tiruppavada seva
-
Tirumala Nitya Harathi: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి
తిరుమల శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు.. తమ జీవితం ధన్యమైందని భావిస్తారు భక్తులు. ఇక స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకుని స్వామివారికి ఇచ్చే హారతిని అందుకుంటే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదని భావిస్తారు భక్తులు. అటువంటిది ప్రతి నిత్యం స్వామివారికి హారతిని సమర్పించుకునే భాగ్యం లభిస్తే అలాంటి అవకాశం ఒకటి వుంటుందా అంటే అన్నింటికీ అవుననే సమాధానం. నిత్యహారతుల కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం హారతులు సమర్పించే భాగ్యం కొంతమందికి లభిస్తోంది. 1986లో ఐదుగురితో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పుడు 22 మందికి విస్తరించింది. శ్రీవారి ఆలయంతో సంబంధం వున్న మఠాల ప్రతినిధులకు స్వామివారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే కొన్ని కుటుంబాలకు ఈ మహద్భాగ్యం లభిస్తోంది. శ్రీవారి ఆలయంలో పూజాకైంకర్యాలను బట్టి కొన్ని రోజులలో మొదటి గంట జరుగుతున్న సమయంలో నిత్యహారతికి అనుమతిస్తుండగా మరికొన్ని రోజులలో రెండవ గంట తరువాత నిత్యహారతులకు అనుమతిస్తారు. మొదటి గంట ముగిసిన తరువాత నిత్యహారతులు సమర్పించే వారిని సన్నిధి వరకు అనుమతిస్తుండగా వారు తెచ్చిన పళ్లెంతో స్వామివారికి హారతిని అర్చకులు సమర్పిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం వారిని రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతిస్తారు. మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో అయితే రెండవ గంట అయిన తర్వాత ఉత్సవమూర్తులు కళ్యాణమండపం వేంచేపు కాబడిన తర్వాత వారిని అనుమతిస్తారు. మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, రెండవ గంట అయిన తర్వాత నిత్యహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకం, రెండవ అర్చన, రెండవ గంట, సర్కార్ హారతి, శ్రీవారి వేంచేపు అయిన తర్వాత నిత్య హారతులకు అనుమతి ఇస్తారు. గురువారం రోజున మూలమూర్తికి సడలింపు కార్యక్రమం, తిరుప్పావడ సేవ తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. శుక్రవారం రెండవ తోమాల, రెండవ అర్చన, రెండవ గంట ముగిసిన తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. విశేష ఉత్సవాలు, అత్యవసర సమయంలో మొదటిగంట, బలి అయిన వెంటనే శ్రీవారి ఉత్సవమూర్తులు కళ్యాణమండపానికి వేంచేపు చేసిన తర్వాత అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన ధ్వజారోహణం రోజు రాత్రి నిత్యహారతులకు అనుమతిస్తారు. (క్లిక్ చేయండి: ఆనంద నిలయ విమాన విశిష్టత) అహోబిల మఠానికి 1997 నుంచి అనుమతి ఇవ్వగా ఆండావన్ ఆశ్రమానికి 1988లో, పరకాల స్వామి మఠానికి 1997లో, శ్రీమన్నారాయణ చిన్న జీయర్ మఠానికి 1986లో, శ్రీ ఉత్తరాది మఠానికి 1997లో, రాఘవేంద్రస్వామి మఠానికి 1997లో, శ్రీశృంగేరి శంకర మఠానికి 1986లో, శ్రీ కంచికామకోటి పీఠానికి 1988లో, ఉడిపి మఠానికి 2002లో, వల్లభాచార్య మఠానికి 1986లో, ఆర్య మైత్రేయ స్వామి వారికి 1986లో, కర్ణాటక రాష్ట్ర చారిటీస్‌కి 1986లో, నారద మందిరానికి 1986లో, తులసీదాసు మఠానికి 1986లో, రాధాకృష్ణ మందిరానికి 1988లో, వ్యాసరాజ మఠానికి 1997లో, లక్ష్మీనారాయణ మందిరానికి 1986లో, హాథీరాంజీ మఠానికి 1986లో, మూల మఠానికి 2005లో, పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానానికి 2007లో, తాళ్ళపాక అన్నమాచార్య కుటుంబానికి 2007లో, అనంతాళ్వార్ కుటుంబానికి 2009 నుంచి నిత్యహారతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. (క్లిక్ చేయండి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి మేల్కొలుపు ఇలా...) -
తిరుప్పావడ సేవలో గవర్నర్ దంపతులు
సాక్షి, తిరుమల: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. పుష్కరిణి నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. తర్వాత ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి, వకుళమాతను దర్శించుకుని హుం డీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ గవర్నర్ దంపతులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాన్వాయ్‌లో ఆగిన గవర్నర్ కారు.. మరో కారులో ప్రయాణం తిరుమల పర్యటనలో గురువారం ఉదయం గవర్నర్ కారు మధ్యలో ఆగింది. అతిథి గృహం నుంచి ఆలయానికి వెళ్లే సమయంలో రాంబగీచా వద్ద కారులో హఠాత్తుగా వాసన రావడంతో పాటు ముందుకు కదలలేదు. దీంతో గవర్నర్ నరసింహన్ దంపతులు కాన్వాయ్‌లో వెనుకే వస్తున్న మరో కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. హ్యాండ్ బ్రేక్‌ను డ్రైవర్ రిలీజ్ చేయకుండానే కారు నడపడంతో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసు దర్యాప్తునకు ఆదేశించినట్టు సమాచారం. చక్రస్నానంలో.. తిరుచానూరు: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. పంచమీతీర్థం మండపంలో అమ్మవారు, చక్రతాళ్వార్లకు నిర్వహించిన స్నపన తిరుమంజనంను తిలకించారు. అనంతరం పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారికి శ్రీవారి సారె సాక్షి, తిరుమల/తిరుచానూరు: తన పట్టపురాణి అయిన పద్మావతి అమ్మవారికి వేంకటేశ్వర స్వామివారు సారె పంపారు. గురువారం తిరుమలలో ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పుష్పాలు, తులసిమాల, నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలతో కూడిన సారెను టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, డెప్యూటీఈవో చిన్నంగారి రమణ మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిం చారు. కార్యక్రమంలో జీయరు స్వాము లు, అర్చకులు, డాలర్ శేషాద్రి పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్న సారెను టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్‌కు అందజేశారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు నడు మ ఏనుగు అంబారిపై సారెను ఊరేగింపుగా కోమలమ్మ సత్రం, కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరుచానూరు పసుపు మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయం మీదుగా పంచమీతీర్థ మండపానికి తీసుకొచ్చి ఆలయ అర్చకులకు అప్పగించారు. వేడుకగా స్నపన తిరుమంజనం పద్మావతి అమ్మవారి చక్రస్నానం పురస్కరించుకుని గురువారం పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపంలో అమ్మవారికి, చక్రతాళ్వార్లకు ఆలయ అర్చకులు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల నుంచి అమ్మవారికి శ్రీవారి సారె వచ్చిన తరువాత 10.30 గంటలకు పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పచ్చల హారాన్ని అలంకరించారు. జియ్యర్ స్వాముల సమక్షంలో పాంచరాత్ర ఆగమ పండితులు మణికంఠభట్టర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్లకు చక్రస్నానం వేడుకగా నిర్వహించారు.