జై.. సింగిల్ మదర్ కిడ్. అమ్మే ప్రపంచం అతడికి. అమ్మ లత, ఉద్యోగం, తన సరదాలు.. ఇంతే.. జై లైఫ్ ఇంతకుమించి ఏమీ లేదు. నాన్న ఇలా ఉంటాడని అమ్మెప్పుడూ చెప్పలేదు. నాన్నెలా ఉంటాడని జై కూడా ఎప్పుడూ అడగలేదు. అన్నీ బాగున్నాయి. ఏదో విషయం గురించి బాధపడే అవసరం జైకి రాదు.కానీ ఒక రోజొచ్చింది. అమ్మ ఏదో బాధలో ఉంది. ఒక దగ్గర కూర్చుండిపోయి ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది. జై తన పని పక్కనబెట్టి అమ్మకు దగ్గరగా వెళ్లి.. ‘‘మామ్! ఆర్ యూ ఓకే!?’’ అనడిగాడు.‘‘తప్పు చేశాన్రా! ఇన్నేళ్లూ నీకొక నాన్న ఉన్నారని, మనకు దగ్గర్లోనే ఉన్నారని, చెప్పకుండా తప్పు చేశాను.’’ అమ్మ మొదటిసారి నాన్న గురించి చెబుతూ ఉంటే జై అలాగే ఆమెను చూస్తూండిపోయాడు.జైకి ఐదేళ్లు కూడా లేవప్పుడు. నాన్న దేవాతో గొడవపడింది అమ్మ. కొడుకు భవిష్యత్ గురించి భయం వేసిందామెకు. ‘‘నేను వెళ్లిపోతాను’’ అనేసింది. దేవా కాదనలేదు. ఇది జరిగిన ఇరవై ఏళ్లకు ఈ విషయం కొడుక్కి చెప్పింది అమ్మ.నాన్న గురించి మొత్తం విన్న జై, అమ్మతో ఓ మాటన్నాడు.‘‘నేనొకసారి ఆయన్ను చూడాలి!’’
దేవా ఇల్లు. ఎప్పుడూ మనుషులతో కళకళలాడుతుంది ఆ ఇల్లు. జై ఆ ఇంట్లోకి మొదటిసారి అడుగుపెడుతున్నాడు.కారు దిగగానే, జైకి ఎదురుపడిన దేవా తమ్ముడు.. ‘‘ఎవరు బాబూ మీరూ?’’ అనడిగాడు.‘‘దేవా గారి అబ్బాయిని!’’దేవా తమ్ముడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. జైని అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఇన్నేళ్ల తర్వాత అన్న కొడుకును చూసిన ఆనందం. భుజంపై చెయ్యేసి జైని ఇంట్లోకి తీసుకెళ్లాడు.‘‘అన్నయ్యా!’’ అంటూ అప్పుడే మెట్లు దిగుతూ వస్తోన్న దేవాను చూస్తూ, ప్రేమగా జైని చూపించాడు దేవా తమ్ముడు.‘‘ఎవరూ?’’ అనడిగాడు దేవా.‘‘నాన్నరా?’’ జైకి దేవాను పరిచయం చేశాడు దేవా తమ్ముడు.దేవా, జై ఇద్దరూ ఏం మాట్లాడుకోవట్లేదు. మౌనం. ఇరవై ఏళ్ల మౌనం అది.దేవా ఉద్వేగంతో జై ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ ఇంటికి కొత్త వెలుగొచ్చింది. జై తో పాటొచ్చిన వెలుగది. కొద్దిసేపట్లో వారిద్దరి చుట్టూ ఇంట్లో వాళ్లంతా చేరిపోయారు.‘‘అక్కా! మన జై!’’ జై ని ఇంట్లో వాళ్లకు పరిచయం చేశాడు దేవా తమ్ముడు. ‘‘ఏరా! ఇప్పటికి గుర్తొచ్చామా? అమ్మ రాలేదా?’’ ప్రశ్నలు కురిపిస్తూ పోయింది జై అత్తయ్య.‘‘ఏదో పనుండీ.. కుదర్లేదు.’’ జై నవ్వుతూ సమాధానమిచ్చాడు.ఆ రోజంతా జై గురించిన మాటలే ఇల్లంతా.రాత్రయింది. జై తన గదిలో ఏవో పెయింటింగ్స్ చూస్తూ ఉండటం గమనించిన దేవా, వస్తూనే..‘‘జై! ఇంకా పడుకోలేదా?’’ అనడిగాడు.
‘‘నిద్ర పట్టలేదు.’’ సమాధానమిచ్చాడు జై.నవ్వి, కాసేపాగి, ‘‘అమ్మెలా ఉంది?’’ అనడిగాడు దేవా.‘‘షీ ఈజ్ ఫైన్.’’నవ్వాడు దేవా. పక్కన్నే ఉన్న బాటిల్‌లోని కొంత వైన్‌ను గ్లాసులోకి తీసుకొని, ‘‘ఓ! డైలీ వన్ పెగ్. ఇరవై ఏళ్ల నుంచి ఇదే నా కంపెనీ రా!’’ అన్నాడు జై నిచూస్తూ. ‘నువ్వూ తీసుకుంటావా?’ అని ఆఫర్ చేశాడు.‘‘నో నో! ఐ యామ్ ఫైన్’’‘‘సో! ఏం చేస్తున్నావ్?’’‘‘ఐ యామ్ ఆన్ ఆర్కిటెక్ట్’’దేవా, జై మాటలకు అడ్డుకట్ట వేసే పరిస్థితేదీ కనిపించలేదు అక్కడ. ఒక్క రాత్రయిపోవడం అన్నది తప్ప. ఇరవై ఏళ్ల మౌనం ఆ రాత్రంతా మాటలుగా పరచుకుంది.
జై రాకతో ఊరంతా సంబరాలు చేసుకుంది. ఊళ్లో గొడవలు, ఊళ్ల మధ్య పగలు కొంచెం కొంచెం తగ్గుతున్నాయి. ఒక భూమి విషయంలో పక్క ఊరి పెద్ద మనిషి అనుచరుడొకడు దేవాకు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు.‘‘ఎవరు పంపించారో తెల్సా! ఉమన్న..’’ దేవాకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి గట్టిగా అరుస్తున్నట్టు చెప్పాడు.దేవా కుటుంబమంతా కోపంతో రగిలిపోతోంది.‘‘చెప్పింది చేస్తే.. మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది.’’ వచ్చిన మనిషి మాట్లాడుతూనే ఉన్నాడు.‘‘పగలు ఆగుతాయంటే సంతోషమే! కానీ పేదోడి జీవితాన్ని పణంగా పెట్టి కాదు.’’‘‘ఇన్నేళ్లూ అన్నీ మూసుకొని కుక్కిన పేనుల్లా బతికారుగా! ఇప్పుడు కొత్తగా ఈ రోషమెందుకు? నువ్వు కాదన్న కబురుతో మేం ఈ ఊరు దాటితే, ఊరోళ్లంతా మీ ఇంటిల్లిపాదికీ తద్దినం పెట్టాల్సి వస్తుంది’’ వార్నింగ్ ఇచ్చాడు ఆ మనిషి.
దేవా తమ్ముళ్లు కోపంతో పైకి లేచారు.‘‘చెప్పాల్సింది చెప్పారుగా! ఇక మీరు బయల్దేరండి’’ అంటూ దేవా సున్నితంగా చెప్పాడు. వచ్చిన వాళ్లు వచ్చిన దార్లో జీపులో ఊరు దాటుతున్నారు. జై ఇదంతా వింటూనే ఉన్నాడు.ఆ జీపు ఊరు దాటకముందే వాళ్ల మీద పడిపోయాడు. గొడవకొచ్చిన అందరికీ తానేంటో చూపించాడు. దేవాకి వార్నింగ్ ఇచ్చిన మనిషి జై చేతిలో చావు దెబ్బలు తిన్నాడు.అతడికి దగ్గరగా వెళ్లి, కోపంగా, వార్నింగ్ ఇస్తూ, జై ఈ మాటన్నాడు.‘‘ఇరవై ఏళ్ల నుంచి ఓ లెక్క. ఇప్పట్నుంచో లెక్క. ఆడి కొడుకొచ్చాడు. ఆడి కొడుకొచ్చాడని చెప్పు..’’జై ఆ మాటంటూ, ఊరి పొలిమేరలో ఉన్న కిలో మీటరు రాయిని బలంగా తన్నాడు.
ఆడి కొడుకొచ్చాడు!!
Published Sun, Nov 5 2017 1:33 AM | Last Updated on Sun, Nov 5 2017 1:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment