PM Modi Presented Dasa Danam To President Biden Its Significance - Sakshi
Sakshi News home page

‘దృష్ట సహస్రచంద్రో’.. బైడెన్‌కు దశ దానం.. దాని ప్రాముఖ్యత తెలుసా?

Published Thu, Jun 22 2023 12:36 PM | Last Updated on Thu, Jun 22 2023 1:28 PM

PM Modi presented Dasa Danam to President Biden Its significance - Sakshi

అమెరికా పర్యటనలో భాగంగా.. వైట్‌హౌజ్‌ విందుకు హాజరైన ప్రధాని మోదీ.. సతీసమేతంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో పరస్పరం కానుకలు ఇచ్చి గౌరవించుకున్నారు. మోదీ టేస్ట్‌కి తగ్గట్లే కెమెరాలను బైడెన్‌ ఇవ్వగా.. భారత సంప్రదాయానికి తగ్గట్లు  ఉపనిషత్తుల కాపీని, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌కు గ్రీన్‌ డైమండ్‌కు బహుకరించారు. అదే సయమంలో మోదీ బహుకరించిన గంధపు చెక్కతో కూడిన పెట్టె ఒకటి బైడెన్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ పెట్టెను.. అందులో ఉన్న దశ దానం ప్రశస్తిని స్వయంగా మోదీనే బైడెన్‌కు వివరించారు.     

హిందూ జీవన విధానంలో ‘‘దశ దానం’’ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అంశం. హిందూ ఆచారాలకు ప్రతీక కూడా. 

ప్రాచీన భారతీయ గ్రంథం కృష్ణ యజుర్వేదంలో వైఖానస గృహ్య సూత్రం ప్రకారం.. ఒక వ్యక్తి దాదాపు 29,530 రోజులు.. మరోలా చెప్పాలంటే ఎనభై సంవత్సరాల ఎనిమిది నెలల వయస్సును పూర్తి చేసినప్పుడు ‘దృష్ట సహస్రచంద్రుడు’ అంటే వెయ్యి పౌర్ణమిలను చూసిన వ్యక్తి అవుతాడు.

► హిందూ జీవన విధానంలో.. ప్రతీ వ్యక్తికి ఇదొక ముఖ్యమైన మైలురాయి లాంటిది. జీవితంలో ఆ దశ పూర్తైన వాళ్లను.. వాళ్ల పరిపూర్ణ అనుభవానికి గుర్తుగా గౌరవించబడతారు. శాస్త్రోక్తంగా.. వినాయక పూజలతో మొదలవుతుంది. పూర్ణహారతి, శతాభిషేకం.. చివరకు సహస్ర చంద్ర దర్శనంతో ముగుస్తుంది. 

► సహస్ర పూర్ణ చంద్రోదయం సమయంలో.. దశ దానం చేయడం ఆనవాయితీ. గోదానం, భూదానం, తిలదానం(నువ్వులు) , హిరణ్యదానం(బంగారం), ఆజ్యదానం(నెయ్యిగానీ.. వెన్నగానీ), ధాన్యదానం, వస్త్రదానం, గుడ(బెల్లం) దానం, రౌప్యదానం(వెండి), లవణదానం(ఉప్పు) చేస్తారు. 

► బైడెన్‌ కిందటి ఏడాది నవంబర్‌తోనే 80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అందుకే ఆయనకు మోదీ దశ దానం సమర్పించారు. 

► జైపూర్‌(రాజస్థాన్‌)కు చెందిన ఓ కళాకారుడు ఆ ప్రత్యేకమైన చందనపు పెట్టెను రూపొందించారు. అందుకు కావాల్సిన చెక్కలను మైసూర్‌ నుంచి తెప్పించారు. తరతరాలుగా ఇలా గంధపు పెట్టెల తయారీ రాజస్థాన్‌లో కుల వృత్తిగా నడుస్తోంది. 

► బాక్స్‌లో గణేషుడి ప్రతిమ ఉంది. దీనిని కోల్‌కతాకు చెందిన ఓ స్వర్ణకారుడు తయారు చేశారు. ఆయన కుటుంబం ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తోంది. 

► ప్రతిమతో పాటు ప్రమిదను కూడా ఉంచారు. ఇది కూడా కోల్‌కతాకు చెందిన స్వర్ణకారుల కుటుంబమే చేసింది. 

► ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కళాకారులు రూపొందించిన రాగి తామ్ర పాత్ర.. దాని మీద శ్లోకం చెక్కి ఉంది. 

ఇక అసలైన దశ దానం.. వెండి పెట్టెల్లో ఉంది. 

ఆవు స్థానంలో బుల్లి వెండి కొబ్బరికాయ ప్రతిమను, భూదానం స్థానంలో మైసూర్‌ నుంచి తెప్పించిన సువాసనభరితమైన గంధపు చెక్క ముక్కను, తమిళనాడు నుంచి తెప్పించిన నువ్వులను, హిరణ్యదానం కోసం రాజస్థౠన్‌ నుంచి తెప్పించిన 24 క్యారెట్ల బంగారపు కాయిన్‌ను, పంజాబ్‌ నుంచి నెయ్యిని, జార్ఖండ్‌ నుంచి తెప్పించిన గుడ్డ ముక్కను, ధాన్యదానంలో భాగంగా యూపీ నుంచి బియ్యం, మహారాష్ట్ర నుంచి బెల్లం ముక్కను, రాజస్థాన్‌ నుంచి వెండి నాణేన్ని, అలాగే గుజరాత్‌ నుంచి తెప్పించిన ఉప్పును లవణ దానంలో భాగంగా.. చిన్న వెండి పెట్టెల్లో ఉంచి బైడెన్‌కు మోదీ దశ దానంలో భాగంగా అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement