నా దారి ఇది కాదు..
దీపికా పదుకొనె తండ్రి ప్రకాశ్ పదుకొనె పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్. దీపికా కూడా తనదీ అదే దారి అయి ఉంటుంది అనుకుంది. చదువుకునే రోజుల్లో బ్యాడ్మింటన్, చదువు తప్ప ఇంకేదీ తన ప్రపంచం కాదనుకుంది. నేషనల్ చాంపియన్ కూడా అయింది. కానీ దీపికా పదుకొనె దారి వేరు. ఆ విషయం 18వ ఏట అర్థం చేసుకుందామె. మోడలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత 2006లో సినిమాల్లోకి వచ్చేసింది.పీకూ, మస్తానీ, వెరోనికా, శాంతిప్రియ, తార..ఈ పేర్లలో ఏది గుర్తొచ్చినా ఒక స్టార్ గుర్తొస్తుంది.అది ఆ పాత్రల గొప్పదనమే కావొచ్చు. ఆ పాత్రల్లో కనిపించిన నటి గొప్పదనం కూడా కావొచ్చు.దీపికా పదుకొనె.. అలాంటి గొప్ప పాత్రలకు మరింత గౌరవం తెచ్చిన స్టార్..ఆ స్టార్ గురించిన విశేషాలు కొన్ని..
డిప్రెషన్‌లో..
2014లో దీపికా తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. మామూలుగా ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ దీపికా అన్నీ చెప్పుకుంది. లేవగానే విచిత్రంగా ఉండేదని, ఏ పని చేసినా ఏదో లాగుతున్నట్లు ఉండేదని, నిద్ర పట్టకపోయేదని, ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ననీ.. అన్నీ.. అన్నీ చెప్పుకుంది. జనాల్లో కలిసిపోవడం, మనుషులతో మాట్లాడటం అవసరమని చెప్తుంది దీపికా. అది తాను ప్రపంచానికిచ్చే సందేశం అంటారామె!
బాయ్‌ఫ్రెండ్స్..
దీపికా పదుకొనె బాయ్‌ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దదే! ఈ విషయాన్ని ఆమె డైరెక్ట్‌గానే చెప్పేస్తుంది. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమ వ్యవహారం గురించి, ‘‘అదేంటో మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ వర్కవుట్ అవ్వదనుకున్నాం. విడిపోయాం.’’ అంటుంది. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌తో దీపికా పీకల్లోతు ప్రేమలో ఉంది.ఈ ఇద్దరికీ బాలీవుడ్‌లో ‘హాట్ కపుల్’ అన్న పేరుంది.
పారిపోదామనుకొని..
దీపికా బాలీవుడ్‌లో అడుగుపెట్టడమే బ్లాక్‌బస్టర్. కాకపోతే ఆ సినిమా తర్వాత అన్నీ ఫ్లాపులే! ఎలాంటి ఫ్లాపులంటే ఒక దశలో ఇండస్ట్రీని వదిలిపెట్టి పారిపోదామనుకుంది. కానీ ధైర్యంగా నిలబడింది. 2012లో ‘కాక్‌టెయిల్’ సినిమాతో దీపికా పదుకొనె సక్సెస్‌ఫుల్ కెరీర్ మళ్లీ కొత్తగా మొదలైంది. ఈ ఐదేళ్లలో హాలీవుడ్ సినిమా (ట్రిపుల్ ఎక్స్)లో నటించే స్థాయికి చేరుకుందామె.
నో అంటే నో..
దీపికా ఆడవాళ్ల కోసం పోరాడుతుంది. వారిని సమాజం ఇలా చూస్తుందంటూ గట్టిగా వాదించి చెబుతుంది. ఒకసారి ఏదో పేపర్లో ‘దీపికా క్లీవేజ్ షో’ అన్న కామెంట్ వస్తే, వారికి దిమ్మతిరిగే సమాధానమే ఇచ్చింది. ‘ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఒకమ్మాయి నో అందంటే అది నో.. సెక్స్ విషయమైనా.. ఇంకేదైనా..’ ఇది దీపికా ఎప్పుడూ గట్టిగా చెప్పే ఓ మాట.
Comments
Please login to add a commentAdd a comment