అమెజాన్‌కు ఇంకా బుద్ధి రాలేదా?
న్యూఢిల్లీ: భారత జాతీయ జెండా తరహా డోర్‌మ్యాట్‌లను తన కెనడా వెబ్‌సైట్‌లో అమ్మకాలకు ఉంచి తీవ్ర విమర్శల పాలైన అమెజాన్‌కు ఇంకా బుద్ధి రానట్లే అనిపిస్తోంది. ఈ వ్యవహారంలో స్వయంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన అమెజాన్.. భారతీయుల మనోభావాలు దెబ్బతినే అలాంటి తప్పునే మరోసారి చేసింది.
అమెజాన్ యూఎస్ వెబ్‌సైట్‌లో గాంధీజీ బొమ్మ ముద్రించి ఉన్న చెప్పులను అమ్మకానికి ఉంచింది. దీనిని గుర్తించిన ఓ ట్విట్టర్ యూజర్.. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ట్యాగ్ చేశారు. డోర్ మ్యాట్‌ల వ్యవహారంలో ఇది తమ తప్పిదం కాదని.. వెబ్‌సైట్‌లో వాటిని థర్డ్ పార్టీ అమ్మకానికి ఉంచిందని అమెజాన్ చెప్పుకుంది. భారతీయుల మనోభావాలు దెబ్బతినే ఇలాంటి ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి ఉంచకుండా చర్యలు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబారికి ప్రభుత్వం ఆదేశించిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.