ఎవిడెన్స్ | Neil Schofield Story | Sakshi
Sakshi News home page

ఎవిడెన్స్

Published Sun, Nov 15 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

ఎవిడెన్స్

ఎవిడెన్స్

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  23
నేను మరో హంతకుడితో సెల్‌లో ఉన్నాను. అతని పేరు జాన్. తన భార్యని చంపాడన్న అభియోగం మీద అతను శిక్ష అనుభవిస్తున్నాడు. తను నా అభియోగం మీద ఆసక్తిని చూపించాడు. జరిగింది ఒకటికి పదిసార్లు నా చేత చెప్పించుకుని శ్రద్ధగా కళ్లు మూసుకుని విన్నాడు.
 ‘‘నేను దొంగని తప్ప హంతకుడ్ని కాను. నేను చేయని హత్యని పోలీసులు నామీద రుద్దారు. హంతకులు ఎవరో నాకు చూచాయగా తెలుసు’’ చెప్పాను.
   
నేను కిటికీ అద్దాలు పగలగొట్టుకుని అర్ధరాత్రుళ్లు చీకట్లో రహస్యంగా ఇళ్లల్లోకి ప్రవేశించే దొంగను కాను. అది నాకు ఇష్టం లేని పని. ఆహ్వానంపై ఇళ్లకి వెళ్లి, దొంగతనం చేయడం నా వృత్తి. అలా ఆహ్వానం అందుకోడానికి ఓ మార్గం... అమ్మకానికి ఉన్న ఇళ్లకి కొనుగోలు దారుడిలా వెళ్లడం. అక్కడ వారి కన్నుగప్పి జేబులో పట్టే విలువైన వస్తువులు తస్కరించడం నా వృత్తి.
 ఓ రోజు నా గాలానికి ఇళ్ల బ్రోకర్ గ్లోరియా చిక్కింది. ‘ఇల్లు అమ్మకానికి’ అన్న ప్రకటనకి నేను ఎప్పటిలానే జవాబు రాశాను. గ్లోరియా నాకు ఫోన్ చేసి అడిగింది.
 ‘‘మిస్టర్ చార్లీ?’’
 ‘‘అవును. మీరు?’’
 ‘‘నా పేరు గ్లోరియా. ఇల్లు కొందామనుకుంటున్నారా?’’
 ‘‘అవును. మీ ప్రకటనని చూశాను.’’
 ఆ ఇంటి విస్తీర్ణం, వయసు లాంటివి అడిగి తెలుసుకుని చెప్పాను.
 ‘‘నేను వెదికే ఇల్లు అలాంటిదే.’’
 అడ్రస్ చెప్పింది. మంగళవారం సాయంత్రం ఐదున్నరకి ఇల్లు చూపిస్తానని చిరునామా చెప్పింది.
   
ఆ ఇంటి యజమానురాలు వృద్ధురాలైన మిస్ హంట్లీ. ఆవిడ పెళ్లి చేసుకోలేదు. నన్ను హోప్ క్రాఫ్ట్‌గా పరిచయం చేసింది. మేం కరచాలనం చేసుకున్నాక గ్లోరియా చెప్పింది.
 ‘‘మీరు నన్ను క్షమిస్తే నేను వెళ్తాను మిస్టర్ హోప్ క్రాఫ్ట్. నాకు వేరే ముఖ్యమైన పని ఉంది. మిస్ హంట్లీ, దయచేసి మీ ఇంటిని మిస్టర్ హోప్ క్రాఫ్ట్‌కి చూపిస్తారా?’’
 ఆమె సెలవు తీసుకుని వెళ్లిపోయాక మిస్ హంట్లీ నాకు గ్రీన్ రోజ్ టీని కలిపి తీసుకురావడానికి వంట గదిలోకి వెళ్లింది. నేను హాల్లోని మేంటిల్ పీస్ మీద ఉన్న ఓ జేడ్ రాయితో చేసిన బొమ్మని అందుకుని నా జేబులో వేసుకున్నాను. చెప్పాగా నేను దొంగని తప్ప హంతకుడ్ని కాదని.
 ఓ యువకుడి ఫొటోని చూసి అదెవరిదని అడిగితే ఆవిడ తన మేనల్లుడు రాబర్ట్ గురించి చెప్పింది.
 ‘‘నా మేనల్లుడు రాబర్ట్. నాకు వీడు తప్ప ఇంకో బంధువు అంటూ ఎవరూ ఈ ప్రపంచంలో లేరు.’’
 ఆలోచించి నా నిర్ణయాన్ని మళ్లీ గ్లోరియాకి రెండు రోజుల్లోగా తెలియ చేస్తానని చెప్పి టీ తాగి బయటపడ్డాను.
 ‘‘ఆలస్యం చేయకండి. ఇప్పటికే నలుగురు ఇంటిని చూసి వెళ్లారు’’ ఆవిడ హెచ్చరించింది.
   
 మర్నాడు, బుధవారం ఉదయం ఆరున్నరకి నా సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ తలుపు కొట్టిన చప్పుడు విని నాకు మెలకువ వచ్చింది. లేచి వెళ్లి తలుపు తెరిస్తే ఎదురుగా యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ కనబడ్డాడు. అతను ఎందుకు వచ్చాడో ఊహించలేకపోయాను. కాని క్రితం రోజు నేను చేసిన దొంగతనం కోసం వచ్చాడని మాత్రం అనుకోలేదు.
 అతను లోపలికి వచ్చి అడిగాడు.
 ‘‘మిస్ హంట్లీ మీకు పరిచయమా?’’    
 ‘‘హంట్లీ. ఎక్కడో ఆ పేరు విన్న... అవును. నిన్న ఆవిడ ఇంటిని చూశాను.’’
 ‘‘లక్ష పౌండ్లు ఇచ్చి దాన్ని కొనే తాహతు మీకుందా?’’... అతను నా అపార్ట్‌మెంట్‌లోని ఆట్టే ఖరీదు లేని వస్తువులని చూస్తూ అడిగాడు.
 నేను బదులు చెప్పలేదు. ఆ జేడ్ బొమ్మని చూశాడు. కాని ‘ఇదెక్కడిది?’ అని ప్రశ్నించలేదు. ఆవిడ ఆ బొమ్మ పోయిందని ఫిర్యాదు చేసి ఉండొచ్చు. గ్లోరియా ద్వారా నా ఫోన్ నంబర్ తెలుసుకుని, నా చిరునామా తెలుసుకుని అతను వచ్చాడని నాకు అర్థమైంది.
 ‘‘మీరు నాతో స్టేషన్‌కి రావాలి.’’
 ‘‘దేనికి?’’
 ‘‘ప్రశ్నించడానికి.’’
 ‘‘ఏ విషయం మీద?’’
 ‘‘మిస్ హంట్లీని మీరు ఎందుకు చంపారో తెలుసుకోడానికి.’’
 నేను అదిరిపడ్డాను.
 ‘‘నేనావిడని చంపడం ఏమిటి?’’ అడిగాను కంగారుగా.
   
 జాన్ నేను చెప్పింది శ్రద్ధగా విని అడిగాడు.
 ‘‘గ్లోరియాకి, రాబర్ట్‌కి స్నేహం ఉందంటావు?’’
 ‘‘అవును. కోర్టు హాలుకి వాళ్లు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని రావడం గమనించాను.’’
 ‘‘నువ్వు అక్కడ మర్చి పోయిన నీ సిల్క్ రుమాలుని పోలీసులు ఆధారంగా ఉపయోగిస్తున్నారా?’’
 ‘‘అవును.’’
 ‘‘నిన్ను అరెస్ట్ చేశాక కాని అతను రాలేదా?’’
 ‘‘అవును.’’
 మర్నాడు జైలు లైబ్రరీలో జాన్ నాతో చెప్పాడు.
 ‘‘నేను చెప్పినట్లు ఓ ఉత్తరం రాయి. దాన్ని లైబ్రేరియన్‌కి ఇవ్వు. అతను పోస్ట్ చేస్తాడు.’’
 డియర్ మిస్టర్ రాబర్ట్,
 హంతకుడిగా నువ్వు అనుభవించాల్సిన శిక్షని నేను అనుభవిస్తున్నాను. నేను నా కేసుని మళ్లీ తెరవమని, నువ్వే అసలు హంతకుడివి అని కోర్టుకి ఓ పిటిషన్ పెడితే చాలు. నేను బయటికి వెళ్తాను. నువ్వు లోపలికి వస్తావు. మిస్ హంట్లీ మరణించిన రెండు రోజుల దాకా నువ్వు మాంచెస్టర్లోనే ఉన్నావని పేర్కొన్నావు. కాని అది అబద్ధం. లేకపోతే నేను మరిచి పోయిన సిల్క్ రుమాలు మీద నీ డీఎన్‌ఏ ఎలా దొరుకుతుంది? దాన్ని నువ్వు ముక్కు తుడుచు కోడానికి ఉపయోగించావని నాకు తెలుసు. కేసు పూర్తయి తీర్పు వచ్చాక నా రుమాలుని పోలీసులు నాకు ఇచ్చేస్తారు. దాన్ని పరీక్షిస్తే నీ డీఎన్‌ఏ పోలీసులకి లభిస్తుంది. మనం ఎన్నడూ కలుసుకోలేదు అని కోర్టుకి తెలుసు. అలాంటప్పుడు మిస్ హంట్లీ ఇంట్లోంచి నేను బయటకి వచ్చాక, ఆ రుమాలు ఉన్న ఇంట్లోకి నువ్వు వెళ్లకపోతే దానిమీద నీ డీఎన్‌ఏ ఎలా వస్తుంది? నేను కోర్టుకి పిటిషన్ పెట్టుకుంటే కోర్టు దాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ఏ క్షణంలోనైనా పంపవచ్చు. నువ్వు అలా జరగకూడదనుకుంటే నా బేంక్ అకౌంట్ నంబర్ ఇస్తున్నాను. వెంటనే లక్ష పౌన్లు దానికి బదలాయించు. లేదా...
 జాన్ ఊహించిందే జరిగింది. లక్ష పౌన్లు నా అకౌంట్లో జమ అయ్యాయని నాకు తెలిసింది. ఆ సిల్క్ రుమాలు నా సూట్లో భద్రంగా ఉంది. అది జైల్లోని ఖైదీల వస్తువులు భద్రపరిచే గదిలో భద్రంగా ఉంది.
 (నీల్ స్కోఫీల్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement