ఆ సమస్యకి ఆపరేషన్ తప్పదా?! | Sexual Problems | Sakshi
Sakshi News home page

ఆ సమస్యకి ఆపరేషన్ తప్పదా?!

Published Sun, Nov 22 2015 4:25 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ఆ సమస్యకి ఆపరేషన్ తప్పదా?! - Sakshi

ఆ సమస్యకి ఆపరేషన్ తప్పదా?!

మా అమ్మాయి వయసు పన్నెండేళ్లు. ఆరో తరగతి చదువు తోంది. రజస్వల అయ్యి ఆరు నెలలు అవుతోంది. ఎందుకో తనకి ప్రతి నెలా పీరియడ్‌‌స రావడం లేదు. రెండు నెలలకోసారి వస్తున్నాయి. వచ్చినప్పుడల్లా పది నుంచి పదిహేను రోజులు బ్లీడింగ్ అవుతోంది. దాంతో అస్తమానం ప్యాడ్‌‌స మార్చుకోవడం ఇబ్బందిగా ఉంది, స్కూలుకు వెళ్లను అని మొరాయిస్తోంది. అన్ని రోజులు వెళ్లకపోతే ఎలా కుదురుతుంది? దీనికి పరిష్కారం ఏమిటి? 
 - స్వర్ణలత, కాకినాడ

పన్నెండేళ్లు అంటే ఆడిపాడే వయసు. ఆ వయసులో అస్తమానం న్యాప్‌కిన్‌‌స మార్చుకోవడం, సరి చేసుకోవడం పాపం నిజంగానే కష్టంగా ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు... టీవీ, ఇంటర్నెట్లు వంటి వాటి వల్ల హార్మోన్లలో త్వరగా మార్పులు వచ్చి, ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు. దాంతో అటు పిల్లలకి, పెద్దవాళ్లకి కూడా ఇబ్బంది అవుతోంది. ఈ వయసులో మెదడు నుంచి వచ్చే హార్మోన్లు, అండాశయాల నుంచి వచ్చే హార్మోన్లు సమంగా విడుదల అవ్వవు. అవి సక్రమంగా పని చేయడానికి కనీసం రెండేళ్లయినా పడుతుంది. ఈ లోపల పీరియడ్‌‌స సక్రమంగా రాకుండా ఆలస్యంగా రావడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, లేదంటే పదిహేను ఇరవై రోజులకే వచ్చేయడం వంటివి జరగవచ్చు. కాబట్టి అవి సర్దుకునే వరకు తల్లిగా మీ పాపకి మీరే విషయం అర్థమయ్యేటట్లు చెప్పండి. న్యాప్‌కిన్‌‌స వాడే పద్ధతిని నేర్పించండి. ఓసారి గైనకాలజిస్టును కూడా సంప్రదిస్తే... థైరాయిడ్ సమస్య, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు, గర్భాశయంలో కానీ అండాశయంలో కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయా అని పరీక్షలు చేసి, ఏవైనా ఉంటే చికిత్స చేస్తారు. ఏ సమస్యా లేకపోతే పాపకి కొద్ది రోజులు ఓపిక పట్టమని ధైర్యం చెప్పండి.
 
నా వయసు 22. పెళ్లై ఇరవై నెలలు అవుతోంది. నాలుగు నెలల బాబు ఉన్నాడు. నార్మల్ డెలివరీనే అయ్యింది. అయితే నా పొట్ట మీద బాగా స్ట్రెచ్ మార్‌‌క్స వచ్చేశాయి. అవి పోవాలంటే ఏం చేయాలి? అలాగే మేం శారీరకంగా ఎప్పుడు కలవొచ్చు?
 - సోనీ, మెయిల్
 
నార్మల్ డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఆగిపోయి, కడుపులో నొప్పి కానీ, కుట్లు పడుంటే వాటిలో నొప్పి కానీ లేకపోతే... రెండు నెలల తర్వాతి నుంచీ సెక్స్‌లో పాల్గొనవచ్చు. తొమ్మిది నెలల పాటు గర్భాశయంలో బిడ్డ పెరిగేకొద్దీ పొట్ట పెద్దగా అవుతుంది. దానివల్ల పొట్టమీది చర్మం సాగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి... చర్మం లోపలి పొరలో ఉండే ఎలాస్టిక్ ఫైబర్స్ బాగా సాగి చిట్లిపోతాయి. దాంతో చర్మంపైన తెల్లగా, ఎర్రగా, నల్లగా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఒక్కసారి బాగా స్ట్రెచ్ అయిపోయిన చర్మం, స్ట్రెచ్ మార్క్స్... డెలివరీ అయ్యాక మళ్లీ సాధారణ స్థితిలోకి రావాలంటే కష్టం. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట తగ్గి, ఆ మార్క్స్ కాస్త చిన్నగా కనిపించవచ్చు. అంతేకాని పూర్తిగా పోవు. అందుకే గర్భం దాల్చిన మూడు నెలల నుంచే డాక్టర్ పర్యవేక్షణలో మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ క్రీములు వాడుతూ ఉంటే ఈ ఇబ్బంది ఏర్పడదు. 
 
నా వయసు 24. పెళ్లై అయిదేళ్లవుతోంది. నా వక్షోజాలు చాలా పెద్దగా ఉంటాయి. ఎంత పెద్దగా అంటే చూడటానికే ఇబ్బందిగా అనిపిస్తుంది. డాక్టర్‌కి చూపిస్తే చిన్నగా చేయడానికి ఆపరేషన్ చేయాలి, మూడు లక్షలు ఖర్చవుతుందని అన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఆపరేషన్ అవసరం లేకుండా బ్రెస్ట్ తగ్గించుకునే మార్గం లేదా? నాకు పీరియడ్స్ సరిగ్గా రావు. పరీక్ష చేయిస్తే నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. ఈ రెండు సమస్యలకీ ఏదైనా సంబంధం ఉందా?
 - శ్వేత, మెయిల్

మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. బరువు ఎక్కువ ఉండటం వల్ల కొందరికి రొమ్ముల్లో కొవ్వు చేరి బాగా పెరుగుతాయి. బరువు మరీ ఎక్కువ పెరిగితే అండాశయాల్లో నీటి బుడగలు చేరి, పీరియడ్స్ సక్రమంగా రావు. దాంతో పిల్లలు కలగడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. కాబట్టి మీరు అధిక బరువు కనుక ఉంటే... వాకింగ్, ఇతరత్రా వ్యాయామాలు చేసి, మితాహారం తీసుకుంటూ బరువు తగ్గండి. తద్వారా కొవ్వు తగ్గి, వక్షోజాల సైజు కూడా కాస్త తగ్గుతుంది. అలాగే బరువు తగ్గడం వల్ల నీటి బుడగలు ఇంకా ఎక్కువ పెరగకుండా ఉంటాయి. హార్మోన్ల అసమ తుల్యత కూడా కాస్త తగ్గి, పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగు తాయి. ఇంత చేశాక కూడా వక్షోజాలు తగ్గకపోతే... మీకు మరీ ఇబ్బందిగా అనిపిస్తే... ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. 
 
నా వయసు 30. ఇద్దరు పిల్లలు. పీరియడ్‌‌స రెగ్యులర్‌గా వస్తాయి. కానీ మొదటి రెండు రోజులూ పొత్తి కడుపులో నొప్పి, బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య జనరల్ చెకప్‌కి వెళ్తే స్కాన్ చేశారు. అప్పుడు గర్భాశయంలో 3 సెం.మీ. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉందని తేలింది. గైనకాలజిస్టును సంప్రదిద్దామంటే ఆపరేషన్ చేయాలి అంటారేమోనని భయంగా ఉంది. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 
 - ఉమ, రాజమండ్రి
 
కొందరిలో పీరియడ్‌‌స సమయంలో మొదటి రెండు రోజులు నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ ఉండవచ్చు. ఆ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల అలా అవుతుంది. అది తప్పనిసరిగా ఫైబ్రాయిడ్ వల్లే అవ్వాలని లేదు. మీకున్న ఫైబ్రాయిడ్ వల్ల మీకు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. పీరియడ్‌‌స రెండు రోజులూ ట్రెనెక్సిమిక్ యాసిడ్ + మెఫినిమిక్ యాసిడ్ కలసిన మాత్రలు వేసుకోండి. తీవ్రతను బట్టి రెండు నుంచి మూడు వేసుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది. సంవత్సరానికోసారి స్కానింగ్ చేయించుకుని, ఫైబ్రాయిడ్ పరిమాణం పెరుగుతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకున్న ఫైబ్రాయిడ్ గర్భాశయం మధ్య పొరలో ఉండి, చిన్నగా ఉంది కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. ఒకవేళ తర్వాత సైజు పెరుగుతూ బ్లీడింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతుంటే మాత్రం చికిత్స అవసరమవుతుంది. ఇప్పుడు కొత్తగా ఫైబ్రాయిడ్ కొద్దిగా కరిగి సైజు తగ్గడానికి మందులు దొరుకుతున్నాయి. వాటిని డాక్టర్ పర్యవేక్షణలో మూడు నుంచి ఆరు నెలలు వాడితే సరిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికి దాని గురించి పెద్దగా దిగులు పడకండి. 
 
నేను బీటెక్ చదువుతున్నాను. ఓ అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలను కోవడంతో శారీరకంగా కలవాలని ఆశపడ్డాం. చాలాసార్లు ప్రయత్నించాం. కానీ నాకు బాగా నొప్పి పుట్టి కలయిక జరగలేదు. తర్వాత మేం విడిపోయాం. ఈ మధ్య ఓ జ్యోతిష్యుడి దగ్గర జాతకం చూపించుకోడానికి వెళ్తే... నా యోనిరంధ్రం చాలా చిన్నగా ఉందని, దానివల్ల పెళ్లయ్యాక నేను శృంగార జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటానని చెప్పాడు. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నేనా సమస్యని ఎదుర్కొన్నాను కదా! ఇప్పుడు నేనేం చేయాలి? నిజంగానే నాకు సమస్యలు ఎదురవుతాయా?
 - శరణ్య, నెల్లూరు
 
పెళ్లి కాకుండా కలవడానికి ప్రయత్నించినప్పుడు... కొన్ని సార్లు మనసులో అభద్రతా భావం, భయం ఉన్న కారణంగా యోని కండరాలు బిగుసుకున్ననట్లు అయ్యి, అంగప్రవేశం అవ్వకపోవచ్చు. దాంతో మీరు మీ యోని రంధ్రం చిన్నగా ఉందని డిసైడైపోయినట్టు ఉన్నారు. పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. అందుకే మీ భయాన్ని జ్యోతిష్యుడు చెప్పినట్టు సృష్టిస్తున్నారు. ఏ జ్యోతిష్యుడూ శృంగార జీవితం గురించి ముందే చెప్పడు. ఏవో కలహాలు రావొచ్చని చెబుతారంతే. పెళ్లి కాకుండా తప్పు చేయాలనుకుని, కుదరకపోవడం వల్ల ఏవేవో భయాలు పెట్టుకున్నారు. జరిగిందేదో జరిగింది. ఇక ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా బుద్ధిగా పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత కనుక ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌ని కలిస్తే, పరీక్షించి చికిత్స చేస్తారు. ఒకవేళ నిజంగానే యోని రంధ్రం చిన్నగా ఉంటే, దాన్ని వెడల్పు చేయడానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు. 
 
నా వయసు 27. పెళ్లై ఆరేళ్లయ్యింది. ఒక బాబు ఉన్నాడు. మావారు chronic prostatitis తో బాధపడుతున్నారు. ఒకవేళ మేము శారీరకంగా కలిస్తే, ఆయన నుంచి ఇన్ఫెక్షన్ నాకు అంటుకుంటుందా? మేము మరో బిడ్డ కావాలనుకుంటున్నాం. ఈ సమయంలో అది వీలవుతుందా? మావారికున్న సమస్య అడ్డంకి అవుతుందా?
 - మౌనిక, ఊరు రాయలేదు
 
క్రానిక్ ప్రోస్టటైటిస్ అంటే... మగవారిలో ఉండే ప్రొస్టేట్ గ్రంథి వాయడం. ఇంతకుముందు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల (అక్యూట్ ప్రోస్టటైటిస్) మాటిమాటికీ ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. అలా అని ఇప్పుడు కచ్చితంగా ఇన్ఫెక్షన్ క్రిములు ఉండాలనేమీ లేదు. కాకపోతే ఈ పరిస్థితిలో కొందరిలో శుక్రకణాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కలయికలో మగ వారికి నొప్పి కూడా ఉండవచ్చు. ఒకసారి మీ వారికి సీమన్ అనాలసిస్, సీమన్ కల్చర్ వంటి పరీక్షలు చేయిస్తే... ఇన్ఫెక్షన్ ఉందా, కణాలు ఎలా ఉన్నాయి వంటివన్నీ తెలుస్తాయి. ఇన్ఫెక్షన్ లేకపోతే నిర్భయంగా కలవవచ్చు. ప్రెగ్నెన్సీకి కూడా అవకాశాలు మామూలుగానే ఉంటాయి. 
 
నా వయసు 21. పెళ్లయ్యింది. నా వక్షోజాలు చాలా నొప్పిగా ఉంటాయి. కలయిక సమయంలో కాస్త ఒత్తినా చాలా నొప్పి పుడుతుంది. తట్టుకోలేకపోతున్నాను. ఎందుకలా అవుతోంది? నా స్తనాల్లో ఏదైనా సమస్య ఉందంటారా?
 - ఓ సోదరి

వక్షోజాలు అనేవి ఆడవారిలో చాలా సున్నితమైన అవయవాలు. ఏ సమస్యా లేకపోయినా కూడా ఒక్కోసారి నొప్పి అనిపిస్తుంది. కాస్త ఒత్తినా బాధ కలుగుతుంది. అది కేవలం వారి వారి శరీరతత్వం, సున్నితమైన మనసు, నొప్పిని తట్టుకునే శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొందరిలో పీరియడ్స్ వచ్చే పది పదిహేను రోజుల ముందు నుంచే హార్మోన్లలో మార్పుల వల్ల వక్షోజాలు బరువు పెరిగినట్లయ్యి, కాస్త ముట్టుకున్నా కూడా నొప్పిగా ఉంటూ ఉంటాయి. ఓసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే వారు పరీక్ష చేసి, ఏదైనా సమస్య ఉందా లేదా అని చూస్తారు. తగిన సలహా ఇస్తారు. 
                                                                       
బరువు తగ్గడం వల్ల నీటి బుడగలు ఇంకా ఎక్కువ పెరగకుండా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత కూడా కాస్త తగ్గి, పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement