కొడుకు పేరు సోమలింగం!
విజయం అనేది కల నుంచే పుడుతుంది. కల కన్నప్పుడే ఆ కలను నిజం చేసుకో వాలనే తపన పెరుగుతుంది. అయితే కలకు, పగటి కలకు మధ్య రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ దాటితే కల కాస్తా పగటి కలై అపహాస్యం పాలవుతుంది.
ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ కొందరు పగటి కలలు కంటుంటారు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఆ పని తాలూకు విజయాన్ని కలలోనే సొంతం చేసుకుని ఆనందిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయమే - ‘ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’.
వెనకటికి ఒక సోమరి, సమయం దొరికితే చాలు పగటి కలలు కనేవాడట. ఒకరోజు చెట్టుకింద నిద్రపోతున్న ఆ సోమరికి మెలవకువ వచ్చింది. ఏం చేయాలో తోచక పగటి కలకు ప్రారంభోత్సవం చేశాడు. రేపో మాపో ఒక అందమైన అమ్మాయితో నాకు ఘనంగా పెళ్లవుతుంది, మాకో అందమైన అబ్బాయి పుడతాడు, వాడికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించడం మొదలెట్టాడు. రకరకాల పేర్లు ఆలోచించి చివరికి ‘సోమ లింగం’ అని ఫైనల్ చేశాడు. ఆపైన... ‘నా కొడుకు పేరు సోమలింగం’ అంటూ మురిసి పోయాడట. అందుకే ఈ జాతీయం పుట్టింది.