దివాకరం అబద్ధాలకు పెట్టింది పేరు. అతడిలా అబద్ధాలు చెప్పేవారు అసలు ఎక్కడా కనిపించరేమో అన్నట్టుగా అబద్ధాలు చెప్పేస్తూంటాడు. అతనికి చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు.. కుడిభుజంగా పనిచేసే ఓ వ్యక్తి తప్ప! ఏయే విధాలుగా డబ్బు సంపాదించవచ్చో ఆయా విధాల్లో సంపాదిస్తుంటాడు. అన్నీ అబద్ధాలే! ఆ అబద్ధాలే అతని వ్యాపారానికి పెట్టుబడి. రోజులు గడుస్తున్నాయి. దివాకరం అబద్ధాలతో డబ్బులు వెనకేసుకుంటూ వెళుతున్నాడు. ఊర్లో వాళ్లందరికీ తనతో కొన్ని అవసరాలు ఉండేలా చూసుకుంటున్నాడు. అవి అబద్ధాలతో ముడిపడి ఉన్నవే. భువనేశ్వరిని కలిసే వరకూ, కలిశాక కూడా ఇది ఇలాగే జరుగుతూ వచ్చింది.
భువనేశ్వరి చాలా అందంగా ఉంటుంది. ఆమెకు తొలిచూపులోనే పడిపోయాడు దివాకరం. అదే విషయం చెప్పడానికి కొన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఒకరోజు ఆమెకు యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో పడినా, అదంతా జోక్ అనుకొని పట్టించుకోలేదు. కానీ అది జోక్ కాదు. భువనేశ్వరికి నిజంగానే యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉంది. దివాకరం పరిగెత్తుకుంటూ హాస్పిటల్‌కు వచ్చాడు. భువనేశ్వరి దివాకరం రావడాన్ని చూసింది. కోపంగా అతని వంక చూసింది. మనసులో ఉన్న కోపమంతా కక్కేసింది. తిడుతూనే పోతోంది. దివాకరం ఆపే ప్రయత్నం చేయలేదు. ‘‘గెట్ అవుట్! ఈ జన్మలో నీ ఫేస్ నాకు చూపించకు’’ కోపంగా చివరి మాట అంటూ ముఖం తిప్పింది భువనేశ్వరి. దివాకరం దీనంగా చూస్తూ నిలబడ్డాడు.బయటకొచ్చి తన అనుచరుడి మీద అరిచాడు. మళ్లీ కనిపించొద్దని భువనేశ్వరి చెప్పినా, కనిపిస్తూనే ఉన్నాడు. భువనేశ్వరికి దివాకరంపై కోపం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది.దివాకరం తన ప్రేమను చెప్పడానికి ఇదే సమయమని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వింత ప్రేమలేఖ రాసి పంపించాడు. భువనేశ్వరికి ఆ ప్రపోజల్ నచ్చింది. దివాకరాన్ని కలవాలని పిలిపించింది.దివాకరం భువనేశ్వరిని కలవడానికి హాస్పిటల్‌కు వచ్చాడు. ఆమె ఎదురుగా భయం భయంగా నిలబడ్డాడు. భువనేశ్వరి పూర్తిగా కోలుకుంది అప్పటికి. దివాకరం రాగానే లేచి కూర్చుంది.‘‘నీ కొత్త రకం ప్రేమలేఖ.. చూశాను.’’ అంది.
‘‘థ్యాంక్యూ’’ అన్నాడు దివాకరం సిగ్గు పడిపోతూ.‘‘నీ కుప్పిగంతులూ, వెకిలి నవ్వులు కూడా చూశాను..’’ మాట్లాడుతూనే లేచి మెల్లిగా నడవడం మొదలుపెట్టింది భువనేశ్వరి.ఇద్దరి మధ్యా కాసేపు మౌనం.‘‘నీ ప్రేమ సంగతి నాకు తెలీదు కానీ, నీది పరమ వంకర బతుకు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలే చెబుతావ్. జనాలను దారుణంగా మోసం చేస్తావ్!’’ అంటూ ఒక దగ్గర ఆగి, గోడకు ఆనుకొని భువనేశ్వరి మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టింది.‘‘నిజమేననుకోండి! కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ క్యాసెట్‌లో మీకు ముందే చెప్పా.’’ దివాకరం తన తప్పులను సర్దిచెప్పుకున్నాడు.సరే అన్నట్టు చూసింది భువనేశ్వరి. ‘‘నేన్నీకో పరీక్ష పెట్టదల్చుకున్నాను.’’ అంది.దివాకరం చూస్తూ నిలబడ్డాడు.‘‘నీ ప్రేమలేఖలానే అది కూడా కొత్తగా ఉంటుంది..’’ అంటూ భువనేశ్వరి మాట్లాడుతూంటే, మధ్యలోనే అందుకొని..‘‘నిజమా?’’ అని ఉత్సాహంగా ముందుకు కదిలాడు దివాకరం. ‘‘నేన్నిన్ను పెళ్లి చేస్కోవాలంటే నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి..’’ ‘‘తప్పకుండా నెగ్గుతాను. అదేంటో చెప్పండి!’’ దివాకరం మరింత ఉత్సాహం కనబరిచాడు.
‘‘నువ్వొక నెల రోజుల పాటు.. అన్నీ.. నిజాలే చెప్పాలి..’’ నెమ్మదిగా చెప్పింది భువనేశ్వరి.దివాకరం గట్టిగా నవ్వి, ‘‘కొత్త రకం పరీక్ష అంటే నేనింకా సముద్రం మీద పరిగెట్టమనో, చంద్రమండలం మీద నడవమనో చెప్తారనుకున్నా.. ఓస్ ఇంతేనా!!’’ అన్నాడు.‘చెప్పేది విను’ అన్నట్టు చూసి –‘‘ఇంకా చాలా ఉందీ.. చెప్పేది జాగ్రత్తగా విను..’’ అంది భువనేశ్వరి.దివాకరం ఉత్సాహం తగ్గింది. జాగ్రత్తగా వింటున్నాడు.‘‘నెలరోజుల పాటు.. అంటే.. ఈ రోజు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ.. అన్ని వేళలా నువ్వన్నీ నిజాలే చెప్పాలి. కల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. అంతే కాదు.. నీకు మనసులో ఏమనిపించినా,దాచుకోకుండా, అదంతా బయటకు చెప్పేయాలి.’’దివాకరం భువనేశ్వరి మాటలను శ్రద్ధగా వింటున్నాడు.భువనేశ్వరి కాసేపాగి, ఏదో గుర్తొచ్చినట్టు, ‘‘ఆ! నువ్వు ఈ నెలంతా కాలనీలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలనీ దాటిపోవద్దు. సరేనా!’’ అంటూ, చెప్పాల్సింది అయిపోయినట్టు దివాకరం వంక చూసింది.‘‘హుర్రే...!!’’ అని గట్టిగా అరిచాడు దివాకరం.‘‘ఇదిగో! ఆ కుప్పిగంతులే వద్దంటున్నా. అసలు ఈ పందెం ఎందుకు పెట్టానో తెల్సా..?’’‘‘తెలీదు..’’‘‘నిన్ను వదుల్చుకోడానికి..’’ ‘‘అంటే నేను ఈ పందెంలో గెలిచినా కూడా వదులుకుంటారా?’’
‘‘అసలు నువ్ గెలిస్తే కదా!!’’‘‘ఒకవేళ గెలిస్తే..?’’భువనేశ్వరి కాసేపు ఏం మాట్లాడలేదు. మళ్లీ తేరుకొని.. ‘‘నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటా!’’ అంది.‘‘ప్రూఫ్ ఏంటి? తీరా నేను గెలిచిన తర్వాత.. థూ.. నాకొద్దూ అంటే?’’‘‘నువ్విలా అడుగుతావని అనుమానం వచ్చే, ఒక అగ్రిమెంట్ రాశాను. చూడు..’’ అంటూ తన బెడ్ పక్కనే పెట్టిన ఒక పేపర్‌ను దివాకరానికి చూపించింది భువనేశ్వరి. దివాకరం అది చదువుతున్నాడు.
‘‘మళ్లీ చెప్తున్నాను.. బాగా ఆలోచించుకో! ఆ తర్వాత నువ్వెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, పీక తెగినా నో ప్రాబ్లమ్. నేను మాటంటే మాటే.. పందెం అంటే పందెమే!’’ భువనేశ్వరి మాటలు వింటూ, అగ్రిమెంట్ పేపర్ చూస్తున్నాడు దివాకరం.‘‘అంత మొండిదాన్ని నేను..’’ అంది భువనేశ్వరి, చివరిమాటగా.‘‘ఓకే ఓకే! మీరింకేం చెప్పొద్దు. నేను రెడీ..’’ అన్నాడు దివాకరం.‘‘అన్నట్టు.. ఈ ఒప్పందం మనిద్దరి మధ్యే ఉండాలి. నువ్వెవ్వరికీ చెప్పకూడదు!’’ హెచ్చరిక లాంటిది జారీ చేసింది భువనేశ్వరి.‘‘పైకీ కిందికీ పదిసార్లు చదువుకో! సరే అనుకుంటేనే సంతకం పెట్టు..’’ అంది.దివాకరం ఎగిరి గంతేశాడు. సంతకం చేశాడు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఏప్రిల్ ఒకటికి విడుదలవుతుంది.
అన్నీ అబద్ధాలే!
Published Sat, Dec 2 2017 11:47 PM | Last Updated on Sat, Dec 2 2017 11:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment