వైన్ స్పాట్ | Hakone Kowakien Yunessun is a hot springs spa resort | Sakshi
Sakshi News home page

వైన్ స్పాట్

Published Sun, Aug 23 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

వైన్‌లో జలకాలు

వైన్‌లో జలకాలు

‘ప్రయాణం ఎందుకు చేస్తారు?’ అనే ఒకే ప్రశ్నకు వందలాది సమాధానాలు విని పించవచ్చు. ఎందుకంటే ఎవరి అవసరాల మీద వాళ్లు ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి. కానీ జపాన్‌లోని యునెసన్ స్పా రిసార్‌‌టకి వెళ్లేవారిని అడిగితే మాత్రం...  ప్రయాణం అనేది ఆరోగ్యం కోసం అంటారు. అవును మరి. యనెసన్ స్పారిస్టార్‌‌ట ప్రత్యేకతే అది! ఈ రిసార్ట్‌లో ఉన్నన్ని స్పాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. అందుకే సేద తీరడానికి, కొత్త ఉత్తేజాన్ని పొందడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు  ఇక్కడికి వస్తుంటారు.
 
జపాన్‌లోని అషిగరషిమో జిల్లాలో ఉన్న హకోనే పట్టణంలో జనాభా తక్కువ. ప్రకృతి అందాలు ఎక్కువ. ఇక్కడ ఎన్నో ఆర్ట్ మ్యూజియమ్‌లు కూడా  ఉన్నాయి. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న ఈ పట్టణానికి పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. అయితే ఈ పట్టణం అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించడానికి మరో ముఖ్యమైన కారణం... యునెసన్ స్పా రిసార్ట్!
 
ప్రతి ‘స్పా’ ప్రత్యేకమే...
యునెసన్ రిసార్ట్‌కు వెళితే చాలు... అది మనల్ని టైమ్ మిషన్‌లో రోమన్‌ల కాలానికి తీసుకువెళుతుంది. రోమన్ బాత్ చేయిస్తుంది! ‘సూప్ నూడ్ స్పా’ వారెవా అనిపిస్తుంది. ‘‘మొదటిసారి వచ్చినప్పుడు పర్యాటకులలో  పెద్దగా ఆసక్తి కనిపించదు. నూడ్‌ల్స్‌బాత్ ఏమిటి? విడ్డూరం కాకపోతేనూ అన్నట్లుగా మాట్లాడతారు. ఒకసారి నూడుల్స్ బాత్ చేసిన తరువాత మాత్రం ఆ అనుభవాన్ని జన్మలో మరిచిపోరు’’ అంటాడు స్థానిక నూడుల్ స్టోర్ యాజమానికి ఇచిరో.

స్పా రిసార్‌‌టలో ఉండే నూడుల్స్ బాత్‌కి ఈయనే నూడుల్స్ సప్లై చేస్తుంటాడు. ఇది కేవలం సరదా కోసమేనా! ఒకింత భిన్నమైన అనుభవాన్ని చవి చూడడానికేనా! కానే కాదు.. చర్మం కాంతిమంతం కావడానికి, జీవక్రియ వృద్ధి చెందడానికి ఈ బాత్  ఉపయోగపడుతుంది అంటాడు ఇచిరో. గ్రీన్ టీ బాత్ అనేది మరో మంచి అనుభవం. ఒక పెద్ద టీ పాట్ నుంచి గ్రీన్‌టీ పూల్‌లోకి పడుతుంటుంది. టంజ్వా, హకోన్ పర్వతాల నుంచి  ప్రత్యే కంగా దీని కోసం టీ ఆకులను తెప్పి స్తారు. గ్రీన్ టీ బాత్  వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయని, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగు తుందని అంటారు నిర్వాహకులు.
 
ఇక మరో పెద్ద ఆకర్షణ... వైన్ స్పా.   క్లియోపాత్రా తరచుగా వైన్ బాత్ చేసేదట. దీని గురించి కథలు కథలుగా ఈ రిసార్ట్‌లో  చెబుతారు. అమెరికన్ బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ స్టౌ డెమైర్ మోకాలికి సర్జరీ జరిగింది. అప్పుడెవరో ఆయనకు వైన్ బాత్ గురించి చెప్పారట. మొదట తేలిగ్గా తీసుకున్నప్పటికీ ఆ తరువాత ఆసక్తి పెరిగి కొన్నిరోజుల పాటు రెడ్‌వైన్ బాత్ చేశాడట. దీనివల్ల శారీరకంగా, మానసికంగా తనకు అద్భుత ఫలితం కనిపించింది అంటాడు ఈ ఆటగాడు. ‘వైన్ థెరపీ’ గురించి ఇలాంటి కథనాలు  ఇక్కడ చాలా వినిపిస్తాయి.
 
గ్రీన్ టీ బాత్‌లాగే కాఫీబాత్‌కు కూడా మంచి ఆదరణ ఉంది, చర్మ రుగ్మతలను నయం చేయడానికి కాఫీబాత్ ఉపయోగపడుతుందని నమ్మకం. అలాగే ప్రేమికుల రోజున ‘చాక్లెట్ బాత్’కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాదని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటారు నిర్వాహకులు. శిరోజాలు,  రక్తప్రసరణకు ఈ చాక్లెట్ బాత్ మేలు చేస్తుందట.

ఇవి మాత్రమే కాదు... ఫుట్ బాతింగ్ ప్లేస్, లార్జ్ హీటెడ్ స్విమ్మింగ్‌పూల్, వాటర్‌ఫాల్ స్పా, కోల్డ్ వాటర్ స్పా, ఫ్లోటింగ్ బాత్, డ్రాగన్ వాటర్ ఫాల్, హాట్ స్ప్రింగ్ కేవ్, చార్‌కోల్ స్పా, శాంక్చరీ ఆఫ్ వాటర్.... ఇలా ఎన్నో ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. యునెసన్ రిసార్ట్‌తో పాటు ‘మోరి నో యు’ రిసార్ట్‌కు కూడా హకోనేలో మంచి పేరుంది. దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి.
 
ఈ స్పాల కారణంగా హకోనేకు వచ్చేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగు తోందని జపాన్ టూరిజం శాఖ చెబు తోంది. హకోనే పేరు చెబితే సందర్శకులు కూడా ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.‘‘హకోనేకు వెళ్లి వచ్చిన తరువాత కొత్త ఉత్తేజం ఏదో ఒంట్లో చేరినట్లు అనిపిస్తుంది’’ అంటాడు బ్రిటన్‌కు చెందిన పర్యాటకుడు మైఖేల్ గోవ్. విహారయాత్ర ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంటే వెళ్లకుండా ఉండగలమా అంటాడు మరో సందర్శకుడు. వాళ్లంతా హకోనేను భూలోక స్వర్గం అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement