టీవీక్షణం : సెల్వస్వామి పాత్ర చేయొద్దన్నారు! | interview with ravi varma | Sakshi
Sakshi News home page

టీవీక్షణం : సెల్వస్వామి పాత్ర చేయొద్దన్నారు!

Published Sat, Mar 1 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

టీవీక్షణం : సెల్వస్వామి పాత్ర చేయొద్దన్నారు!

టీవీక్షణం : సెల్వస్వామి పాత్ర చేయొద్దన్నారు!


 ‘ఆరుగురు పతివ్రతలు’ రిలీజయ్యాక మావాళ్లు ఓ యాభైమందిని తీసుకుని థియేటర్‌కి వెళ్లాను. సినిమా చూసి బయటకు వస్తుంటే ఓ ముసలావిడ వచ్చి... ‘మీరందరూ ఇంతే’ అంటూ నా కాలర్ పట్టుకుంది. ఆమె అల్లుడు శాడిస్ట్ అంట. అతడు గుర్తొచ్చాడట. తర్వాత కూలయ్యి... ‘చాలా బాగా చేశావ్ బాబూ’ అంటూ ముద్దు పెట్టుకుంది. తిట్టిందో పొగిడిందో అర్థం కాలేదు కానీ... నటుడిగా నేను సక్సెస్ అయ్యానని మాత్రం అర్థమైంది.

 

 తెల్లని పంచె-లాల్చీ, కోరమీసం, మెడలో పులిగోరు, కళ్లలో అంతుపట్టని భావాలు... ‘మొగలిరేకులు’ సీరియల్‌లో ‘సెల్వస్వామి’ని చూసిన ప్రేక్షకులు ఆ ఆహార్యాన్నిగానీ, ఆ పాత్రను పండించిన రవివర్మని గానీ ఎప్పటికీ మర్చిపోలేరు. అతి చిన్న వయసులోనే ఇద్దరు యువకుల తండ్రిగా నటించి మెప్పించారాయన. ‘నటుడనేవాడు ఏ పాత్రయినా చేయాలి, అప్పుడే నిజమైన నటుడనిపించుకుంటాడు’ అనే రవివర్మ తన గురించి చెప్పిన కబుర్లివి...
 
     కెరీర్ ఎలా ఉంది?
 బ్రహ్మాండం! ‘బృందావనం’ సీరియల్‌తో పాటు రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నాను.
 
     సీరియల్స్ తగ్గించినట్టున్నారే?

 సినిమాలపై దృష్టి పెట్టాను. అందుకే డేట్స్ సమస్య రాకూడదని సీరియల్స్ తగ్గించాను.
 
     మీ కెరీర్ మొదలైంది సినిమాతోనా, సీరియల్‌తోనా?
 సినిమాతోనే. ‘ఆరుగురు పతివ్రతలు’ నా తొలి సినిమా.
 
     అసలు యాక్టర్ ఎలా అయ్యారు?
 మాది వైజాగ్. ఇంటర్ వరకూ అక్కడే చదివాక, నా ఫ్రెండ్ సింగపూర్‌లో ఉండటంతో నేనూ వెళ్లిపోయాను. రోబోటిక్స్ కోర్సు చేసి అమెరికా వెళ్లిపోదామనుకున్నాను. కానీ అప్పుడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలడంతో వెళ్లలేని పరిస్థితి. వైజాగ్ వచ్చేసి హీలియో కన్సల్టింగ్ అనే యానిమేషన్ సంస్థ పెట్టాను. నా ఫ్రెండ్ ఒకతను సత్యానంద్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసేవాడు. అప్పుడప్పుడూ నేనూ తనతో వెళ్లేవాడిని.  నన్ను కూడా ఫీల్డ్‌కి రమ్మని సత్యానంద్‌గారు ప్రోత్సహించడంతో యాక్టింగ్‌తో పాటు డెరైక్షన్ కోర్సు కూడా చేశాను.
 
     మరి డెరైక్టరెందుకవ్వలేదు?
 అవుదామనే వర్మ కార్పొరేషన్‌కి వెళ్లాను. వర్మ బంధువు సుబ్బరాజు అక్కడ ఇన్‌చార్జ్. అయన నన్ను చూసి... ‘నటుడిగా ఎందుకు ట్రై చేయకూడదూ, ఈవీవీ ఓ సినిమా తీస్తున్నారు, వెళ్లి చూడు’ అన్నారు. వెంటనే నా పోర్ట్‌ఫోలియో ఈవీవీగారికి పంపాను. నచ్చడంతో ‘ఆరుగురు పతివ్రతలు’లో శాడిస్టు భర్త పాత్ర ఇచ్చారు.
 
     ఓ శాడిస్టు పాత్రతో ఎంటరవడం మైనస్ అనిపించలేదా?
 లేదు. ఏదైనా నటనే కదా! సినిమాల్లోకి వెళ్తానంటే మొదట ఒప్పుకోని మా నాన్న కూడా ‘చాలా బాగా చేశావు’ అంటూ మెచ్చుకున్నారు. ఎమ్మెస్ నారాయణగారు వాళ్లబ్బాయి సినిమా ‘కొడుకు’లో చాన్సిచ్చారు. మరికొన్నిటిలోనూ అవకాశాలొచ్చాయి.
 
     మరి సీరియల్స్ వైపు ఎందుకొచ్చారు?

 కొన్ని సినిమాల్లో నటించాక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో ముంబై వెళ్లిపోయాను. ‘ఆషిక్ బనాయా ఆప్‌నే’ చిత్రానికి డెరైక్షన్ డిపార్ట్‌మెంట్లో పని చేస్తుండగా... తాను తీయబోయే షార్ట్ ఫిల్మ్‌లో నటించమంటూ రాఘవేంద్రరావు పిలిచారు. తీరా వచ్చాక షార్ట్ ఫిల్మ్ కాస్తా సీరియల్ అయ్యింది. అలా ‘త్రిశూలం’తో టెలివిజన్ నటుడిగా మారాను.
 
     సెల్వస్వామి పాత్ర ఎలా దొరికింది?
 ఆ పాత్రను మొదట సెల్వరాజ్ చేశారు. ఆయనను రీప్లేస్ చేయాలి అనుకుని ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నప్పుడు... సాగర్ (ఆర్కే నాయుడు) నా పేరు చెప్పాడట.
 
     వేరొకరు చేసిన పాత్రలోకి పరకాయప్రవేశం కష్టమనిపించలేదా?
 లేదు. అతడి ప్రభావం పడకూడదనే నేను సీరియల్ చూడలేదు. గెటప్ వేసుకున్నాను. నా స్టయిల్లో నటించే ప్రయత్నం చేశాను. మొదట్లో ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రను చేయడం అవసరమా అని కొందరు అన్నారు. చేయొద్దని చెప్పినవాళ్లూ ఉన్నారు. కానీ చేయడం వల్లే నేనే ంటో అందరికీ తెలిసింది.
 
     ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
 ప్రకాశ్‌రాజ్ గారిలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుని కావాలి. ‘ఉయ్యాలా జంపాలా’లో హీరోయిన్ తండ్రిగా చేశాక, నాలో ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడని అందరూ గుర్తించారు. ప్రకాశ్‌రాజ్, రావు రమేష్‌ల తర్వాత అంత మంచి నటుడు దొరికాడంటూ రివ్యూలు రాశారు. ఆ పేరును నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. జగపతిబాబు హీరోగా చేస్తోన్న ‘ఓ మనిషి కథ’ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాను. అవార్డు కోసమే తీస్తోన్న సందేశాత్మక చిత్రమది. నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను.
 - సమీర నేలపూడి
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement