
తేనెతుట్టను పట్టిన ఈగల్లా రైళ్లని మనుషులు పట్టుకుని వేలాడుతూ తరలిపోతున్న దృశ్యాల ఫొటోలు, దేశ విభజన కాలం నాటివి ఇప్పటికీ కనిపిస్తాయి. ఎముకల గూడులైపోయిన మనుషులు భయంతో, నీరసంతో, పంటిబిగువున నడుస్తున్న ఫొటోలు – ఇవన్నీ అప్పటివే. ఈ భయానక చిత్రాలలో ఎక్కువ భాగం ఒక మహిళా జర్నలిస్టు తీసినవే.ప్రపంచ చరిత్రలో జరిగిన అతి పెద్ద హింసాత్మక వలసలలో ఒకటి మన దేశంలోనే జరిగింది. ఇంకో మాటలో చెప్పాలంటే తరిమివేత. కావళ్లలో, భుజాల మీద వృద్ధులతో, మంచం సవారీ మీద గర్భిణులతో, చంకల్లో ఏడుస్తున్న పసివాళ్లతో, రోజుల తరబడి తిండీతిప్పలు లేక నీరసించిన ముఖాలతో కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని, ఎడ్ల బళ్ల మీద, గాడిదల మీద, చిన్న చిన్న వాహనాల మీద సామగ్రితో అనంతంగా సాగిపోతున్న వ్యథార్త జీవుల యథార్థ దృశ్యాలు ఆ కాలాన్ని విచలితం చేశాయి. చిన్న చిన్న గుంపుల నుంచి ఎనిమిది మైళ్ల పాటు సాగిన వలసలు ఆనాడు కనిపించాయి. ఇది 1947లో జరిగిన భారత విభజన నాటి విషాద దృశ్యమాలిక. కోటీ యాభయ్ లక్షల నుంచి రెండు కోట్ల మంది పాకిస్థాన్ నుంచి భార™Œ కూ, భారత్ నుంచి పాకిస్థాన్‌కూ తరలిపోయారు. ఇరవైరెండు లక్షల మంది ఆచూకీ దొరకలేదు.
హిందువులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. సిక్కులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ముస్లింలీగ్ నేత జిన్నా 1946లో ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో ఉపఖండం కనీవినీ ఎరుగుని రీతిలో హత్యాకాండను చూసింది. ఆ సంవత్సరం బెంగాల్ రక్తసిక్తమైంది. 1947లో ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది. 1947 ఆగస్ట్ 15కు స్వాతంత్య్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించినా, సరిహద్దుల నిర్ణయం ఆగస్టు 17కు గాని జరగలేదు. ఆ నలభై, యాభై గంటలలో జరిగిన ఘోరాలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మీద అనేక ప్రశ్నలను సంధిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన ఘోరాల కంటే ఆ సమయంలో ఇక్కడ జరిగిన ఘోరాలు దారుణమైనవని ఆ యుద్ధంలో పని చేసి వచ్చిన బ్రిటిష్ సైనికులూ పత్రికా విలేకరులూ చెప్పడం విశేషం (భారత, పాక్ విభజనపై వెలువడిన కొన్ని పుస్తకాలను సమీక్షిస్తు ప్రఖ్యాత చరిత్రకారుడు, నవలాకారుడు విలియం డాల్రింపుల్ జూన్ 29, 2015న ‘ది న్యూయార్కర్’ పత్రికకు రాసిన వ్యాసంలో ఇలాంటి విషయాలు చాలా వెల్లడించారు). ఈ రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్.
‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. ఒక సన్నటి సందులో గుట్టలుగా పడి ఉన్న శవాలు, వాటిని పీక్కు తినడం కోసం అక్కడి ఇళ్ల మీద నుంచి చూస్తున్న రాబందులు ఎదురు చూస్తున్న ఫొటో అందరినీ కదిలిస్తుంది. శవాలను బండ్ల మీద నింపుతున్న దృశ్యం, అందులో బండి చక్రం ఆకుల మధ్య నుంచి కనిపిస్తున్న కళ్లు మూత పడని ఒక శవం దేని గురించో ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది. భారత్ నుంచి పాక్‌కూ, పాక్ నుంచి భారత్‌కూ సాగిన వలసలు కూడా దారుణ హింస మధ్యనే సాగింది. వెంటాడి చంపడం, యువతులపై అత్యాచారాలు చేయడం (మొత్తం 75,000 మందికి ఇలాంటి దుస్థితి ప్రాప్తించిందని ఊర్వశి బుటాలియా, తన ‘అదర్ సైడ్ ఆఫ్ ది సైలెన్స్’ పుస్తకంలో చెబుతారు. ఈమె అలాంటి బాధలు పడ్డ పంజాబీ కుటుంబానికి చెందినవారే) సర్వ సాధారణంగా జరిగిపోయింది. ఇలాంటి రక్తపు జాడల వెంట పయనిస్తూ మార్గరేట్ ఫొటోలు తీశారు.
మార్గరెట్ (జూన్ 14,1904–ఆగస్ట్ 27,1971) అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. తల్లి మీద ప్రేమతో బూర్కి (ఆమె ఇంటిపేరు) పేరును కూడా మార్గరెట్ తన పేరులో చేర్చుకుంది. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. తరువాత హెర్పిటాలజీ (పాములు, కప్పల అధ్యయనం, జంతుశాస్త్రంలో ఉపశాస్త్రం) చదువుతుండగా తండ్రి మరణించడంతో, కోర్సు పూర్తి చేయలేదు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తరువాత ఆ పత్రిక యజమాని హెన్రీ లూస్ ‘లైఫ్’ పేరుతో ఒక పత్రికను వెలువరించాలని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే మార్గరెట్‌ను ఆ పత్రికకు ఎంపిక చేశాడు. ఆమె లైఫ్‌లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. తొలి సంచిక (నవంబర్ 23, 1936) మీద మోంటానా లోని ఫోర్ట్ పెక్ డ్యామ్ ఫొటో ప్రచురించారు. అది మార్గరెట్ తీసినదే. నిజానికి ఇది ఆమె సాధించిన ఘనతలలో చాలా చిన్నది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రషా) మీద నాజీ సేనలు దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం కూడా ఆమెకే దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు.
మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ మార్చి, 1946లో భారతదేశానికి వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీశారు. ఇంకా చాలా పోజులలో ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశం కోసం తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్రపురుషుల పోర్ట్రెయిట్‌లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. ఆమె 1946 మార్చిలో వచ్చారు. అప్పుడే వైస్రాయ్ వేవెల్‌ను సాగనంపి ఆఖరి ఆంగ్ల వైస్రాయ్ మౌంట్‌బాటన్‌ను ప్రతిష్టించారు. మౌంట్‌బాటన్‌ను ఇక్కడకు పంపించిన కారణమే భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి. కానీ ఆ క్రమంలో పాకిస్థాన్‌ను విభజించవలసి వచ్చింది. మౌంట్‌బాటన్ రాక తరువాత వరసగా ఘటనలు జరిగిపోయాయి. ఆగాఖాన్ ప్యాలెస్ నుంచి గాంధీని విడుదల చేశారు. జిన్నాతో ఆయన 18 రోజులు చర్చలు జరిపారు. తరువాత జాతీయ నాయకులంతా విడుదలయ్యారు. ఆ తరువాత ఆగస్టులో జిన్నా ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చారు. అక్కడ నుంచి రక్తపాతం మొదలైంది. మార్గరెట్ తన కెమెరాతోను, లీ ఐటింగన్ డైరీ కలంతోను ఆ దారుణ దృశ్యాలకు శాశ్వతత్వం కల్పించారు. ఐటింగన్ 20 ఏళ్ల యువతి. విభజన నాటి ఉద్రేకం, వాతావరణం ఎలాంటిదంటే, సైనికులు పోలీసులు కూడా భయపడుతున్నారు. వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇంక ఇద్దరు స్త్రీల వల్ల ఎలా అవుతుంది? అని చాలామంది ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా రవాణా సౌకర్యం మరీ కష్టమని నిరాశ పరిచారు.
కానీ ఆ ఇద్దరు మహిళలు ఒక జీప్ సంపాదించగలిగారు. ఒక ఇంగ్లిష్ సైనికాధికారిని పట్టుకుని కొందరు సైనికులను రక్షణగా కూడా తెచ్చుకున్నారు. రెండు గ్యాలన్ల పరిశుభ్రమైన నీరు, పక్క బట్టలు, ఒక టైప్ రైటర్, ఇక కెమెరా సామగ్రి సరేసరి. వీటిని జీప్‌లో వేసుకున్నారు. ఖాకీ దుస్తులు ధరించి మత కల్లోలాలతో మండుతున్న పంజాబ్‌లో పర్యటన ప్రారంభించారు. లాహోర్ సమీపిస్తున్న కొద్దీ ప్రమాద ఘంటలు మరింత గట్టిగా వినిపించడం మొదలైంది. బాధ, ఉక్రోషం నిండిన కాందిశీకులు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొందిరిని స్థానికులు నిరోధించి హింసాకాండకు దిగుతున్నారు. ఎదురుగా వస్తున్న వేరే వర్గం గుంపుల మీద దాడులు జరుగుతున్నాయి. ముప్పయ్ మంది గుంపు పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకుని జీప్ వైపు వస్తుంటే, ఒక సైనికాధికారి కాల్పులు జరపవలసి వచ్చింది. నదులలో, రైలు పట్టాల పక్కన, బావులలో, దారి పక్కన శవాల గుట్టలను చూశారు. ఆకలితో అసువులు బాసిన బాలలను ఫొటోలు తీశారు. చిత్రం ఏమిటంటే, అలాంటి స్థితిలో కూడా మార్గరెట్‌లో ఫొటోగ్రాఫర్ మౌలిక లక్షణం చచ్చిపోలేదు. ఒక సిక్కు మతస్థుడు అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను తన భుజాల మీద ఎక్కించుకుని నడుస్తున్నాడు. ఏమైందో తెలియదు. ఆ దృశ్యం కెమెరాకు చిక్కలేదు. కానీ ఒక ప్రత్యేక ఎఫెక్ట్ కోసం ఒక్కసారి వెనక్కి వెళ్లి మళ్లీ నడిచి రమ్మని మార్గరెట్ ఆ సిక్కు మతస్థుడిని కోరిందట. ఖాకీ దుస్తులలో ఉన్న మార్గరెట్‌ను చూసి అతడు తీవ్రంగా భయపడుతూ ఆమె చెప్పినట్టు చేశాడట. తరువాత ఆ సిక్కు మతస్థుడు కలసి సాగుతున్న గుంపు మీద ప్రత్యర్థులు దాడి చేశారు. అందులో 103 మంది చనిపోయిన సంగతి మార్గరెట్‌కు తెలిసింది. ‘యుద్ధస్య రమ్యం’ అని ఎవరూ అనరు. కానీ ‘యుద్ధస్య కథా రమ్యం’ అంటారు. అలాగే మార్గరెట్ విభజన విషాద చిత్రాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో మార్గరెట్ తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సమరం అహింసాయుతంగా మొదలై, దారుణమైన హింసతో ముగిసింది. ఇదొక వైచిత్రి. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతాన్ని చూసింది.
- డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment