుగుతోంది. మీరు చేస్తున్నది ఎంత వరకూ కరెక్టో మీరోసారి ఆలోచించు కోండి. తెలియక తప్పు చేస్తే ఫర్వాలేదు. కానీ ఇలా తెలిసి చేయడం నేరం కాదా?!
నా వయసు 29. పెళ్లై నాలుగేళ్లు అవుతోంది. సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు. వాడు పుట్టేవరకూ నేను, మావారు సెక్స్‌ని బాగానే ఎంజాయ్ చేశాం. బాబు పుట్టిన కొన్నాళ్ల వరకూ కూడా బాగున్నాం. కానీ ఈ మధ్య ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. నా యోని చాలా వదులుగా అయిపోయిందని, తనకు తృప్తి లేదనీ అంటున్నారు. ఎక్కువసార్లు సెక్స్ చేస్తే అలా అయిపోతుంది, మనం వారానికి రెండు మూడుసార్లే కలుస్తున్నాం, మరి ఇంత వదులుగా ఎందుకయ్యింది, నీకు వేరే ఎవరితోనైనా సంబంధం ఏర్పడిందా అని అడుగుతున్నారు. ఆ మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి. అలాంటిదేం లేదని ఎంత చెప్పినా వినడం లేదు. ఆయన్ని ఎలా నమ్మించాలో తెలియడం లేదు. ఆయన అన్నది నిజమేనా? ఎక్కువసార్లు సెక్స్ చేస్తే యోని అలా వదులైపోతుందా? నాకెవరితోనూ సంబంధం లేదు. మరి ఎందుకలా అయ్యింది?
- సింధుజ, హైదరాబాద్
కాన్పు సాధారణ కాన్పా లేక సిజేరి యన్ అయ్యిందా రాయలేదు. సిజేరియన్ అయినవాళ్ల కంటే సాధారణ కాన్పు అయినవాళ్లలో యోని మామూలుగా కంటే కాస్త ఎక్కువ వదులయ్యే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ అవ్వాలనేమీ లేదు. బిడ్డ బరువు ఎక్కువ ఉండటం, లేదంటే బిడ్డ తల యోనిభాగంలో ఎక్కువ సేపు ఆగిపోవడం జరిగినప్పుడు... యోని కండరాలు బాగా సాగి అలా అవ్వవచ్చు. వారి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో మళ్లీ యోని కండరాలు గట్టి పడిపోయి, సాధారణ స్థాయికి వచ్చేస్తాయి. కొందరిలో అలా కాకపోవచ్చు. అంతే తప్ప... ఎక్కువ సార్లు కలిసినా, వారానికి రెండు మూడు సార్లు కలిసినా యోని వదులవడంలో తేడా ఏమీ ఉండదు. అది కేవలం అపోహ మాత్రమే. ఆ విషయం మీవారికి మీరే అర్థమయ్యేలా చెప్పండి. అప్పటికీ వినకపోతే ఎవరైనా డాక్టర్‌తో చెప్పించండి.
డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్,మోతీనగర్, హైదరాబాద్