ప్రేమ ఓడింది... నేను గెలిచాను!
జ్ఞాపకం
ప్రేమే జీవితమనుకుంది.
ఆ ప్రేమలోనే ఓడిపోయింది.
తర్వాత ఏం జరిగింది?
ప్రేమ గుడ్డిది అంటారు అందరూ. అది నిజమో కాదో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు. ప్రేమ గెలిపించగలదు. ఓడించగలదు. వెనక్కి లాగగలదు. ముందుకు నడిపించనూ గలదు.మా నాన్న ఒకప్పుడు పెద్ద కాంట్రాక్టరు. బోలెడంత సంపాదన. కానీ కాసింతయినా తీరిక ఉండేది కాదు. దానివల్ల ఆయనకు మనుషులను, వారి మనస్తత్వాలను అంచనా వేసే అవకాశం చిక్కేది కాదు. ఉరుకులు పరుగుల్లో పడి క్షణాల్లో నిర్ణయాలు తీసేసుకునేవారు. అందరినీ నమ్మేస్తుండేవారు.
దాంతో నమ్మకస్తులు అనుకున్న దగ్గరవాళ్లే దారుణంగా మోసం చేశారు. సర్వ సంపదలూ పోగొట్టుకుని మా కుటుంబం వీధిన పడేలా చేశారు.నమ్మకద్రోహం కలిగించినంత వేదన మరేదీ కలిగించదు. జరిగిన మోసాన్ని, తన వల్ల తన కుటుంబానికి పట్టిన దుస్థితిని తలచు కుని నాన్న కుమిలి పోయారు. దాంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. మనోవ్యాధి ఆయన్ని మంచం పట్టించింది. చివరికి ఆ వేదన ఆయన్ని ఈ లోకం నుంచే తీసుకెళ్లిపోయింది.
ఒక్కసారిగా ఇన్ని కుదుపుల్ని మేం భరించలేకపోయాం. ఉన్నదంతా పోయింది. కొండంత అండ నాన్న కూడా కనుమరుగైపోయారు. ఇక మా పరిస్థితి ఏమిటి? నలుగురం ఆడపిల్లలం. నేనే పెద్దదాన్ని. అందరికీ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నామీదే ఉంది. కానీ నేనా పని చేయలేకపోయాను. ఎందుకంటే నన్ను మరో దెబ్బ బలంగా తాకింది.
నాన్న ఆర్థికంగా బాగున్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడు మా ఇంటికొచ్చారు. ‘నీ కూతురును నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా’ అని అడిగారు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నమ్మబలికారు. నేనే తన ఇంటి కోడలిని అని నాన్న దగ్గర మాట తీసుకుని మరీ వెళ్లారు. ఆయన కొడుకు కూడా నన్ను చాలా ఇష్టపడ్డాడు. తరచుగా నాతో మాట్లాడేవాడు. మెల్లగా ఇద్దరి మనసులూ కలిశాయి. మనువుకు సిద్ధమయ్యాయి. కానీ అనుకున్నట్టుగా మా పెళ్లి జరగలేదు.
మా పరిస్థితి తారుమారవ్వగానే చాలామంది మాకు దూరమైపోయారు. సంపద ఉన్నప్పుడు చుట్టూ చేరినవాళ్లు, సంపద పోయాక చుట్టుపక్కల కనిపించ డమే మానేశారు. వాళ్లలో నాన్న స్నేహి తుడూ ఉన్నాడు. దురదృష్టం ఏమిటంటే... ఆయన కొడుకు కూడా ఉన్నాడు. ‘నువ్వు లేకపోతే నేను లేను, నీతోనే నా జీవితం’ అంటూ అంతవరకూ మాటల మత్తు చల్లినవాడు... తన తండ్రి బోధకు తలొగ్గి మాట మార్చేశాడు. ‘నీ కోసం ఏమైనా చేస్తాను’ అన్నవాడు... ‘మా నాన్న ఒప్పు కోవడం లేదు, ఏం చేయమంటావ్’ అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు. మెల్లగా మాటలు తగ్గించాడు. చివరికి తండ్రి చూపించిన లక్షాధికారి కూతురి మెడలో సంతోషంగా తాళి కట్టేశాడు.
అతడు చేసిన మోసం నన్ను నిలువునా కుదిపేసింది. తను ఎవరికో తాళికట్టాడన్న బాధతో నా మెడలో ఉరి తాడు వేసుకోవాలనుకున్నాను. కానీ చివరి క్షణంలో అమ్మ వచ్చి నన్ను ఆపింది. అలా చేసినందుకు తను నన్ను కోప్పడలేదు. నా ఆవేదన చూసి కంటతడి పెట్టలేదు. ఒక్కటే మాట అంది. ‘‘అతను కాదన్నాడని చచ్చిపోవాలనుకున్నావా? నువ్వు ఆత్మహత్య చేసుకునేంత గొప్ప ప్రేమికుడా తను?’’
చెంప మీద కొట్టినట్లయ్యింది. దెబ్బకు దెయ్యం దిగినట్టనిపించింది. నిజమే. అతనో స్వార్థపరుడు. వాడి కోసం నా నిండు జీవితాన్ని బలి చేసుకోవాలా? నన్ను కాదని వెళ్లిపోయినవాడి కోసం... నేను కావాలనుకునే నా కుటుంబాన్ని వదిలేసి పోవాలా? చాలా ఆలోచించాను. కళ్లు తెరిచాను. జీవితంలో ప్రేమ, పెళ్లి ఒక భాగం తప్ప అవే జీవితం కాదన్న వాస్త వాన్ని గ్రహించాను. జీవితంలో స్థిర పడ్డాను. మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. చెల్లెళ్లను చదివిస్తు న్నాను. ప్రేమలో ఓడిపోయినా... జీవితంలో గెలిచాను. నాలా తొందరపడి ప్రాణాలు తీసుకోవాలనుకునేవారి కోసం ఈ రోజు నా జీవితాన్నిలా పరిచాను.
- స్నేహ, డోర్నకల్, వరంగల్ జిల్లా