రింగ్.. రింగ్.. రింగ్..!
ఎంగేజ్‌మెంట్ రింగ్‌కి ఉండే క్రేజే వేరు. ‘‘నీకు తోడుగా ఉంటా!’’ అని చెప్పే ఓ ధైర్యమది. మరి బంధాల్లో అలాంటి ఓ «ధైర్యానికి ఎంత విలువ ఉంటుంది? రూపాయిల్లో లెక్కిస్తామా అది? కూడదు. కానీ ఎప్పుడూ ఉంచుకోవాలి కాబట్టి ది బెస్ట్ అనుకునే ఉంగరమే కొనాలి. ఎన్ని ఆలోచించాలి? అన్ని ఆలోచిస్తాం కాబట్టే ఆ రోజూ, ఆ రింగూ అంత ప్రత్యేకం. అంత ప్రత్యేకమైనది కాబట్టే దాని చుట్టూ ఏది జరిగినా ఓ కథే. ఈమధ్య బయటకొచ్చిన అలాంటి కథలు..
చీప్.. చాలా చీప్..!
లండన్‌లో ఉండే ఓ అబ్బాయికి తన కంపెనీలోనే పనిచేసే ఒకమ్మాయి అంటే చాలా ఇష్టం. ఇద్దరి మధ్యా మంచి స్నేహం కూడా ఉంది. అమ్మాయికీ అతడంటే ఇష్టమే! ఓ మంచి రోజు చూసుకొని 1,300 యూరోలు (సుమారు లక్ష రూపాయలు) పెట్టి ఎంగేజ్‌మెంట్ రింగ్ కొని ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యాడు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఆమె ముందుకెళ్లి మోకాళ్ల మీద కూర్చొని, ‘‘నన్ను పెళ్లిచేసుకుంటావా?’’ అనడిగాడు. అమ్మాయి ఓకే చెబుదామనే సిద్ధమైంది కానీ, ఎంగేజ్‌మెంట్ రింగ్ తక్కువ ధరదేమో అని అనుమానించింది.
అనుకున్నదే తడవుగా బ్యాగ్ చెక్ చేసి బిల్ చూసింది. అంతే! ‘‘ఇంత తక్కువలో ఇలా రింగు కొనేస్తావని అస్సలు అనుకోలేదు. నీ జీతమేంటీ? నువ్వు చేసిందేంటీ?’’ అని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోవడంతో పాటు ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. కొందరు నవ్వారు. ఇంకొందరు విమర్శలు గుప్పించారు. మరికొందరు ‘‘నీకసలు ప్రేమ విలువ తెలుసా?’’ అంటూ గట్టిగానే మందలించారు. ఆ పోస్ట్‌కి వచ్చిన రెస్పాన్స్ చూశాక ఆ అమ్మాయిలో మార్పు వచ్చిందో లేదో తెలియదు కానీ, ఈ విషయం మాత్రం అంతటా పాకి ఆమెకు చెడ్డ పేరే తెచ్చింది.
భర్తతో విడిపోయినా..!
చీప్ రింగ్ కొన్నాడని బాయ్‌ఫ్రెండ్‌ను కాదన్న అమ్మాయిది ఒక కథైతే భర్తతో విడిపోయాక కూడా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చేతికి అలాగే ఉంచుకున్న ప్రిన్సెస్ డయానాది మరో కథ. 1981లో ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ చార్లెస్‌ను పెళ్లాడింది. డయానాకు ఓ ఖరీదైన ఉంగరాన్ని ఎంగేజ్‌మెంట్ రింగ్‌గా తొడిగి, ఆమెతో ఓ కొత్త జీవితం మొదలుపెట్టాడు చార్లెస్. 1992లో వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఇద్దరూ విడిపోయారు. అయితే భర్తతో విడిపోయాక కూడా డయానా తన చేతికి ఆ ఉంగరాన్ని అలాగే నాలుగేళ్ల పాటు ఉంచుకుంది.
అదంతా చార్లెస్ ప్రేమను మరచిపోలేకే అనుకుంటారంతా. కానీ అసలు విషయం మాత్రం ఆమె చనిపోయిన 20 ఏళ్లకు, అంటే ఈమధ్యే బయటకు వచ్చింది. తమకు పుట్టిన పిల్లల కోసమే ఆ రింగును డయానా అలా ఉంచుకున్నారని తేలింది. డయానాకు పిల్లలంటే అంత ఇష్టం. డయానా కుమారుడు ప్రిన్స్ విలియమ్ తన భార్య కేట్ మిడిల్టన్‌కు ప్రపోజ్ చేస్తూ తొడిగిన ఉంగరం కూడా డయానాదే కావడం విశేషం. తల్లిమీద తనకున్న ప్రేమను విలియమ్ ఇలా చాటుకున్నాడు. ఒక్క రింగు చుట్టూ ఎన్ని కథలూ.. ఎన్నెన్ని ప్రేమలూ..!!
క్యారట్ తొడిగిన రింగు..!
మేరీ గ్రామ్స్‌కు 84 ఏళ్లు. గత పదమూడేళ్లుగా ఆమె దాచిన ఓ రహస్యం ఈమధ్యే ఓ క్యారట్ రూపంలో బయటకొచ్చింది. ఆ క్యారట్ చుట్టూ అల్లుకున్న ఉంగరమే మేరీ దాచిన సీక్రెట్. 1951లో నోర్మన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది గ్రామ్స్. గ్రామ్స్‌కు ప్రపోజ్ చేస్తూ నోర్మన్ ఓ ఖరీదైన ఉంగరాన్ని ఆమెకు తొడిగాడు. 2004లో గార్డెనింగ్ చేస్తున్న సమయంలో గ్రామ్స్ తన చేతికి ఉన్న డైమండ్ రింగును పోగొట్టుకుంది. చుట్టుపక్కల అంతా వెతికినా అది దొరకలేదు.
చాలాకాలం ఏడ్చింది. నోర్మన్‌కు తెలిస్తే బాగుండదని ఒక కొత్త రింగును కొనుక్కొని ఆ పోయిన రింగు స్థానాన్ని భర్తీ చేసింది. మళ్లీ ఇప్పుడు 2017లో గ్రామ్స్ కోడలు తమ గార్డెన్‌లో పండిన క్యారెట్‌లను తీస్తూంటే ఒక క్యారట్‌ను చుట్టుకొని డైమండ్ రింగ్ ఉండడం కనిపించింది. గ్రామ్స్‌కు ఫోన్ చేస్తే ఇన్నాళ్లు దాచిన సీక్రెట్ చెప్పేసింది. 13 ఏళ్ల తర్వాత పోయిన ఉంగరం మళ్లీ కనిపించడం, అదీ ఒక క్యారట్‌కు చుట్టుకొని కనిపించడం వార్తలకు ఎక్కి కూర్చుంది. ఐదేళ్ల క్రితమే పైలోకాలకు వెళ్లిపోయిన ఆమె భర్త నోర్మన్‌కు మాత్రం ఈ రహస్యం ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు.