ఈ విలేజ్‌లో... కేవలం రిలాక్స్ అవ్వండి! | relax in this village | Sakshi
Sakshi News home page

ఈ విలేజ్‌లో... కేవలం రిలాక్స్ అవ్వండి!

Published Sun, Oct 20 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

ఈ విలేజ్‌లో... కేవలం రిలాక్స్ అవ్వండి!

ఈ విలేజ్‌లో... కేవలం రిలాక్స్ అవ్వండి!

 విహారం
 
 సూర్యుడిలోని ప్రకాశం, పువ్వుల్లోని సుగంధం, ప్రకృతిలోని సౌందర్యం... వీటన్నింటినీ కలగలుపుకున్నది ఆ నదీ తీరం. ఆకట్టుకునే పరిసరాలు, సహజమైన  రూపం ఆ ప్రదేశం సొంతం. ఈ రెండింటి సంగమమే ఆ దృశ్యకావ్యం... ఈ వర్ణనకు వాస్తవ రూపమే పోర్టోఫినో.. ఇటలీ దేశంలో, ఇటాలియా నదీ తీరంలోని అందమైన అందాల గ్రామమది. సదుపాయాలు పెరిగి నగరంగా పిలువబడుతోంది.
 
 నదీ తీరాలు నాగరికతకు పుట్టిళ్లు. పంటలు ఇచ్చాయి. జ్ఞానాన్ని పెంపొందించుకొనే తీరికనిచ్చాయి. ఉల్లాసాన్ని ఇచ్చే వాతావరణాన్ని ఇచ్చాయి. భూమ్మీద అలాంటి నదిలెన్నో ఉన్నాయి. దేని ప్రత్యేకత దానిదే. దేని సొగసు దానిదే. ఇలాంటి నేపథ్యంతోనే.. ఎన్నో రిసార్ట్ టౌన్‌లను తన ఒడిలో అనుసంధానించుకొని గుంభనంగా సాగుతుంటుంది ఇటాలియా నది. యూరప్‌లోని నార్త్ గయానా నుంచి ఫ్రెంచ్ సరిహద్దు వరకూ లైగేరియా సముద్రపు అంచులను కలుపుతూ సాగుతుంది ఈ నది.
 
 ఇది యూరప్ ఒడ్డును ఒరుసుకొని పోతున్నా.. అక్కడి మనుషుల సకల జీవరంగాలనూ స్పృశిస్తూనే ఉంటుంది. అలా ఈ నదీ స్పర్శతో ఒక ఉనికిని తెచ్చుకొన్నదే పోర్టోఫినో గ్రామం.  ప్రపంచంలో పర్యాటక కేంద్రాలంటే పెద్ద నగరాలే... అనుకునే వారు ఇక్కడికి ఓ సారి రావాల్సిందే. పచ్చని పైరు, చక్కని సెలయేరు, చల్లటి గాలి... అన్నట్టుగా పర్యాటకకేంద్రంగా విలసిల్ల్లుతోంది ఈ గ్రామం.
 
 ఎన్నెన్నో విశేషాలు...
 పోర్టోఫినో గ్రామానిది శతాబ్దాల చరిత్ర. ఇక్కడ కవిత్వం పుట్టింది. సంగీతం పుట్టింది. అందుకే పర్యాటక చిత్రపటంలోనే కాదు... చారిత్రకంగానూ దీనిది ప్రముఖ స్థానమే. ఒక్కమాటలో చెప్పాలంటే పోర్టోఫినో పరిసరాల్లోనే ఇటాలియన్ కళ, కవిత్వం దాగుంది. ఈ ఊరి పరిసరాల స్ఫూర్తితో కవిత్వం రాశామని, ఈ పరిసరాల్లో కూర్చొని తమ కలాలను ఝళిపించామని చెప్పే రచయితలు అనేక మంది. ఇక్కడి ప్రకృతి ఆవరణంలో ఏదో మాయ ఉందని వారు అంటారు. అలాగే  ఇది యూరప్‌లోనే సెలబ్రిటీలకు ఫేవరెట్ స్పాట్‌గా పేరు పొందింది. వేసవిలో సేదతీరడానికి ఎంతో మంది ఇక్కడకు చేరుకుంటుంటారు. ఇంత ప్రేరణ ఉందంటే... ఆ వాతావరణం ఎంత అందంగా ఉంటుంటో అర్థం కావట్లేదూ! ఇంకా చిత్రమేంటంటే... ఈ అందమైన ప్రకృతిపై  మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల ముద్ర కూడా ఉంది.
 
 ప్రత్యేక ఆకర్షణలు...
 నడుస్తూ ఈ ఊరి అందాలను చూడటం ఉల్లాసానికి ఒక ఉత్తమమైన మార్గమని ఇటలీ వాసులు, పర్యాటక ప్రేమికులు చెబుతారు. ఇందులో రెండు సౌలభ్యాలున్నాయి. ఒకటి ఇక్కడి హోటళ్ల, బీచ్‌ల అందాలు చూడొచ్చు.. రెండు భారీ స్థాయిలోని టాక్సీ చార్జీలను తప్పించుకోవచ్చు అంటూ ఇక్కడ టాక్సీ చార్జీల గురించి టూరిస్ట్ గైడ్‌లు ముందుగానే హెచ్చరిక జారీ చేస్తుంటారు. ఇక్కడ అన్నీ ఆకట్టుకొనేవే.. ప్రత్యేకించి ఇక్కడి జీవన విధానం. ఫొర్టోఫినో ట్రిప్ ప్లాన్ చేసుకోవడంలో ముందుగానే ప్రయారిటీలు, షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడానికే అవకాశం లేదట. ఎందుకంటే అక్కడకి వెళ్లే వరకే మన చేతుల్లో ఉంటుంది. అక్కడికెళ్లాక ఆ అందాలు అక్కడ్నుంచి కదలనివ్వవు. దాంతో ప్రణాళిక మొత్తం మారిపోతుంది. బీచ్‌లో కూర్చుని అందాలు తనివి తీరా అనుభవిస్తుంటే... లాగూన్‌లలో డాల్ఫిన్లు చేసే విన్యాసాలను ఆస్వాదిస్తుంటే.. గంటలు నిమిషాల్లా గడిచిపోతాయని అంటారు.
 
 మధ్యయుగం నాటి ఆనవాళ్లు...
 ఇక్కడ పదహారో శతాబ్దం నాటి కోట క్లాస్టెల్లో బ్రౌన్ ఉంటుంది. ఒకనాడు అంతఃపురంగా విలసిల్లిన ఈ కోట ఇప్పుడు మ్యూజియంగా మారి అలనాటి వైభవానికి ఆనవాలుగా ఉంది. మధ్య యుగానికి చెందిన మరో చారిత్రక ప్రదేశం సెయింట్ మార్టిన్ చర్చి ఇక్కడ మరో ఆకర్షణ. ‘క్రైస్ట్ ఆఫ్ ఏబియస్’ పేరిట ఇక్కడ ఏర్పాటుచేసిన యేసు క్రీస్తు విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. దాదాపు 30 అడుగుల ఎత్తుండే ఈ విగ్రహం నది మధ్యలో మునిగి ఉంటుంది. ఇలాంటి అనుభూతి మీకు మరెక్కడా దొరకదు. స్కూబా డ్రైవర్‌లకు, ఫిషర్ మ్యాన్‌లకు విగ్రహ రూపంలోని యేసుక్రీస్తు రక్షణగా ఉంటాడని ఒక నమ్మకం. మునిగి ఉన్న ఈ విగ్రహాన్ని పర్యాటకులు వీక్షించడానికి వీలుగా ఉంటుంది.
 
 రిలాక్స్...రిలాక్స్...
 ఈ ఊరిని వచ్చే పర్యాటకులకు ఒకే ఒక్క ముఖ్య సూచన ఉంది. అదేంటంటే.. ఇక్కడ విజ్ఞానాన్ని  సంపాదించుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ప్రకృతి మిస్టరీల గురించి ఆలోచించనే వద్దు... జస్ట్ రిలాక్స్! ఇక్కడ చేయగలిగిన, చేయాల్సిన గొప్ప పని ఏదైనా ఉందంటే అది రిలాక్స్ కావడమే మాత్రమే. ప్రకృతికి ఒక సొంతం గ్రామం ఉంటే అదిలా ఉంటుందనిపించే ఈ చిన్న నగరంలో కలియతిరగండి. ఆద్యంతం అనుభవైకవేద్యమైన అనుభూతి పొందండి. నదీ ప్రవాహ గలగలలు వినండి. చక్కటి ఇటాలియన్ వంటలతో మైమరిచిపోండి. ఎందుకంటే పోర్టోఫినో ఉన్నది అందుకే!
 
 ఫోర్టోఫినోకు ఎలా వెళ్లాలి?
 1940లలో బ్రిటన్ నుంచి గుర్రాల ద్వారా పర్యాటకులు ఈ ఊరికి వచ్చేవారట. అలా ఇక్కడికి పర్యాటకుల ప్రవాహం మొదలైంది. ప్రస్తుతానికి అయితే పోర్టోఫినో దగ్గరలో జెనోవా నగరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 36 కిలోమీటర్ల కారు ప్రయాణంతో పోర్టోఫినో చేరుకోవచ్చు. ఇంకా ఫ్రాన్స్‌లోని నైస్, ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్ట్‌లు కూడా పోర్టోఫినోకు దగ్గరగా ఉన్న ఇతర విమానాశ్రయాలు.
 
 ఊరి పేరు ఎలా వచ్చిందంటే...
 
 పోర్టోఫినో రోమన్లు పెట్టిన పేరు. ఈ నదీతీరపు గ్రామానికి  కాలక్రమేణా ఊరిపేరు మారిపోయేంత ప్రస్థానం ఉంది.  డాల్ఫిన్లకు స్వర్గధామమైన నదికి తీరంలో ఉండే ఈ గ్రామానికి ‘పోర్టస్ డాల్ఫినో’గా రోమన్లు నామకరణం చేశారు. పోర్ట్ ఆఫ్‌ది డాల్ఫిన్‌గా పిలుచుకునే వారు. క్రమేణ ఇదే ఫోర్టోఫినో అయ్యింది. పేరులోనే డాల్ఫిన్లను దాచుకొన్న ఈ ఊరును ఒక ఎక్వేరియంగా అభివర్ణిస్తారు ఇటాలియన్లు. ఇక్కడి తీరంలో కూర్చున్నా.. నదిలో ఈదులాడినా వందల, వేల రకాల చేపలను వీక్షించడానికి అవకాశం ఉంఆది. అందుకే దీన్ని ఫిషింగ్ సిటీ అని అంటారు.
 
 ఊరి జనాభా 500!
 ఇక్కడ శాశ్వతంగా నివసించే వారి సంఖ్య 500. అయితే యూరప్‌లో వేసవి కాలం వచ్చి భానుడు ఒళ్లు విరుచుకున్నాడంటే.. ఈ ఊరిలో జనాభా అమాంతం పెరిగిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకి వస్తారు. వీరి కోసం బొటిక్స్, ఆర్ట్‌గ్యాలరీలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు నడపడమే స్థానికుల జీవనాధారం. ఫిషింగ్ ఆదాయం ఆదనం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement