కరుణ చూపి... కడుపు నింపి | EACH One Feed One | Sakshi
Sakshi News home page

కరుణ చూపి... కడుపు నింపి

Published Sun, May 21 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

కరుణ చూపి... కడుపు నింపి

కరుణ చూపి... కడుపు నింపి

కొన్ని శునకాలు రాజభోగం అనుభవిస్తాయి. వాటి అదృష్టానికి అబ్బురపడిపోతాం. కొన్ని శునకాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు. వాటి ఆలనాపాలనా ఎవరికీ  పట్టదు. అందుకే వీధి కుక్కలు వీధికుక్కలుగానే ఉండిపోతాయి.  కొన్ని సంవత్సరాల క్రితం ఒక  వీధికుక్క దీనస్థితిని చూసి, దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు అంజలి కకటి. ఆ తరువాత కూడా గాయపడిన  మరో శునకాన్ని ఎక్కడో చూసి ఇంటికి తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే దీనస్థితిలో ఉన్న వీధి శునకాల కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు అంజలి. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘ఈచ్‌ వన్‌ ఫీడ్‌ వన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ.

 దక్షిణ ఢిల్లీలో ఏర్పాటైన  ఈ ఎన్జీవో ‘డెలివరీ బైకు’ అనే సరికొత్త విధానంతో వీధిశునకాలకు ఆహారం అందిస్తుంది. బెక్‌పై ఉన్న వ్యక్తికి ఎక్కడ వీధిశునకాలు కనిపించినా తన దగ్గర ఉన్న ఆహారాన్ని అందించి వాటి ఆకలి తీరుస్తాడు. ఎఫ్‌ఐఎస్‌ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్న అంజలి తన జీతంలో 80 శాతాన్ని ‘ఈచ్‌ వన్‌...’ కోసం వినియోగిస్తు న్నారు. తనకు తెలిసిన మిత్రుల నుంచి కూడా నిధులు సేకరిస్తున్నారు. ‘ఈ నెల ఇంత బడ్జెట్‌’ అని ఏ నెలకు ఆ నెల అనుకుంటున్నప్పటికీ... ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గాయపడిన శునకాన్ని తీసుకువస్తుంటారు. ఇలా ఆకస్మికంగా వచ్చిన శునకాలతో ఖర్చు పెరుగుతుండడాన్ని గమనించిన అంజలి ‘ఎమర్జెన్సీ ఫండ్‌’ ఏర్పాటు చేశారు.

 కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశంలోని  ఇతర ప్రాంతాలలో కూడా వీధిశునకాల కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నారు అంజలి. పక్షవాతానికి గురైన ఒక వీధిశునకానికి రకరకాలుగా సపర్యలు చేసి, అది మళ్లీ పరుగెత్తేలా చేశారు. ఈ ఆనందం తనకు ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని ఇస్తుంది అంటారు. గాయపడిన శునకాలను గుర్తించడానికి సహాయబృందాలను, తక్షణ వైద్యసేవలు అందించడానికి మినీ అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంజలి.కెరీర్‌లో పరుగులు తప్పా మరో ఆలోచన లేని యుతకు అంజలి ఆదర్శంగా నిలిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement