ధనుర్దాసుకు జ్ఞానోదయం | Enlightenment of wealth | Sakshi
Sakshi News home page

ధనుర్దాసుకు జ్ఞానోదయం

Published Sun, Mar 25 2018 1:04 AM | Last Updated on Sun, Mar 25 2018 1:04 AM

Enlightenment of wealth - Sakshi

శ్రీరంగనాథుని దేవాలయంలో సుపాలనా వ్యవస్థలను నిర్ధారించి నిక్కచ్చిగా అమలు చేయాలన్నది రామానుజుల సంకల్పం. అందరితో కలిసి మెలసి మెలుగుతూ త్యాగధనులై ఉంటూ ప్రతిప్రాణి పట్ల దయ కలిగి ఉండే మహనీయుడు కనుక అందరినీ ఒక్కొక్కరినే మార్చుతూ ముందుకు వస్తున్నారు రామానుజులు. ఆలయం పైన అధికారం చేతిలో ఉన్న వారిని కూడా సక్రమమార్గంలో పెట్టడానికి ఎవరూ నొచ్చుకోని మార్గాలను రామానుజులు అన్వేషిస్తున్నారు. ఆలయ అధికారాల తాళాలు చేతిలో ఉన్న ప్రధాన ధర్మాధికారి తిరువరంగత్తముదనార్‌ యువకుడు, సంపన్నుడు. అధికారం తలకెక్కింది. ఉత్తమవంశజుడైనా భజనపరుల మధ్య తిరుగుతూ విలాసాలకు అలవాటు పడ్డాడు. విద్యాధికుడే అయినా దురలవాట్లకు లోబడి ఆలయ ధర్మానికి దూరం కావడం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చివరకు దైవాన్ని కూడా నిరాదరించే స్థాయికి ఆయన వ్యవహారాలు పెరిగాయి. ఈ అముదనార్‌ను ఏ విధంగా మార్చాలా అని రామానుజులు ఆలోచిస్తున్నారు.   ఒకరోజు అముదనార్‌ తల్లిగారు పరమపదించారు. పదకొండోరోజున నిర్వహించే క్రియాకర్మల నిర్వహణకు భోక్తలుగా స్వాముల అవసరం వచ్చింది. కాని స్వాములు ఆ కార్యక్రమాలు జరిపించడానికి రావడానికి ఇష్టపడరు. ఆ మంత్రాలు తెలిసి శ్రద్ధగా కార్యం నిర్వహించే వారు ఎందరో రామానుజుల శిష్యకోటిలో ఉన్నారు. కనుక వారిలో కొందరిని పంపాలని రామానుజుడిని అభ్యర్థించారు. కురేశుల నాయకత్వంలో కొందరిని వెళ్లమన్నారు. మాతృదేవత కార్యక్రమాలను పద్ధతి ప్రకారం జరపాలని, తృప్తి చెందారా అని అడిగినప్పుడు ఏం కోరాలో చెప్పి పంపారు. కురేశులు వెళ్లారు, వారి బృందం పద్ధతి తప్పకుండా అముదనార్‌ మాతృకార్యం నిర్వహించారు. అముదనార్‌ చాలా సంతోషించారు. గృహస్తుడి ధర్మాన్ని పాటించి చందన పుష్పాలతో స్వాములను సత్కరించి, వారికి నమస్కరించి తరువాత ‘‘తృప్తాస్థా?’’ అని అడిగారు. 

అందుకు ప్రతిస్పందనగా ‘‘తృప్తోస్మి’’ అని చెప్పడం పరిపాటి. కాని కురేశులు ఏమీ మాట్లాడలేదు.‘‘స్వామీ! మీకేమయినా అసంతృప్తి కలిగించానా, ఇంకా ఏదయినా కావాలనుకుంటున్నారా, మీకు చేసిన సన్మానం మీకు సంతోషం కలిగించలేదా?’’ అని అముదనార్‌ అడిగారు. కార్యం నిర్వహించిన స్వాములు సంతృప్తులు కాకపోతే మాతృదేవత ఆత్మ సంతృప్తి చెందబోదని విశ్వసిస్తారు. కనుక అముదనార్‌ ఆందోళన చెందారు. కురేశులు చాలాసేపు మౌనం పాటించడం భరించలేకపోయారు. ‘‘మీకేం కావాలన్నా ఇస్తాను దయచేసి అడగండి, వెనుకాడకండి’’ అని పదే పదే ప్రార్థించారు.  ‘‘మీ దగ్గరున్న ఆలయ అధికారాలు మా చేతికి ఇవ్వండి. ఆలయ తాళం చెవులు అప్పగించండి. అదే మేము కోరుకునేది’’ అన్నారు కురేశులు. దీని వెనుక రామానుజుల వారి వ్యూహం ఉందని అర్థమైంది. అముదనార్‌ మారుమాట మాట్లాడకుండా తాళాలు తెచ్చి ఇచ్చారు. కురేశులు తృప్తోస్మి అన్నారు.రామానుజులను కలిసి తిరువరంగత్తముదనార్‌ తన ఆలయ అధికారాలను పూర్తిగా ఆయనకు అప్పగించారు. కురేశులు, రామానుజులు మాత్రం ఆయన్ను వదలలేదు. ఆయనలో లోపాలను సరిదిద్ది ఆలయ విధులు సర్వసమానతా సిద్ధాంతాలతో అమలు చేసేందుకు ఆయన్ను సిద్ధం చేసి ఉత్తమ పాలకుడిగా మార్చేశారు. తాను, తన అధికారమే అన్నీ అనుకున్న అముదనార్‌ తనకు రామానుజులే సర్వస్వమని చిత్తశుద్ధితో భావించి ఆయన శిష్యరికంలో అనేక రచనలు సాగించారు. రామానుజులను 108 తమిళ గీతాలతో ప్రస్తుతించారు. ఈ పాశురాలను ఇరామానుశ నూత్తందాది అని పిలుస్తారు.

ధనుర్దాసు
ఉఱైయూర్‌ (నిచుళాపురం)లో ఉండే ధనుర్దాసు గొప్ప విలువిద్యా నిపుణుడు. మల్లుడు కూడా. పోరాట కళల్లో అతణ్ని మించిన వాడు లేడు. ఆయనకు కనకాంబ అనే అతిలోక సుందరి ప్రియురాలు. ఆమె అందాన్నే నిరంతరం ఆరాధిస్తూ, ఆమె నేత్ర సౌందర్యాన్ని చూస్తూనే ఉండే వాడు. ఆమె ప్రియుడిని ఓ కోరిక కోరింది. శ్రీరంగనాథుని చైత్రోత్సవం తప్పక చూడాలని, కనుక ఆ రోజుల్లో శ్రీరంగం వెళ్తానంది.‘‘నీతోపాటే నేనూ’’ అంటూ ధనుర్దాసు బయలుదేరాడు. ఇద్దరూ శ్రీరంగం పక్కనే ఉన్న కావేరీ నదీ తీరానికి చేరుకున్నారు. అప్పుడే శ్రీరంగనాథుడి ఉత్సవ విగ్రహాలకు తిరుమంజనం జరుగుతున్నది. పైన ఎండ మండిపోతున్నది. ఇసుకలో కనకాంబ నడుస్తూ ఉంటే సూర్యతాపానికి ఆమె కందిపోకుండా ధనుర్దాసు ఆమెనే చూస్తూ వెనకకు నడుస్తూ గొడుగు నీడ తప్పకుండా కాపాడుతున్నాడు.ధనుర్దాసు కనకాంబ సౌందర్యారాధన చూసి శిష్యులు నవ్వడం రామానుజులు గమనించారు. విషయం తెలుసుకున్నారు. ‘‘మీలో ఒకరు వెళ్లి నేను రమ్మన్నానని చెప్పి ధనుర్దాసును నా వద్దకు తీసుకురండి’’ అని ఆదేశించారు. రామానుజుని కరుణారసదృష్టి ధనుర్దాసును ఆకట్టుకున్నది. నమస్కరించాడు. రామానుజులు అతడిని ప్రేమతో పలకరించాడు. కాసేపు కుశల ప్రశ్నల తరువాత, ‘‘ధనుర్దాసూ! లోకమంతా చూస్తున్నా పట్టించుకోకుండా నీ భార్య కన్నులనే చూస్తున్నావట. నిజమేనా.. నీకు సిగ్గనిపించడం లేదా?’’ అని అడిగారు. 

‘‘స్వామీ సన్యాసులు మీరు, మీకు ఆ లావణ్యవతి నేత్రాల సౌందర్యశక్తి గురించి ఏ విధంగా చెప్పడం? మీకు చెప్పగలిగేంత తెలివి నాకు లేదు స్వామీ. ఎండలో ఆమె కందిపోతే నేను తట్టుకోలేను కనుక గొడుగు పడుతున్నాను స్వామీ. నిజానికి శ్రీరంగ చైత్రోత్సవాలు చూడాలన్న ఆమె కోరికపైనే మేమిద్దరమూ ఇక్కడికి వచ్చాము. గొడుగు పట్టుకుని భార్యాభర్తలు నడవడం కూడా తప్పేనా స్వామీ..’’ ‘‘ఓహో! ఆమె నేత్రసౌందర్యమా నిన్ను కట్టిపడవేసింది. అంతకు మించిన నేత్రసౌందర్యమే లేదంటావా ధనుర్దాసూ..’’ అన్నారు రామానుజులు.‘‘లేదు. నాకు తెలిసినంత వరకు నా భార్యను మించిన సౌందర్యవతి, లావణ్యమూర్తి లేదనే అనుకుంటున్నాను.’’ అన్నాడు. ‘‘అంతకుమించిన నేత్ర సౌందర్యం ఉంది. అది నువ్వు ఒక్కసారి చూడాలి’’ అని స్వామి ప్రేమతో అంటూ ఉంటే ధనుర్దాసు కాదనలేకపోయాడు.‘‘సరే స్వామీ! చూస్తాను మీమాట ఎందుకు కాదనాలి. చూపండి.’’ అన్నాడు ధనుర్దాసు. శ్రీరంగని గర్భాలయంలోకి వెంట తీసుకువెళ్లినాడు ఆచార్యుడు. జగదేక సుందర విశ్వరూపమై, అఖిల భువనాధీశుడు అలవోకగా శేషశయ్యపై వయ్యారంగా శయనించి చిరునవ్వులు చిందిస్తూ, కన్నుల నిండా కరుణను కురిపిస్తూ... క్రీగంట విశ్వాన్నే శాసించే ఆ అద్భుత సౌందర్యమూర్తి కలువ కన్నులను చూసిన తరువాత ధనుర్దాసుకు మరేమీ కనిపించడం లేదు. రామానుజుడు తలచినట్టే జరిగింది. శ్రీరంగని కరుణామయ దృక్కులు ధనుర్దాసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

భగవంతుడితో భక్తుడి అనుసంధానం జరిగింది. శిష్యుడిని ‘‘శ్రీరంగనాథ కృపా కటాక్ష సిద్ధిరస్తు’’ అని ఆశీర్వదించారు. ‘‘ఏమంటావు ధనుర్దాసూ’’ అని అడిగితే ‘‘ఏమనగలను స్వామీ, నా అజ్ఞానం పటాపంచలు చేశారు. అద్భుతమైన శాశ్వతమైన సౌందర్యాన్ని దర్శింపచేసి పుణ్యం కట్టుకున్నారు. నన్ను నిరంతరం ఈ స్వామికి సేవచేసుకునే భాగ్యం కల్పించండి స్వామీ ’’ అని పాదాలపై పడ్డాడు ధనుర్దాసు. ‘‘అదేం భాగ్యం. మాతోనే ఉందువుగాని, మాతోపాటు శ్రీరంగని ఆరాధింతువుగాని లే నాయనా’’ అని లేపారు స్వామి. అతనికి పంచసంస్కారాలు జరిపించి, దివ్యమంత్రోపదేశం చేసి శిష్యకోటì లో చేర్చుకున్నారు. తన భర్తను తనకు దూరం చేస్తారేమోనని భయంతో కనకాంబ పరుగెత్తుకుంటూ వచ్చింది. స్వామి పాదాలు పట్టుకుని ‘‘నా గతేమిటి స్వామీ’’ అని విలపించింది. ‘‘నీకేం లోటు తల్లీ. నీ భర్తతో నీవూ ఇక్కడే ఉండు. నీ భర్తకు సన్యాసం ఇవ్వడం లేదు. ఇద్దరూ కలిసి స్వామికి సేవ చేయండి. తరించండి. సరేనా’’ అని ఆమెను ఆశీర్వదించారు. విశిష్టాద్వైత సిద్ధాంతాల ఆచరణలో రామానుజుల వారికి ధనుర్దాసు కులం ఎక్కడా అడ్డురాలేదు. రామానుజుని అనుంగు శిష్యుడు కావడానికి ధనుర్దాసు అంకిత భావం చాలని రామానుజులు తన మాటల ద్వారా చేతల ద్వారా చాటి చెప్పారు. భగవంతుడి సేవ చేయడానికి, వైష్ణవమతానికి, ముక్తిమార్గానికి, జ్ఞానమార్గానికి కేవలం ఆర్తి ఒక్కటే అర్హత అని రామానుజుడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. రామానుజుడు కావేరీ స్నానానికి వెళ్తున్నపుడు దాశరథి భుజంపై చేయి వేసేవాడు. స్నానం తరువాత ధనుర్దాసు భుజాన్ని ఆసరాగా తీసుకుని పైకి నడిచేవాడు. స్నానం తరువాత శూద్రుడిని ఎందుకు తాకుతున్నారని శిష్యులు ప్రశ్నించారు. రామానుజుడి సమాధానం: 

‘‘జన్మతః వచ్చిన కులం కన్న జ్ఞానకులం శ్రేష్ఠమయినది. విద్య, ధనం, కులం మనుషుల్లో మదాన్ని కలిగిస్తుంది. కాని బుద్ధిమంతుడైతే కులం, విద్య, ధనం ప్రభావం ఆ వ్యక్తిపైన ఉండనే ఉండదు. మనం తేల్చుకోవలసింది మనం బుద్ధిమంతులమా కాదా అని మాత్రమే. మన ఆళ్వారులతో సమానమైన ప్రేమాభిమానాలు పెరుమాళ్లపైన ధనుర్దాసుకు ఉన్నాయి. అదే అతని ఔన్నత్యానికి కారణం. దాన్ని మీకందరికీ తెలియజేయడం కోసమే నేను స్నానం తరువాత ధనుర్దాసు భుజంపై చేయివేసి నడుస్తున్నాను.’’ఈ సమాధానంతో పైకి సిగ్గుపడినట్టు కనిపించినా శిష్యులు మారతారని, తృప్తి చెందుతారని రామానుజులు అనుకోలేదు. రోజూ ఉతికి ఆరవేసుకునే తన శిష్యుల ధోవతుల నుంచి ఒక ముక్క చించి తీసుకురమ్మని తన అంతరంగిక శిష్యుడొకరిని ఆదేశించారు ఆచార్యులు. అతను ధోవతులన్నీ చింపాడు. మరునాడు లేవగానే చినిగి ఉన్న ధోవతులను చూసి ఒకరినొకరు నిందించుకుంటూ తిట్టుకుంటూ కొట్లాడుకున్నారు. వారు ఉపయోగించిన భాష వారి కులానికి, చదువుకు తగినట్టు లేదని స్పష్టంగా తెలిసింది, వారితో సహా. ఆచార్యుడు జోక్యం చేసుకుని వారిని శాంతపరిచారు. ధనుర్దాసు ఆ పనిచేయించాడేమో అని కొందరు అనుమానించారు. ధోవతులు చిరిగినందుకు పరితపిస్తున్న శిష్యులలో కొందరిని పిలిచి ‘‘ధనుర్దాసు ప్రస్తుతం నా ఆశ్రమంలోనే ఉన్నాడు. కనకాంబ నిద్రిస్తున్న సమయం చూసి ఆమె ఆభరణాలను ఎవరికీ తెలియకుండా తీసుకుని రండి. మరొక విషయం. మీరు అక్కడే ఎక్కడైనా దాక్కుని ఆభరణాల దొంగతనం గురించి ధనుర్దాసు, కనకాంబ ఏం మాట్లాడుకుంటారో, ఏం చేస్తారో చూసి నాకు చెప్పండి’’ అని చెప్పారు. ఆ శిష్యులు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి గురువుగారు దొంగతనం చేయమంటున్నారు అని. అయినా ధనుర్దాసు మీద ప్రతికూల భావాలతో ఆ పనిచేయడానికి ఉద్యుక్తులైనారు.
 
భర్త ఏ రాత్రయినా వస్తాడని కనకాంబ తలుపు గడియ వేయలేదు. నిద్రిస్తున్నది. ఇంతలో అలికిడి అయింది. రామానుజ ఆశ్రమానికి చెందిన వైష్ణవులు వచ్చారని అర్థమైంది. కళ్లు మూసుకుని గమనిస్తూ ఉంది. ఆమె ఒకవైపు ఒత్తిగిలి పడుకున్నది. శిష్యులు పైకి కనబడే ఆభరణాలను ఒకటొకటే ఒలిచివేస్తున్నారు. కాసేపయిన తరువాత కనకాంబ అటువైపు తిరిగింది. నిద్రలేచిందనుకుని భయపడి వారు బయటకు వెళ్ళిపోయి కిటికీల దగ్గర దాక్కున్నారు. ధనుర్దాసు అంతలో ఇంటికి చేరుకున్నాడు. ఒంటిపైన ఒక వైపే ఆభరణాలతో వింతగా ఉన్న కనకాంబను చూసి ఇదేమి అవతారం అన్నాడు ధనుర్దాసు. జరిగిన విషయం చెప్పిందామె. ధనుర్దాసు: గురువుగారి శిష్యులు వచ్చారా. వారికి ఏదో అవసరం ఉండి ఉంటుంది. అయినా  నీవు కదలకుండా ఉండాల్సింది అప్పుడు వారే ఏదో విధంగా మిగిలిన నగలూ తీసుకునే వారు కదా!కనకాంబ: నిజమే. కాని నేను వారిని భయపెట్టేందుకు కదల్లేదు. ఇటువైపు నగలు కూడా తీసుకునేందుకు వీలుంటుందని నెమ్మదిగా అటు తిరిగాను. కాని వారు వెళ్లిపోయారు. ధనుర్దాసు: మన గురువుగారి బోధలు మరిచిపోయావా కనకాంబా.. భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల మనం స్వతంత్రంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా భాగవతుల పట్ల స్వతంత్రంగా వ్యవహరించడం తప్పు. నీవు కాస్త ఆలోచించాల్సింది కదూ!కనకాంబ: అవును పొరబాటైంది. వారికేమి కష్టాలున్నాయో ఏమో. ధనం అవసరం ఉండి ఉంటుంది. ఏం చేద్దాం. గురువుగారికి తీసుకువెళ్లి ఇద్దామా?ధనుర్దాసు: ఏమో కనకాంబా నాకేమీ తోచడం లేదు. భాగవతులకు ఉపకరించని ఈ సంపద మనకెందుకు. బాగా రాత్రయింది. రేపు కావేరీ స్నానానికి వెళ్లే సమయంలో గురువుగారిని క్షమించమని అడుగుతాను. అంతా భగవదేచ్ఛ. ఆచార్యుని ఆజ్ఞ. శిష్యులు పరుగెత్తుకుంటూ వెళ్లి జరిగినదంతా గురువుగారికి పూసగుచ్చినట్టు వివరించారు.రామానుజ: ఇప్పుడు చెప్పండి. ధోవతి చింపుల కోసం కొట్లాడుకున్న మీరు ఈ వైపు, నగలు ఇంకా ఇవ్వలేకపోయామే అని పరితపిస్తున్న ధనుర్దాసు ఆ వైపు. నేను ఎవరి మీద ఆధారపడాలో మీరే చెప్పండి. ఎవరు వైష్ణవాన్ని, భాగవత సేవా వైభవాన్ని, త్యాగగుణాన్ని అనుసరిస్తున్నారో మీరే చెప్పండి. ఎవరు పవిత్ర భావాలతో ఉన్నారు? ఎవరిది మడి? ఎవరిది అశుచి? నేను స్నానం తరువాత తాకవలసిన పవిత్రుడెవరు?వారంతా రామానుజుని పాదాలపై పడి తమ అజ్ఞానాన్ని మన్నించమని కోరారు. ‘‘సరే.. ఈ నగల మూట వారికే అప్పగించి రండి’’ అని వారిని పంపించారు. కనకాంబ ఆ నగలు చూసి ఏం చేయాలో తెలియక భర్తను చూసింది. తీసుకోవాలో వద్దో? ధనుర్దాసు మరోసారి అడిగాడు.. ‘‘నిజంగా గురువుగారే పంపించారా? నన్ను ఈ నగలు తీసుకొమ్మని ఆదేశించారా?’’ అని. అవునన్నారు శిష్యులు. తాను స్వతంత్రుడిని కాదనీ గురువు పట్ల పరతంత్రుడినని వారి ఆదేశాలు తప్పబోనని చెప్పి నగలు తీసుకున్నారు. ఈ సంఘటనను కల్పించి శిష్యులకు బుద్ధి చెప్పడానికి గురువుగారు సంకల్పించారని తెలిసి, రామానుజుడే తమకు సర్వస్వం అని నిశ్చయించుకుని, తమ పట్ల వారికి గల అభిమానానికి ఆనందంగా మాట్లాడుకుంటూ ఆ రాత్రి గడిపారు ఆ దంపతులు. 
రామానుజ మార్గం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement