జమున బొమ్మల కొలువు | Jamuna toys employ | Sakshi
Sakshi News home page

జమున బొమ్మల కొలువు

Published Sun, Oct 20 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

జమున బొమ్మల కొలువు

జమున బొమ్మల కొలువు


 అపురూపం
 మసకబారుతున్న పండగ సంప్రదాయాలలో బొమ్మలకొలువు ఒకటి. బొమ్మ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ నుండి చీమ వరకు అన్నింటిలో భగవంతుడిని దర్శించవచ్చన్న భావనతో బొమ్మలకొలువును ఏర్పాటుచేసి, హారతి పట్టడం పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారు ఈ తరంలో అంతగా లేరు. కానీ ఒకప్పుడు బొమ్మలకొలువును ఏర్పాటు చేయడం లేదా వాటికి హాజరవడం అంటే ఎంతో సరదా! సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అలనాటి నటి జమునగారికీ ఈ సరదా ఉంది.
 
 చిన్నతనంలో దుగ్గిరాలలో బొమ్మల పెళ్లిళ్లలో సేకరించిన తాటాకు బొమ్మలు మొదలుకొని, ఈ మధ్య అమెరికాలో కొన్న బొమ్మల వరకు ఆమె బొమ్మల కొలువులో కొలువు తీరవలసిందే. జమునగారి ఉత్సాహానికి ఆమె తల్లిగారి ప్రోత్సాహం జత అయ్యింది. ఇద్దరూ ఎన్నో రకాల బొమ్మలను సేకరించేవారు. రామాయణ ఘట్టాలకు సంబంధించిన రామాయణం బొమ్మల సెట్, ఇంకా గజేంద్ర మోక్షం బొమ్మల సెట్, కైలాసం సెట్... అలాగే కొండపల్లి బొమ్మలు, మట్టి బొమ్మలు, తిరుపతి చెక్క బొమ్మలు, ఇంకా చిన్నప్పుడు తను ఆడుకున్న పొయ్యి బొమ్మ, పూజించిన సరస్వతీదేవి బొమ్మ... ఇలా ఎన్నో రకాల బొమ్మలతో శోభాయమానంగా, విజ్ఞానదాయకంగా కొలువును ఏర్పాటు చేసేవారు శ్రీమతి జమున.
 
  ఆహ్వాన పత్రాలను కూడా ముద్రించి అందరికీ పంపేవారు. క్రమం తప్పకుండా ఎందరో ప్రముఖులు వచ్చేవారు. ఎందుకంటే జమునంటే ఇష్టం. జమున ఇంట పేరంటమన్నా ఇంకా ఇష్టం. నవరాత్రులప్పుడు రోజూ ఉదయం అమ్మవారి పూజలు, సాయంత్రం బొమ్మలకొలువు పేరంటం... ఇలా తన ఆరో యేట మొదలు గత ఏడు దశాబ్దాలుగా అలుపెరగకుండా జమున బొమ్మల కొలువు పెడుతూనే ఉన్నారు.
 
 జమున బొమ్మలకొలువును చూడటానికి ప్రముఖ నటీమణులందరూ విచ్చేసేవారు.
 ఐదు సంవత్సరాలు హీరోయిన్‌గా నిలబడితే ఈ రోజుల్లో గొప్ప!ఇరవై అయిదు సంవత్సరాలు ఏకధాటిగా హీరోయిన్‌గా నటించడం ఆమె గొప్ప!!
 
 అంత బిజీ కథానాయిక అయినా...
 పండగలు - ఆచారాలు - పద్ధతులు - సంప్రదాయాలను మరువకపోవడం ఇంకా గొప్ప!వాటిని ఇప్పటికీ కొనసాగించడం నిజంగా గొప్ప!!
 
 -ఫొటోలు, రచన: సంజయ్ కిషోర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement