చేతి రాత మారుద్దా? | Michael temer the nature lover | Sakshi
Sakshi News home page

చేతి రాత మారుద్దా?

Published Sun, Feb 7 2016 2:55 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

చేతి రాత మారుద్దా? - Sakshi

చేతి రాత మారుద్దా?

 విహారం
 ‘ఒక మనిషి మరో మనిషిని పలకరించక పోవచ్చునేమోగానీ... ప్రకృతి అలా కాదు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తుంది.  సముద్రాన్నే తీసుకుందాం. దాని వైపు చూస్తే... అలలు మనలను ఆప్యాయంగా పలకరిస్తాయి. మనం తిరిగి వాటిని పలకరించే వరకు అవి పలకరిస్తూనే ఉంటాయి’ అని తన డైరీలో ఒక చోట రాసుకున్నాడు మైఖేల్ టెమెర్ అనే ప్రకృతి ప్రేమికుడు.
 
 అదెంత నిజమో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుంది... ఉరుగ్వేలోని పుంట దెల్ ఎస్తే నగరం. అట్లాంటిక్ సముద్ర తీరాన ఉన్న ఈ నగరం... పేరుకు నగరమేగానీ అక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ  ప్రశాంతత రాజ్యమేలుతుంది. అర్జెంటీనియన్లు, బ్రెజిల్ వారు, యురోపియన్లు తమ విశ్రాంతి విడిదిగా పుంట దెల్‌ను ఎంచుకోవడానికి ఈ ప్రశాంతతే కారణం.పుంట దెల్‌లో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన మొక్కలు, చెట్లు ఉన్న బొటానికల్ గార్డెన్, కమర్షియల్ గ్యాలరీలు, కాసినో, పాపులర్ హ్యాండీక్రాఫ్ట్ మార్కెట్లు... మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నప్పటికీ... అందరినీ మొట్టమొదట ఆకర్షించేది మాత్రం పుంట దెల్ బీచ్‌లో ఏర్పాటు చేసిన ‘ల మనో’ శిల్పం!
 
 ‘ల మనో’ అంటే హస్తం. చిలీకి చెందిన ఆర్టిస్ట్ మారియో దీనిని రూపొందించాడు. ఆధునిక శిల్ప కళారీతులపై జరిగిన ఒక సదస్సు కోసం ఒకసారి పుంట దెల్‌కు వచ్చాడు మారియో. తన గుర్తును అక్కడ వదిలి వెళ్లడం కోసమని ఈ అభయ హస్తానికి రూపకల్పన  చేశాడు. సముద్రంలో మునకలు వేయాలనుకునే వాళ్లను ‘జాగ్రత్త సుమా’ అని చ్చరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ల మనో. దాంతో దీన్ని సెంటిమెంటుగా భావించేవారు ఎక్కువయ్యారు.
 
 ‘‘ల మనో ప్రభావం వల్ల  కావచ్చు... మునుపటిలా సముద్ర మరణాలు కనిపించడం లేదు’’ అంటాడు ఫ్రాన్సిస్కో గిరో అనే స్థానికుడు. ‘‘దెల్ బీచ్‌లో ఉండే ప్రశాంతత వేరు. ల మనో దగ్గర ఉండే ప్రశాంతత వేరు. అక్కడికి వెళ్లి కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనసంతా తేలిక పడిపోతుంది. ఆ చేతి వేళ్లలో ఏదో మహత్తు ఉందని అనిపిస్తుంది’’ అంటాడు నెల్సన్ బార్బోసా అనే బ్రెజిలీయుడు.  వీళ్లే కాదు. ఇక్కడకు వచ్చి ఈ హస్తాన్ని చూసినవాళ్లందరూ కూడా దాదాపు ఇలాంటి మాటలే చెబుతారు.

ఒక నిఖ్సారైన కళాకృతిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... అది తన గురించిన ఆలోచనలు, భావాలను విస్తృతపరుస్తుంది అంటారు పెద్దలు.‘ల మనో’ను చూసినప్పుడు కూడా అలాంటి విస్తృత భావాలు మన మనసుకు చేరువవుతాయి. ప్రపంచమంతా నిండిపోతోన్న అన్యాయం, ఒంటరితనం, విచారం, హింస... మొదలైన వాటిపై ‘ల మనో’ నిశ్శబ్దంగా భావ ప్రకటన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ‘ఇనుము, కాంక్రీట్ పునాదిపై కాదు, మనిషి భావో ద్వేగాల పునాదిపైనే  ల మనో నిర్మాణం జరిగింది’  అనేవాళ్లు కూడా ఉన్నారు.
 
 ఈ అభయ హస్తం చుట్టూ ఎన్నో నమ్మకాలు కూడా ఏర్పడ్డాయి. కొందరైతే ల మనో దగ్గరికి వెళ్లి మనసులో కోరికలు ఫలించాలని కోరుకుంటున్నారు కూడా. ఆరోగ్యం మెరుగు పడాలని, ప్రేమ ఫలించాలని, ఉద్యోగం రావాలని ఆ చేతిని తాకి ప్రార్థిస్తున్నారు. కొందరైతే తమ కోరికను సుద్దతో చేతిమీద రాసి, తుడిపేస్తారు. అలా చేస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. ఈ నమ్మకాల విషయం ఎలా ఉన్నా.... ‘లమనో’ ఓ ప్రముఖ పర్యాటక కేంద్రం అనడంలో సందేహం లేదు!                                      
                                      
 నమ్మకం బంధాలను నిలబెడుతుందని చెప్తారు పెద్దలు.నమ్మకం గొప్ప నిర్మాణాలకు కూడా దారి తీస్తుందని చెప్తోంది ఈ హస్తం. ఉరుగ్వేలో ఉన్న ఈ హస్తంతో ముడిపడిన ఆ నమ్మకం ఏమిటి?!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement