మొన్నోరోజు గోడ మీద బాలీవుడ్ సినిమా పోస్టర్ ‘స్త్రీ’ (మీ అభిమాన తార శ్రద్ధా కపూర్ నటించిన) చూసీ చూడగానే మా ఊరి గోడలు గుర్తుకు వచ్చాయి. సినిమా పోస్టర్‌కు మా ఊరి గోడలకు ఏమిటి సంబంధం?ఏమిటా గొడవ అంటారా? ఈ సినిమాలోలాగే మా ఊళ్లోనూ ఒన్స్ అపాన్ ఏ టైమ్ కామెడీ, హారర్ చెట్టాపట్టాలేసుకొని తిరిగాయి. నేడే చదవండి...దసరా ముందో దసరా తరువాతో గుర్తులేదుగానీ ఒక పుకారు ఇలా షికారు చేసింది...అర్ధరాత్రి సమయంలో ఒక అపరిచిత స్త్రీ ఆ ఇంటివాళ్ల బంధువులలో ఎవరిదో ఒకరి గొంతుతో మాట్లాడుతుందట.మన బంధువే కదా అని తలుపు తీయగానే...
ఎదుట ఒక యువతి! మీరు ఊహించినట్లుగానే ఆమె కళ్లు చింతనిప్పులు. ఆమె పండ్లు పదునైన కత్తులు. ఆ యువతి కనీవినీ ఎరగని భయానకమైన కంఠంతో...‘‘లోనికి రావచ్చా?’’ అని అడుగుతుందట.ఇక అంతే... సమాధానం చెప్పడానికి నోరు సహకరించదు. పరుగెత్తడానికి కాళ్లు సహకరించవు. గావుకేక పెట్టడం తప్ప మరో గత్యంతరం లేదు.నిజానిజాలు దెయ్యమెరుగు...ఈ పుకారు పుణ్యమా అని ఊరివాళ్లకు నిద్ర కరువైంది. పదేపదే ఇంటి తలుపుల వైపు చూడటమే పనైపోయింది. పుసుక్కున ఏ కుక్కో పిల్లో ఇంటి తలుపు తట్టి చప్పుడు చేసినా సకుటుంబ సపరివారంగా అందరూ భయంతో బిక్కచచ్చేవాళ్లు. తమలో తాము ఇలా గుసగుసలాడుకునేవారు...‘అదిగో అది రానే వచ్చింది’‘మన ఇల్లే దొరికిందా’‘మనం నిద్ర పోయినట్లు నటిస్తే...అది పక్కింటికి వెళ్లి తలుపు కొడుతుంది’
గుర్ర్‌ర్ర్‌ర్ర్...గుర్ర్‌ర్‌ర్ర్.. ఈ కృత్రిమ గుర్రుల సౌండ్‌తో వాడవాడంతా దద్దరిల్లేది.
మా ఊళ్లో ఎస్పీ భయంకర్ అనే కానిస్టేబుల్ ఉండేవాడు, ఇతని అసలు పేరు లింగమూర్తి. అయితే ఈ పేరుతో అతడిని ఎవరూ పిలిచేవారు కాదు. ఊరందరికి అతడు ‘ఎస్పీ భయంకర్’ మాత్రమే. ఈ భయంకర్‌గారికి ఒకరోజు చౌరస్తా దగ్గర ఎవరో ‘తలుపుల దెయ్యం’ గురించి చెప్పారు.అంతే, అతను తుపానులా విరుచుకుపడ్డాడు.అగ్నిగుండంలా రగిలిపోయాడు.‘‘మీ తెలివితక్కువతనంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ కాలంలో దెయ్యాలను నమ్మడమేంటి అసలు! మీరు మనుషులా దెయ్యాలా?’’ అని ఒంటి కాలు మీద నిలబడి అరిచాడు.అంతే కాదు...అసలు ఈ భూమి ఎలా పుట్టింది, సైన్స్ అంటే ఏమిటి? అంతరిక్షంలో ఏం జరుగుతుంది, బిగ్‌బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి....ఇలా కోసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. దీంతో కానిస్టేబుల్ కనకయ్యకు మండింది.‘‘ఒరేయ్ ఆ దెయ్యం కంటే నీ స్పీచ్ భయంకరంగా ఉంది. ఆపరాబాబు’’ అని కనకయ్య అరిస్తేగాని ఎస్పీ భయంకర్ తగ్గలేదు.అలాంటి ఎస్పీ భయంకర్ ఒక అర్ధరాత్రిపూట ‘వామ్మో...వాయ్యో’ అని అరుస్తూ ఇంటి బయటకు వచ్చాడు.‘‘ఏమైంది?’’‘‘ద....ద...ద...ద....ద...దెయ్యం’’ అంటూ మరోసారి జడుసుకున్నాడు.చెంబెడు నీళ్లు తాగిన అనంతరం ఇలా చెప్పాడు:‘‘సరిగ్గా రాత్రి పన్నెండుగంటలు. దబదబమని తలుపు చప్పుడైంది. వొద్దు...తలుపు తీయొద్దు అని మా ఆవిడ అరిచింది. నోరు మూసుకొని పడుకో అని నేను ఆమె మీద అరిచి స్పీడ్‌గా వెళ్లి తలుపు తీశాను...’’‘‘ఏమైంది?’’‘‘ఎవరో ఒక ఆడవ్యక్తి నిల్చొని ఉంది. అంతే నేను కళ్లు తిరిగి పడిపోయాను. ’’ అంటూ కళ్లనీళ్లు తుడుచుకున్నాడు.
ఎస్పీ భయంకర్‌కు తలుపుల దెయ్యం ఎదురైన న్యూస్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. ఏ వీధిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా ఇదే ముచ్చట. ఈ ఘటన దరిమిలా భయంకర్ పూర్తిగా డీలా పడిపోయాడు. మెడలో ఏవేవో తాయత్తులు కనిపించేవి. ఏ జేబులో చూసినా కుప్పలుతెప్పలుగా విభూతి కనిపించేది.ఎవరైనా భయంకర్ అని పిలిస్తే...‘‘నా పేరు భయంకర్ కాదు. లింగమూర్తి’’ అని వినయంగా బదులిచ్చేవాడు.ఎలాంటి మనిషి ఎలా అయ్యాడు?ఇంటి గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాయిస్తే వచ్చిన దెయ్యం వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోతుందని పుకారు బయలుదేరింది. అది పుకారా మారుతి కారా అనేది పక్కన పెడితే...‘‘రాయించుకుంటే పోయేదేముంది? దెయ్యం తప్పా’’ అనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటి గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాయించుకోవడం మొదలుపెట్టారు. ఈ దెబ్బతో ఆర్టిస్ట్ బొందయ్యకు చేతినిండా గిరాకీ. సంవత్సరం తిరక్కుండానే మంచి ఇళ్లు కట్టాడు.నిజాలు నిలకడ మీద తెలుస్తాయట.అదేమిటోగానీ... నిజాలు సంవత్సరం తరువాత తెలిశాయి. అవి ఇలా ఉన్నాయి:ఒకటి:లింగమూర్తి అలియాస్ ఎస్పీ భయంకర్‌ను భయపెడతాను అని చాలెంజ్ చేసి నిరూపించుకున్నాడు రాజేశం. ఆ అర్ధరాత్రి లింగమూర్తి చూసింది దెయ్యాన్ని కాదు... చీర కట్టి నెత్తిన కొంగు కప్పుకున్నరాజేశాన్ని.రెండు:‘ఓ స్త్రీ రేపు రా’ అనే కాన్సెప్ట్ ఆర్టిస్ట్ బొందయ్యదే. తనకు అట్టే బేరాలు లేకపోవడంతో ‘ఓ స్త్రీ రేపు రా’ అని గోడ మీద రాయిస్తే దెయ్యం వెనక్కి తిరిగిపోతుందనే ప్రచారాన్ని పుట్టించి, పెంచి, పోషించి విజయాన్ని సాధించాడు!
– యాకుబ్ పాషా
అయ్యా ఆమె ఎవరు?
Published Sun, Sep 23 2018 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment