మా వంశ దెయ్యాంకురం! | Horror movies storys | Sakshi
Sakshi News home page

మా వంశ దెయ్యాంకురం!

Published Sun, Jan 22 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

మా వంశ దెయ్యాంకురం!

మా వంశ దెయ్యాంకురం!

‘‘దెయ్యాలు ఫేస్‌పౌడర్‌ వాడతాయా?’’ అని మా రాంబాడుగాడిని అడిగాడు మా బుజ్జిగాడు. వాడీమధ్య హారర్‌ సినిమాలు టూమచ్‌గా చూస్తున్నాడు. దాంతో దెయ్యాల గురించి తరచూ తరచి తరచి అడుగుతున్నాడు. నన్నేమైనా అడిగితే ‘‘చల్‌... దెయ్యం లేదు... భూతం లేదు... ఫో’’ అంటూ కసురుకుంటాను కదా. అందుకే వాడు మా రాంబాబుగాడిని తగులుకున్నాడని నాకు అనిపిస్తోంది. అన్నట్టు... మా బుజ్జిగాడి ప్రశ్నకు రాంబాబు గాడు ఏం చెబుతాడా అని నాకూ అనిపించింది. దాంతో నేనూ  ఆసక్తిగా వినడం మొదలు పెట్టాను.

‘‘ఏమోరా! ఐడియా లేదు. అవి తెల్లచీరలైతే కడతాయి. సినిమాల్లో చూసిన దాని ప్రకారమైతే కొన్ని దెయ్యాల ముఖం పౌడరు పూసినట్టుగా, మరీ ఎక్కువ తెల్లగా ఉంటుంది. కానీ పౌడరు పూసినందువల్ల అలా ఉంటుందా లేక వాటికి కావాల్సిన పౌష్టికాహారమైన రక్తం తగినంత దొరకక రక్తహీనత వచ్చిందా అన్న విషయంలో నాకు ఆథెంటిక్‌ ఇన్ఫర్మేషన్‌ లేదు. అవి డాక్టర్‌ దగ్గరికి పోయి బ్లడ్‌టెస్ట్‌ చేయించినట్టుగా మనకెక్కడా ఎప్పుడూ సమాచారం ఎప్పుడూ లేదు. కాకపోతే చంద్రముఖి సినిమాలో చూసినదాన్ని బట్టి అందులోని దెయ్యం మాత్రం కాటుకను కాస్త ఓవర్‌గా పూసుకుంటుంది. కాబట్టి... కాటుకా పౌడర్‌ విషయానికి వస్తే... అవి కాటుకను విరివిగా వాడతాయని తెలుసుగానీ పౌడర్‌ విషయంలో మాత్రం మనకో స్పష్టత లేదురా’’ అని ఆన్సర్‌ ఇచ్చాడు రాంబాబుగాడు.

‘‘ఎలాగూ అనీమియాతో రక్తం తక్కువైనందువల్ల ముఖం తెల్లగానే ఉంటుంది కదా. ఆల్రెడీ ఫెయిర్‌గా ఉండే ముఖానికి మళ్లీ ఫేస్‌పౌడరు ఎందుకు? మరి దెయ్యాలు పళ్లు తోముకోడానికి పేస్ట్‌ వాడతాయంటావా?’’ మరో ప్రశ్నను సంధించాడు బుజ్జిగాడు. ‘‘అవి పండ్లూ, ఫలాలు తినే దాఖలా లేదు. డ్రాక్యులా సినిమాల ప్రకారం... రక్తం పీల్చడానికి వాటికి రెండు కోర పళ్లు చాలు. కేవలం రెండు పళ్ల సంరక్షణ కోసం అంతలా టూత్‌ పేస్టు అవసరం లేదు. అయినా ఆడ దెయ్యాలు జుట్టు విరబోసుకున్నా అప్పుడే షాంపూ చేసుకున్నట్లుగా, చక్కగా తల దువ్వుకొని ఉంటాయి. మగదెయ్యాలు మాత్రం చింపిరి జుట్టుతో చిందరవందరగా, చిరాగ్గా కనిపిపిస్తుంటాయి. దీని ప్రకారం ఆడదెయ్యాలు స్వచ్ఛభారత్‌ నినాదాన్ని చక్కగా పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటాయనీ, మగదెయ్యాలు ఏమాత్రం తమ నీటుగా కనిపించవనీ అర్థమవుతోంది కదా’’ అని బదులిచ్చాడు వాడు.ఇలా మాట్లాడుతుండగానే రాంబాడు గాడి మొబైల్‌ మోగింది. ఏదో మాట్లాడి పెట్టేయగానే మళ్లీ మావాడు ప్రశ్నలతో తయారయ్యాడు.

‘‘ఇంతకీ దెయ్యాలు సెల్‌ఫోన్‌ వాడుతుంటాయంటావా?’’ ఆసక్తిగా అడిగాడు.‘‘ఏమోరా... మామూలుగా స్వీట్‌ వాయిస్‌తో ఉండే అమ్మాయిలు కూడా తాము దెయ్యాలయిపోయాక చాలా బొంగురుగొంతుతో మాట్లాడతాయని మనకు తెలుసు.  మరి అవి సెల్‌ఫోన్‌ వాడతాయా, వాట్సాప్‌ మెసేజీలు పెడతాయా, మెయిల్స్‌ పంపుకుంటాయా అన్న విషయం మనకు ఇదమిత్థంగా తెలియదు. కాకపోతే లేటెస్ట్‌గా నేను చూసిన వాల్‌పోస్టర్‌లో ఒక మగదెయ్యం చుట్టూ నోట్లో పెట్టుకొని స్మోకింగ్‌ చేస్తోంది. దానికోసారి ‘ఈ నగరానికేమైంది... బహిరంగ ధూమపానానికి తప్పదు జరిమానా’ అనే ఆ సినిమా ట్రైల్‌పార్టీను చూపించాలని నాకు అనిపించింది రా’’ అన్నాడు రాంబాబుగాడు. మావాడు అడుగుతుంటే నాకూ ఓ మాట తోచింది. దెయ్యాలకు డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. వాటికి ఏటీయం క్యూలలో నిలబడాల్సిన ఖర్మ పట్టలేదు. వాటికి అలాంటి అగత్యం ఏమీ లేదు కదా అనిపించింది.

‘‘అయితే ఈ లెక్క ప్రకారం... దెయ్యాలకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. అవి మొబైల్‌ రీఛార్జీలు చేయించనక్కర్లేదు. వైఫైలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫేస్‌పౌడర్లు రాసుకోనక్కర్లేదు. పేస్టులూ, బ్రష్షులూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు.  మనలా మంచి మంచి బిల్డింగులు కూడా అక్కర్లేదు. వాటికి పాడుబడ్డ భవనాలే చాలు. ఇక దెయ్యాల ఆరోగ్య సమస్యల గురించి ఆలోచించినా... పాపం... ఏదో రక్తహీనతలాంటి జబ్బులే తప్ప... వాటికి చూపు పవర్‌ తగ్గిన దాఖలా లేదు. కనీసం  కళ్లజోడు పెట్టుకున్న దెయ్యం ఒక్కటీ లేదు. మరి నేను చూసిన హారర్‌ సినిమాల ప్రకారమైనా... నువ్వు చూసిన తెలుగు సినిమాల లెక్కలోనైనా ఒక్క దెయ్యమూ మనం పడే కష్టాలను పడటం లేదు కదా.

 దాన్ని బట్టి వాటి లైఫే బాగుంది కదా. మరి అవి అంత హాయిగా బతుకుతూ ఉంటే... అందరూ దెయ్యాలంటే చిన్నచూపు చూస్తుంటారు. దెయ్యం బతుకును చూసి భయపడుతుంటారు?’’ లాజికల్‌గా అడిగాడు బుజ్జిగాడు.అంతంత పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు చేసే మా రాంబాబుగాడు కూడా వాడి ప్రశ్నకు  ఏమీ ఆన్సరు చెప్పకుండా అవాక్కయిపోయాడు. కానీ ఎప్పుడూ ఏ వాదనలోనైనా  సరే... తానే గెలిచే మా రాంబాబు గాడు మావాడి ప్రశ్నలను తట్టుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్‌... పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తెలుసుగానీ... మీవాడు పుట్టకముందే పరిమళిస్తున్నాడేమిట్రా. ఏదేమైనా గానీ వీడికి స్వజాతి ఫీలింగు ఎక్కువే’’ అంటూ మావాడి మీద తన అక్కసంతా వెళ్లగక్కాడు.
– యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement