కొత్త పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం
కొత్త డీజిల్, పెట్రోల్ కార్లు, వ్యాన్లపై బ్రిటన్ నిషేధం విధించింది. ఈ వాహనాల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్టు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్ గోవ్ ప్రకటించారు. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న ''ఎయిర్ క్వాలిటీ ప్లాన్'' ను బుధవారం బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2040 నుంచి అన్ని వాహనాలు, కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచేవి ఉండేలా ప్లాన్ చేస్తున్నామని గోవ్ చెప్పారు. హైబ్రిడ్ వెహికిల్స్‌తో సహా అన్ని ఇతర ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనున్నట్టు పేర్కొన్నారు. 2040 నుంచి జీరో ఎమిషన్స్ కార్లే రోడ్లపై నడిచేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల వైపుకి మరలుతున్న ఈ ప్రక్రియను ఓ మైలురాయిలాగా గోవ్ అభివర్ణించారు. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
గోవ్ ఈ ప్లాన్‌ను ప్రకటించిన వెంటనే లగ్జరీ ఆటో కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ మినీని బ్రిటన్‌లో అసెంబ్లింగ్ చేసినట్టు తెలిపింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్గారాలపై పోరాటం చేయడానికి మంత్రులు కూడా 225 మిలియన్ పౌండ్ల(రూ.2140 కోట్లకు పైగా) ఫండ్‌ను ఆవిష్కరించారు. ఒకవేళ పర్యావరణానికి ప్రమాదకరమైన నైట్రోజన్ డయాక్సైడ్‌ను తగ్గించలేకపోయినప్పుడు, స్థానిక అథారిటీలు ఛార్జర్లను ప్రవేశపెట్టేలా లేదా రోజులో కొంత సమయం ఆ వాహనాలపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లోనే ఆ దేశ సంకీర్ణ ప్రభుత్వం కార్బన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీనిలోనే 2050 నుంచి ఎలాంటి పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్లపై నడవకుండా చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.