ramanjulu
-
నెరవేరిన మూడో ప్రతిజ్ఞ
నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ద్రావిడ వేదాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లడం మరో యజ్ఞం. అదే యామునులకు రామానుజులు ఇచ్చిన మూడో వాగ్దానం. యామునుల మరో శిష్యుడు తిరుమాలై ఆండాన్. ఆయనను అనుసరించి రామానుజులు తిరువాయిమొళి ప్రబంధ అధ్యయనంపై సాధికారికమైన కృషి చేశారు. అందులోని తత్వ గాంభీర్యాన్ని వెలికి తీసి విశేషార్థాలను వివరించి రామానుజులు చెప్పేవారు. ఆండాన్ నుంచి ప్రత్యక్షంగా తిరువాయిమొళి వ్యాఖ్యానాన్ని ఆమూలాగ్రంగా చదివి నిష్ణాతులైనారు రామానుజులు. యామునుల మరో శిష్యరత్నం శ్రీవరరంగాచార్యులు. వారికి తిరువరంగప్పెరుమాళ్ అఱైయర్ అని మరో పేరు ఉంది. నాలాయిర దివ్య ప్రబంధగానంలో ఈయన నిష్ణాతుడు. వారి నుంచి ప్రత్యక్షంగా నాలుగువేల పాశురాల అర్థాన్ని నేర్చుకున్నారు రామానుజులు. ఎంత ఏకసంథాగ్రాహి అయినా గురుముఖతః వినయంతో విద్య నేర్చుకోవాలని రామానుజులు ఆ విధంగా ఆచరించి తరతరాలకు ప్రబోధించారు. శ్రీవిష్ణు పురాణానికి సమంగా ఆరువేల సంఖ్యతో అలరారే విధంగా తిరువాయిమొళికి వ్యాఖ్యానాన్ని రచించమని తిరుక్కురుగై పిరాన్ పిళ్లాన్ అనే తన శిష్యుడిని ఆదేశించారు. అదే ఆరాయిఱప్పడి (ఆరువేల శ్లోకాల సంపుటి). ఇది ద్రావిడవేదానికి తొలి భాష్యం. ఆ తరువాత మరికొందరు ఆచార్యులు తిరువాయిమొళిపై ఇదేబాటలో మరో నాలుగు వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. ఆరువేల పద్యాలున్న ఆరాయిఱప్పడి తరువాత మిగిలిన నాలుగువేల పాశురాలపైన కూడా వ్యాఖ్యానాలు రావడానికి ఈ గ్రంథం ప్రేరణ అయింది. అదే విధంగా వేదాంతసారాన్ని కూడా రామానుజులు తన శ్రీభాష్య రచన ద్వారా సామాన్యీకరించారు. తమిళ సంస్కృత వేదాల అధ్యయనం చేసిన వారిని ఉభయ వేదాంత ప్రవక్త అని సంబోధిస్తారు. అటువంటి ఉభయవేదాంత ప్రవక్తలు ఎందరో రామానుజుల శిష్యకోటిలో ఉన్నారు. ఆ విధంగా రామానుజుడు యామునాచార్యుల మూడో వాగ్దానాన్ని కూడా పూర్తి చేశారు. రామానుజుల ఆచార్యత్వంలో వేలాది శిష్యులు నాలుగువేల పాశురాలను నేర్చుకుని ప్రతి ఆలయంలో గానం చేస్తూ మంగళా శాసనం పలుకుతూ ఉన్నారు. ప్రతి ఆలయం తిరువాయిమొళి పారాయణాలతో ప్రతిధ్వనిస్తున్నది. రామానుజ కూటములు ప్రతి ఊళ్లో ఏర్పడ్డాయి. కులమత భేద రహితంగా అందరికీ భోజనం పెట్టే సత్సంప్రదాయాన్ని రామానుజులే ప్రారంభింపచేశారు. ఆ రామానుజ కూటములలోనే ద్రవిడ వేద పారాయణం కూడా సాగుతూ ఉండేది. ఆ విధంగా ఊరూరా వాడవాడలా ఇంటింటా ద్రవిడవేదం ప్రతిధ్వనించింది. వైష్ణవం ప్రకాశించింది. శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీవైకుంఠ గద్య అనే మూడు గద్యములను (గద్యత్రయం) రామానుజులు రచించారు. ప్రపన్నుడు ప్రతిదినం భగవంతుడి గురించి ఏ విధంగా చింతించాలో ధ్యానించాలో ఆయన ఈ మూడు అద్భుత రచనల్లో వివరించారు. మనలో అహంకారాన్ని తొలగించుకుని, సాధారణ అల్ప జీవులమన్న నిజాన్ని గుర్తించి అందరికన్న తక్కువ అనే నైచ్యానుసంధానాన్ని వివరించి, జగన్నాథుడిని ఆశ్రయించే పద్ధతులను సామాన్యులకు కూడా అందే రీతిలో ఈ గ్రంథాలు తెలియజేశాయి. జగన్నాథుడి ప్రేమ రామానుజుడు ఉత్తరదేశ యాత్ర కొనసాగిస్తూ పూరీ జగన్నాథ క్షేత్రం చేరుకున్నారు. అది పురుషోత్తమ క్షేత్రం. అతి పవిత్రమైన నారాయణ స్థానం. అన్నధామం. జగన్నాథుడు మట్టికుండల్లో వండిన ఆహారాన్ని భుజించే సామాన్యుడు. అందరికీ అందుబాటులో ఉండే సౌశీల్యుడు. అక్కడ రామానుజ మఠాన్ని స్థాపించారు. అక్కడ పూజా వ్యవహారాలలో అవకతవకలు శాస్త్ర వైరుధ్యాలు కనిపించాయి. వాటిని సరి చేద్దామనుకున్నారు. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో అర్చనాది కార్యక్రమాలను క్రమబద్ధం చేద్దామనుకున్నారు కానీ అక్కడి పండాలు అందుకు అంగీకరించలేదు. మరునాటి నుంచి ఈ కొత్త విధానాలు ప్రవేశ పెట్టాల్సిందే అని నిర్దేశించారు. ప్రేమతో మాకు వచ్చిన రీతిలో మాకు నచ్చిన రీతిలో నిన్ను పూజిస్తాము కానీ మాకీ కొత్త పద్ధతుల్లో వాత్సల్యం కనిపించడం లేదు మాకొద్దు ఈ పద్ధతి అని జగన్నాథ భక్తులు తమ దేవున్ని వేడుకున్నారు. ఆ రాత్రి జగన్నాథ క్షేత్రంలో నిద్రించిన రామానుజుడు మరునాడు శ్రీకూర్మంలో నిద్రలేచారు. శ్రీకూర్మమా? శివలింగమా? శ్రీరామానుజులు కళ్లు తెరిచే సమయానికి ఎదురుగా ఒక మహాలింగం నెలకొన్న ఆలయం ఉంది. త్రిశూలాలు పట్టుకున్న వారు చుట్టూ చేరి శివనామ స్మరణ చేస్తున్నారు. తన వెంట శిష్యులు లేరు. తన ఆరాధనా సామగ్రి లేదు. పెరుమాళ్ల పెట్టె లేదు. తిరుమణి పెట్టె లేదు. ఇప్పుడు ఏం చేయడం. తన నిత్యానుష్ఠాన కార్యక్రమానికి అవరోధం ఏర్పడినట్టేనా. నిరాహారంతో పరమాత్ముడిని ధ్యానం చేస్తూ గడిపారు. స్వామీ ఏమిటీ పరీక్ష అని మనసు దైవాన్ని ప్రశ్నిస్తున్నది. అంతలో ఒక అంతర్వాణి అశరీరవాణి వినిపించింది. ‘‘రామానుజా..నీ ముందున్న ఆలయంలో మహాదేవుడు కాదు, మహాకూర్మం ఉంది. ఆ ఎదురుగా ఉన్న పుష్కరిణి నా పాల సముద్రమే. తిరుమన్ను లేదనే కదా నీ బాధ. ఆ పుష్కరిణి చుట్టూ ఉన్నదంతా తిరుమణే’’ అని వినిపించింది. తరచి చూస్తే ఆ విషయం నిజమని అర్థమైంది. అక్కడ పురుషోత్తమపురం పూరీలో రామానుజుని శిష్యులు గురువుగారు కానరాక ఆందోళన పడ్డారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారికి కనిపించి ‘‘మీ గురువుగారు శ్రీకూర్మంలో ఉన్నారు. వెళ్లండి వెళ్లండి’’ అన్నారు. వారు వెంటనే బయలుదేరి రామానుజులను చేరుకున్నారు. శ్రీకూర్మంలో ఉన్నది మహాకూర్మమే కానీ మహాలింగం కాదని రామానుజులు అనేక ప్రమాణాలు చూపారు. అనేక పురాణాలు స్థలపురాణంలోని భాగాలు వివరించి, ఆలయంలో శ్రీకూర్మపు జాడలు ప్రత్యక్షంగా చూపినారు. అయినా అక్కడి అర్చకులు ఒప్పుకోలేదు. ఆ దేవుడు శివుడనే వాదించారు. సరే అయితే ఈ రాత్రి తలుపులు మూసి రేపు తెరుద్దాం. శ్రీ కూర్మనాథుడు శివలింగమే అయితే ఎట్లున్నది అట్లే ఉండును. శ్రీకూర్మావతారుడైతే ఈ మూర్తి పడమర వైపు తిరుగుగాక అన్నారు. అందుకు అర్చకులు ఒప్పుకున్నారు. రాత్రి గుడి తలుపులు మూసివేశారు. మరునాటికి పడమటవైపు తిరిగి తానే శ్రీకూర్మనాథుడినని, హరిననీ నిరూపించుకున్నారు స్వామి. అప్పటికే తూర్పుదిశలో అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. వైష్ణవ క్షేత్ర పాంచరాత్రాగమ విధానం ప్రకారం మూలస్వామి ఎటువైపు చూస్తూ ఉంటే అటువైపే (అంటే ఇక్కడ పడమరవైపు ముఖం ఉంటే అటువైపే) ధ్వజస్తంభం ఉండాలని, అక్కడ మరో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టింపచేశారు రామానుజుడు. ప్రపంచంలో రెండు ధ్వజస్తంభాలున్న మహాక్షేత్రం శ్రీకూర్మం ఒక్కటే. అక్కడి నుంచి సింహాచలం చేరుకున్నారు రామానుజులు. సింహాచలంలో రామానుజులు ద్వయరూపంలో హరి నెలకొన్న పుణ్యక్షేత్రం సింహాచలం. వరాహ నరసింహుడాయన. దశావతారాల్లో మూడో అవతారమైన వరాహరూపంలో ముఖం ఉంది. నిలబడినది నరుని తీరు. కొండ సింహం ఆకారంలో ఉంటుంది కనుక సింహాచలం. మొత్తంగా ఆయన వరాహ, నర, సింహుడు. కూర్మం నుంచి వరాహమై, నరసింహమై ఆ తరువాత వామనుడు, పరశురాముడు, రాముడనే పరిపూర్ణ మానవుడిగా పరిణమించబోతున్న క్రమానికి ఒక విచిత్ర సంధి దశ సింహాచలాధీశుడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల హింసకు జ్వలిస్తున్న కోపాన్ని తగ్గించుకోవడానికి ఆయన నిరంతరం చందనంలో మునిగి శాంత స్వరూపంగా ఉంటారు. అక్కడ శ్రీ కృష్ణమాచార్యులనే కవి, సంగీత విద్వాంసుడు మహాభక్తుడు ఉన్నారు. ఆయన గానం వినడానికి నరసింహుడు స్వయంగా వచ్చి పాటకు తగ్గట్టు లయబద్ధంగా నృత్యం చేసేవాడు. ప్రతిరాత్రి ఈ భక్తుడు ఆ భగవంతుడు కవితా గాన మృదంగ నృత్య కార్యక్రమాలతో గడుపుతారు. వారి నిలయానికి చేరి రామానుజులు కృష్ణమాచార్యులకు నమస్కరించారు. ఆయన ప్రతి నమస్కారం చేయకుండా ‘క్షేమమే కదా’ అని పలకరించారు. ‘‘మీ దయవల్ల, హరి అనుగ్రహం వల్ల అంతా క్షేమమే స్వామీ. నాదొక మనవి. వరాహ నరసింహుని ఆంతరంగికులైన మీరు ఈసారి పెరుమాళ్లతో ముచ్చటించినప్పుడు శ్రీరంగం నుంచి వచ్చిన (తనను చూపుతూ) ఈ సన్యాసికి మోక్షం ఉందో లేదో కనుక్కోవాలని ప్రార్థన’’ అని వినయంగా చెప్పుకున్నారు. ‘ఓ అదెంత పని...సరే’నన్నారాయన. ఆ రాత్రి నరసింహుని ముందుంచారు ఈ సందేహాన్ని. ‘‘ఆ సన్యాసికి తప్పక మోక్షం లభించగలదు. ఆయనకే కాదు కృష్ణమాచార్యా.. ఆయన ఎవరికి మోక్షం ఉండాలని చెబితే వారికి కూడా మోక్షం ఉండగలదు’’ అన్నారు హరి. ‘ఓహో సన్యాసి సామాన్యుడు కాడ’న్నమాట అనుకున్నారు కృష్ణమాచార్య. మరునాడు రామానుజుడు కలిస్తే ఈ విషయం చెప్పారు. ఆయన చాలా సంతోషించి ‘‘స్వామీ నా సంగతి సరే మీ మోక్షం గురించి కూడా కనుక్కున్నారా, కనుక్కునే ఉంటారు లెండి’’, అని రామానుజులు వాక్యాన్ని మధ్యలోనే ఆపారు. ‘నాకు మోక్షం లేకపోవడమా, నా సంగీతానికి నాట్యం చేసే హరి నాకు మోక్షం ఇవ్వడా? అయినా సరే అడుగుదాం’ అని మనసులో అనుకున్నారు. ఆ రాత్రి హరిని అడిగితే నవ్వి ఊరుకున్నారు. ‘భగవాన్ ఏమిటిది? నాకు నిత్యదర్శనం ఇచ్చే భాగ్యం కలిగించిన మీరు మోక్ష భాగ్యం ఇవ్వడం లేదా?’ అని ఆందోళనగా అడిగారు. ‘‘అది నీవు ఇప్పటిదాకా అడుగనే లేదు కదా కృష్ణమాచార్యా. నీ పాటకు మృదంగానికి నా ఆట సరిపోయింది కదా. అయినా ప్రస్తుతం మోక్షం ఇచ్చే అధికారం ఆ శ్రీరంగం సన్యాసికే ఉంది. నీవు మోక్షార్థివే అయితే ఆయన్ను ఆశ్రయించాల్సిందే’’ అని నరసింహుడు అనగానే కృష్ణమాచార్యులు ఆగ్రహోదగ్రులైనారు. తీవ్రకోపంతో ‘‘నీ గుడి ఏడు రాత్రులూ పగళ్లూ దగ్ధమైపోవు గాక.. ఈ గుడి శిఖరము నేలకూలుగాక’’ అని శపించారు. ‘‘అకారణంగా ఇంత తీవ్ర శాపమా, నీ కవిత్వం నీచుల పాలవుగాక’’ అని హరి ప్రతిశాపం ఇచ్చారు. తన కోపమే విధ్వంసానికి కారణమని అర్థం అయిన వెంటనే ఆయనకు పాదాక్రాంతులైనారు కృష్ణమాచార్య. ‘‘నీవు ఈ అహంకారాన్ని వదులుకుని అకారత్రయాన్ని (అనన్యార్హశేషత్వము, అనన్యశరణత్వము, అనన్యభోగత్వము) తెలుసుకున్నపుడే నీకు శాంతి, మోక్షం. రామానుజుని ఆశ్రయించడమే నీకు మార్గం’’ అని హరి అంతర్థానమైనారు. మరునాడు ఆయన రామానుజుని ఆశ్రమానికి వెళ్లి ‘‘నేను కృష్ణమాచార్యుడిని వచ్చానని చెప్పండి’’ అన్నారు. చెప్పారు. రామానుజులు ‘‘నేను చనిపోయిన తరువాత రమ్మన్నానని చెప్పండి’’ అని తిరిగి పంపించారు. ఆయన తరువాత ఎవరి దగ్గరికి వెళ్లాలి, దీని అర్థం ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే ‘‘నేను అంటే అహంకారం. అది ఛస్తేనే లోనికి అనుమతి’’. తన లోపమేమిటో తెలిసింది. కోపంతో పాటు లోపమూ పోతేనే గురువు ఆశ్రయం లభిస్తుంది. ఈసారి ఆయన కృష్ణదాసుడు వచ్చాడని చెప్పుకున్నాడు. చెప్పగానే లోనికి రమ్మన్నారు. రామానుజుని శిష్యులైనారు. సింహాచలంలో కొన్నాళ్లుండి రామానుజులు అక్కడి భక్తులకు తిరుమంత్రార్థాన్ని ఉపదేశించారు. ఆ మూలను హంస మూల అని పవిత్రభావంతో పిలుస్తారు. కొన్నాళ్ల తరువాత అక్కడి నుంచి బయలుదేరితే కృష్ణరామానుజ దాసు తానూ కూడా వస్తానన్నాడు. ‘‘ఇక్కడే ఉండి వరాహ నరసింహుని సేవించు’’ అని ఆదేశించి వెళ్లారు రామానుజులు. కృష్ణమాచార్యుని శాపం వల్ల తురుష్కులు దాడిచేసి దేవాలయాన్ని ఏడురోజుల పాటు కాల్చారట. గోదాగ్రజుడు... గోదాభీష్టుడు ఒకరోజు నాచ్చియార్ తిరువాయ్మొళికి వ్యాఖ్యానం చెబుతున్నపుడు తొమ్మిదవ తిరుమోళి లో ఆరు, ఏడో పాశురాలకు అర్థం వివరిస్తున్నారు రామానుజులు. సుందరబాహు స్వామికి నూరు పాత్రలలో వెన్నను, చక్కెర పొంగలిని సమర్పిసా ్తనని గోదాదేవి వాగ్దానం చేసినట్లు ఆ పాశురాల్లో ఉంది. కానీ గోదాదేవి ఆ మాట చెల్లించుకోలేక పోయారు. రామానుజులు ఆ వ్యాఖ్యానాన్ని అక్కడే నిలిపివేసి అప్పుడే శ్రీవిల్లి పుత్తూరుకు బయలుదేరి గోదాదేవి మొక్కిన విధంగా నూరు గిన్నెల వెన్నను, చక్కెరపొంగలిని సమర్పించారు. గోదాదేవి అభీష్టాన్ని పూర్తి చేసినందుకు రామానుజుడు గోదాదేవికి అన్న అయ్యారనే పేరు తెచ్చుకున్నారు. రామానుజ అష్టోత్తరంలో గోదాగ్రజాయనమః అనీ గోదాభీçష్టపూరకాయనమః అనీ నామాలను సంతరించుకున్నారు. వడుగనంబి రామానుజుని శిష్యులలో వడుగనంబికి రామానుజుని రూపమే దైవం. రామానుజుని పాదాలను తయారు చేయించుకుని సాలగ్రామంలో పెట్టి పూజించుకునే వాడు. శ్రీపాద తీర్థం మాత్రమే తీసుకునేవాడు. శ్రీరామానుజుల తిరువారాధన పెట్టెను నెత్తిన పెట్టుకుని రామానుజుల పాదుకలను చేతిలో పట్టుకుని ప్రయాణిస్తూ ఉండేవాడు. ఓ సందర్భంలో నీటి ప్రవాహం దాట వలసివచ్చినపుడు రామానుజుని ఆరాధన పేటికలోనే ఆయన పాదుకలను కూడా పెట్టి తీసుకుపోతుంటే నా దేవుడిమీద నా పాదాలు పెట్టడం నాకు పాపం కదూ అని అడిగారు రామానుజులు. మీకు మీ దేవుడెంతో మాకు నా దేవుడంతే స్వామీ... అనేవాడు. శ్రీరంగనాథుని ఊరేగింపు వస్తున్నది. రామానుజుడు శ్రీరంగనాథుని చూడడానికి మఠంలోంచి బయటకు నడుస్తూ ‘వత్సా నీవూ రా స్వామిని చూద్దాం’ అని పిలిచారు. అప్పుడు ఆయన రామానుజుల కోసం పాలు మరిగిస్తున్నారు. ‘మీ దేవుడి కోసం మీరు వెళ్లండి స్వామీ నా దేవుడి కోసం నేను పాలు మరగబెట్టుకోవడమే నాకు ముఖ్యం.’ అని జవాబిచ్చాడు. అతని గురుభక్తిని రామానుజులు చిరునవ్వుతో ప్రశంసించేవారు. వడుగనంబి రామానుజ అష్టోత్తరశత నామ స్తోత్రం రచించారు. అందులో చివరి శ్లోకం ఇది.యదాన్ద్ర పూర్ణేవ మహాత్మానేదం కృతం స్తుతం సర్వజనావనాయ, తజ్జీవ భూతం భువి వైష్ణవానాం బభూవ రామానుజ మానసానామ్ -
ధనుర్దాసుకు జ్ఞానోదయం
శ్రీరంగనాథుని దేవాలయంలో సుపాలనా వ్యవస్థలను నిర్ధారించి నిక్కచ్చిగా అమలు చేయాలన్నది రామానుజుల సంకల్పం. అందరితో కలిసి మెలసి మెలుగుతూ త్యాగధనులై ఉంటూ ప్రతిప్రాణి పట్ల దయ కలిగి ఉండే మహనీయుడు కనుక అందరినీ ఒక్కొక్కరినే మార్చుతూ ముందుకు వస్తున్నారు రామానుజులు. ఆలయం పైన అధికారం చేతిలో ఉన్న వారిని కూడా సక్రమమార్గంలో పెట్టడానికి ఎవరూ నొచ్చుకోని మార్గాలను రామానుజులు అన్వేషిస్తున్నారు. ఆలయ అధికారాల తాళాలు చేతిలో ఉన్న ప్రధాన ధర్మాధికారి తిరువరంగత్తముదనార్ యువకుడు, సంపన్నుడు. అధికారం తలకెక్కింది. ఉత్తమవంశజుడైనా భజనపరుల మధ్య తిరుగుతూ విలాసాలకు అలవాటు పడ్డాడు. విద్యాధికుడే అయినా దురలవాట్లకు లోబడి ఆలయ ధర్మానికి దూరం కావడం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చివరకు దైవాన్ని కూడా నిరాదరించే స్థాయికి ఆయన వ్యవహారాలు పెరిగాయి. ఈ అముదనార్ను ఏ విధంగా మార్చాలా అని రామానుజులు ఆలోచిస్తున్నారు. ఒకరోజు అముదనార్ తల్లిగారు పరమపదించారు. పదకొండోరోజున నిర్వహించే క్రియాకర్మల నిర్వహణకు భోక్తలుగా స్వాముల అవసరం వచ్చింది. కాని స్వాములు ఆ కార్యక్రమాలు జరిపించడానికి రావడానికి ఇష్టపడరు. ఆ మంత్రాలు తెలిసి శ్రద్ధగా కార్యం నిర్వహించే వారు ఎందరో రామానుజుల శిష్యకోటిలో ఉన్నారు. కనుక వారిలో కొందరిని పంపాలని రామానుజుడిని అభ్యర్థించారు. కురేశుల నాయకత్వంలో కొందరిని వెళ్లమన్నారు. మాతృదేవత కార్యక్రమాలను పద్ధతి ప్రకారం జరపాలని, తృప్తి చెందారా అని అడిగినప్పుడు ఏం కోరాలో చెప్పి పంపారు. కురేశులు వెళ్లారు, వారి బృందం పద్ధతి తప్పకుండా అముదనార్ మాతృకార్యం నిర్వహించారు. అముదనార్ చాలా సంతోషించారు. గృహస్తుడి ధర్మాన్ని పాటించి చందన పుష్పాలతో స్వాములను సత్కరించి, వారికి నమస్కరించి తరువాత ‘‘తృప్తాస్థా?’’ అని అడిగారు. అందుకు ప్రతిస్పందనగా ‘‘తృప్తోస్మి’’ అని చెప్పడం పరిపాటి. కాని కురేశులు ఏమీ మాట్లాడలేదు.‘‘స్వామీ! మీకేమయినా అసంతృప్తి కలిగించానా, ఇంకా ఏదయినా కావాలనుకుంటున్నారా, మీకు చేసిన సన్మానం మీకు సంతోషం కలిగించలేదా?’’ అని అముదనార్ అడిగారు. కార్యం నిర్వహించిన స్వాములు సంతృప్తులు కాకపోతే మాతృదేవత ఆత్మ సంతృప్తి చెందబోదని విశ్వసిస్తారు. కనుక అముదనార్ ఆందోళన చెందారు. కురేశులు చాలాసేపు మౌనం పాటించడం భరించలేకపోయారు. ‘‘మీకేం కావాలన్నా ఇస్తాను దయచేసి అడగండి, వెనుకాడకండి’’ అని పదే పదే ప్రార్థించారు. ‘‘మీ దగ్గరున్న ఆలయ అధికారాలు మా చేతికి ఇవ్వండి. ఆలయ తాళం చెవులు అప్పగించండి. అదే మేము కోరుకునేది’’ అన్నారు కురేశులు. దీని వెనుక రామానుజుల వారి వ్యూహం ఉందని అర్థమైంది. అముదనార్ మారుమాట మాట్లాడకుండా తాళాలు తెచ్చి ఇచ్చారు. కురేశులు తృప్తోస్మి అన్నారు.రామానుజులను కలిసి తిరువరంగత్తముదనార్ తన ఆలయ అధికారాలను పూర్తిగా ఆయనకు అప్పగించారు. కురేశులు, రామానుజులు మాత్రం ఆయన్ను వదలలేదు. ఆయనలో లోపాలను సరిదిద్ది ఆలయ విధులు సర్వసమానతా సిద్ధాంతాలతో అమలు చేసేందుకు ఆయన్ను సిద్ధం చేసి ఉత్తమ పాలకుడిగా మార్చేశారు. తాను, తన అధికారమే అన్నీ అనుకున్న అముదనార్ తనకు రామానుజులే సర్వస్వమని చిత్తశుద్ధితో భావించి ఆయన శిష్యరికంలో అనేక రచనలు సాగించారు. రామానుజులను 108 తమిళ గీతాలతో ప్రస్తుతించారు. ఈ పాశురాలను ఇరామానుశ నూత్తందాది అని పిలుస్తారు. ధనుర్దాసు ఉఱైయూర్ (నిచుళాపురం)లో ఉండే ధనుర్దాసు గొప్ప విలువిద్యా నిపుణుడు. మల్లుడు కూడా. పోరాట కళల్లో అతణ్ని మించిన వాడు లేడు. ఆయనకు కనకాంబ అనే అతిలోక సుందరి ప్రియురాలు. ఆమె అందాన్నే నిరంతరం ఆరాధిస్తూ, ఆమె నేత్ర సౌందర్యాన్ని చూస్తూనే ఉండే వాడు. ఆమె ప్రియుడిని ఓ కోరిక కోరింది. శ్రీరంగనాథుని చైత్రోత్సవం తప్పక చూడాలని, కనుక ఆ రోజుల్లో శ్రీరంగం వెళ్తానంది.‘‘నీతోపాటే నేనూ’’ అంటూ ధనుర్దాసు బయలుదేరాడు. ఇద్దరూ శ్రీరంగం పక్కనే ఉన్న కావేరీ నదీ తీరానికి చేరుకున్నారు. అప్పుడే శ్రీరంగనాథుడి ఉత్సవ విగ్రహాలకు తిరుమంజనం జరుగుతున్నది. పైన ఎండ మండిపోతున్నది. ఇసుకలో కనకాంబ నడుస్తూ ఉంటే సూర్యతాపానికి ఆమె కందిపోకుండా ధనుర్దాసు ఆమెనే చూస్తూ వెనకకు నడుస్తూ గొడుగు నీడ తప్పకుండా కాపాడుతున్నాడు.ధనుర్దాసు కనకాంబ సౌందర్యారాధన చూసి శిష్యులు నవ్వడం రామానుజులు గమనించారు. విషయం తెలుసుకున్నారు. ‘‘మీలో ఒకరు వెళ్లి నేను రమ్మన్నానని చెప్పి ధనుర్దాసును నా వద్దకు తీసుకురండి’’ అని ఆదేశించారు. రామానుజుని కరుణారసదృష్టి ధనుర్దాసును ఆకట్టుకున్నది. నమస్కరించాడు. రామానుజులు అతడిని ప్రేమతో పలకరించాడు. కాసేపు కుశల ప్రశ్నల తరువాత, ‘‘ధనుర్దాసూ! లోకమంతా చూస్తున్నా పట్టించుకోకుండా నీ భార్య కన్నులనే చూస్తున్నావట. నిజమేనా.. నీకు సిగ్గనిపించడం లేదా?’’ అని అడిగారు. ‘‘స్వామీ సన్యాసులు మీరు, మీకు ఆ లావణ్యవతి నేత్రాల సౌందర్యశక్తి గురించి ఏ విధంగా చెప్పడం? మీకు చెప్పగలిగేంత తెలివి నాకు లేదు స్వామీ. ఎండలో ఆమె కందిపోతే నేను తట్టుకోలేను కనుక గొడుగు పడుతున్నాను స్వామీ. నిజానికి శ్రీరంగ చైత్రోత్సవాలు చూడాలన్న ఆమె కోరికపైనే మేమిద్దరమూ ఇక్కడికి వచ్చాము. గొడుగు పట్టుకుని భార్యాభర్తలు నడవడం కూడా తప్పేనా స్వామీ..’’ ‘‘ఓహో! ఆమె నేత్రసౌందర్యమా నిన్ను కట్టిపడవేసింది. అంతకు మించిన నేత్రసౌందర్యమే లేదంటావా ధనుర్దాసూ..’’ అన్నారు రామానుజులు.‘‘లేదు. నాకు తెలిసినంత వరకు నా భార్యను మించిన సౌందర్యవతి, లావణ్యమూర్తి లేదనే అనుకుంటున్నాను.’’ అన్నాడు. ‘‘అంతకుమించిన నేత్ర సౌందర్యం ఉంది. అది నువ్వు ఒక్కసారి చూడాలి’’ అని స్వామి ప్రేమతో అంటూ ఉంటే ధనుర్దాసు కాదనలేకపోయాడు.‘‘సరే స్వామీ! చూస్తాను మీమాట ఎందుకు కాదనాలి. చూపండి.’’ అన్నాడు ధనుర్దాసు. శ్రీరంగని గర్భాలయంలోకి వెంట తీసుకువెళ్లినాడు ఆచార్యుడు. జగదేక సుందర విశ్వరూపమై, అఖిల భువనాధీశుడు అలవోకగా శేషశయ్యపై వయ్యారంగా శయనించి చిరునవ్వులు చిందిస్తూ, కన్నుల నిండా కరుణను కురిపిస్తూ... క్రీగంట విశ్వాన్నే శాసించే ఆ అద్భుత సౌందర్యమూర్తి కలువ కన్నులను చూసిన తరువాత ధనుర్దాసుకు మరేమీ కనిపించడం లేదు. రామానుజుడు తలచినట్టే జరిగింది. శ్రీరంగని కరుణామయ దృక్కులు ధనుర్దాసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భగవంతుడితో భక్తుడి అనుసంధానం జరిగింది. శిష్యుడిని ‘‘శ్రీరంగనాథ కృపా కటాక్ష సిద్ధిరస్తు’’ అని ఆశీర్వదించారు. ‘‘ఏమంటావు ధనుర్దాసూ’’ అని అడిగితే ‘‘ఏమనగలను స్వామీ, నా అజ్ఞానం పటాపంచలు చేశారు. అద్భుతమైన శాశ్వతమైన సౌందర్యాన్ని దర్శింపచేసి పుణ్యం కట్టుకున్నారు. నన్ను నిరంతరం ఈ స్వామికి సేవచేసుకునే భాగ్యం కల్పించండి స్వామీ ’’ అని పాదాలపై పడ్డాడు ధనుర్దాసు. ‘‘అదేం భాగ్యం. మాతోనే ఉందువుగాని, మాతోపాటు శ్రీరంగని ఆరాధింతువుగాని లే నాయనా’’ అని లేపారు స్వామి. అతనికి పంచసంస్కారాలు జరిపించి, దివ్యమంత్రోపదేశం చేసి శిష్యకోటì లో చేర్చుకున్నారు. తన భర్తను తనకు దూరం చేస్తారేమోనని భయంతో కనకాంబ పరుగెత్తుకుంటూ వచ్చింది. స్వామి పాదాలు పట్టుకుని ‘‘నా గతేమిటి స్వామీ’’ అని విలపించింది. ‘‘నీకేం లోటు తల్లీ. నీ భర్తతో నీవూ ఇక్కడే ఉండు. నీ భర్తకు సన్యాసం ఇవ్వడం లేదు. ఇద్దరూ కలిసి స్వామికి సేవ చేయండి. తరించండి. సరేనా’’ అని ఆమెను ఆశీర్వదించారు. విశిష్టాద్వైత సిద్ధాంతాల ఆచరణలో రామానుజుల వారికి ధనుర్దాసు కులం ఎక్కడా అడ్డురాలేదు. రామానుజుని అనుంగు శిష్యుడు కావడానికి ధనుర్దాసు అంకిత భావం చాలని రామానుజులు తన మాటల ద్వారా చేతల ద్వారా చాటి చెప్పారు. భగవంతుడి సేవ చేయడానికి, వైష్ణవమతానికి, ముక్తిమార్గానికి, జ్ఞానమార్గానికి కేవలం ఆర్తి ఒక్కటే అర్హత అని రామానుజుడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. రామానుజుడు కావేరీ స్నానానికి వెళ్తున్నపుడు దాశరథి భుజంపై చేయి వేసేవాడు. స్నానం తరువాత ధనుర్దాసు భుజాన్ని ఆసరాగా తీసుకుని పైకి నడిచేవాడు. స్నానం తరువాత శూద్రుడిని ఎందుకు తాకుతున్నారని శిష్యులు ప్రశ్నించారు. రామానుజుడి సమాధానం: ‘‘జన్మతః వచ్చిన కులం కన్న జ్ఞానకులం శ్రేష్ఠమయినది. విద్య, ధనం, కులం మనుషుల్లో మదాన్ని కలిగిస్తుంది. కాని బుద్ధిమంతుడైతే కులం, విద్య, ధనం ప్రభావం ఆ వ్యక్తిపైన ఉండనే ఉండదు. మనం తేల్చుకోవలసింది మనం బుద్ధిమంతులమా కాదా అని మాత్రమే. మన ఆళ్వారులతో సమానమైన ప్రేమాభిమానాలు పెరుమాళ్లపైన ధనుర్దాసుకు ఉన్నాయి. అదే అతని ఔన్నత్యానికి కారణం. దాన్ని మీకందరికీ తెలియజేయడం కోసమే నేను స్నానం తరువాత ధనుర్దాసు భుజంపై చేయివేసి నడుస్తున్నాను.’’ఈ సమాధానంతో పైకి సిగ్గుపడినట్టు కనిపించినా శిష్యులు మారతారని, తృప్తి చెందుతారని రామానుజులు అనుకోలేదు. రోజూ ఉతికి ఆరవేసుకునే తన శిష్యుల ధోవతుల నుంచి ఒక ముక్క చించి తీసుకురమ్మని తన అంతరంగిక శిష్యుడొకరిని ఆదేశించారు ఆచార్యులు. అతను ధోవతులన్నీ చింపాడు. మరునాడు లేవగానే చినిగి ఉన్న ధోవతులను చూసి ఒకరినొకరు నిందించుకుంటూ తిట్టుకుంటూ కొట్లాడుకున్నారు. వారు ఉపయోగించిన భాష వారి కులానికి, చదువుకు తగినట్టు లేదని స్పష్టంగా తెలిసింది, వారితో సహా. ఆచార్యుడు జోక్యం చేసుకుని వారిని శాంతపరిచారు. ధనుర్దాసు ఆ పనిచేయించాడేమో అని కొందరు అనుమానించారు. ధోవతులు చిరిగినందుకు పరితపిస్తున్న శిష్యులలో కొందరిని పిలిచి ‘‘ధనుర్దాసు ప్రస్తుతం నా ఆశ్రమంలోనే ఉన్నాడు. కనకాంబ నిద్రిస్తున్న సమయం చూసి ఆమె ఆభరణాలను ఎవరికీ తెలియకుండా తీసుకుని రండి. మరొక విషయం. మీరు అక్కడే ఎక్కడైనా దాక్కుని ఆభరణాల దొంగతనం గురించి ధనుర్దాసు, కనకాంబ ఏం మాట్లాడుకుంటారో, ఏం చేస్తారో చూసి నాకు చెప్పండి’’ అని చెప్పారు. ఆ శిష్యులు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి గురువుగారు దొంగతనం చేయమంటున్నారు అని. అయినా ధనుర్దాసు మీద ప్రతికూల భావాలతో ఆ పనిచేయడానికి ఉద్యుక్తులైనారు. భర్త ఏ రాత్రయినా వస్తాడని కనకాంబ తలుపు గడియ వేయలేదు. నిద్రిస్తున్నది. ఇంతలో అలికిడి అయింది. రామానుజ ఆశ్రమానికి చెందిన వైష్ణవులు వచ్చారని అర్థమైంది. కళ్లు మూసుకుని గమనిస్తూ ఉంది. ఆమె ఒకవైపు ఒత్తిగిలి పడుకున్నది. శిష్యులు పైకి కనబడే ఆభరణాలను ఒకటొకటే ఒలిచివేస్తున్నారు. కాసేపయిన తరువాత కనకాంబ అటువైపు తిరిగింది. నిద్రలేచిందనుకుని భయపడి వారు బయటకు వెళ్ళిపోయి కిటికీల దగ్గర దాక్కున్నారు. ధనుర్దాసు అంతలో ఇంటికి చేరుకున్నాడు. ఒంటిపైన ఒక వైపే ఆభరణాలతో వింతగా ఉన్న కనకాంబను చూసి ఇదేమి అవతారం అన్నాడు ధనుర్దాసు. జరిగిన విషయం చెప్పిందామె. ధనుర్దాసు: గురువుగారి శిష్యులు వచ్చారా. వారికి ఏదో అవసరం ఉండి ఉంటుంది. అయినా నీవు కదలకుండా ఉండాల్సింది అప్పుడు వారే ఏదో విధంగా మిగిలిన నగలూ తీసుకునే వారు కదా!కనకాంబ: నిజమే. కాని నేను వారిని భయపెట్టేందుకు కదల్లేదు. ఇటువైపు నగలు కూడా తీసుకునేందుకు వీలుంటుందని నెమ్మదిగా అటు తిరిగాను. కాని వారు వెళ్లిపోయారు. ధనుర్దాసు: మన గురువుగారి బోధలు మరిచిపోయావా కనకాంబా.. భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల మనం స్వతంత్రంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా భాగవతుల పట్ల స్వతంత్రంగా వ్యవహరించడం తప్పు. నీవు కాస్త ఆలోచించాల్సింది కదూ!కనకాంబ: అవును పొరబాటైంది. వారికేమి కష్టాలున్నాయో ఏమో. ధనం అవసరం ఉండి ఉంటుంది. ఏం చేద్దాం. గురువుగారికి తీసుకువెళ్లి ఇద్దామా?ధనుర్దాసు: ఏమో కనకాంబా నాకేమీ తోచడం లేదు. భాగవతులకు ఉపకరించని ఈ సంపద మనకెందుకు. బాగా రాత్రయింది. రేపు కావేరీ స్నానానికి వెళ్లే సమయంలో గురువుగారిని క్షమించమని అడుగుతాను. అంతా భగవదేచ్ఛ. ఆచార్యుని ఆజ్ఞ. శిష్యులు పరుగెత్తుకుంటూ వెళ్లి జరిగినదంతా గురువుగారికి పూసగుచ్చినట్టు వివరించారు.రామానుజ: ఇప్పుడు చెప్పండి. ధోవతి చింపుల కోసం కొట్లాడుకున్న మీరు ఈ వైపు, నగలు ఇంకా ఇవ్వలేకపోయామే అని పరితపిస్తున్న ధనుర్దాసు ఆ వైపు. నేను ఎవరి మీద ఆధారపడాలో మీరే చెప్పండి. ఎవరు వైష్ణవాన్ని, భాగవత సేవా వైభవాన్ని, త్యాగగుణాన్ని అనుసరిస్తున్నారో మీరే చెప్పండి. ఎవరు పవిత్ర భావాలతో ఉన్నారు? ఎవరిది మడి? ఎవరిది అశుచి? నేను స్నానం తరువాత తాకవలసిన పవిత్రుడెవరు?వారంతా రామానుజుని పాదాలపై పడి తమ అజ్ఞానాన్ని మన్నించమని కోరారు. ‘‘సరే.. ఈ నగల మూట వారికే అప్పగించి రండి’’ అని వారిని పంపించారు. కనకాంబ ఆ నగలు చూసి ఏం చేయాలో తెలియక భర్తను చూసింది. తీసుకోవాలో వద్దో? ధనుర్దాసు మరోసారి అడిగాడు.. ‘‘నిజంగా గురువుగారే పంపించారా? నన్ను ఈ నగలు తీసుకొమ్మని ఆదేశించారా?’’ అని. అవునన్నారు శిష్యులు. తాను స్వతంత్రుడిని కాదనీ గురువు పట్ల పరతంత్రుడినని వారి ఆదేశాలు తప్పబోనని చెప్పి నగలు తీసుకున్నారు. ఈ సంఘటనను కల్పించి శిష్యులకు బుద్ధి చెప్పడానికి గురువుగారు సంకల్పించారని తెలిసి, రామానుజుడే తమకు సర్వస్వం అని నిశ్చయించుకుని, తమ పట్ల వారికి గల అభిమానానికి ఆనందంగా మాట్లాడుకుంటూ ఆ రాత్రి గడిపారు ఆ దంపతులు. రామానుజ మార్గం -
రేపు జీఎంసీలో అంబేడ్కర్ జయంతి
రాజంపేట రూరల్ : ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాజంపేట పట్టణంలోని జీఎంసీ కళామందిర్లో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు ఎన్.శివరామయ్య, అధ్యక్షులు ఎస్.రామాంజులు ఒక ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకలో డివిజన్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొనాలని వారు కోరారు. అలాగే భరతమాత ముద్దు బిడ్డ అయిన అంబేద్కర్ జయంతిని ప్రజలు వాడవాడలా ఓ పండుగలా నిర్వహించాలని కోరారు. జీఎంసీలో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి, ఆర్డీఓ వీరబ్రహ్మం, డీఎస్పీ రాజేంద్రలు పాల్గొంటారని వారు తెలిపారు.