ట్రాంపొలీన్‌ జంప్‌  | funday new story special | Sakshi
Sakshi News home page

ట్రాంపొలీన్‌ జంప్‌ 

Published Sun, Mar 11 2018 6:28 AM | Last Updated on Sun, Mar 11 2018 6:28 AM

funday new story special - Sakshi

‘‘ఐ యామ్‌ సారీ! ఈసారి కూడా నీకు యూఎస్‌ వీసా చేయడం కుదరకపోవచ్చు. నెక్స్‌›్టఇయర్‌ తప్పకుండా ట్రై చేద్దాం’’.మేనేజర్‌ చెప్పిన ఈ మాటలే గిర్రున తిరుగుతున్నాయి. అతని మీద కోపం తెచ్చుకోవాలో, ఇలాంటి చిక్కు మెలికలు కార్పొరేట్‌ ప్రపంచంలో ఉంటాయని తెలిసీ రాత్రింబవళ్లు కష్టపడ్డందుకు నన్ను నేను తిట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాన్ఫరెన్స్‌ రూమ్‌లో ఒక్కడినే అలా అచేతనంగా కూర్చుండిపోయా. మేనేజర్‌ కొద్దిసేపటి క్రితమే వెళ్లిపోయాడు. నా ప్రశ్నలకు అతని దగ్గర సమాధానం లేదు. ఉంటే అలా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయేవాడు కాదు. నిస్తేజంగా గదిలో కూర్చున్న నాకు, ముందున్న శూన్యం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సగటు ఐటీ ఉద్యోగిలానే నాకు కూడా డాలర్‌ డ్రీమ్స్‌ ఎక్కువే! ఆ కల కోసమే కదా.. చిన్న పల్లెటూరి నుంచి ఇంత దూరమొచ్చిందని గుర్తొచ్చినప్పుడు, బాధ ఇంకా ఎక్కువైంది. యూఎస్‌ వెళ్లి ఎంతోకొంత సంపాదించి సొంత ఊరికి ఏదైనా చేయాలి. కలలన్నీ కల్లలవుతున్నాయి. ‘‘ఒరేయ్‌ అర్జున్‌! ఇంకా ఎంతసేపు అలా అన్నీ పోగొట్టుకున్న వాడిలా కూర్చుంటావ్‌! అయ్యిందేదో అయింది. నీ ఆలోచనల ఓవర్‌టైమ్‌ రూమ్‌లో చేద్దువుగానీ పద.. బయల్దేరు.. రేపసలే వీకెండ్‌..’’ కృష్ణగాడి మాటలతో ప్రస్తుతంలోకి తేరుకున్నాను. ‘‘రేయ్‌! నీకు అర్థం కాదులే, నన్నొదిలెయ్‌..’’ అన్నాను. నాకు తెలీకుండా నా మాటల్లో కోపం ధ్వనిస్తోంది. 

‘‘విక్రమ్‌ అంతా చెప్పారు లేరా! నువ్విక్కడ ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది లేదంటే. రూమ్‌కెళ్లి మాట్లాడకుందాం పదా.. లేట్‌ అయితే క్యాబ్‌ కూడా దొరకదు..’’ చేసేదేమీ లేక సిస్టమ్‌ షట్‌డౌన్‌ చేసి ఇద్దరం పార్కింగ్‌ ఏరియాకు బయల్దేరాము. క్యాబ్‌ రెడీగా ఉంది. కృష్ణ, నేను ఒకే ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నాం. కొలీగ్స్‌. ఇప్పుడైతే ఫ్రెండ్, రూమ్‌మేట్‌ కూడా. ‘రేపన్నది ఒకటుండదు.. ఈరోజు.. ఈ క్షణమే శాశ్వతం’ అంటాడు కృష్ణ. ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. మా లక్ష్యాలు, లక్షణాలు వేరైనప్పటికీ ఇద్దరం బాగానే అలవాటు పడిపోయాం.    వీకెండ్‌ అనగానే అందరికీ ఒకేరకంగా అలవాటు పడిపోతుంది. మేమూ అందరిలానే. బారెడు పొద్దెక్కాక లేవడం, ఏదో ఒక ఆంధ్రా మెస్‌లో భోజనం చేయడం, ఆ వీక్‌ రిలీజ్‌ అయిన సినిమా చూడటం, మిగిలే ఆ కొద్ది సమయాన్ని మాల్స్‌లో ‘హమ్‌ హై హైదరాబాదీ’ అంటూ గడిపేయడం. ఇదే. ఇదే రొటీన్‌ అందరిదీ. ఈ వీకెండ్‌ కూడా అలాగే గడిచిపోతుంది. పెద్దగా మార్పేమీ ఉండదు కదా అనుకున్నా.. మధ్యాహ్నం ఒంటి గంటకు లేచి. బెడ్‌పైనుంచి లేచి ఆవలిస్తూ లివింగ్‌ రూమ్‌కి వచ్చి చూస్తే, కృష్ణగాడు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. వరుసగా చానల్స్‌ మార్చుకుంటూ పోతున్నాడు. నన్ను చూడగానే నా వైపు తిరిగాడు. ‘‘ఏరా! రాత్రంతా ఆలోచిస్తూనే కూర్చున్నావా ఏంటీ? కళ్లు అంతలా ఎర్రబడ్డాయి?’’ ఆరాతీశాడు. ‘‘ఏమోరా.. ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం బ్లాంక్‌ అయిపోయింది.’’  సోఫాలో కూలబడ్డాను. 

‘‘ఎక్కువ ఆలోచించి బుర్ర పాడుచేసుకోకురా.. నీ ఎఫర్ట్‌ అయితే పెట్టావ్‌ కదా.. హోప్‌ ఫర్‌ ది బెస్ట్‌. మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఈ ప్రపంచమంతా ఏకమై మనకు సహకరిస్తుందట..’’ వాడు నీతిబోధనలు మొదలుపెట్టాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఆపుతావా! ఇవన్నీ చెప్పడం బానే ఉంటుంది. నా ప్లేస్‌లో ఉండి చూడు.. తెలుస్తుంది..’’ అన్నాను కోపంగా. ‘‘ఓకే ఓకే కూల్‌ రా! సరే మరి, ఈ రోజు ప్లాన్స్‌ ఏంటి?’’ నా కోపాన్ని తగ్గించడం వాడికి బాగా తెలుసు. ‘‘ఏమో! ఎక్కడికీ వెళ్లాలని లేదు. నీకేమైనా పనులుంటే వెళ్లి చూస్కొని రా.. నేను రూమ్‌లోనే ఉంటా.’’చిన్నగా నవ్వి, మళ్లీ టీవీ చూస్కుంటూ వాడి పనిలో బిజీ అయిపోయాడు కృష్ణ. సోఫాలో కూర్చొని కొద్దిసేపు న్యూస్‌ పేపర్‌ తిరగేశా. తల గిర్రున తిరుగుతోంది. నిన్నటి రోజే వెంటాడుతోంది. ఆకలి చచ్చిపోయింది. ఏమీ తినాలనిపించట్లేదు. ఏదీ పాలుపోక మళ్లీ బెడ్‌పై కూలబడ్డా. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలీదు.     ‘‘ఒరేయ్‌ అర్జున్‌! లేవరా.. లే..’’ కృష్ణగాడి మాటలు తూటాల్లా తాకుతున్నాయి. లేచి వాడివైపు కోపంగానే చూశా, పడుకోనివ్వారా? అంటూ. టైమ్‌ నాలుగైంది అప్పుడు. ‘‘లేరా బాబూ! ఇలా వీకెండ్‌ని లేజీగా వేస్ట్‌ చేస్తే ఎలా? ఇవ్వాళ రొటీన్‌గా కాకుండా ఎక్కడికైనా పోదాం. పోనీ పార్క్‌కి పోదామా? ఇక్కడే దగ్గర్లో..’’ కళ్లు పెద్దవి చేసి అడిగాడు. యాక్చువల్లీ ఐడియా బాగుంది. కానీ ఎందుకో ఎక్కడికీ వెళ్లాలనిపించట్లేదు. రానని చెప్పేశా. వాడు వదలడు కదా.. బలవంతపెట్టాడు. మనకోసం ఒకరు ఇలా తపన పడుతున్నారంటే వాళ్లకు నో చెప్పడం ఎందుకో కష్టంగా ఉంటుంది. అందులోనూ కృష్ణగాడికైతే అస్సలు నో చెప్పలేం. పక్కవాడి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకునే అల్పసంతోషి కృష్ణ. ఏంటో వీడు నాకు అర్థం కాడు కూడా! రెడీ అయి వచ్చేస్తా అని చెప్పేశా. 

ఇద్దరం పార్క్‌కు వెళ్లిపోయాం. సాయంత్రం ఐదు దాటింది. వీకెండ్‌ కదా.. పార్కంతా పిల్లలు, పెద్దలు.. ఓహ్, కళకళగా ఉంది. మాఘ మాసపు సంధ్యా సమయపు చిరుగాలి నలువైపులనుంచి నన్ను అలుముకునేసరికి మనసుకు హాయిగా అనిపించింది. క్షణంపాటు గుండెలోని బరువునంతా ఆ గాలి తనతో పాటు మోసుకెళ్లిపోయినట్లనిపించింది. కాస్త తేలికగా ఉందిప్పుడు.‘‘రేయ్‌ అర్జున్‌! పదరా అక్కడ కూర్చుందాం.. అక్కడ వ్యూ బాగుంటుంది..’’ నన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వడు ఈ కృష్ణగాడు. ‘‘వస్తున్నా..’’ అన్నాను. దూరంగా కనిపిస్తోన్న ఓ స్టోన్‌ బెంచీ వైపుకు అడుగులు వేశాం.ఒక పక్క చిన్నపాటి లేక్‌ వ్యూ.. మరోపక్క సేదతీరడానికి పయనమవుతున్న ఎర్రటి సంధ్యా భానుడు.. మధ్యన వీకెండ్‌ హుషారులో సముద్రంలోని కెరటాల్లా ఆనందంతో ఎగిసిపడుతున్న పిల్లల కేరింతల పలకరింపులు, వారమంతా పరుగుల ప్రపంచంలో కొట్టుమిట్టాడి సేదతీరుతున్న పెద్దలు.. మొత్తం ఒక ల్యాండ్‌స్కేప్‌ వ్యూలాగా ఉంది పార్క్, ఆ బెంచీ దగ్గర్నుంచి చూస్తే. ‘‘వావ్‌! నైస్‌ వ్యూ..’’ అన్నా. ‘‘నువ్వు ఈ వ్యూఎంజాయ్‌ చేస్తూ ఉండు.. ఇప్పుడే వస్తాను..’’ అంటూ తినడానికి ఏదైనా తీసుకొస్తానని వెళ్లాడు కృష్ణ. ‘‘నీ తిండిగోల మాత్రం తగ్గదే..’’ అని గట్టిగా నవ్వా.  వాడూ ఓ నవ్విసిరి పరుగులాంటి నడకతో ఓ షాప్‌ దగ్గరికెళ్లిపోయాడు. 

నేను నా దృష్టిని ఎదురుగా ఉన్న మినీ చిల్డ్రన్స్‌ పార్క్‌ వైపుకు మళ్లించా. అక్కడ బాగా సందడిగా ఉంది. పిల్లలంతా గుంపుగా ట్రాంపొలీన్‌ జంప్‌ దగ్గర    పోగై ఉన్నారు. చప్పట్లు కొడుతూ పైకీ, కిందకీ ఉత్సాహంతో గంతులు వేస్తున్నారు. ఆకాశంలో ఎగురుతున్న రెక్కల్లేని పక్షిలాగా గాల్లో తేలుతున్నట్టుగా చాలా బావుంటుంది ఆ ఆట. ఒక్కొక్కరుగా పిల్లలు ఆ ట్రాంపొలీన్‌ జంప్‌ ఆడుతూంటే, వాళ్లతో వచ్చిన పెద్దవాళ్లు పిల్లల ఆనందాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఫొటోస్‌ క్లిక్‌మనిపిస్తున్నారు. వాళ్లని అలా చూస్తూంటే భలే ముచ్చటేసింది. అలానే చూస్తూ ఉండిపోయాను. ‘‘ఇదిగోరా! వేడి వేడి మిరపకాయ్‌ భజ్జీలు..’’ కృష్ణగాడి మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడి చూశా. వాడు ఆ పిల్లల కేరింతల వైపు చూస్తూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ‘‘చూశావారా అర్జున్‌.. ఆ పిల్లలు ట్రాంపొలీన్‌ జంప్‌ని ఎంతగా ఎంజాయ్‌ చేస్తున్నారో! అది పైకి వెళ్లిన క్షణంలో ఎంతైతే హ్యాపీగా ఉన్నారో.. కిందపడినప్పుడూ అంతే హుషారుగా కేకలు వేస్తున్నారు. మన లైఫ్‌ కూడా ఇంతేనేమో! కిందపడ్డప్పుడల్లా, పైకి మళ్లీ ఎగురుతామనే నమ్మకంతో, ధైర్యంగా ముందుకు సాగడమే. లైఫ్‌ ఈజ్‌ ఎ ట్రాంపొలీన్‌ జంప్‌..’’ అన్నాడు నవ్వుతూ. వాడు నవ్వుతూ చెప్పినా ఆ మాటల్లో గొప్ప ఫిలాసఫీ ఉంది కదా అనిపించింది. నిజమేనేమో, జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఎంతో ఆవేదనకు గురవుతాం. చతికిలపడిపోతాం. కానీ అది దాటొస్తే ఇంకో జీవితం ఉందనిపించింది. ఓడిపోయిన ప్రతిసారీ గెలవడానికి ఇంకోఅవకాశం ఇచ్చేస్తుందేమో లైఫ్‌. ఇప్పుడు నేను ఆ అవకాశం కోసం వెతకాలేమో! ‘యూ ఫెయిల్‌ ఓన్లీ వెన్‌ యూ క్విట్‌..’ అని ఎక్కడో చదివిన మాటలు గుర్తొచ్చాయి. కృష్ణగాడి వైపు చూశా. వాడింకా ఆ పిల్లలనే చూస్తూన్నాడు. ఆ పిల్లల సందడి ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తోంది. ఈ సాయంత్రం ఇక్కడికొచ్చి కూర్చోవడం బాగుంది. ‘రేపు నిన్నటిలా కచ్చితంగా ఉండదు’ అన్న ఆలోచన ఎంత బాగుందీ! 
సుచిత్ర రెడ్డి (చెన్నై) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement