తిరుమల శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు.. తమ జీవితం ధన్యమైందని భావిస్తారు భక్తులు. ఇక స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకుని స్వామివారికి ఇచ్చే హారతిని అందుకుంటే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదని భావిస్తారు భక్తులు. అటువంటిది ప్రతి నిత్యం స్వామివారికి హారతిని సమర్పించుకునే భాగ్యం లభిస్తే అలాంటి అవకాశం ఒకటి వుంటుందా అంటే అన్నింటికీ అవుననే సమాధానం.
నిత్యహారతుల కార్యక్రమం
శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం హారతులు సమర్పించే భాగ్యం కొంతమందికి లభిస్తోంది. 1986లో ఐదుగురితో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పుడు 22 మందికి విస్తరించింది. శ్రీవారి ఆలయంతో సంబంధం వున్న మఠాల ప్రతినిధులకు స్వామివారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే కొన్ని కుటుంబాలకు ఈ మహద్భాగ్యం లభిస్తోంది. శ్రీవారి ఆలయంలో పూజాకైంకర్యాలను బట్టి కొన్ని రోజులలో మొదటి గంట జరుగుతున్న సమయంలో నిత్యహారతికి అనుమతిస్తుండగా మరికొన్ని రోజులలో రెండవ గంట తరువాత నిత్యహారతులకు అనుమతిస్తారు. మొదటి గంట ముగిసిన తరువాత నిత్యహారతులు సమర్పించే వారిని సన్నిధి వరకు అనుమతిస్తుండగా వారు తెచ్చిన పళ్లెంతో స్వామివారికి హారతిని అర్చకులు సమర్పిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం వారిని రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతిస్తారు.
మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో అయితే రెండవ గంట అయిన తర్వాత ఉత్సవమూర్తులు కళ్యాణమండపం వేంచేపు కాబడిన తర్వాత వారిని అనుమతిస్తారు. మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, రెండవ గంట అయిన తర్వాత నిత్యహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకం, రెండవ అర్చన, రెండవ గంట, సర్కార్ హారతి, శ్రీవారి వేంచేపు అయిన తర్వాత నిత్య హారతులకు అనుమతి ఇస్తారు.
గురువారం రోజున మూలమూర్తికి సడలింపు కార్యక్రమం, తిరుప్పావడ సేవ తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. శుక్రవారం రెండవ తోమాల, రెండవ అర్చన, రెండవ గంట ముగిసిన తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. విశేష ఉత్సవాలు, అత్యవసర సమయంలో మొదటిగంట, బలి అయిన వెంటనే శ్రీవారి ఉత్సవమూర్తులు కళ్యాణమండపానికి వేంచేపు చేసిన తర్వాత అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన ధ్వజారోహణం రోజు రాత్రి నిత్యహారతులకు అనుమతిస్తారు. (క్లిక్ చేయండి: ఆనంద నిలయ విమాన విశిష్టత)
అహోబిల మఠానికి 1997 నుంచి అనుమతి ఇవ్వగా ఆండావన్ ఆశ్రమానికి 1988లో, పరకాల స్వామి మఠానికి 1997లో, శ్రీమన్నారాయణ చిన్న జీయర్ మఠానికి 1986లో, శ్రీ ఉత్తరాది మఠానికి 1997లో, రాఘవేంద్రస్వామి మఠానికి 1997లో, శ్రీశృంగేరి శంకర మఠానికి 1986లో, శ్రీ కంచికామకోటి పీఠానికి 1988లో, ఉడిపి మఠానికి 2002లో, వల్లభాచార్య మఠానికి 1986లో, ఆర్య మైత్రేయ స్వామి వారికి 1986లో, కర్ణాటక రాష్ట్ర చారిటీస్‌కి 1986లో, నారద మందిరానికి 1986లో, తులసీదాసు మఠానికి 1986లో, రాధాకృష్ణ మందిరానికి 1988లో, వ్యాసరాజ మఠానికి 1997లో, లక్ష్మీనారాయణ మందిరానికి 1986లో, హాథీరాంజీ మఠానికి 1986లో, మూల మఠానికి 2005లో, పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానానికి 2007లో, తాళ్ళపాక అన్నమాచార్య కుటుంబానికి 2007లో, అనంతాళ్వార్ కుటుంబానికి 2009 నుంచి నిత్యహారతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. (క్లిక్ చేయండి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి మేల్కొలుపు ఇలా...)
Comments
Please login to add a commentAdd a comment