డేంజర్లో హలీవుడ్
అంతరిక్ష జీవులు దాడి చేస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. యుగాంతం వచ్చి భూమి బద్దలవుతుంది. హాలీవుడ్ కాపాడుతుంది. సునామీ వచ్చి కెరటాలు ఆకాశానికి ఎగుస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. ప్రపంచానికి ముప్పు వచ్చిన ప్రతిసారీ హాలీవుడ్ హీరో ఒకడు నిలబడతాడు. ఇప్పుడు కరోనా వచ్చింది. కాని– హాలీవుడ్ తనను రక్షించేది ఎవరా అని పిపిఇ ధరించి ఎదురు చూస్తూ ఉంది.
ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో నంబర్ వన్ హాలీవుడ్. ఏడాదికి దాదాపు 9 లక్షల కోట్లు దాని టర్నోవర్. 120 సంవత్సరాల ఘన చరిత్ర, ఇంత వ్యాపారం ఉన్న హాలీవుడ్ కరోనా వల్ల ఏం కాబోతున్నది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే అది కరోనా వల్ల 9 బిలియన్ల డాలర్లను నష్టపోయిందని ఒక అంచనా. నిజానికి చిన్న అవాంతరాలకే కుప్పకూలే వ్యవస్థ ఇది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 57 వేల మంది హాలీవుడ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు.
అదే సమయంలో తమ పారితోషికం పెంచమని 12 వేల మంది హాలీవుడ్, టెలివిజన్ రంగ రచయితలు సమ్మె చేశారు. వీటన్నింటి వల్ల 380 మిలియన్ డాలర్లు నష్టపోయింది హాలీవుడ్. ఆ సమయానికి ఇప్పటిలా డిజిటల్ స్ట్రీమింగ్ లేదు. జనం థియేటర్లలోనే సినిమాలు చూడాల్సిన పరిస్థితి. కాని జనం దగ్గర డబ్బు లేదు. ఆ సమయంలోనే హైవైగల్ అనే ఒక సినీ విశ్లేషకుడు ‘కరువు కాలంలో ఆల్కహాల్ అయినా కొంటారు కాని సినిమా టికెట్ కొనరు’ అని వ్యాఖ్యానించారు. అది అక్షరాలా నిజమైంది. దాదాపు రెండేళ్లపాటు పోరాడి ఆ గడ్డుకాలాన్ని దాటేసింది హాలీవుడ్.
కరోనా సమయం
హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’ అని కూడా అంటారు. కరోనా దెబ్బకు ఆ కలల వ్యాపారం కుప్పకూలి పోయింది. హాలీవుడ్లో పని చేసే వారందరూ ధనవంతులు కారు. హాలీవుడ్ మీద ఆధారపడి దాదాపు 9 లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు రెండు లక్షల మంది మాత్రమే బాగా గడిచే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. మిగిలినవాళ్లంతా రెక్కాడితేగాని డొక్కాడని వారే. వీళ్లలో చాలామంది కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయారు. డిస్నీలాండ్ తన పార్క్‌లో పని చేసే లక్ష మంది ఉద్యోగాలని తొలగించింది.
అలాగే థియేటర్లలో పని చేసే వాళ్లల్లో లక్షా యాభై వేల మందిని తీసేశారు. వాళ్లని పనిలో నుంచి తీసేస్తున్న యజమానులు ఇందుకు వేదన అనుభవిస్తున్నారు. జూన్, జూలై నుంచి సినిమా కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంతమందికి ఉపాధి కల్పించడం కష్టం కావచ్చు. ‘ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం’ అని సినిమాటోగ్రాఫర్లు అంటున్నారు. ‘కేవలం డోమినోలో మాత్రం ఉద్యోగాలున్నాయి. అక్కడ పని వెతుక్కుంటున్నాం’ అని ప్రొడక్షన్ కో ఆర్డినేటర్లు అంటున్నారు. ‘కింగ్డమ్’ సీరియల్లో పాపులర్ అయిన నటుడు మాక్ బ్రిండెట్ తన రెగ్యులర్ ఈఎంఐలు కట్టలేక నిరుద్యోగ భృతికి అప్లై చేశాడు.
రానున్న పోటీ
రాబోయే రోజుల్లో ఎలా పని చేయాలి అనే విషయం మీద హాలీవుడ్ కసరత్తు చేస్తోంది. ఎలా చేసినా గతంలాంటి స్థితి తిరిగి రాదని అందరికీ తెలుసు. స్టూడియోలు, యూనియన్ల మధ్య చర్చలు ఏ నిర్ణయాలకు వస్తాయో తెలియదు. కాని తక్కువ మందితోనే షూటింగ్ చేయాలి. అవకాశాలు కొద్దిమందికే ఉంటాయి. వాటి కోసం అందరూ దారుణమైన పోటీ పడతారు. వేతనాలు తగ్గిస్తారనే వార్త కార్మికులను కలవర పరుస్తోంది. ప్రపంచాన్ని కాపాడే హీరో హాలీవుడ్లో ఉండొచ్చు. కాని ఆ హీరోను కూడా కాపాడే సూపర్ హీరో ప్రేక్షకుడే. ఆ ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చి కూచునే వరకు హాలీవుడ్డే కాదు ఏ సినిమా రంగమైనా డేంజర్లో ఉన్నట్టే.
రక్షించేవాడు క్రిస్టఫర్ నోలన్?
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్‌ను కాపాడనున్నాడా? కాపాడాలనే సమస్త హాలీవుడ్ భావిస్తోంది. క్రిస్టఫర్ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్’ జూలై 17న విడుదల కానుంది. లాక్డౌన్ తర్వాత కరోనాతో ‘సహజీవనం’ దాదాపు స్థిరపడ్డాక హాలీవుడ్ ప్రపంచం మీదకు ప్రేక్షకుల స్పందన కోసం వదలనున్న సినిమా ఇదే. ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలా అడ్డుకున్నాడనేదే ‘టెనెట్’ కథ. మన డింపుల్ కపాడియా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది.
దీని తర్వాత బాండ్ ఫిల్మ్ ‘నో టైమ్ టు డై’ విడుదలవుతుంది.ఎలాగైనా అనుకున్న డేట్‌కే సినిమా విడుదల చేయాలని నోలన్ పట్టు పట్టి ఉన్నాడట. ఇదిలా ఉండగా ఏప్రిల్ 10న థియేటర్లతోపాటు కరోనా వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కూడా విడుదలైన ‘ట్రోల్స్ వరల్డ్ టూర్’ వివాదం రేపింది. థియేటర్ల కంటే డిజిటల్‌గా ఇది బాగా కలెక్ట్ చేయడంతో అమెరికాలోని థియేటర్స్ వ్యవస్థ భగ్గుమంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన యూనివర్సల్ స్టూడియో వారి ఏ సినిమాలనూ విడుదల చేయబోమని అల్టిమేటం జారి చేసింది. దాంతో ఆ స్టూడియో నుంచి రాబోతున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’, ‘జూరాసిక్ వరల్డ్: డొమినియన్’ తదితర సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది.
స్పానిష్ ఫ్లూ– హాలీవుడ్
సరిగ్గా వందేళ్ల క్రితం 1919 నవంబర్‌లో స్పానిష్ ఫ్లూ ప్రారంభమైంది. 1921 ఫిబ్రవరి వరకూ ఉధృతంగా తన ప్రభావం చూపి వెళ్లిపోయింది. అప్పటికి హాలీవుడ్ పసిపాప. న్యూజెర్సీ నుంచి 1912లో వలస వచ్చి ప్రస్తుతం హాలీవుడ్ ఉన్న చోట స్థిరపడుతూ ఉంది. అప్పటికి అమెరికా వ్యాప్తంగా 20 వేల థియేటర్లలో మూకీ సినిమాలు ఆడుతున్నాయి. అటువంటి సమయంలో స్పానిష్ ఫ్లూ దెబ్బతో హాలీవుడ్లో భయానక వాతావరణం నెలకొంది. ఎవర్ని కదిపినా అప్పుడే ఫ్లూ వ్యాధి బారిన పడ్డ వ్యక్తో లేదా ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వ్యక్తో. మొదట్లో స్పానిష్ ఫ్లూని తేలిగ్గా తీసుకున్నాయి చాలా స్టూడియోలు, థియేటర్లు. అప్పుడే షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ తారలు బ్రియాంట్ వాష్‌బర్న్, అన్నా క్యూ నీల్సన్లకు ఫ్లూ వచ్చింది. దాంతో హాలీవుడ్ కలవరపడిపోయింది. షూటింగ్స్ ఆపేశారు.
స్పానిష్ ఫ్లూ సమయంలో తీసిన మూకీ సినిమా ‘డాడీ లాంగ్ లెగ్స్’లో జనం ముఖాలకు మాస్క్‌లు
హాలీవుడ్ స్టార్స్ తమ నెల జీతాలు తగ్గించుకుని ఆ మొత్తంతో స్టూడియోల్లోకి ఇతర సిబ్బందికి డబ్బులిచ్చారు. మాట్నీ ఐడియల్గా పేరొందిన హెరాల్డ్ లాక్వుడ్ స్పానిష్ ఫ్లూతో చనిపోయాడు. అయితే స్టూడియోలు నెలల తరబడి మూసి ఉంచడానికి మొరాయించాయి. స్టూడియోల్లో వర్క్ చేసుకుంటామని, అందుకు అనుమతి ఇవ్వమని విన్నపాలు ప్రారంభించాయి. దాంతో షూటింగ్స్‌కు పర్మిషన్ వచ్చింది. పోలీసులు చాలా నిబంధనలు పెట్టారు. సినిమాల్లో గుంపులు ఉండే సీన్స్ ఉండకూడదు. కేవలం ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టుల మీదే సీన్స్ తీయాలి. అయితే దీనివల్ల మరికొందరు స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. అప్పట్లో స్టూడియోలకి వచ్చేవాళ్ల మీద క్రిమి సంహారక మందులు జల్లేవాళ్లు. రెడ్‌క్రాస్‌కి చెందిన నర్స్ షూటింగ్‌కి వచ్చినవాళ్ల మీద పౌడర్ చల్లుతుండేది. 1921 ఫిబ్రవరి వరకూ ఈ అవస్థ తప్పలేదు.
ప్రేక్షకుల మీద ప్రయోగాలు
అమెరికాలో దాదాపు ఆరు వేల థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లలో 40 వేల స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో అధిక శాతం రీగల్, ఎ.ఎమ్.సి, సినీమార్క్ అనే మూడు ప్రధాన సంస్థలవి. అమెరికాలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప మిగిలిన నిర్ణయాధికారాలు స్టేట్ గవర్నర్స్కే ఉంటాయి. థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొదటగా టెక్సాస్‌లో మే 8న కొన్ని థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ 25 శాతానికి తగ్గించేశారు. టికెట్ రేట్లలో బాగా డిస్కౌంట్ ఇచ్చారు.
హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’డిస్నీలాండ్ టెనెట్’
ఎయిర్ పోర్ట్‌లో ఎలా సెక్యూరిటీ చెక్ ఉంటుందో అంతకు మించి తనిఖీలు చేసి పంపిస్తున్నారు. అయితే పాత సినిమాలే ప్రదర్శిస్తున్నారు. ఒక్లహామా రాష్ట్రంలో థియేటర్లకి గ్లాస్ స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ థియేటర్లను ఓపెన్ చేయమని ఆదేశాలిచ్చినా అక్కడ కొందరు థియేటర్ల యజమానులు అంగీకరించడం లేదు. అట్లాంటాలోని ప్లాజా థియేటర్ ఓనర్ కరోనా ఇంకా ఉండగా ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయలేను అని తేల్చి చెప్పాడు.
‘ఈ పరిస్థితుల్లో ఆదాయం లేకపోగా శానిటైజేషన్ కోసం కొత్త పెట్టుబడి పెట్టాలి. పైగా సీటింగ్ కెపాసిటీ తగ్గించాలి. ఖర్చెక్కువ, రాబడి తక్కువ ఉండే ఇలాంటి పరిస్థితిలో థియేటర్లని మరికొంత కాలం మూసి ఉంచడం బెటర్’ అని మరో థియేటర్ ఓనర్ చెప్పాడు. కొందరు థియేటర్ల ఓనర్ల డిమాండ్ ఏమిటంటే కరోనా ఉండటం వల్ల ప్రేక్షకుల ఇళ్లకు నేరుగా క్యూబ్ సిస్టమ్ ద్వారా సినిమాలను విడుదల చేయాలి అయితే వచ్చిన దానిలో థియేటర్లకు కొంత వాటా ఇవ్వాలి అనేది. ఏమైనా జూలై నుంచి థియేటర్లు సంపూర్ణంగా తెరుచుకుంటాయని అక్కడి ప్రదర్శనారంగ దిగ్గజాలు భావిస్తున్నాయి.
– తోట ప్రసాద్ (సినీ రచయిత)