ఐపిల్... గర్భం రాకుండా ఆపలేదా?!
సందేహం
నా వయసు 31. ఈ మధ్యనే బ్లడ్ టెస్ట్ చేస్తే నాకు డయాబెటిస్ ఉందని తెలిసింది. మధుమేహం వచ్చినవాళ్లకి సెక్స్ కోరికలు తగ్గుతాయని, శృంగారంలో సరిగ్గా పాల్గొనలేరని విన్నాను. అది నిజమేనా? నాకు ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు ఏవైనా తీసుకోవచ్చా?
- అమరావతి, కొత్తపేట
డయాబెటిస్ వచ్చిన వాళ్లందరికీ కోరికలు తగ్గాలని, సెక్స్‌లో పాల్గొనలేరని ఏమీ లేదు. కొంతమందికి దీర్ఘకాలంగా మధుమేహం ఉండి, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం కంట్రోల్‌లో లేకపోవడం... మరికొందరిలో రక్తనాళాలు మందంగా తయారయ్యి యోని, ఇతర జననాంగాలకు రక్త సరఫరా తగ్గడం వల్ల సెక్స్‌లో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతే తప్ప అందరికీ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన చెందవద్దు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ వ్యాయామం చేయండి. మితాహారం తీసుకుంటే, బరువు పెరగకుండా నియంత్రించుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. సెక్స్‌లో కూడా హుషారుగా పాల్గొనవచ్చు.
నా వయసు 21. నా సమస్య నా బరువే. ఇప్పుడు నా బరువు ముప్ఫై రెండున్నర కిలోలు. 2012లో నాకో సర్జరీ జరిగింది. అప్పుడు నా పేగులు కొంతమేర కత్తిరించి, ఆ స్థానంలో ఓ గొట్టం అమర్చారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు ఏమీ లేవుగానీ అనారోగ్యం వల్ల తగ్గిన బరువు అలానే ఉండిపోయింది. ఏం తిన్నా పెరగడం లేదు. పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు... అన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటాను. అయినా ఫలితం లేదు. బరువు పెరుగుతానేమో అన్న ఆశతో జంక్‌ఫుడ్ కూడా తినడం మొదలుపెట్టాను. కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. నేను కనుక పెళ్లి చేసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? నేనేం చేస్తే బరువు పెరుగుతానో దయచేసి సూచించండి.
- సింధు, మెయిల్
కొంతభాగం పేగులు తీసేశారు అని రాశారు. ఏ సమస్య రావడం వల్ల అలా తీశారు అనేది రాయలేదు. మనం నోటి ద్వారా తీసుకునే ఆహారం గొంతులోంచి పొట్టలోకి, అక్కడి నుంచి చిన్న పేగులు, ఆ తర్వాత పెద్ద పేగుల్లోకి ప్రవేశించే క్రమంలో... అనేక రకాల ఎంజైమ్స్ ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి, సులువుగా జీర్ణమయ్యేలా చేస్తాయి. జీర్ణం కాని పదార్థాలు మలద్వారం ద్వారా మలం రూపంలో బయటకు వచ్చేస్తాయి.
జీర్ణమైన ఆహారంలో కొంత భాగం చిన్న పేగుల నుంచి, కొంత భాగం పెద్ద పేగుల నుంచి రక్తనాళాల్లోకి ప్రవేశించి, శరీరంలోని అన్ని భాగాలకూ అందడం ద్వారా జీర్ణక్రియ పూర్తవుతుంది. తద్వారా మనిషికి కావలసిన శక్తి వస్తుంది. బరువు పెరుగుతారు. మీకు పేగుల్లో కొంత భాగం తీసేశారు కాబట్టి, మీకు జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేదు. మీరు ఎంత తిన్నా కానీ అది మీ రక్తంలోకి, తద్వారా శరీరంలోకి చేరడం లేదు. అందుకే మీరు బరువు పెరగడం లేదు.
ఓసారి డాక్టర్‌ని సంప్రదించి, బరువు పెరగకపోవడానికి థైరాయిడ్ తదితర హార్మోన్ల సమస్యలు, మరేవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయోమే పరీక్ష చేయించుకోండి. కారణం తెలిశాక తగిన చికిత్స చేయించుకోండి. అవసరమైతే బి-కాంప్లెక్స్ మాత్రలు, ఇంజెక్షన్లు, సెలైన్‌లో ప్రొటీన్, అమైనో యాసిడ్ ఇంజెక్షన్లను కలిపి తీసుకోండి. ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక చక్కగా పెళ్లి చేసుకో వచ్చు. దిగులు పడకండి.
నా వయసు 33. బరువు 72 కిలోలు. పెళ్లై పదమూడేళ్లు అయ్యింది. పదేళ్ల బాబు ఉన్నాడు. నేను, నా భర్త ఎంతో ప్రేమగా ఉంటాం. శృంగారంలో కూడా ఎంతో హుషారుగా పాల్గొంటాం. అయితే ఆ సమయంలో నా భర్త అతిగా చూషించడం వల్ల నా స్తనాలు వదులుగా అయిపోయాయి. ఆకారాన్ని కోల్పోయాయి. పరిమాణం కూడా తగ్గి చిన్నగా కనిపిస్తున్నాయి. అవి మళ్లీ మామూలుగా అవ్వాలంటే ఏం చేయాలి? క్రీములవీ రాసినా, సర్జరీలు చేయించుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మొన్న మీరొకరికి సలహా ఇచ్చారు. మంచి ఆహారం తీసుకొమ్మని చెప్పారు. నేను తీసుకుంటున్నాను. కానీ ఇప్పటికీ అవి సైజు పెరగలేదు. మరి నేనేం చేయాలి?
- రేవతి, బెంగళూరు
స్తనాలను చూషించడం వల్ల వదులుగా అవడం జరగదు. పైగా రెగ్యులర్ మసాజ్‌లా పని చేస్తుంది. దాంతో రక్త ప్రసరణ పెరిగి, రొమ్ములు నిండుగా తయారవుతాయి. రొమ్ముల్లో పాలగ్రంథులు, ఫైబ్రస్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. ఆ కొవ్వు తగ్గడం వల్ల వాటికి సపోర్ట్ తగ్గి, చర్మం సాగినట్లయ్యి, వదులుగా చిన్నగా అనిపించడం జరుగుతుంది. కొందరికైతే కాన్పు తర్వాత , బిడ్డకు పాలివ్వడం మానేసిన తర్వాత పాలగ్రంథులు తగ్గిపోయి రొమ్ములు వదులుగా, చిన్నగా అవుతాయి. రెగ్యులర్‌గా రొమ్ముల్ని మసాజ్ చేసుకుంటూ, కొవ్వుపదార్థాలతో కూడిన ఆహారం తీసుకుంటూ కొద్దిగా బరువు పెరగండి. అప్పుడు రొమ్ముల్లో కొవ్వు పేరుకుని, అవి పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది.
నాకు ఇద్దరు పిల్లలు. సిజేరియన్ ద్వారా పుట్టారు. రెండో సిజేరియన్ అయ్యి రెండేళ్లు అయ్యింది. ఆరు నెలల నుంచి పీరియడ్స్ సమయంలో నా పొట్ట మీద, కుట్ల మధ్యలో చిన్న గడ్డలాగా అవుతోంది. అది బాగా నొప్పి పుడుతోంది. పీరియడ్‌స తగ్గాక మళ్లీ పది రోజులకు మెత్తబడిపోతోంది. ఎందుకలా అవుతోంది?
- అంకిత, విజయవాడ
సిజేరియన్ చేసేటప్పుడు గర్భసంచి మీద గాటు పెట్టి, అందులో నుంచి బిడ్డను బయటకు తీస్తారు. ఆ సమయంలో మాయను, గర్భసంచి లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్‌ను కూడా బయటకు తీసివేయడం జరుగుతుంది. ఒక్కోసారి పొరపాటుగా చిన్న ఎండోమెట్రియమ్ ముక్క పొట్టమీద పైన పొరలో కుట్ల కింద ఉండిపోవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి అది అక్కడే కరిగిపోతుంది. కొందరిలో మాత్రం అలా జరగదు.
హార్మోన్ల ప్రభావం వల్ల నెలనెలా పీరియడ్స్ సమయంలో గర్భసంచి నుంచి బ్లీడింగ్ ఎలా అవుతుందో, పొట్టమీద కుట్ల కింద ఉన్న ఎండోమెట్రియమ్ ముక్క ఉత్తేజితం అయ్యి అక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఆ రక్తం గడ్డకట్టి అక్కడ మీరు చెప్పినట్టుగా గట్టిగా తయారవుతుంది. మళ్లీ వారం పది రోజులకు ఆ గడ్డ దానంతటదే కరిగిపోతుంది. అందువల్లే నెలసరి సమయంలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. మీరు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు వాడి చూడండి. అలా కూడా తగ్గకపోతే... ఆ గడ్డకట్టే ప్రాంతం వరకు చిన్నగా కట్ చేసి, ఎండోమెట్రియమ్ పొరను తొలగించాల్సి ఉంటుంది.
నా వయసు 17. నాకు ఈ మధ్య వైట్ డిశ్చార్జ్ బాగా అవుతోంది. పైగా యోనిలోను, ఆ చుట్టుపక్కల చాలా దురదగా కూడా ఉంటోంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయితే మనుషులు బలహీనపడిపోతారని విన్నాను. అది ఎంతవరకు నిజం?
- స్రవంతి, ఏలూరు
ఆడవారిలో వైట్ డిశ్చార్జి అవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది... యోనిలోను, సర్విక్స్‌లోను ఉండే గ్రంథుల నుంచి మ్యూకస్ స్రవించడం వల్ల సన్నగా తీగలాగ, నీరులాగ వైట్ డిశ్చార్జి అవుతుంది. దీనిలో వాసన, దురద ఉండవు. రజస్వల అయ్యే ముందు, పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ మధ్యలో అండం విడుదలయ్యే టప్పుడు ఇది స్రవిస్తుంది. దీని గురించి భయపడాల్సిన పని లేదు.
ఇక రెండోది... బ్యాక్టీరియా, ఫంగల్, ప్రొటోజోవల్ ఇన్ఫెక్షన్ల వల్ల అయ్యేది. ఇలా అయ్యే డిశ్చార్జి పెరుగులాగ, నురగలాగ ఉంటుంది. పచ్చగా ఉండి దురద, మంట కూడా కలుగుతాయి. దీన్ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. మీరు వెంటనే గైనకాలజిస్టును కలిస్తే యాంటి బయొటిక్స్, యాంటి ఫంగల్ మందులు ఇస్తారు. ఇక మీ అనుమానం సంగతి. వైట్ డిశ్చార్జి వల్ల బలహీనపడటం అనేది ఉండదు. రక్తహీనత ఏర్పడినప్పుడు, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు బలహీన పడ తారు. అయితే అలాంటప్పుడు ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
రక్తంలో చక్కెర శాతం కంట్రోల్‌లో లేకపోవడం... మరికొందరిలో రక్తనాళాలు మందంగా తయారయ్యి యోని, ఇతర జననాంగాలకు రక్త సరఫరా తగ్గడం వల్ల శృంగారంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతే తప్ప మధుమేహం వచ్చిన వారందరికీ కలయిక సమయంలో ఇబ్బంది ఉండదు.
నా వయసు 22. రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. రోజుకు రెండు మూడుసార్లు శారీరకంగా కలుస్తున్నాం. అప్పుడే పిల్లలు వద్దనుకోవడం వల్ల నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడు ఐపిల్ వేసుకుంటున్నాను. అయితే నాకో సందేహం. ఆ పీరియడ్ ముగిసేవరకూ కలిసిన ప్రతిసారీ ఐపిల్ వేసుకోవాలా? లేక రోజుకొక్కసారి వేసుకుంటే ఎన్నిసార్లు కలిసినా ఫర్వాలేదా? ఇలా ఐపిల్ ఎక్కువ వాడటం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలియజేయండి.
- దీప్తి, చెన్నై
ఐపిల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు గాను ఎప్పుడో ఒకసారి వేసుకునే మాత్ర. అంతేకాని కలిసినప్పుడల్లా దానిని వేసుకోకూడదు. ఈ మాత్రలో ప్రొజెస్టరాన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆ సమయంలో అండం తయారు కాకుండా, వీర్యకణాలు అండంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా కలిసిన ఇరవై నాలుగు గంటల లోపల వేసుకోవాలి. లేదంటే కనీసం డెబ్భై రెండు గంటలు గడవక ముందు అయినా వేసుకోవాలి.
ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది. అయితే గర్భం రాకపోవడం అన్నది మాత్రం వారి వారి శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అరవై నుంచి తొంభై శాతం మందిలో మాత్రమే ఇది గర్భం రాకుండా అడ్డుకో గలుగుతుంది. మిగతా శాతం వారిలో ఫెయిలయ్యి, గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. మోతాదును మించి, అంటే నెలలో రెండు మూడుసార్లు వేసుకుంటే... రొమ్ముల్లో నొప్పి, తలనొప్పి, వికారం, పీరియడ్స్ క్రమం తప్పి త్వరగా రావడం, ఒళ్లు బరువెక్కడం వంటి ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి.
కాబట్టి మీరిలా నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడల్లా ఐపిల్ వేసుకుంటూ పోతే... హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో పాటు పైన చెప్పుకున్న ఇతరత్రా సమస్యలు కూడా వస్తాయి. పైగా ముందే చెప్పినట్టు గర్భం రాదు అన్న గ్యారంటీ కూడా లేదు.అందుకే నాన్ సేఫ్టీ పీరియడ్‌లో కలిసినప్పుడల్లా ఐపిల్ వేసుకోవడం మానేసి... కండోమ్స్ వాడుకోవడం ఎంతైనా మంచిది.
- డా॥వేనాటి శోభ