గోరంత అందాలు
నెయిల్ ఆర్ట్
ఇది ‘సెయింట్ ప్యాట్రిక్స్ డే’ నెయిల్ ఆర్ట్ రకాలలో ఒకటి. దీన్ని వేసుకోవడానికి ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగుల నెయిల్ పాలిష్‌లు, ట్రాన్స్‌పరెంట్ టేప్, సిల్వర్ గ్లిట్టర్, ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌లు సిద్ధం చేసుకోవాలి. ఈ నెయిల్ ఆర్ట్ చాలా సింపుల్‌గా అందంగా కనిపిస్తుంది. దీన్ని వేసుకోవడం చాలా సులువు కూడా. ముందుగా గోళ్లను శుభ్రం చేసి, అందంగా కత్తిరించుకోవాలి. తర్వాత ఈ డిజైన్‌ను వేసుకోవాలి. ఎలా అంటారా? ఇదిగో ఇలా...
1. ముందుగా గోరుపై క్రాస్‌గా ట్రాన్స్‌పరెంట్ టేప్‌ను అతికించాలి. తర్వాత మిగిలిన భాగం గోరుపై ఆకుపచ్చ రంగు పాలిష్‌ను పూయాలి.
2. ఆ తర్వాత టేప్‌ను తొలగించాలి. అలా చేయడం వల్ల టేప్ పెట్టిన భాగానికి పాలిష్ అంటకుండా ఉంటుంది.
3. ఇప్పుడు ఆకుపచ్చరంగు పూర్తిగా ఆరాక ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌ను అప్లై చేయాలి. ఆ తర్వాత నలుపురంగు పాలిష్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా గీతలు గీయాలి.
4. అలాగే తెలుపురంగు పాలిష్‌తో నల్ల గీతల పక్కన తెల్ల గీతలు గీయాలి.
5. తర్వాత టేప్ తొలగించిన భాగంలో నలుపురంగు పాలిష్‌తో చిన్న చిన్న పువ్వులు గీయాలి.
6. మూడు పువ్వుల కింద ఓ చిన్న గీతను కూడా గీయాలి. పాలిష్ పూర్తిగా ఆరాక వాటిపై ఆకుపచ్చరంగును అద్దాలి. అలాగే ఆకుపచ్చ డిజైన్, పువ్వుల భాగం మధ్యలో సిల్వర్ గ్లిట్టర్‌తో ఓ డివైడింగ్ లైన్ గీయాలి. ఇదే విధంగా అన్ని గోళ్లకూ సేమ్ డిజైన్‌ను వేసుకొని, చివరగా ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌ను పూయాలి.