
ఫేస్ బుక్‌లో అద్వైతం
మే 11 శంకర జయంతి
జీవుడు, దేవుడు ఒక్కటేనంటూ అద్వైతాన్ని బోధించాడాయన. బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశాడాయన.శివకేశవులపై పలు స్తోత్రాలను విరచించడమే కాదు... జగజ్జననిని స్తుతిస్తూ సౌందర్యలహరి రాశాడాయన. తన బోధనలతో మానవాళిని భగవంతునికి చేరువ చేశాడాయన.ఆయనే ఆది శంకరాచార్యులు. జీవించింది ముప్పయి రెండేళ్లే అయినా...మానవాళిని సంస్కరించేందుకు అనల్పమైన కృషి చేశాడాయన. అందుకే నేటికీ ఆయన అందరికీ ఆరాధ్యుడు. కంప్యూటర్ తరం కూడా ఆయన బోధలతో స్ఫూర్తి పొందుతుండటమే ఇందుకు నిదర్శనం.
నేను ఎవరిని?
శంకరాచార్యుల జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే జ్ఞానానికి చేరువ కావడమే.
గోవింద భగవత్పాదులకు శంకరాచార్యులు చెప్పిన సమాధానం పదే పదే మననం చేసుకోవడం నాకు ఇష్టం.
‘నువ్వు ఎవరు?’ అనే ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
‘నేను నింగిని కాదు.
భూమిని కాదు.
నీటిని కాదు.
అగ్నిని కాదు. గాలిని కాదు.
ఎటువంటి గుణాలూ లేనివాడిని.
ఇంద్రియాలు కాని వేరే చిత్తంగాని లేనివాడిని.
నేను శివుడను. విభజన లేని జ్ఞానసారాన్ని.’
- వి.నవీన, విద్యార్థిని
ఆత్మసిద్ధాంతం
ఆత్మ గురించి శంకరుల భావాలు నాకు విశిష్టంగా అనిపిస్తాయి. అనేక పొరలను విప్పి అంతిమ సత్యాన్ని చెప్పినట్లు అనిపిస్తాయి. ఆత్మ గురించి ఆయన ఇలా అంటారు...
‘ఆత్మ స్వయంప్రకాశం కలది. బుద్ధికి, మనసుకు, ఇంద్రియాలకు ఆత్మ ఒక సంధానకర్తగా ఉంటుంది. తర్కం ద్వారా ఆత్మను తెలుసుకోలేం. అయితే మనకు లభించే జ్ఞానం ఆత్మస్వరూపమే. జ్ఞానం-ఆత్మ రెండూ భిన్నమైనవి కావు. ఈ రెండూ ఒకటే. ఆత్మతో సంబంధం లేని జ్ఞానం కాని, అనుభవం కాని ఉండవు. ఆత్మను గురించి ఏ ప్రమాణం ద్వారాను తెలుసుకోలేము. అన్ని ప్రమాణాలకూ ఆత్మే ఆధారం.’
- జి.శ్రీకర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఈ ప్రపంచం పాము కుబుసం!
భ్రమ, వాస్తవాల గురించి చిన్న చిన్న ఉదాహరణలతో గొప్పగా చెప్పారు శంకరాచార్యులు. ఆయన చెప్పిన ‘ప్రాతిభాసిక సత్త’, ‘వ్యవహార సత్త’ ఎప్పుడూ మనసులో మెదులుతూనే ఉంటాయి. వాటి గురించి ఆయన ఇలా చెప్పారు...
‘కంటికి కనిపిస్తుంది కానీ, అది యదార్థం కాదు. దీన్ని ‘ప్రాతిభాసిక సత్త’ అంటారు. ముత్యపు చిప్పను చూసి వెండి అనుకోవడం, తాడును చూసి పాము అనుకోవడం, ఎండమావులను చూసి నీటికొలను అనుకోవడం... ఇలాంటివే. ‘వ్యవహార సత్త’ అంటే నిత్యం మనం చూసే ప్రపంచం. దీనికి ఉనికి ఉన్నది. అది ఎప్పటిదాకా అంటే... విజ్ఞాన ఘనమైన బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకునేంత వరకు. ఆ తరువాత ఈ ప్రపంచం పాము కుబుసంలా నిష్ర్పయోజనం.’ ఎంత గొప్ప విషయాలో కదా!
- ఆర్.వి.ప్రమోద్, బీటెక్ విద్యార్థి
మహిమాన్వితుడు
కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో ఆర్యాంబ, శివగురు దంపతులకు శంకరులు జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోయారు. శంకరులు ఏకసంథాగ్రాహి. చిన్న వయసులోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్లి భిక్ష అడుగుతాడు శంకరుడు.
భిక్ష వేయడానికి ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరి కాయను దానం చేస్తుంది ఆ పేదరాలు. దీనికి చలించిపోయిన శంకరులు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది. ఒకరోజు శంకరుల తల్లి ఆర్యాంబ నది నుంచి నీళ్లు తెచ్చుకుంటూ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకే తెప్పించి ప్రజలను ఆశ్చర్యపరుస్తారు!