
తలకాయపై వాట్ ఏ కాయ...!
రాంబాబు గాడికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంటే కాస్త విముఖత. అవి వచ్చి చిన్న చిన్న కిరాణాషాపులను దెబ్బ కొట్టాయని వాడి నమ్మకం. వాడు ఒక షాపింగ్ మాల్ బయట నిలబడి ఉన్నప్పుడు అటుగా వెళ్తూ వాడిని పలకరించా. అలా షాపింగ్ మాల్‌ను తేరిపార చూస్తూ ఉన్నాడు వాడు. ‘‘ఎందుకు రా అలా నిరసనగా చూస్తున్నావ్. అన్నీ ఒకచోటే దొరికేలా చేస్తున్నారు ఈ షాపింగ్‌మాల్స్‌వాళ్లు. అలా అందర్నీ ఆకర్షిస్తున్నారు. వారి వ్యాపార సూత్రం వారిది. ఎందుకలా కోపంగా చూస్తున్నావ్’’ అడిగా. ‘‘నేను కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే నిన్ను నువ్వు సరిచేసుకో. మొదటిసారి నేను కాస్త వాటిపట్ల ఆరాధనగా చూస్తున్నాను’’ అన్నాడు వాడు.
‘‘ఆరాధనా? ఎందుకలా?’’ బోల్డంత ఆశ్చర్యంగా అడిగా. ‘‘ఒరేయ్... చిన్నప్పుడు నేను వాడిన కుంకుడుకాయలు అక్కడ కనిపించాయి రా. ఇప్పుడంటే షాంపులు షాపింగ్ మాల్స్‌లా వచ్చి కుంకుడు కాయల్లాంటి కిరాణాషాపులను మింగేశాయ్. కానీ ఒకప్పుడు కుండుడు కాయే నా వినోద సాధనం కదరా’’ అన్నాడు వాడు. ‘‘కుంకుళ్లు తలస్నానానికి వాడేవాళ్లం. వినోదం ఏమిటి?’’ బిత్తరపోయి అడిగా.
‘‘నువ్వు చేశావో లేదాగానీ... కుంకుడుగాయ కాస్త పచ్చిగా ఉండగానే మేం తెంపేవాళ్లం. దానిలోకి పిన్నీసు తోకను రివర్స్‌లో గుచ్చి బయటకు తీసి ఊదితే... సబ్బు బుడగల్లా... బుడగలు బుడగలు వచ్చేవి. అలా మా పచ్చిగా ఉన్నప్పుడు అదే మా వినోదం. అంతెందుకు పండి ఎండాక కూడా దాంతోనే ఆడుకుంటూ టైమ్‌పాస్ చేసేవాళ్లం’’ అన్నాడు.
‘‘హెడ్‌బాత్‌కు కుంకుళ్లు వాడతారు. అంటే... ఆటకు కుంకుళ్లు ఏమిట్రా నీకు హెడ్‌స్ట్రాంగ్ కాకపోతే’’ అన్నాను.
‘‘నువ్వు హెడ్‌తో ఆలోచిస్తున్నావు. నేను మనసుతో ఆలోచించి చెబుతున్నాను. అప్పట్లో కుంకుడుకాయలు కొట్టడానికి ఒక గుండ్రటి రాయిని ఉంచుకునేవాళ్లం. అదెంత గుండ్రంగా ఉంటే మనకు అంత స్పెషల్. ఆ రాయితో కుంకుడును చితక్కొట్టడంలోనూ ఒక నేర్పును అలవరచుకునేవాళ్లం. లోపల ఉండే కుంకుడు గింజ మాత్రం చితికిపోకుండా... కేవలం పైనున్న తొక్క మాత్రమే నలిగేలా కొట్టడం ఒక ఆర్టు. అలా చిన్నప్పుడు కళాత్మకంగా కొట్టడాన్ని అలవరిచేదేరా కుంకుడు. అందుకే అది ఆర్టు కూడా నేర్పుతుందని నా ఉద్దేశం. అలా ఆర్టిస్టిగ్గా, నేర్పుగా కొట్టిన కుంకుళ్ల నుంచి తీసిన గింజలతో ఆడుకునేవాళ్లం. పైగా నాకు కుంకుడుగింజ అంటే ఒక సినిమా హీరో పట్ల ఉండేంత వర్షిప్ కూడా ఉంది’’ అన్నాడు రాంబాబుగాడు.
‘‘ఓహో... సినీహీరోలంటే నీకు చేదు కదా అందుకే కుంకుడు గింజలతో పోలుస్తున్నావన్నమాట’’ అన్నాన్నేను.
‘‘చేదు కోసం కాదురా... సినిమా మొదట్లో హీరోయిన్లను హీరోలు టీజ్ చేస్తుంటారే. అచ్చం అలాగే కుంకుడు గింజ కూడా చేస్తుంటుంది’’
‘‘అదెలా?’’
‘‘నీకు గుర్తుందా. కుంకుడు గింజను బాగా రుద్దీ రుద్దీ టక్కున ఎవరికైనా అంటించామనుకో. వారికి చర్మం చరుక్కుమనేలా కాలేది. అచ్చం హీరో టీజింగ్‌లాగే. అందుకే నాకు కుంకుడు గింజ అంటే హీరో లాగే. పైగా హీరోలా కుంకుడు త్యాగాలు కూడా చేస్తుంది రా’’
‘‘నీకు మైండు దొబ్బింది. కుంకుడుకు త్యాగమేమిట్రా?’’
‘‘నిజం రా... అందరూ త్యాగమంటే కరివేపాకుతో పోల్చుకుంటారు. కనీసం కరివేపాకును తినే టైమ్ వరకైనా గిన్నెలో ఉంచుకుంటారు గానీ... తలను శుభ్రపరిచే ఆ అద్భుతమైన పులుసు అంటే అందరికీ చేదే. కుంకుడు పులుసుకు ఒక్కసారి వాడుకొని దాని పిప్పిని కూడా అచ్చం కరివేపాకులాగా... చింతపండు పులుసులాగా పారేస్తారు. కరివేపాకు అనేదాన్ని వాడుకొని వదిలేస్తున్నామనే సానుభూతి ఉంటుంది. అందుకే ఎట్‌లీస్ట్ సామెతల్లో భాషవాడకంలో దానితో పోలుస్తుంటారు. కానీ కుంకుడు పులుసు సేవను మాత్రం అప్పటికీ ఎవరూ గుర్తించలేదు. అది అంతరించిపోయాక ఇప్పుడూ ఎవరూ గుర్తుపట్టే పరిస్థితి లేదు’’ అంటూ ఎమోషనల్ అయిపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నాడు వాడు.
‘‘ఏడవకు... ఏడవకు... కుంకుడు పునర్వైభవం కోసం మనం పాటుపడదాం లే’’ అన్నాను వాణ్ణి కాస్త ఛీరప్ చేద్దామని.
‘‘ఛీ... ఛీ... ఈ పాడు షాపింగ్ మార్ట్‌లను చూస్తుంటేనే చిరాకేస్తుంది’’ అంటూ మళ్లీ మాల్స్ మీద కోపం వెళ్లగక్కాడు వాడు.
‘‘అందేట్రా రాంబాబూ... నీ బాల్యజ్ఞాపకాలను గుర్తు చేశాయనీ, కుంకుడు నాస్టాల్జియాకు తోడ్పడ్డాయనీ ఇప్పుడే కదా వాటిపైపు ఆరాధనగా చూశావ్. అంతలోనే ఈ మార్పేమిటి?’’ అడిగా.
‘‘కుంకుడు పునరుద్ధరణ కోసం మరో వీరేశలింగంగారిలా మారిపోదామనుకుంటే ఈ షాపింగ్ మాల్స్ నాకు పోటీ వస్తున్నాయేమిట్రా. నేను పాటు పడదామనుకున్నానా ఫీల్డులోకి వచ్చి నాకు ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయిరా ఈ పాడు మాల్స్’’ అంటూ పాత ధోరణికి వచ్చాడు వాడు.
వాడి మాటలు వినగానే కుంకుడు రసం కళ్లలోకి, నోట్లోకి వెళ్లినప్పుడు కలిగే ఫీలింగ్ మళ్లీ వచ్చింది. ఏం చేద్దాం? అనుభవించడం తప్ప అప్పుడూ ఇప్పుడూ ఏమీ చేయలేను!!
- యాసీన్