భాగస్వామి
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 2
కాలిఫోర్నియాలోని ఆ చిన్న గ్రామంలో కెల్లీ అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. అతనికి బ్రింక్సీ ఎదురుపడ్డాడు. ‘‘నువ్వు నీ వృత్తిని మార్చుకోకపోతే నువ్వు మరోసారి జైలు లోపలి భాగం చూడాల్సి ఉంటుంది’’ కెల్లీ బ్రింక్సీని బెదిరించాడు. అప్పటికే రెండుసార్లు జైలుకి వెళ్లొచ్చిన బ్రింక్సీని కెల్లీ గతంలో చాలాసార్లు హెచ్చరించాడు.
‘‘నన్నొక్కడినీ జైలుకి పంపి, ఈ ఊరిని రక్షించావనుకోకు. నాలాంటివాళ్లు వందల మంది ఇక్కడ ఉన్నారు’’ బ్రింక్సీ జవాబు చెప్పాడు.
‘‘అందుకే రేపటి నించి నాకు ఓ కొత్త పోలీసు భాగస్వామి వస్తున్నాడు. వాడు ఒకేసారి నీలాంటి ఇరవై మందిని ఎదుర్కోగలడు’’.
‘‘ఎవరు?’’... బ్రింక్సీ ఆసక్తిగా అడిగాడు.
‘‘నా కొత్త పార్ట్‌నర్ పేరు పీటర్. జర్మనీలోని ఆక్స్‌బర్గ్ అతని స్వగ్రామం. ఇటీవలే అమెరికాకి వలస వచ్చాడు.’’
‘‘చూద్దాం’’... బ్రింక్సీ నిర్లక్ష్యంగా అన్నాడు.
అధికారులు పీటర్ గురించి చెప్పగానే కెల్లీ మొదట్లో పీటర్‌ని తన భాగస్వామిగా తిరస్కరించాడు. కానీ క్రమేపీ అతను తనకి ఎంత అండగా ఉంటాడో అర్థమైంది. అందుకు కారణం పీటర్ పొందిన శిక్షణ. భయంకరంగా, నల్లగా కనిపించే పీటర్... కెల్లీ ఇంట్లోనే బస చేయసాగాడు. కెల్లీ భార్య నోరా ఈ కొత్త అతిథిని అంగీకరించింది. పిల్లలు మాత్రం పీటర్‌కి దూరంగా మెసలసాగారు. కారణం పీటర్ వాళ్లని తన దగ్గరకు రానీడు.
రాత్రుళ్లు పెట్రోలింగ్‌లో తన భర్తకి తోడుగా పీటర్ ఉండటం కెల్లీ భార్యకి సంతోషాన్ని ఇచ్చింది. నోరాకి గల ఒకే సమస్య పీటర్ ఎక్కువ మాంసం తినడం. ఆ రాత్రి ఒకటిన్నర దాటాక పీటర్‌తో కలిసి కెల్లీ పెట్రోలింగ్ చేశాడు. డ్యూటీ దిగబోయే ముందు ఆఖరుగా ఎక్స్‌ప్రెస్ స్ట్రీట్‌లోని స్థానిక బ్రీవరీకి చేరుకున్నాడు. అందులోంచి బీర్ బాటిల్ కేసులని ఎవరో తరచు దొంగిలిస్తున్నారని, రాత్రిళ్లు బీట్‌లో చూడమని కెల్లీకి ఆ ఉదయమే లెఫ్టినెంట్ సూచించాడు.
బ్రీవరీ బయట ఓ వేన్ ఆగి ఉండటం, ఎవరో దాన్లోకి బీర్ కేన్స్‌ని ఎక్కించడం గమనించిన కెల్లీ... డ్రైవింగ్ తలుపు తెరిచి, దిగి, తన భాగస్వామి పక్కన ఉన్న తలుపు కూడా తెరిచి చెప్పాడు.
‘‘పీటర్... మనకి పని పడినట్లుంది. దిగు.’’ ఇద్దరూ అక్కడికి వెళ్లారు. ఆ వేన్ అప్పటికే సగానికి పైగా బీర్ కేన్స్‌తో నిండింది. లోపల నించి బీర్ కార్టన్స్‌ని మోసుకొచ్చే వ్యక్తి మొహం వాటిని వేన్‌లో ఉంచేదాకా కెల్లీకి కనపడలేదు. అతను బ్రింక్సీ!
‘‘బ్రింక్సీ... నువ్వు నా హెచ్చరికను ఖాతరు చేయలేదు. రెడ్ హేండెడ్‌గా పట్టుబడ్డావు’’ బెల్ట్‌కి ఉన్న బేడీలని తీస్తూ అన్నాడు చెల్లీ.
నివ్వెరపోయిన బ్రింక్సీ కొద్ది క్షణాల్లో తేరుకుని తన నడుంకి, బెల్ట్‌కి మధ్య దాచిన రివాల్వర్‌ని తీసి నవ్వుతూ కెల్లీకి గురిపెట్టాడు.
‘‘వీడేనా పీటర్?’’... బ్రింక్సీ అడిగాడు.
‘‘అవును. తన ప్రతాపం చూస్తావా?’’
‘‘చూస్తాను’’... ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు బ్రింక్సీ.
‘‘పీటర్... గెట్ హిమ్’’... వెంటనే కెల్లీ ఆజ్ఞాపించాడు.
తక్షణం పీటర్ బ్రింక్సీ మీదకి దూకి వాడి కాలు పట్టుకున్నాడు. బ్రింక్సీ చేతిలోని రివాల్వర్ పేలి గుండు పీటర్ తల్లోంచి దూసుకుపోయింది.
‘‘డ్యూటీలో ఉన్న పోలీస్‌ని చంపడం ఎంత నేరమో తెలుసా?’’ కెల్లీ అరిచాడు. అతని చేతిలోని రివాల్వర్ కూడా పేలింది. బ్రింక్సీ కుడి భుజంలో ఆ గుండు గుచ్చుకుంది. బ్రింక్సీ చేతిలోని రివాల్వర్ కింద పడిపోయింది.
‘‘దొంగతనం చేస్తూ రెడ్ హేండెడ్‌గా పట్టుబడి, డ్యూటీలో ఉన్న పోలీస్‌ని చంపావు. కాబట్టి నిన్ను చంపినా నాకేం కాదు. నా గుండు గురి తప్పింది.’’
కెల్లీ చేతిలోని పిస్తోలు మళ్లీ పేలింది. బ్రింక్సీ మరణించబోయే ముందు ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘పీటర్ పోలీస్ ఎందుకవుతాడు? కుక్క...’’
‘‘పీటర్ నా భాగస్వామి’’... కళ్లల్లోంచి నీళ్లు కారుతూండగా, నిశ్చలంగా పడి ఉన్న ఆ జర్మన్ షెఫర్డ్ కుక్కని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు కెల్లీ.
మూలం: జేమ్స్ హోల్డింగ్ కథ