దొంగతనం దొంగిలించారు | julayi movie story copy by dark knight | Sakshi
Sakshi News home page

దొంగతనం దొంగిలించారు

Published Sun, Jun 7 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

దొంగతనం దొంగిలించారు

దొంగతనం దొంగిలించారు

ఆ సీన్ - ఈ సీన్
కాపీ కొట్టడం అంటే కథనో, కాన్సెప్ట్‌నో  లేపుకురావడమే కాదు, సీన్లను కూడా దోచుకురావచ్చని మన సినిమాలు నిరూపిస్తున్నాయి. కథను కాపీ కొట్టడం ఒక  ఎత్తు అయితే, సీన్లను యథాతథంగా దించేయడం మరో ఎత్తు. ఇలాంటి తెలివినే ప్రదర్శించారు ‘జులాయి’ సినిమా రూపకర్తలు. అయితే ఏ ఫ్లాప్ సినిమా నుంచో సీన్లు ఎత్తి ఉంటే ఎక్కువ మందికి తెలిసేది కాదు. వీరు బాగా ఫేమస్ సినిమా నుంచి సీన్లను చౌర్యం చేశారు. దీంతో గుట్టు సులభంగా రట్టయింది!
   
‘మొత్తం ఎంతమంది?’ మొదటి వాడి ప్రశ్న. ‘పదిమంది ఉంటారనుకొంటా...’ రెండోవాడి జవాబు. ‘వాటాలు ఎక్కువవుతాయేమో!’ మొదటివాడి సందేహం. ‘అందుకే వైర్ కట్ చేశాక నిన్ను కట్ చేయమన్నాడు’ అనే సమాధానం ఇచ్చిన రెండోవాడి తుపాకీ పేలింది. మొదటోడు చనిపోయాడు. బ్యాంక్ దొంగతనానికి వచ్చిన దొంగల ముఠా అది. బ్యాంకులో డబ్బు ఉండే స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వెళ్లాక ఆ దోపిడీ ముఠాలోని పెద్దతల  దొరికిన వాడిని దొరికినట్లు చంపేస్తుంది.
 ‘‘ఎవర్రా వీళ్లను చంపింది. పదిమంది ఫెన్సింగ్ దాటితే ఇద్దరమే మిగిలాం...’’ అంటూ ఆ ముఠాలోని ఒకడు పెద్దతలను అడగడమే ఆలస్యం... వాడూ ఢమాల్!
 
దోపిడీలో వీళ్లకు సహాయంగా వచ్చిన క్రేన్‌డ్రైవర్‌ను కూడా చంపేయడంతో ‘‘ఫైనల్‌గా  బయటకు వచ్చేది ఒక్కడు. ఆ ఒక్కడే ఆ ముఠాలోని పెద్దవాడు. మొత్తం డబ్బును దోచుకొని బయటపడతాడు.
 
అల్లు అర్జున్ హీరోగా, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే సీన్ ఇది. సూపర్‌హిట్ అయిన ఈ సినిమాలో త్రివిక్రమ్ లాజిక్ లేకుండా తీసిన మ్యాజిక్ సీన్లలో ఒకటి ఇది. కథానుసారం ఈ దోపిడీ సీన్ ‘జులాయి’ సినిమాకు ప్రోలాగ్ గా ఉంటుంది. మరి దీన్ని ఊరికే ఏదో దోపిడీ సీన్‌లా తీసేయొచ్చు. అసలు కథ వేరే కాబట్టి, ఈ సీన్‌ను ఏదోలా లాగించేయవచ్చు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం ఈ సీన్‌ను సూపర్‌గా తీర్చిదిద్దాడు.

తన పెన్నుకు పదును పెట్టి పేపర్‌పై, మెదడుకు పదును పెట్టి తెరపై దోపిడీ సీన్‌ను నవ్యతతో రూపొందించాడు. ‘పదిమంది దోపిడీకి వచ్చి, వాళ్లలో ఒకడు అందర్నీ చంపేసి దోచుకున్న మొత్తం డబ్బును సొంతం చేసుకోవడం...’ అనే కాన్సెప్ట్ తెలుగు తెరపై ఎప్పుడూ రాలేదు కదా! అందుకే త్రివిక్రమ్ ఎత్తుగడ సినీ ప్రేక్షకులను ఆకట్టుకొనేసింది.
 
అయితే ఈ సీన్‌ను ఆకట్టుకొనేలా రూపొందించడంలో అసలు క్రెడిట్ మాత్రం ఈ దర్శకుడికి దక్కదు. ఈ సీన్‌కు మాతృక బ్యాట్‌మన్ సీరీస్ సినిమా ‘డార్క్‌నైట్’ లో ఉంటుంది! ఇటీవల వచ్చిన సైంటిఫిక్ వండర్ సినిమా ‘ఇంటర్‌స్టెల్లార్’. ఆ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నిర్మాణ, దర్శకత్వంలో 2008లో వచ్చిన సినిమా డార్క్‌నైట్. బ్యాట్‌మన్ సీరీస్‌లో వచ్చిన ఈ సినిమా ‘ది జోకర్’గా పిలవబడే విలన్‌కు సూపర్‌హీరో అయిన బ్యాట్‌మన్‌కు పోరాటంగా సాగుతుంది.

దోపిడీలు, హత్యలు చేస్తూ అచ్చమైన విలనిజాన్ని ప్రదర్శించే జోకర్ ‘డార్క్‌నైట్’ సినిమాలో బ్యాంకును దోచుకొనే విధానాన్నే ‘జులాయి’ సినిమాలో సోనూసూద్ అండ్ గ్యాంగ్‌తో రిపీట్ చేయించారు. డార్క్‌నైట్ గ్యాంగ్ ముఖాలకు మాస్క్‌లు ఉంటాయి. జులాయి రోబరీ గ్యాంగ్‌కు మాస్క్‌లు ఉండవు!  అంతే తేడా. ఒక్క ఫ్రేమ్ కూడా తేడా లేకుండా ఆ సీన్‌కు ఈ సీన్‌ను కార్బన్‌కాపీగా తయారు చేశారు! ఎలాంటి మొహమాటం లేకుండా లాగించేశారు.

సోనూసూద్ పాత్ర బ్యాంక్ రోబరీకి కి వేసిన ప్లాన్, అందులో భాగంగా. తనతో పాటు వచ్చిన వారిలో ఒక్కొక్కరినీ చంపుతూ మొత్తం డబ్బును తనే దోచుకుపోయే ప్రణాళికను వేయడం... క్యాష్‌రూమ్ గోడను క్రేన్‌తో పడగొట్టించడం... ఇలా యాజ్‌టీజ్‌గా దించేయడంలో ఈ సినిమా రూపకర్తలు తమ వంతు పాత్రను పోషించారు. ఈ సీన్‌ను చూసి.. ‘అరే! అచ్చం బ్యాట్‌మన్ సినిమాలో సీన్‌నే దించేశారే!’ అనుకోవడం ఈ రెండు సినిమాలనూ చూసిన ప్రేక్షకుల వంతవుతుంది!
 - బి.జీవన్‌రెడ్డి

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement