అనంతరం: తండ్రి మనసెరిగిన తనయుడు | Malhar seeks to walk in his father Nana patekar steps | Sakshi
Sakshi News home page

అనంతరం: తండ్రి మనసెరిగిన తనయుడు

Published Sun, May 25 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

అనంతరం: తండ్రి మనసెరిగిన తనయుడు

అనంతరం: తండ్రి మనసెరిగిన తనయుడు

పెద్దయ్యాక నాన్నలా అవ్వాలని ప్రతి కొడుకూ అనుకుంటాడు. మల్హర్ కూడా అలానే అనుకున్నాడు. కానీ తన అడుగు జాడల్లో నడిచేందుకు తండ్రి అతడికి అనుమతినివ్వలేదు. అందుకే నానా పటేకర్ కొడుకుగా నటుడు కావలసినవాడు, నేడు దర్శకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాన్న మాటలే బతుకు పాఠాలుగా మార్చుకుని ముందుకు సాగిపోతున్నాడు!
 
 ఊహ తెలియగానే పిల్లాడికి కంటిముందు కనిపించే సూపర్‌హీరో... అతడి తండ్రే. మల్హర్‌కి కూడా తండ్రి నానా పటేకర్ అంతే. ఓ విలక్షణ నటుడికి కొడుకుగా పుట్టినందుకు అనుక్షణం గర్వించేవాడు మల్హర్. తండ్రి అడుగుల్లో అడుగులు వేస్తూ సాగిపోవాలనుకున్నాడు. కానీ అతడొకటి తలిస్తే... అతడి తండ్రొకటి తలిచాడు. ఫలితంగా మల్హర్ గమ్యం మారిపోయింది. అయినా నిరుత్సాహపడలేదు. తండ్రి ఇష్టమే తన ఇష్టంగా సాగిపోతున్నాడు. తండ్రి చూపిన బాట సరైనదని మనసా వాచా నమ్ముతున్నాడు.
 
 ‘నానా’లో  నాన్నకంటే నటుడినే ఎక్కువ చూస్తూ పెరిగాడు మల్హర్. అందుకేనేమో... తానూ నటుడినే అవ్వాలనుకున్నాడు. చిన్నప్పుడు ఓ రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు. పెద్దయ్యాక కూడా నటుడిగా నిరూపించుకోవాలనుకున్నాడు. అయితే తన ఆలోచనను తండ్రికి చెప్పలేదు. కామ్‌గా కామర్స్ కోర్సు పూర్తి చేశాక... ‘నేను నటుడిని అవ్వాలనుకుంటున్నాను నాన్నా’ అంటూ తండ్రి ముందు మనసు పరిచాడు.
 
 వెంటనే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనే అనుకున్నాడు మల్హర్. కానీ మౌనమే సమాధానంగా వచ్చింది.  తానో గొప్ప నటుడే అయినా... తన కొడుకుని నటుణ్ని చేయాలని నానా ఎప్పుడూ అనుకోలేదు. తాను చేసేది కాకుండా తన కొడుకు ఇంకేదైనా డిఫరెంట్‌గా చేయాలని ఆశపడ్డాడు. అలాగని బిడ్డని బలవంతంగా ఇష్టంలేని మార్గంలోకి తోసే కఠిన మనస్కుడు కాదాయన. అందుకే ఆలోచనలో పడ్డాడు. అవుననాలా, కాదనాలా అన్న సందిగ్ధంలో కాసింత కాలం కరిగిపోయింది. తరువాత తన మనసులోని మాటని కొడుకుతో చెప్పాడు నానా. ‘నువ్వు నటుడిగా కంటే డెరైక్టర్‌గా పైకి వస్తావు. అలా ఎందుకు ట్రై చేయకూడదు’ అన్నాడు. ‘అలానే ఎందుకు చేయాలి’ అని మల్హర్ అనలేదు. ‘నేననుకున్నది ఎందుకు చేయకూడదు’ అని ఎదురు ప్రశ్నించనూలేదు. సరే అన్నాడు. తండ్రి నిర్ణయం తన మంచి కోసమేనని నమ్మి అటుగా ప్రయత్నాలు ప్రారంభించాడు.
 
 నిజానికి మల్హర్‌ని నటన వైపు వెళ్లొద్దని నానా అనడానికి బలమైన కారణం ఉంది. మల్హర్ మొదట్నుంచీ సిగ్గరి. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అందరితోనూ సులువుగా కలిసిపోయే స్వభావం కాదు తనది. ఫొటో తీస్తాను నిలబడమంటేనే ఇబ్బందిపడిపోయే మనిషి. అలాంటివాడు నటుడిగా నిలదొక్కుకోలేడనిపించింది నానాకి. నటుడనేవాడు కెమెరాతో స్నేహం చేయాలి. కెమెరా ముందు తనను తాను పూర్తిగా పరచగలగాలి గానీ  ముడుచుకునిపోతే ఫెయిలవడం ఖాయం. అందుకే ఆయన కొడుకుని ప్రోత్సహించలేదని అంటారు మల్హర్ గురించి తెలిసిన అతడి సన్నిహితులు. అది మాత్రమే కాదు... మల్హర్‌ని తన దగ్గరే సహాయ దర్శకుడిగా పెట్టుకోమంటే కూడా నానా అంగీకరించలేదు. ‘నా దగ్గరయితే మొహమాటపడతాడు. ఫ్రీగా ఉండలేడు. కెరీర్ ప్రారంభంలో ప్రతిభను ప్రదర్శించేందుకు ఏదీ అడ్డు పడకూడదు. లేదంటే ఆదిలోనే కెరీర్ అంతమైపోతుంది’ అన్నారు నానా.
 
 మల్హర్ స్థానంలో మరే కొడుకు ఉన్నా తండ్రిని అపార్థం చేసుకునేవాడేమో. తండ్రి తన ఇష్టాన్ని చంపేస్తున్నాడనీ, తనకు సహాయపడటం లేదనీ అనుకునేవాడేమో. మల్హర్ మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. మెచ్యూర్డ్‌గా ఆలోచించాడు. తండ్రి తనకు ఎందుకలా చెప్పివుంటాడో అంచనా వేసేందుకు ప్రయత్నించాడు. ఆయన సలహాలను పాటిస్తూ, ఆయన చూపిన దారిలో సాగిపోవాలని నిర్ణయించుకున్నాడు. రామ్‌గోపాల్ వర్మ దగ్గర సహాయకుడిగా చేరాడు. నిజానికి వర్మ సినిమాతో నటుడిగా పరిచయమవ్వాలతడు. కానీ తండ్రి కోసం నటించాలన్న ఆలోచనను పక్కన పెట్టి మెగాఫోన్‌ను అందుకునేందుకు సిద్ధమయ్యాడు.
 
 నీకిష్టమైన నటనను వదులుకున్నందుకు బాధలేదా అని ఎవరైనా అంటే... అలాంటిదేమీ లేదంటాడు మల్హర్ నవ్వుతూ. కనీసం ఎప్పటికైనా నటిస్తావా అని అడిగితే... ‘ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు, భవిష్యత్తు సంగతి తెలియదు, ఇప్పుడైతే ఫిల్మ్ మేకింగ్ గురించి పూర్తిగా నేర్చుకునే పనిలో ఉన్నాను, మనసంతా దానిమీదే ఉంది’ అంటాడు. తండ్రిలా నటుడు కాకపోయినా... ఆయన రక్తంతో పాటు పట్టుదలను, సృజనాత్మకతను, నిబద్దతను పంచుకున్నాడు మల్హర్. వాటి సహాయంతో అతడు ఎంచుకున్న రంగంలో తప్పకుండా దూసుకుపోగలడు. తండ్రి ఆశను, ఆశయాన్ని నెరవేర్చనూగలడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement