స్వప్న శిథిలాలు
మై జాన్తీ హు
నేను స్వాప్నికురాలిని అని
మూడు రాళ్ల పొయ్యి దగ్గర కూర్చుని
అమ్మీజాన్ తెగిన
నల్లపూసల దండకి పదోసారి ముడి వేస్తున్నప్పుడు
అనుకున్న
రెక్కలు కట్టుకుని అనంత తీరాలకు
ఎగిరెళ్లాలని
బుధుడు, శుక్రుడు, గురుడు
గ్రహాలన్నింటిని వరుసగా
మాలగుచ్చి
సూర్యుడ్ని మధ్య వేలాడేసి
అమ్మ మెడలో అలంకరించాలని
మై జాన్తీ హు...
నేను కలలను శ్వాసిస్తానని...
చినిగిన చీరను బురఖా నీడన
దాచుకుని అమ్మ బజారుకు
వెళుతున్నప్పుడు అనుకున్నాను
నీలాకాశాన్ని మడత పెట్టి
అమ్మీజాన్‌కు కానుకగా ఇవ్వాలని
మై జాన్తీ హు...
నా కలలు అందమైనవని...
పది మంది పిల్లలను సాకలేక
ఆగమాగ మవుతుంటే
అనిపించింది
ప్రపంచం అంతా చుట్టి
ఆకుపచ్చని అడవంతటిని మూట కట్టి
వాలిద్ సాహెబ్ పాదాల చెంత పెట్టాలని...
మై జాన్తీ హు...
నాకో కలల ప్రపంచం ఉందని...
పెళ్లి చేయలేక మూడో అక్కను
ముసలోడి చేతిలో పెట్టినప్పుడు
అనుకున్నాను
మరో ప్రపంచం చివరి నుంచి
రెక్కల గుర్రంపై ఎగిరి వచ్చే
రాకుమారుడిని ఆపా కోసం తేవాలని
మై జాన్తీ హు...
ఓ రోజు నా కలలూ ఛిద్రం అవుతాయని
స్వప్నాల శిథిలాల కింద
నలిగిన దేహపు ముక్కల్ని పేర్చి
అమ్మీజాన్ లా, దాదీమా లా
జీవించేయాలని...
మరో దారి లేదని....