ఓల్డ్ జూట్... న్యూ డోర్‌మ్యాట్స్...
ఇంటికి - ఒంటికి
ప్రస్తుతం మనం వాడే డోర్‌మ్యాట్స్ ఒక్కో ఇంట్లో ఒక్కో వెరైటీలో ఉంటున్నాయి. అవునా.. రకరకాల డిజైన్లలో, వివిధ రంగుల్లోని మ్యాట్స్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇప్పుడే కాదు, పాత రోజుల్లో కూడా డోర్‌మ్యాట్లను వాడేవారు. అవేనండీ.. జనపనారతో చేసిన పట్టాలను కాళ్ల దగ్గర వేసుకునే వారు. అలాంటివే ఇప్పుడు మీకూ వాడాలని, అలా కొన్నేళ్ల వెనక్కి వెళ్లాలని ఉందా? అయితే జనపనారతో ఇంట్లోనే వివిధ డిజైన్లలో డోర్‌మ్యాట్లను తయారు చేసుకోవచ్చు ఇలా...
కావలసినవి: జనపనార (జూట్), పాత డోర్‌మ్యాట్ (కొలతల కోసం), గ్లూ
తయారీ విధానం: ముందుగా మీకు ఏ సైజు మ్యాట్ కావాలో అలాంటి కొలతలతో ఉన్న పాత మ్యాట్‌ను తీసుకోండి. దాని ఆధారంగా డోర్‌మ్యాట్‌ను సులువుగా తయారు చేసుకోవచ్చు. మొదట ఫొటోలో కనిపిస్తున్న విధంగా జనపనారను ఒక్కో చుట్టూ చుట్టుకుంటూ గుండ్రంగా తిప్పుకోవాలి. అంతా పూర్తి అయ్యాక, ఆ నార చివర ఒక గట్టిముడి వేయాలి. అప్పుడు అది కూడా ఓ డిజైన్‌లా కనిపిస్తుంది.
ఆపైన గ్లూను దళసరిగా జనపనార చుట్లపై పూయాలి. దాంతో ఆ జనపనార ఒకదానికొకటి అతుక్కుంటుంది. కావాలంటే పాత మ్యాట్‌ను కొత్తదానిపై పెట్టి ఒకేలా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. గుండ్రంగానే కాకుండా ఈ జనపనారను ఫొటోల్లో కనిపిస్తున్నట్టుగా దీర్ఘచతురస్రాకారంలోనూ తయారు చేసుకోవచ్చు.