సాక్ష్యం | Malladi Venkata Krishna Crime Stories - 18 | Sakshi
Sakshi News home page

సాక్ష్యం

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

సాక్ష్యం

సాక్ష్యం

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  18
కల్నల్ బ్రాక్స్‌టన్ తన స్టేట్‌మెంట్ పూర్తయ్యాక కోర్టు ప్రొసీడింగ్స్‌ని మౌనంగా గమనించసాగాడు.
 ‘‘కౌంటీ ఆఫీసర్‌గా నేను స్వీకరించిన ట్యాక్స్ మొత్తం పది వేల డాలర్లని ఆ రాత్రి ఆఫీస్ నించి ఇంటికి తెచ్చాను. నా భార్య ఇంట్లో లేదు. ఇంటికి వచ్చిన కొద్దిక్షణాలకి ఒంటరిగా ఉన్న నాకు ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. లేచి వెళ్లి తలుపు తెరిస్తే ఎదురుగా గడ్డం నించి ముక్కు దాకా ఎర్ర రంగు కర్చీఫ్ కట్టుకున్న ఓ వ్యక్తి చేతిలో పిస్తోలుతో కనిపించాడు.

అతను నన్ను ట్యాక్స్ డబ్బివ్వమని బలవంతం చేస్తే ఇచ్చాను. తర్వాత నన్ను బట్టల అలమరాలోకి వెళ్లమని తలుపు మూసి బయట గడియపెట్టి వెళ్లిపోయాడు. నేను తలుపుని లోపల నించి కాళ్లతో తన్నాను. అది తెరచుకోకపోవడంతో గొంతు పగిలేలా అరిచాను. మా ఇల్లు హైవేకి నా అరుపులు వినపడనంత దూరంలో ఉంది. మా ఇంటి చుట్టుపక్కల ఇళ్లు లేవు’’ హెండర్సన్ చెప్పాడు.
 తర్వాత సాక్షిగా వచ్చిన పాలవాడు చెప్పాడు.
 
‘‘ఆ ఉదయం నేను హెండర్సన్ ఇంటి బెల్ నొక్కగానే లోపల నించి ఆయన అరుపులు వినిపించాయి. తలుపు తోస్తే తెరచుకుంది. లోపలికి వెళ్లి బట్టల అలమార గడియ తీస్తే అలసి పోయిన ఆయన కనిపించాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను.’’
‘‘అతన్ని మీరు క్రాస్ ఎగ్జామ్ చేస్తారా?’’ జడ్జి డిఫెన్స్ అటార్నీని అడిగాడు.
 అతను లేదన్నట్లుగా చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడు. తర్వాత కల్నల్ బ్రాక్స్‌టన్ కోర్టుకి ఇలా చెప్పాడు.
 
‘హెండర్సన్ నించి ఫోన్ రాగానే వెళ్లి, నేరస్థుడి వర్ణనని రాసుకున్నాను. అది మా ఫైల్స్‌లోని ఒకతనికి సరిపోవడంతో అతని ఫొటోని కౌంటీ ఆఫీసర్ హెండర్సన్‌కి చూపించాను. అతను గత రాత్రి తన ఇంటికి వచ్చిన మనిషేనని కళ్లని చూసి గుర్తుపట్టాడు.’’
 ‘‘కాని నేనా దొంగతనం చేయలేదు’’ నిందితుడు చార్లీ కళ్లనీళ్లతో చెప్పాడు.
 ‘‘ఆ సమయంలో ఎక్కడ ఉన్నావు?’’ ప్రాసిక్యూటింగ్ అటార్నీ అడిగాడు.
 
‘‘నా గదిలోనే ఉన్నాను. టీవీ చూస్తున్నాను’’ చార్లీ జవాబు చెప్పాడు.
 ‘‘నువ్వు నీ గదిలో ఉన్నట్లు ఎలిబీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా?’’
 ‘‘లేరు. నేను, నా భార్య విడిపోయాం. నేను కొన్నేళ్లు జైల్లో ఉండగా విడాకులు తీసుకుని ఆమె ఇంకో పెళ్లి చేసుకుంది.’’
 ‘‘ఓ! నువ్వు జైలు పక్షివే అన్నమాట!
 
‘‘కాని నేను విడుదలై ఏడేళ్లయింది. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు ఎవరూ మా ఇంటికి రాలేదు. కారు మెకానిక్‌గా నిజాయితీగా జీవిస్తున్నాను’’ చార్లీ అసహనంగా చెప్పాడు.
 చార్లీ తరఫు లాయర్ కోర్టుకి చెప్పిన మాట అందర్నీ ఆశ్చర్యపరచింది.
 ‘‘యువరానర్. ముద్దాయి తరఫున నేను ఒక్క సాక్షినీ ప్రవేశపెట్టడం లేదు.’’
 ఆ లాయర్‌కి అతన్ని రక్షించే ఉద్దేశం లేదని, అతన్ని కోర్టు దయకి వదిలేశాడని చాలామంది చెవులు కొరుక్కున్నారు.
 
బీదవాడైన చార్లీకి కౌంటీ నియమించిన లాయర్ కాబట్టి కేసు గెలిచినా, ఓడినా అతనికి ఒరిగేదేం లేదు. అతని ఫీజ్ అతనికి ఎటూ ముడుతుంది.
కొందరు అతనిది బాధ్యతారాహిత్యం అని కూడా భావించారు. జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు. చార్లీ పాత దొంగ అని తెలియగానే జ్యూరీ సభ్యుల్లో కొందరికి ఇది అతని పనే అనే అనుమానం కూడా కలిగింది. కేసు విచారణ పూర్తయ్యాక ప్రాసిక్యూటింగ్ అటార్నీ లేచి నిలబడి అడిగాడు.
 
‘‘మై ఫ్రెండ్! మీరు నిజంగా మీ క్ల్లైంట్ తరఫున సాక్షుల్ని ఎవర్నీ ప్రవేశపెట్టడం లేదా? తర్వాతి ప్రొసీడింగ్స్‌లోకి వెళ్తే ఇక మీకు ఆ అవకాశం ఉండదు.’’
 ‘‘లేదు. కాని కోర్టు అనుమతితో నేను ఓ సాక్ష్యాన్ని ప్రవేశ పెట్టదలచుకున్నాను.’’
 ‘‘అదేమిటి? మీరు సాక్షుల్ని ప్రవేశ పెట్టనన్నారు?’’ ప్రాసిక్యూటింగ్ అటార్నీ అడిగాడు.
 ఆయన చిరునవ్వు నవ్వి అడిగాడు.
 ‘‘మీకు సాక్షికి, సాక్ష్యానికీ తేడా తెలీదా?’’
 
‘‘ఏమిటా సాక్ష్యం?’’ జడ్జి కూడా ఆసక్తిగా అడిగాడు.
 ‘‘అందుకు నేను హెండర్సన్‌ని క్రాస్ ఎగ్జామ్ చేేన  అవకాశం ఇప్పుడు వినియోగించుకుంటాను.’’
 ‘‘సరే’’ జడ్జి అనుమతి ఇచ్చాడు.
 హెండర్సన్ బోనులోకి వచ్చాక డిఫెన్స్ అటార్నీ ప్రశ్నించాడు.
 ‘‘బట్టల అలమరాలో మీరు బంధింపబడ్డాక ఏం జరిగిందో మరోసారి చెప్తారా?’’
 
‘‘ఆ పిస్తోలుతో బెదిరించి చార్లీ నన్ను లోపలికి పంపాడు. తలుపు మూయగానే అంతా చీకటి.
 బయట తలుపుకి గడియ పెట్టిన చప్పుడు వినిపించింది. నేను ఆ తలుపుని నా చేతులతో బాదుతూ తెరవమని అరిచాను. నా కాళ్లతో బలంగా చాలాసేపు తన్నాను. ఆ తర్వాత అలసిపోయి నిద్రపోయాను.’’
 ‘‘మీరు ఆఫీస్ నించి ఆ డబ్బుతో వచ్చిన ఎంతసేపటికి ఇది జరిగింది?’’
 ‘‘తక్షణం. నేను బయట నించి డబ్బుతో అప్పుడే ఇంట్లోకి వచ్చాను. వెంటనే బెల్ కొట్టి లోపలికి వచ్చాడు.’’
 
‘‘అంటే మీరు ఇంకా బూట్లు విప్పి ఉండరు కదా?’’
 ‘‘అవును... కాపేసినట్లున్నాడు చార్లీ. నేను దుస్తులు మార్చుకునే లోపలే బెల్ నొక్కాడు. నేను తలుపు తెరిచాక జరిగింది మళ్లీ చెప్పనా?’’
 ‘‘అవసరం లేదు. బూటు కాళ్లతో తన్నడం నిజమేనా?’’
 ‘‘కాళ్లకి బూట్లు ఉంటే వాటిని విప్పి తన్నేవాడు మూర్ఖుడు అవుతాడు’’ హెండర్సన్ నవ్వుతూ చెప్పాడు.
 
డిఫెన్స్ అటార్నీ సైగ చేయగానే కోర్టు హాల్ తలుపు తెరుచుకుంది. లోపలికి ఇద్దరు సాక్ష్యాన్ని మోసుకు వచ్చారు. దాన్ని చూడగానే కోర్టులో గుసగుసలు.
 ‘‘ఆర్డర్. ఆర్డర్’’ జడ్జి అరిచాడు.
 డిఫెన్స్ అటార్నీ చెప్పాడు.
 ‘‘యువరానర్. ఇదే నేను ప్రవేశపెట్ట దలచుకున్న సాక్ష్యం. ఇది హెండర్సన్ ఇంట్లో, ఆయన్ని బంధించిన బట్టల అలమరా తలుపు. తప్పించుకోడానికి అతను తన బూట్ల కాళ్లతో బలంగా తన్నిన భాగాన్ని గమనించండి.’’
 
జడ్జితో పాటు మిగిలిన వారంతా దానివైపు చూశారు. పిడికి వెనక భాగంలో తెల్లటి రంగు వేయబడ్డ ఆ తలుపు నిగనిగలాడుతోంది. ఎక్కడా చిన్న మరక కాని, గుర్తు కాని లేదు.
 ‘‘యువరానర్. అది మిస్టర్ హెండర్సన్ అల్లిన కట్టుకథ మాత్రమే. ఈ కేస్‌ని పరిశోధించిన మేధావి బ్రాక్స్‌టన్ దృష్టిని ఏదీ తప్పించుకోలేదు అన్నది హెండర్సన్‌కి తెలీదు.’’
 
డిఫెన్స్ అటార్నీ కల్నల్ బ్రాక్స్‌టన్ వంక చూసి సైగ చేశాడు.
 బ్రాక్స్‌టన్ వచ్చి ‘కోర్టు అనుమతితో’ అని చెప్పి కుడి బూటు కాలితో ఆ తలుపు మీద తన్నాడు. తన్నిన చోట తెల్లటి రంగు పెచ్చు లేచింది.
 ‘‘యువర్ ఆనర్. దొంగిలించబడ్డ డబ్బుని ఎక్కడ దాచాడో నేరస్థుడు హెండర్సన్ చెప్తే, ముద్దాయిని మీరు నిర్దోషిగా ఇంటికి పంపచ్చు’’ డిఫెన్స్ అటార్నీ చెప్పాడు.
 హెండర్సన్ మొహంలో అతను పట్టుబడ్డ తాలూకు అవమానం కోర్టులోని వారందరికీ ప్రస్ఫుటంగా కనిపించింది.
(మెర్‌విల్ డేవిసన్ పోస్ట్ కథకి స్వేచ్ఛానువాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement