
నేను ఒక్కణ్నీ ఉన్నప్పుడు దెయ్యం నాకు కనిపించాలి. అందరి మధ్యా ఉన్నప్పుడు దెయ్యం కనిపిస్తే ఆ దెయ్యాన్ని నేను మనిషి అనుకుంటాను తప్ప దెయ్యం అనుకోను. దేవుడు ప్రత్యక్షమై ‘ఏం కావాలో కోరుకో’ అంటే.. ఒక్కసారి దెయ్యాన్ని చూపించమంటాను నేను. అంత క్రేజు నాకు దెయ్యమంటే! దేవుడంటే మళ్లీ అంత లేదు. గుడికి వెళ్లడం, టెంకాయ కొట్టడం, ఓ దండం పెట్టుకోవడం, లెంపలేసుకోవడం.. అంతవరకే! లెంపలు వేసుకోవడం ఎందుకంటే.. మనసులో దెయ్యాన్ని పెట్టుకుని, దేవుడి దగ్గరికి వెళ్తున్నానని. దేవుడి గుడికి నేను వెళ్లడానికి కారణం.. దెయ్యం గుడులెక్కడా లేకపోవడమే. ఉంటే దేవుణ్ణి వదిలేసి, దెయ్యం గుడికే వెళ్లేవాడిని. అప్పుడు దెయ్యం ప్రత్యక్షమై ‘ఏం కావాలో కోరుకో’ అంటే.. ‘దేవుణ్ని ఒకసారి చూపించు’ అని మాత్రం అడగను. ‘నువ్వే మళ్లీ ఒకసారి కనిపించు’ అని ఆ దెయ్యాన్ని అడుగుతాను. దెయ్యం అంటే నాకెందుకంత పిచ్చో తెలీదు. కానీ దెయ్యంపిచ్చి పట్టేసింది. ఎప్పుడు పట్టిందో, ఎలా పట్టిందో.. అవేం గుర్తు లేవు. ఆ పిచ్చిని వదిలించుకోవడమూ నాకు ఇష్టం లేదు. వదిలిందా నాకు పిచ్చిపట్టి పోతుంది. దెయ్యం చంపుతుందని అంటారు. దెయ్యం నన్ను పనిగట్టుకుని చంపనవసరం లేదు. నా దెయ్యంపిచ్చిని ఎవరైనా వదిలించినా చాలు.. నేను చచ్చిపోతాను. ఏ భూతవైద్యుడైనా దెయ్యాన్ని వదిలించగలడు కానీ, దెయ్యం పిచ్చి వదలించలేడు కదా!
ఈ కథల్లో దెయ్యాల్ని, సినిమాల్లో దెయ్యాల్ని నేను నమ్మను. కథ కోసం దెయ్యాన్ని సృష్టించినట్టే ఉంటుంది. అవి నిజం కథలు కావు, నిజం దెయ్యాలూ కావు. నేను ఒక్కణ్నీ ఉన్నప్పుడు దెయ్యం నాకు కనిపించాలి. అందరి మధ్యా ఉన్నప్పుడు దెయ్యం కనిపిస్తే ఆ దెయ్యాన్ని నేను మనిషి అనుకుంటాను తప్ప దెయ్యం అనుకోను. ఎవరైనా ‘నేను దెయ్యాన్ని’ చూశాను అని చెప్తే మాత్రం జెలసీ ఫీల్ అవుతాను. దగ్గరదగ్గరగా నలభై ఏళ్లుగా వెతుకుతున్నా.. దెయ్యం కోసం! దెయ్యం నన్ను కరుణించలేదు. ఆదివారం, అమావాస్య చూసుకొని ఓ రోజు అర్ధరాత్రి శ్మశానానికి కూడా వెళ్లాను. ఎక్కడా దెయ్యం కనిపించలేదు! వెనక నుంచి ధబాల్మని వచ్చి గట్టిగా గొంతు పట్టుకుంటుందని ఆశగా చూశా. చితులు పటక్ పటక్ మంటున్నాయి కానీ.. ‘ఓ..’ అని ఒక్క దెయ్యమూ ఊళబెట్టుకుంటూ రాలేదు. నా ఆశ చచ్చిపోయింది. మనుషులు చచ్చిపోతే దెయ్యాలవుతారని అంటారు. ఆశ చచ్చిపోతే?
కొన్నాళ్లకు నా ఆశ.. ఊళ్లోని ఓ పాడుబడిన ఇంట్లో చిగురించింది. ఎవరో చెప్పారు అందులో దెయ్యం తిరుగుతోందనీ, ఇల్లు చూడ్డానికి వెళ్లినవాళ్ల తల పగలగొట్టి చంపేస్తుందనీ! ‘ఎవర్నైనా చంపిందా ఇంతవరకూ’ అని కుతూహలంగా అడిగాను. తెలీదన్నారు. ‘మరి తల పగలగొట్టి చంపేస్తుందని ఎలా తెలుసు?’ అని అడిగాను. ‘తెలీదు’ అన్నారు!! అందరూ.. విని చెబుతున్నవారే కానీ, చూసి తెలుసుకున్న వారు లేరు. నేను తెలుసుకోవాలను కున్నాను. ఆ రాత్రి ఆ దెయ్యాల కొంపలోకి వెళ్లాను. తాళం వేసి ఉంది. గేటు దూకి లోపలికి వెళ్లాను. వరండా అంతా పిచ్చి మొక్కలు. మసక వెన్నెల్లో పిచ్చి మొక్కలు అందంగా ఊగుతున్నాయి. వాటిని దెయ్యపు మొక్కలు అనాలేమో.. దెయ్యం ఉన్న ఇంట్లో పెరుగుతున్నాయి కదా! మొక్కల్ని దాటుకుని ముందు గది వైపు వెళ్లాను. అది పెద్ద గది. ఆ పెద్ద గదికి పెద్ద పెద్ద తాళం కప్పలు. ఒక్క కిటికీ మాత్రం తెరిచి ఉంది. కిటికీ దగ్గరికి వెళ్లి లోపల హాల్లోకి తొంగి చూశాను. ఏవో నీడలు కనిపించాయి. ఫర్నీచర్ అయి ఉంటుంది. కిటికీ కాస్త ఎత్తున ఉంది. చాలాసేపు కిటికీకి వేలాడాను. సడీ లేదు, చప్పుడూ లేదు. అంటే దెయ్యమూ లేదు. వెనక్కి వచ్చేశాను!
మిగిలిన నా ఒక్క ఆశ.. భూత వైద్యుడు. ఊరి చివర గంగాళమ్మ గుడి పక్కన అతడి ఇల్లు. వెతుక్కునే పని లేకుండానే వెళ్లాను.‘ఎవరికి వదిలించాలి?’ అన్నాడు. ‘వదిలించడం కాదు, తగిలించాలి.. నాకే’ అన్నాను. భూతవైద్యుడు బిత్తరపోయాడు. ‘ఏంటలా బిగుసుకుపోయావ్! నేనేమైనా దెయ్యంలా కనిపిస్తున్నానా?’ అని అడిగాను.‘వదిలించడమే నాకు తెలుసు. తగిలించడం రాదు’ అన్నాడు.. భలే బేరమే.. ఇక ఫో అన్నట్లు!‘డబ్బులిస్తాను. నన్ను దెయ్యానికి పట్టించు’ అన్నాను.‘దెయ్యానికి నిన్ను పట్టించలేను. నీకు దెయ్యాన్నీ పట్టించలేను. ఎందుకంటే దెయ్యాలు ఉంటే కదా’ అన్నాడు భూతవైద్యుడు.నాకు బాధేసింది. ఒక భూతవైద్యుడు అనవలసిన మాటేనా?!‘ఈ మాట బయట చెప్తే నీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది తెలుసా?’ అన్నాను... నా దగ్గర దెయ్యాల్ని దాస్తున్నాడన్న అక్కసుతో.‘నిజం. దెయ్యాలు లేనే లేవు. దేవుడు ఉన్నాడంటే నమ్మని వాళ్లు కూడా.. దెయ్యాలు లేవంటే మాత్రం నమ్మరు. కాబట్టి దెయ్యాలు లేవని నేను అంటున్నానని నువ్వెళ్లి చెప్పినా నిన్ను నమ్మరు’ అన్నాడు. పెద్ద అవమానం! అక్కడినుంచి వచ్చేశాను.
‘మిస్టర్ మాధవ్.. మనుషుల మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. దెయ్యాలపై ధ్యాస తగ్గుతుంది’ అన్నాడు డాక్టర్ సహదేవ. దేవుడి మెడలో స్టెతస్కోప్ వెయ్యకున్నా కూడా దేవుడు సహదేవలా ఉంటాడేమో అనిపిస్తుంది. ఇద్దరి నవ్వూ ఒకేలా ఉంటుంది.‘మాధవ్.. మిమ్మల్ని మీరు గమనించు కుంటున్నారా? దెయ్యాల వెతుకులాటలో మీ ముఖం రోజురోజుకీ ఎలా అయిపోతోందో తెలుసా?’ అన్నాడు డాక్టర్. ఆయన ముఖంలో నవ్వు లేదు! అంటే దేవుడిలా లేడు.‘ఎలా అయిపోతోంది డాక్టర్.. దెయ్యంలా అయిపోతోందా నా ముఖం?’ అని పెద్దగా నవ్వాను. డాక్టర్ సహదేవ నన్నే తీక్షణంగా చూస్తున్నారు. నా వైపే చూస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాడు. అతడి శ్వాస వేగం పెరిగింది. పె..రు..గు..తూ..నే ఉంది.‘మాధవ్.. మీరు.. మీరు..’ అంటూ.. వాటర్ బాటిల్‌ని చేతిలోకి తీసుకున్నాడు.నేను నవ్వుతున్నాను. న.. వ్వు.. తూ.. నే.. ఉన్నాను.అక్కడి నుంచి భూత వైద్యుడి దగ్గరికి బయల్దేరాను. దెయ్యాన్ని నేనింత వరకూ చూడలేదు. కానీ దెయ్యమంటే ఏంటో చూపిస్తాను. ఒక్కొక్కరికీ చూపిస్తాను!
Comments
Please login to add a commentAdd a comment